22, అక్టోబర్ 2019, మంగళవారం

రెక్కలు...!!

1.  నినాదంలో
ఆవేశం
నివేదనలో
ఆక్రోశం

వ్యక్తీకరణ ఏదైనా
వినిపించేది వేదనే..!!

2.   నోటితో
మాటలు
నొసటితో
విరుపులు

అవగతం కాదు
అసలు నైజం..!!

3.    చేసేది
ప్రభుత్వోద్యోగం
జీతంగా తీసుకునేది
ప్రజల సొమ్ము

పని చేసేది
అధికారానికి...!!

4.   క్రమాక్రమ
శోధన
కూల్చివేతల
లక్ష్యం

ప్రజాధనం
దుర్వినియెాగం..!!

5.   కట్టడం
నేలమట్టం
సచివాలయం
పాలనా సౌలభ్యం

నిర్మాణమేదైనా
శాశ్వతం పునాది...!!

6.   గెలుపోటముల
ఆరాటం
మనిషి జీవితమెుక
కదనరంగం

మానసిక ప్రశాంతత
మరణం...!!

7.   అవసరానికి
కాళ్ళు
ఆదమరిచామా
జుట్టు

ఏమరుపాటు
కూడదు...!!

8.    అధికార
మదం
అస్తవ్యస్త
పాలన

జన జీవితాలు
అతలాకుతలం...!!

9.   గెలిచిన ప్రతివాడు
విజేత కాదు
ఓడిన ప్రతివాడు
పరాజితుడు కాదు

గెలుపోటముల లెక్కలు
సరిచూసేవాడు ఆ పైవాడు..!!

10.   అంగడి సరుకయ్యింది
అమ్మదనం
అష్టావక్రుల
చేతబడి

కాదేది అనర్హం
ధన పాశానికి..!!

11.   పరాయితనం చేసింది
పట్టాభిషేకం
అయినవారివ్వలేదు
ఓ ఆత్మీయాలింగనం

ఇంటి వైద్యానికి పనికిరాదు
పెరటిచెట్టు..!!

12.   చేతికి
పని
కలానికి
రాత

అందమైన
అలంకారం..!!

13.   వ్యాధి
బాధిస్తుంది
వ్యసనం
వదలదు

నష్టం
జీవితానికి...!!

14.   కూల్చివేతల్లో
ఉన్న తొందర
పథకాల
మార్పుల్లో వేగిరత

నిబద్ధత
అభివృద్ధిలో కనపడాలి...!!

15.   పురిటి నెప్పులు
భరిస్తుంది
మంచైనా చెడైనా
బిడ్డను సాకుతుంది

పాపాల భైరవి
ధరిత్రి...!!

16.   అడ్డుపడుతున్న
అహం పొరలు
ఒప్పుకోలేని
అనుభవ రాహిత్యము

నమ్మక తప్పని
వాస్తవ సందర్శనం...!!


17.    మనసుతనాన్ని

సంరక్షించాలనుకుంటూ

మనిషితనాన్ని

మరిచిపోతోంది


అక్షరాల

అసహనంలో...!!


18.    చెక్కిలిపై 

జారిన కన్నీళ్ళు 

మనోసంద్రపు

సుడిగుండాలు


దాచేసే సాక్ష్యమే

చిరునవ్వు...!!

19.    జనారణ్యంలో 

ఆధిపత్య పోరు

వనారణ్యంలో

జాతిపోరు


ప్రపంచం 

యుద్ధభూమి...!!

20.   అర్థమయ్యేలా అనువదించేవి

అక్షరాలు

అర్థం కాని అనువాదం 

మనసు


వాదానువాదాల సమతూకం

జీవితం..!!


21.   ఏలినాటి శని

ఏడేళ్ళు

ఎన్నికల శని

ఐదేళ్ళు


కర్మఫలం 

కాటికి పోయే వరకు...!!


22.   వరుసలో పేర్చిన

అక్షరాలు కొన్నే

అందించే భావాలు

అనంతం


వాణీ కటాక్షం

పూర్వజన్మ సుకృతం...!!

23.   గురుతు తెచ్చే

జ్ఞాపకాలకు

నిలువుటద్దం 

ఈ అక్షరాలు


పరమార్థమెరిగిన

రాతలివి..!!

24.   ఆకాశం 

చేతికి అందదు

సముద్రానికి 

ఆవలి తీరం తెలియదు


మనసు గుట్టు

విప్పలేము...!!


25.   కళలు

అందరివి

నైపుణ్యం 

కొందరిదే


ఫలమేదైనా

పూర్వజన్మ సుకృతం...!!

26.   గీతల్లో

ముగ్గులు

రాతల్లో

జీవితాలు


ఇదేనేమెా

విధి విలాసం...!!

27.  రెప్పల పొదిలో

అంబుల గుంపు

గుప్పెడు గుండెలో

జ్ఞాపకాల చప్పుళ్ళు


ముత్యాల సరాలే

మనసు రాగాలు..!! 

28.   మనసు

మాయమైంది

మనిషి

బతికేవుంది


జీవించడానికి జీవితానికి

తేడా ఇదేనేమెా...!!  

29.   తొలిసందె

మలిసందె

మధ్యన

నడిమింటిసంధ్య


జీవనసందెలన్నీ

సూర్యోదయాస్తమయాలే..!!


30.   మరిపించడం

తెలుసు

మురిపించడం

తెలియదు


ఇదే 

నేటి మన అధికారం..!!



  

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner