21, జనవరి 2019, సోమవారం

పుట్టినరోజు జ్ఞాపకాలు కొన్ని...!!

నేను విజయనగరం జొన్నవలనలో 7 వ తరగతి చదివేటప్పుడు నా పుట్టినరోజున నాన్న స్నేహితులు, కొందరు చుట్టాలు ఇంటికి వచ్చారు. అందరు మామూలుగా హాపి బర్త్డే అని, మెని మెనీ హాపి రిటర్న్స్ అని మనకు కాస్త తెలిసిన ఇంగ్లీష్ లో చెప్పారు. యార్లగడ్డ బాబూరావు బాబాయ్ మాత్రం నన్ను ఇబ్బంది పెట్టాలని చాలా పెద్దగా ఇంగ్లీష్ లో విష్ చేసారు. మనకేమెా సగం సగం అర్ధం అయ్యింది. థాంక్స్ చెప్తే ఏం తప్పు పట్టుకుంటారోనని తప్పించుకు తిరుగుతున్నా . బాబాయ్ చాలా ఇంటిలిజెంట్. నా వెనుకే వచ్చి విష్ చేస్తే ఏం చెప్పకుండా వెళిపోతున్నావేంటి అంటే, ఇక ఏం చేయాలో తెలియక బాబాయ్ ఏం చెప్పాలో తెలియదుగా అంటే నవ్వేసి నీ పుట్టిన రోజుకి శుభాకాంక్షలే చెప్పాను అని అంటే హమ్మయ్య అనుకుని నవ్వేసి థాంక్యూ సో మచ్ బాబాయ్ అని చెప్పేసి బరువు దించేసుకున్నా...ప్రతి పుట్టిన రోజుకి ఆ విషయం మాత్రం నాకు గుర్తు వస్తుంది. నవ్వుకుంటా... 😊

అది అప్పటి సంగతి...ఈ రోజు నా కోసం ప్రత్యేకంగా కేక్ పంపిన ఆత్మీయులు కృష్ణకాంత్ ముమ్మనేని గారికి, వారి శ్రీమతి పూర్ణిమకు, ఫోన్లలో ఆత్మీయంగా పలకరించిన వారికి, ముఖ పుస్తకంలో,మెసెంజర్లో తమ ఆత్మీయతను, నా అక్షరాలపై మక్కవను చాటి చెప్పిన ఎందరో సన్నిహిత మిత్రులు,  సోదరులు, సోదరీమణులు, సాహితీ పెద్దలు, అక్షరాభిమానులు మనస్సుతో అందించిన శుభాకాంక్షలకు, శుభాశీస్సులకు నే పొందిన ఆనందం వెల కట్టలేనిది.  ప్రతి
ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞలు తెలియజేయడం తప్ప..

అందరికి ఇక్కడే కేక్, నేను చేసిన గులాబ్ జామూన్లు, అమ్మమ్మ చేసిన పాయసం మీ అందరి కోసం... 😊

18, జనవరి 2019, శుక్రవారం

రాజకీయాలు...!!

అణాకాణికి కూడా పనికిరాని పెతోడూ ఆంధ్రా రాజకీయాల్లో వేలెట్టేవోడే. ఇక్కడ వ్యక్తి పూజలు కాదు వ్యవస్థ బాగు ముఖ్యం. ఎవరెన్ని ఏసాలేసినా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు నిజాలు తెలుసు. కళ్ళు, చెవులు మూసుకుని లేరు ఆంధ్రోళ్ళు. కనీస బాధ్యత లేని నాయకులకు తమ ఓటుతో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. పాలక, ప్రతి పక్షాలను గమనిస్తూనే ఉన్నారు. ఆంధ్రను ఎద్దేవా చేసినోళ్ళను ఎన్నటికి క్షమించరు. వాళ్ళ అడుగులకు మడుగులొత్తే ఎవరిని ఉపేక్షించరు.

14, జనవరి 2019, సోమవారం

మార్పు...!!

నేనెప్పుడు ఒకలానే ఉన్నా... అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ. అప్పుడు నచ్చని నేను ఇప్పుడు కొందరికి నచ్చుతున్నా, మరి కొందరికి నచ్చడం లేదు. తేడా నాలో లేదు. మీ మీ ఆలోచనల్లో ఉంది...అప్పుడే మారని నేను ఎప్పటికి మారను.
ఏది ఎలా ఉన్నా మిత్రులకు, శత్రువులకు, బంధువులకు,  రాబందు(ధు)వులకు అందరికి భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు.....

11, జనవరి 2019, శుక్రవారం

షో టైమ్....!!

రోడ్ షోలకు, టి వి షోలకే టైమ్ చాలడం లేదు ఇంక అసెంబ్లీ షోకి ఏమెాస్తాం చెప్పండి.....మేము చేస్తున్న ఈ ఎంటర్టెయిన్మెంట్ షోలు గుర్తించి మమ్మల్ని గెలిపిస్తే ఓ ముప్పై ఏళ్ళ పాటు మిమ్మల్ని ఇలాగే సంతోషపెట్టగలమని.... నేను భారత రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... 😊

10, జనవరి 2019, గురువారం

ఆత్మఘోష...!!

కాల ప్రవాహం సాగుతూనే ఉంది
మనిషి మనుగడను ప్రశ్నిస్తూ

మనసెప్పుడూ ఆరని చితిలాంటిదే
భావాల మహాభారత యుద్ధంలో

అక్షరాలకు అంటరానితనం అంటుకుంటోంది
కులం చేతిలో కీలుబొమ్మగా మారుతూ

కళలు ఈర్ష్యల కుంపట్లలో కాలిపోతున్నాయి
సాహిత్యమెా ఉన్మాద క్రియగా సాగుతూ

అదుపు తప్పిన కలం అడ్డదిడ్డంగా రాస్తోంది
నైతిక విలువలకు తిలోదకాలిస్తూ

మన తలరాతను రాతలే బయటపెడతాయి
పదుగురు పరమార్ధం తెలుసుకునేలా

ఆగలేని ఆత్మఘోష వినిపిస్తూనే ఉంటుంది
నిర్విరామంగా హృది అలజడికి అంతమే లేకుండా...!!

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner