19, ఫిబ్రవరి 2018, సోమవారం

త్రిపదలు....!!

1.  కొన్ని మౌనాలింతే
కనులతో మాటాడేస్తూ
మనసును పరిచేస్తూ.... !!

ద్విపదలు..!!

1.  నీటి మీది రాతలంతే
తేలిపోతూ చులకనౌతున్న బంధాలై..!!

2.  కొన్ని మాటలంతే
మరువలేని బాసలుగా...!!

18, ఫిబ్రవరి 2018, ఆదివారం

ఏక్ తారలు...!!

1.  ప్రతి క్షణము పున్నమే_కనుల ఎదుట నీవుంటే... !!

2.  మనసు చిత్తరువులే అన్నీ_మంజువాణి మనోభావాలుగా...!!

3.  గోదారి గలగలలే మనసంతా_నీ స్నేహారాధన సవ్వడికి....!!

3.   స్వరజతులుగా సాగుతున్నాయి_గోదారి గంగమ్మ పరవళ్ళ ఉరవళ్ళు...!!

4.   నిస్తేజమౌతున్న అనుబంధాలు_కపట స్నేహాల పాలబడి..!!

15, ఫిబ్రవరి 2018, గురువారం

జీవన "మంజూ"ష ...!! (6)

నేస్తం,
          అవసరానికి అనుబంధాలను అడ్డుగా పెట్టుకుంటూ, అవసరం తీరాక అధఃపాతాళానికి తొక్కేస్తున్న రోజులివి. కుటుంబ బంధాలు కానీ, స్నేహ సంబంధాలు కానీ ఏదైనా తమ స్వార్ధం కోసం వాడుకునే నీచ నైజాలు ఎక్కడికక్కడే దర్శనాలిస్తున్నాయి. పిల్లలని చూడని తల్లిదండ్రులు, తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలు సర్వ సాధారణమై పోతున్న రోజులు ఈనాడు మన సమాజంలో. ఒకప్పుడు ఇంటి నిండా బాంధవ్యాలు, బంధుత్వాలు వెల్లివిరిసేవి. ఇప్పుడు ఉమ్మడి అన్న పదమే మర్చిపోయి బ్రతికేస్తున్నాం. అనాధ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు నిండుగా కనిపిస్తున్న రోజులు ఇవి. జన్మనిచ్చిన వారిని గాలికి వదిలేసి జల్సాగా కాలం గడిపేస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఎందరో. భావి భారత పౌరులను తీర్చిదిద్దుతున్న గౌరవ ఉపాద్యాయులెందరో. 
          ఆధునికంగా ఎంతో ముందగుడు వేస్తున్నాం కానీ మానవత్వాన్ని, మంచితనాన్ని మరుగున పడేస్తున్నాం. చేసిన సాయాన్ని మర్చిపోతూ, మన స్వార్ధమే చూసుకుంటూ రోజులు గడిపేస్తున్నాం. అమ్మ పెట్టిన గోరుముద్దలు మరచి ఆ అమ్మ ఎప్పుడు పోతుందా అని రాబందుల్లా ఎదురుచూస్తున్నాం. తాటాకు పెట్టిన ముంత తలా వైపునే ఉంటుందని మర్చిపోతున్నాం. ఎందుకీ మార్పు మనలో. మన అమ్మాబాబు మనకి విలువలతో కూడిన జీవితాన్నే ఇచ్చారు కానీ మనమెందుకిలా మారిపోయాము...? డబ్బులతో అనుబంధాలను, అభిమానాలను కొనాలని చూస్తున్నాం. పున్నామ నరకం నుండి తప్పించేవాడు పుత్రుడు అని పూర్వపు నానుడి. బతికుండగానే నరకాన్ని చూపిస్తున్న పుత్ర రత్నాలెందరో నేడు. 
          పిల్లలని ఇబ్బంది పెడుతున్న పెద్దలు ఉన్నారు. అహంకారంతో కొందరు, ఆత్మాభిమానంతో మరికొందరు అనుబంధాలను అభాసుపాలు చేస్తూ నలుగురిలో నగుబాటు అవుతున్నారు. దీనివల్ల మనసులు విరిగి మమతలు దూరం అవుతున్నాయి తప్ప ఏ విధమైన ఉపయోగం ఉండటం లేదు. అవసరాలు అగాధాలను సృష్టిస్తున్నాయి కాని అనుబంధాలను పెంచడంలేదు. దీనికి కారణం మన ఆలోచనల్లో వైరుధ్యాలుండటమేనా...!!

ఇప్పటికి ఈ ముచ్చట్లకు సశేషం.

ఈ నెల నవ మల్లెతీగలో నా వ్యాసం .... 

11, ఫిబ్రవరి 2018, ఆదివారం

శోధన....!!

నిరంతర సంఘర్షణల్లోనుంచి
జీవన పరిణామ క్రమాన్ని
ఆవిష్కరించడానికి పడే
తపనలో మేధస్సుకు చిక్కని
ఆలోచనల వలయాలు
ఆక్రమించిన మనసును
సమాధాన పరిచే క్రమంలో
నన్ను నేను శోధించుకుంటూ
తప్పొప్పుల తూకాలను
అసహజ అంతరాలను
అర్ధం కాని ఆవేదనలను
కోల్పోతున్న బంధాల బాధ్యతలను
మధ్యస్థంగా మిగిలిపోయిన
వ్యక్తిగత వ్యవస్థలోని లోపాల భారాన్ని
ముసురు పట్టి ముసుగులోనున్న
మానవత్వపు మమకారాన్ని
వెలుగుపూలు పూయించాలన్న
ఆరాటంలో ఆలంబన చేసుకున్న
ఆత్మ పరిశీలన నుండి అంకురమై
మెుదలైందే ఈ అక్షర ప్రయాణం....!!

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner