22, మే 2018, మంగళవారం

యద్దనపూడి సులోచనారాణికి అక్షరాంజలి....!!

                                    
    శతాబ్దాల తెలుగు సాహితీ చరిత్రలో రారాణి, నవలారాణి సులోచనారాణి అనడంలో అతిశయోక్తి లేదు. అక్షరాలతోనే అందరిని ఆకట్టుకున్న అద్భుత ప్రతిభాశాలి. కుటుంబ విలువలు, ఆప్యాయతలు, మధ్య తరగతి జీవితాలు, సమాజపు అంతరాలు, యువత కర్తవ్యం ఏమిటి, ఇలా మన చుట్టూనే ఉండే ఎన్నో జీవితాలను మన కళ్ళ ముందుకు తెచ్చి మనలో ఎన్నో ఆలోచనలను రేకెత్తించిన అక్షర బాంఢాగారం యద్దనపూడి సులోచనారాణి. 1939 ఏప్రియల్ రెండున కృష్ణా తీరాన కాజ గ్రామంలో పుట్టారు. మొదట్లో చిన్న కధలు రాసారు. తొలి నవల సెక్రెటరీతోనే ఓ కొత్త ఒరవడిని తెలుగు నవలా సాహిత్యంలో నెలకొల్పారు. 

     నా చిన్నప్పుడు ఏడేళ్ల వయసులో ఆంద్రజ్యోతిలో నే చదివిన మొదటి సీరియల్ రాధాకృష్ణ. అతి సాధారణ పల్లె జీవితాల నుంచి మొదలుపెట్టి ఓ కుటుంబంలో ప్రేమలు, ఆప్యాయతలు, అభిమానాలు, కోపాలు, ద్వేషాలు ఇలా అన్ని కోణాలను సమపాళ్లలో చూపించడం ఆమెకే చెల్లింది.  యుక్త వయసు అమ్మాయిల కలల రాకుమారుడు ఎలా ఉంటాడో, మధ్య తరగతి అమ్మాయి వ్యక్తిత్వం ఎలా ఉండాలో, బాధ్యతలను, బంధాలను ఎలా పంచుకోవాలో మనసులకు హత్తుకునే విధంగా చెప్పడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. నే చదివిన రాధాకృష్ణలో చిన్నప్పటి అల్లరి, ఆకతాయితనం, కల్మషం లేని పసితనపు చిలిపితనం  ఎలా ఉంటుందో రాధలోను, కృష్ణలోనూ మన చిన్నతనం కూడా ఇదేనేమో అన్నంతగా లీనమై పోతాం. చిన్ననాటి అనుబంధమే ఇరువురిలో ప్రేమగా రూపొంది మలుపులు తిరిగిన ఆ వలపు ఎలా ముగిసిందన్నది ఆ నవలను శోభన్ బాబు, జయప్రద జంటగా అదే పేరుతొ సినిమాగా తీయడం అది విజయాన్ని సొంతం చేసుకోవడంలోనే ఆమె నేర్పరితనం తెలుస్తుంది. అందరికి తెలిసిన ఆమె తొలి నవల సెక్రెటరీ సినిమాగా రూపొంది ఎంత టి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నది మనందరికీ తెలిసిందే. మరో నవల సినిమాగా మారిన అగ్నిపూలు ప్రేమ, పగ సమపాళ్లలో చూపిస్తూ ద్వేషాన్ని ప్రేమగా మార్చడం, అమెరికాలో పుట్టిన పిల్లల తీరుతెన్నులు అప్పటి రోజుల్లోనే మనకు సవివరంగా చూపించారు. నాకు బాగా నచ్చిన మరో నవల ఈ దేశం మాకేమిచ్చింది. దీనిలో మనకు సమాజం, దేశం ఏమిచ్చింది అని కాకుండా మనం ఈ దేశంలో పుట్టినందుకు మనం సమాజానికి కాని, దేశానికి కాని ఏమి చేశామని ప్రశ్నిచుకోమని చెప్పడంతో మనలో కర్తవ్యాన్ని మేల్కొల్పుతారు. ఆ రోజుల్లో ఒక నవల రెండు భాగాలుగా రావడం అనేది యద్దనపూడి గారి అక్షర విన్యాసం చేసిన మరో అద్భుతమని చెప్పాలి. సినిమాగా కూడా రూపొందించిన మీనా నవల రెండు భాగాలు మన అందరికి సుపరిచితమే. గిరిజా కళ్యాణం, జీవన తరంగాలు, ప్రేమలేఖలు, విచిత్రకుటుంబం, బంగారు కలలు, జై జవాన్, ఆత్మ గౌరవం వంటి సినిమాలుగా మారిన నవలలు ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాయో మనందరికీ విదితమే. 
             ఋతురాగాలు టి వి సీరియల్ గురించి చెప్పనవసరం లేదు. రెండో భాగం కూడా రావడంతోనే ఆమె రచనా పఠిమ ఏమిటో మరోసారి తేటతెల్లం అవుతోంది. ఇప్పటికి తెలుగు నవలా లోకంలో ఆమె మకుటంలేని మహారాణి. ఆమె అక్షరాలు అజరామరం ఎప్పటికి. యద్దనపూడి నవలలు అన్ని చదవడం నాకు లభించిన అదృష్టమేమో. 
         21 మే 2018న అమెరికాలోని కాలిఫోర్నియాలో గుండెనొప్పితో మనందరికీ దూరమైనా, అక్షర రాణి యద్దనపూడి సులోచనారాణి మనందరికీ ఎప్పటికి కలలరాణిగా చిరంజీవే. ఆమె తెలుగు నవలలపై వేసిన ముద్ర చిరస్మరణీయమే. 

"నా అక్షరాలు" కవితా సంపుటి సమీక్ష..!!

  నే రాసిన "నా అక్షరాలు" కవితా సంపుటిని ప్రచురించిన గోదావరి యాజమాన్యానికి, కత్తిమండ ప్రతాప్ గారికి నా మన:పూర్వక ధన్యవాదాలు...                     

                                 " నా అక్షరాలు" కవితల పంటలు పండించే అక్షరవిత్తులు ...!!

                                  తెలుగు సాహిత్యంలో వైవిధ్యమైన రచనలు చేస్తూ విశ్వపుత్రిక హైకూలు, ఏకత్వ జ్ఞానం, ఆకాశంలో అర్ధభాగం, నా ఆత్మ కళలు, ధరిత్రి విలాపం అనే ఐదు పుస్తకాలు, విశ్వకవి రవీంద్రుని గీతాంజలిని అపూర్వగానంగా తెలుగు అనువాదం చేసిన డాక్టర్ పి విజయలక్ష్మి పండిట్ (విశ్వపుత్రిక) రాసిన ఆరవ పుస్తకం "నా అక్షరాలు" కవితా సంపుటి సమీక్ష ఈ వారం గోదావరి సాహిత్యంలో మీ కోసం.
"నా అక్షరాలు" చూడగానే కాస్త తెలుగు సాహిత్యం తెలిసిన అందరికి ముందుగా గుర్తు వచ్చే పేరు బాలగంగాధర తిలక్ రాసిన "అమృతం కురిసిన రాత్రి"లోని నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అన్న మాటలు. ఈ కవితా సంపుటిలో విజయలక్ష్మి పండిట్ రాసిన మొదటి కవిత నా అక్షరాలు లో ప్రణవనాదం ఓంకారం నుండి ఉద్భవించిన నాద తరంగాలే నటరాజ కాలి అందియల మువ్వల సవ్వడులై, అనంత ఆనందలోకాల అంచులు తాకే కాలం పడవలంటూ మొదలుపెట్టి సూర్య కిరణాల స్పర్శతో వికసించే తామరలు, పున్నమి చంద్రికలు, సముద్రపు ఒడిలో ఓలలాడే అల్లరి పిల్లలు, ముత్యాల వాన చినుకుల అందాలు, సప్త వర్ణాల సీతాకోకచిలుకలు, ఆకాశంలో హాయిగా, స్వేచ్ఛగా ఎగిరే గువ్వల రెక్కల చప్పుళ్ళు, ప్రభాతాన మ్రోగే గుడి గంటల చప్పుడు, నాన్న దాచి ఇచ్చే ప్రేమ పలుకుల తాయిలాలు, అమ్మ చేతి గోరుముద్దలు, పసిబిడ్డల కేరింతలు అంటూ సమస్త ప్రకృతిలో మమేకమైన మనసాక్షరాలను అద్భుతంగా అందించారు.  నా తనం కవితలో ఆమె ఎంచుకున్న కలం పేరు గురించిన వివరణ కవితాత్మకంగా చెప్పారు. నా పుస్తకాల అలమరాలో ఆమె దాచుకున్న పుస్తక నేస్తాలు తానేమిటో చెప్తాయి అంటూ పుస్తకాలతో తన చెలిమి చిరకాలఅనుబంధమని బాల్యం నుంచి దాచుకున్న నవరత్నాలని మురిపెంగా చెప్పడం చాలా బావుంది. ఆమె ఒక శాంతి సందేశంలో ఆమె ఒక శిఖరం అంటూ పడతి ఓరిమిని, ఔన్నత్యాన్ని చాటుతూ ఆమె లేని జగతి శూన్యమని మహిళ విలువను చెప్పడం బావుంది. అక్షర మానవుణ్ణిలో జీవితమే సాహిత్యం , అక్షరమయం, అన్ని సాహిత్యపు అనుబంధాలతో మమేకం, అందుకే నేను అక్షర మానవుణ్ణి అంటారు. భూమాతలో సమస్త జీవుల జీవ బీజ ప్రదాత, మూర్తీభవించిన అమ్మదనం మన భూమాత అంటూ గొప్పగా చెప్తారు. భావజలధిలో అంతర్నేత్రంలో తెలుగు అమ్మభాషగా నిలిచి తన భావాలకు ఊతమివ్వడం, కవితా నా కవితలో కవితా జననాన్ని, రేపటి ఇనుడులో సందె సూరీడు కబుర్లను మధురంగా వినిపిస్తూ చీకటి చెంతకు చేరడాన్ని, ఈ.. క్షణంలో కవిలో ఊపిరి పోసుకునే కవితాభావాలను అన్ని కాలాలకు అన్వయించడం, వికసించ వెరసే మొగ్గలో చితికిపోతున్న పసితనపు భయాన్ని, మృగ్యమౌతున్న మానవత్వాన్ని బాగా చెప్పారు. నీవు ఒంటరివి కాదులో ఒంటరితనానికి స్నేహం ఎవరో, ఆకాశం, భూమి అన్ని తోడేనని, అక్షర బలహీనతలో మంచి పుస్తకాలను చదవడం తన బలం, బలహీనత అని, నా పంచేంద్రియాలే నేనులో పంచేంద్రియాలే మనిషి, మనిషే పంచేద్రియాలని, జీవ బీజాలులో దశాబ్దం వెంటాడిన తన కలలకు అక్షర రూపం ఈ కవితని తన ఆలోచనలను పంచుకోవడం, ఆ మామిడిచెట్టు ఏడుస్తూందిలో జరుగుతున్నా అక్రమాలకు సాక్షిభూతమైన మామిడిచెట్టు మనసు రోదనను మనిషి మారణకాండకు మూగబోయి దేవునికి విన్నవించుకోవడం, రైతు ఆత్మనివేదనలో రైతు రోదనను, బరువు బాల్యంలో ఇప్పటి కార్పొరేట్ల చదువులను, అక్షరాలను పాతిపెట్టకు, అక్షర సముద్రం, నా భాషంటే కవితలలో మనిషి మనుగడకు బాట వేసిన అక్షరాలను పాతిపెట్టవద్దంటూ, అక్షర సేద్యం చేయమని చెప్తూ, తెలుగు భాష అమ్మ భాషని నొక్కి వక్కాణించారు. అరుణోదయం, ఆకుపచ్చని యవ్వనంలలో ప్రకృతి అందాలను, చైతన్యాన్ని చూపించారు. అనంత అద్భుత శక్తి ప్రేమని ప్రేమలేని క్షణం ఏదని ప్రశ్నించారు. నవ్వింది ఆకాశం, యుద్ద భూమి, మిథునం, ఇప్పటికిప్పుడు కవితై, అలిగాయి నా ఆలోచనలు, నిర్లక్ష్యం పడగ నీడల్లో, బాపు గీసిన చిత్రపటాలు, అమృత ఘడియలు, నేను సాక్షినై, సహజత్వం, ఆకు సంవేదన వంటి కవితల్లో ప్రతి చిన్న అనుభూతిని అక్షరాలతో బంధించి జీవిస్తావు అక్షరాలై అని అంతులేని కాలచక్ర కథనాన్ని వినిపిస్తూ, చరాస్తులు, మేము కూడా జవాబు దొరకని ప్రశ్నగా మిగలక కళాత్మక జీవితంలో నీ విజయలక్ష్మిని సొంతం చేసుకొమ్మని ఆ ఆ లు కార్చాయి కన్నీళ్ళ ఆనంద భాష్పాలు. అమ్మకానికి ఆడబిడ్డ అంటూ పసిబిడ్డల చీకటి బతుకుల వెలుగు కోణాలను, ఒక భావనలో భారతదేశపు గొప్పదనాన్ని అందంగా తనదైన శైలిలో అక్షరీకరించారు. సామాజిక అంశాలను, తన ఊహలకు ఆకృతులను, విభిన్న కవితా వస్తువులలో "నా అక్షరాలు" కవితా సంపుటి పరిపూర్ణతను అందుకుంది. చక్కని అక్షర భావాలను అందించిన విజయలక్ష్మి పండిట్ కు హృదయపూర్వక అభినందనలు.  

20, మే 2018, ఆదివారం

సంతాప సభ..!!

రేపు..
నాకు ఓ సభ పెడతారట
ఉపన్యాసాలిస్తారట
అందరూ తమ మనసులిప్పి మాట్లాడతారట
నా ఈ స్థితికి కారణాలు వివరిస్తారట
దాటేసిన నిజాల నిగ్గు తేలుస్తారట
అన్యాయాలకు, అక్రమాలకు చరమగీతాలు పాడతారట
మేథావులూ వింటున్నారా..
అబద్దాలే చెప్పరట
న్యాయదేవత గంతలిప్పుతారట
నలుగురిలో గొంతెత్తి చాటుతారట
ఎవరినో నడి బజారులో నిలదీస్తారట
ఉద్యమాలు చేస్తారట
దేనికోసమంటే తెలియదట
ఎవరో చెప్పారట
సత్యాన్ని చంపేసి సమాధి చేసారని....!!

17, మే 2018, గురువారం

ఏమైనా అనుకోండి..!!

నేస్తం,
        మనం ఒక పోస్ట్ పెట్టినప్పుడు దానికి వచ్చే స్పందనలు కూడ స్వీకరించాలి కాని మనకి నచ్చని కామెంట్లు తీసేసి మన హుందాతనాన్ని చాటుకోవడం ఎంత వరకు సబబు..? నీతులు,  సూక్తిసుధలు అందరం చెప్పేస్తాం, కాని వాటిలో కనీసం ఒకటయినా మనం పాటిస్తున్నామా లేదా అని ఎవరో అడగనక్కరలేదు, గతంలో మనం పెట్టిన పోస్ట్లు మననం చేసుకుంటే చాలు. మరోసారి అందరికీ చెప్తున్నా నా పోస్ట్లకు లైక్ లు,  కామెంట్లు పెట్టమని ఎవరికి చెప్పడం లేదు. పెట్టాలనిపిస్తే ఆ పోస్ట్ కి తగ్గ కామెంట్ పెట్టండి అంతేకాని గుడ్ మార్నింగ్ లు,  గుడ్ నైట్ లు పెట్టవద్దు. అనవసరపు చెత్త చెదారాలు పెట్టకండి.  ప్రెండ్ గా ఆడ్ చేసాము కదాని మీ అతి తెలివి ప్రదర్శించకండి.  చెత్త ఫోటోలు పెట్టి దాన్నేమంటారు, దీన్నేమంటారు అని మీ వక్రబుద్దిని బయటేసుకోకండి. భావాలనేవి మనం రాయాలంటే రావు. వాటిని చులకన చేయకండి.  నా రాతలు నచ్చని వారు నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు..

16, మే 2018, బుధవారం

ఓటమి వాపోతోంది...!!

మదిని తడుముతున్నాయి
ఎదను గుచ్చుతున్నాయి 
గాయాలో జ్ఞాపకాలో తెలియదు

కలలు రాలిపోతున్నాయి
కన్నీళ్లు ఆవిరైపోతున్నాయి
చెమ్మలేని రెప్పలు పొడిబారాయి

చీకటి చెలిమి కోరింది
వెలుతురూ వీడిపోయింది
ముసిరిన వెతల  మబ్బులకు

కృష్ణపక్షం మాటేసింది
శుక్లపక్షానికి చోటీయనని
బతుకుని కమ్మేసిన మసక మాయలలో

జీవం ఇంకిపోయింది
జీవితేచ్ఛ నశించింది
జీవన్మరణ సమరంలో

కాలానికి ధీటైన మనోధైర్యమే
నీ గెలుపు చిరునామా అని
ఓటమి వాపోతోంది...!! 
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner