21, సెప్టెంబర్ 2018, శుక్రవారం

మాటల వరకే పరిమితం....!!

                            పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు, రైతు రాజ్యమే మా లక్ష్యం, రైతన్న అన్నం పెట్టే దేవుడు ఇలా వగైరా వగైరా మాటలన్నీ ఎక్కడో విన్నట్టుగా ఉంది కదూ. పార్టీలతో ప్రమేయం లేకుండా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఓట్ల కోసం చెప్పే మాటలే ఇవి... హమ్మయ్య అందరికి గుర్తు వచ్చాయనుకుంటాను. ఇక అసలు విషయానికి వస్తాను. మాది కృష్ణాజిల్లా దివితాలూకాలోని కోడూరు పక్కన ఓ మారుమూల పల్లెటూరు.  కనీసం ప్రభుత్వ రవాణా సౌకర్యాలు లేని ఊరు. కోడూరు నుంచి ఆటో వారు ఎంతంటే అంతా ఇచ్చి నడవలేని వారు వెళ్లడం అనాదిగా జరుగుతోంది. ఒకప్పుడు రోడ్డు సౌకర్యం కూడా లేదు. ఇప్పుడు ఉన్నా కూడా ప్రభుత్వం ఒక్క బస్ కూడా వేయని ఊరు మా ఊరు నరసింహపురం.
                           అసలు విషయం ఏంటంటే రైతులకు పంటకు ఆధారమైన కాలువలే ఇప్పుడు కనబడకుండా పోయే పరిస్థితి వస్తోంది. పంట కాలువ, మురుగు నీటి  కాలువ అని ప్రత్యేకంగా ఉండే కాలువలు కూడా సరిగా లేని దుస్థితి ఇప్పుడు. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకునే నాధుడు లేడు. మా ఊరి నుంచి సాలెంపాలెం, గొంది ఊర్లకు   దారి, 2500 ఎకరాలకు వెళ్ళడానికి అదే దారి, జయపురం, కృష్ణాపురం, నరసింహపురం, ఉల్లిపాలెం పొలాలకు మురుగు కాలువ అయిన లింగన్న కోడు కాలువ మీద వంతెన 2001 లో పడిపోయినా ఇప్పటి వరకు దాని అతి గతి పట్టించుకున్నవారు లేరు. ఊరివారు కాస్త మట్టి, అవి ఇవి వేసి ఆ వంతెన పూర్తిగా పడిపోకుండా చేసారు. కాని బాగా శిథిలావస్థలోనున్న వంతెన ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకునేవారు లేరు. ఊరివారు ఏమైనా చేయగలరా అంటే ఒకరు బాగు చేద్దాం అంటే మరొకరు వద్దని అడ్డం తిరగడం, పనికిమాలిన రాజకీయాలు, మంచి చేసే వారిని తిట్టడం, స్వలాభం లేనిదే ఏమి చేయనివ్వని తత్వాలు పెరిగిపోయాయి.
                       పదిమందికి ఉపయోగ పడే ఆ వంతెన ఎప్పుడు కూలిపోతుందో తెలియదు, కనీసం మన ఊరంతా కలిసి బాగు చేసుకుందామన్న ఆలోచన వచ్చిన వారికి అండగా నిలబడడానికి ఊరిలోని అధికారంలో ఉన్న పార్టీ నాయకులు ముందుకు రాకపోవడమన్నది చాలా విచారకరం. ఊరి వాళ్ళ ఓట్లతో గెలిచింది మీరు డబ్బులు సంపాదించుకోవడానికి మాత్రమే కాదు, కనీసం దానిలో కొంతయినా శ్రద్ధ ఊరి అవసరాల కోసం, ఊరి బాగు కోసం మీ పరపతిని ఉపయోగించండి. నాలుగు కాలాలు ఊరి జనాలు మీ పేరే చెప్పుకుంటారు. అందరికి అవసరమైన వంతెన పునర్నిర్మాణానికి ప్రభుత్వం, ప్రజలు సహకరించాలని కోరుకుంటూ... ఊరి మీద అభిమానాన్ని చంపుకోలేని ఓ సామాన్యుడు. 

త్రిపదలు...!!

1.  ప్రణయం..
పరిచయమయ్యాకే తెలుపుతుందనుకుంటా
బంధాల నడుమ బాంధవ్యాన్ని...!!

20, సెప్టెంబర్ 2018, గురువారం

జీవన "మంజూ"ష (సెప్టెంబర్ )

నేస్తం,
        వ్యవస్థలో విలువలు తగ్గుతున్నాయంటే కారణాలు మరెక్కడో వెదుకుతాం కాని వెదుకులాట మనతోనే మొదలు పెట్టం. ఎందుకంటే మన మీద మనకంత నమ్మకం. మనం ఏ తప్పు చేయని ప్రబుద్ధులమని ప్రగాఢ విశ్వాసం కూడాను. పెళ్ళాం / మొగుడు పిల్లల మంచి చెడు అవసరం లేదు. ప్రపంచానికంతా ఆదర్శవంతులమే కాని మన ఇంట్లో మాత్రం ఎవరి అవసరాలు పట్టించుకోము. కుటుంబం మన అలంకారానికనుకుంటూ, బాధ్యతలు పంచుకుని, బంధాలను పెంచుకోవడానికని మాత్రం మర్చిపోతాం. ఆపదల్లో అందరిని ఆదుకోవడానికి మన విశాల హృదయాన్ని చాటుకుంటాం ఎల్లప్పుడూ. మంచితనం ముసుగు మనమే కప్పుకున్నామో, మరెవరయినా మనకు దాన్ని ఆపాదించారో తెలియని స్థితిలో ఆ ముసుగు నుండి బయటకు రావడానికి ఇష్టపడక నటిస్తూనే జీవించేస్తుంటాం.
      బాధను సంతోషాన్ని పంచుకోవడానికి మన అన్న వారికి మనం ఎలా లేకుండా ఉంటామో, రేపటి రోజున మనకంటూ ఎవరు ఉండరని తెలుకోలేము. చావు పుట్టుకలు ప్రతి ఇంటిలోనూ సహజమన్నది మరచి, మన అహంకారానికి మనమే మురిసిపోతూ డబ్బు పొగరుతో ఆ డబ్బు జబ్బుని మర్చిపోయి రేపన్నది మనకి ఉంటుందని గుర్తు లేనట్టు ప్రవర్తిస్తాం. విభజించి పాలించడం రాజకీయాల్లోనే పరిమితం కాకుండా మనమూ ఆ లక్షణాలన్నీ అవపోసన పట్టేసి అనుబంధాలను అతలాకుతలం చేస్తూ మన ప్రతిభకు మనమే గర్వపడి పోతున్నాం. ఆ ఇంటి బాధ రేపటి రోజున మన ఇంటిది కాకుండా పోదని మర్చిపోయి ప్రవర్తిస్తున్నాము. వయసు పెరుగుతున్న కొలది మన వ్యక్తిత్వం నలుగురు మెచ్చేదిగా ఉండాలి కాని నలుగురిలో నవ్వులపాలు కాకూడదు. నీతి సూత్రాలు వల్లే వేసి, నాలుగు గుడులు తిరిగినంత మాత్రాన మన సహజ లక్షణం పోయి మనము ఏమి మహాత్ములమైపోము. మనస్సాక్షి ఉంటుంది కదా దాన్ని తరచి చూస్తే తప్పొప్పులు తేటతెల్లమౌతాయి. కాదు కూడదు అహంకారాన్నే ఆభరణంగా అమర్చుకుంటామంటారా అది మీ ఇష్టానికే వదలి నలుగురితోపాటు నారాయణా అనడం మేమూ నేర్చుకుంటాం.

ఇప్పటికి ఈ  ముచ్చట్లకు సశేషం.... 

15, సెప్టెంబర్ 2018, శనివారం

కలల ప్రపంచం...!!

కలల ప్రపంచం కాలిపోతోంది
నైరాశ్యపు నీడలలో పడి

మనోసంద్రం ఘోషిస్తోంది
మౌనపు అలల తాకిడికి

కాలం కనికట్టు చేస్తోంది
ఊహలకు ఊతమిచ్చే క్షణాలకు లొంగి

రెప్పల కవచం అడ్డు పడుతోంది
స్వప్నాల మేలిముసుగు తొలగించడానికి

తెలియని చుట్టరికమేదో పలకరించింది
గతజన్మ బాంధవ్యాన్ని గుర్తు చేయడానికి

ముచ్చట్లకు మనసైనట్లుంది
శూన్యాన్ని నింపేయడానికి

ముగింపునెరుగని జీవితమైంది
మూగబోయిన ఎడద సవ్వడికి

అలసట తెలియని అక్షరాలంటున్నాయి
ఆగిపోయే ఊపిరికి ఆసరాకమ్మని....!!

సినీవాలి నవలా సమీక్ష...!!

                                         సినీ రంగంలోని చీకటిని చీల్చిన "సినీవాలి"..!!


ప్రముఖ నవలా రచయిత, సినీ దర్శకులు ప్రభాకర్ జైనీ రాసిన "సినీవాలి" నవలా సమీక్ష సంక్షిప్తంగా..
    " ఒక చిన్న స్వప్నం సాకారమౌతుంటే కలిగే ఆ ఆనందమే వేరు . "  అంటూ ప్రభాకర్ జైనీ తన స్వప్న సాకారాన్ని గురించి చెప్పిన ఈ మాటలు నిజంగా అనుభవానికి వస్తేనే ఆ అనుభూతి, ఆస్వాదన తెలుస్తాయి.  'సినీవాలి' అంటే అమావాస్య నాటి తెల్లవారు ఝామున కనిపించే వెలుగు అని అర్ధం. పూర్తిగా సినిమా ప్రపంచానికి సంబంధించిన ఈ నవలా ఇతివృత్తానికి ఈ "సినీవాలి" అన్న పేరు పెట్టడం నూటికి నూరుపాళ్లు సమంజసమే. చీకటిని వెన్నంటే వేకువ ఉందని చెప్పడానికి, మనిషిలో ఆశావహ దృక్పధాన్ని కల్పించడానికి, నమ్మిన నమ్మకాన్ని గెలిపించుకోవడానికి మనిషి నిరంతరం కాలంతో చేసే యుద్ధమే నాకు ఈ "సినీవాలి" లో కనిపించింది. మనకు రోజుకు ఇరవైనాలుగు గంటలు. ఈ ఇరవై నాలుగు గంటలు అనేవి ప్రతి మనిషి జీవితంలో ఎంతో ప్రముఖ పాత్ర వహిస్తాయి. మార్పు అనేది మంచికైనా కావచ్చు లేదా ఓ మనిషిని అధఃపాతాళానికి పడదోయవచ్చు.
"లక్ష్యం అనేది ఎప్పుడూ ఎడారిలోని మరీచికే..
ఒక లక్ష్యం చేరిన తరువాత.. అక్కడ ఏముంటుంది? ఏమీ ఉండదు శూన్యం." ఇంత కన్నా బాగా విజయాన్ని, గెలుపుని ఎవరైనా చెప్పగలరా అనిపించింది ఈ నవల చదువుతుంటే.
కథానాయకుడు తను దర్శకత్వం వహించిన సినిమాకు ఆస్కార్ నామినేషన్లలో చోటు దొరికినందుకు ఆ ఫంక్షన్లో పాల్గొనడానికి బయలుదేరడంతో నవల ప్రారంభం అవుతుంది. ప్రతి మనిషికి జీవితంలో ఒక గమ్యం అంటూ ఉండాలన్న సందేశం కనిపించడంతో పాటు, అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి కొన్ని కోల్పోవడాన్ని కూడా చూపిస్తుంది. మనిషి భయానికి లొంగితే ఆ భయమే మనల్ని ఎందుకు పనికిరానివాళ్లుగా ఈ సమాజానికి పరిచయం చేస్తుంది. డబ్బుల కోసమో, పేరు, ప్రతిష్టల కోసమో కాకుండా తాను నమ్మిన సిద్ధాంతాల కోసం, సినిమానే తన ప్రాణంగా బతికే ఓ మధ్యతరగతి సగటు యువకుడు కథానాయకుడు. ఉన్నత చదువును, కుటుంబాన్ని వదిలేసి తనెంతో ప్రేమించి, ఆరాధిస్తూ తన ప్రాణంకన్నా మిన్నగా ఇష్టపడే సినీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను, కథ, కధనంతో పాటు దర్శకత్వంలో తనదైన ముద్ర వేయాలని తాపత్రయ పడే సినీ ప్రేమికుడిని సంపూర్ణంగా చూపించడంలో రచయిత కృతకృత్యులయ్యారు.
     సాధారణంగా మనం చూసే మూడు గంటల నిడివి గల సినిమా మన ముందుకు రావడానికి ఎన్ని ఒడిదుడుకులు ఉంటాయో, ప్రతి ఫ్రేమ్ లోను ప్రతి ఒక్కరి కష్టం ఎంత ఉంటుందో కళ్ళకు కట్టినట్టుగా చూపించడం వెనుక సినిమా మీద రచయితకున్న ఇష్టం కాదు కాదు ఆరాధన అనే చెప్పొచ్చు అది స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఇరవై నాలుగు గంటల క్రాఫ్ట్ అనేది సినిమా కాదు జీవితానికి సరిపోయే పదం. ప్రతి రంగంలోనూ మంచి చెడు రెండు  ఉంటాయన్నది నిర్వివాదాంశం. మనిషికి రెండు పార్శ్వాలున్నట్లే ఏ రంగానికైనా ఇవి తప్పవు. కాకపొతే ఇంత విపులంగా లోపాలను అదీ తానెంతో ప్రేమించి ప్రాణంకన్నా ఎక్కువగా చూసుకునే సినిమా గురించి ప్రతి చిన్న విషయాన్ని పంచుకోవడమనేది ఏ కొద్దిమందో చేయగలరు. ఆ కోవలోని వారే ప్రభాకర్ జైనీ అని చెప్పడానికి ఎట్టి సందేహము లేదు.
       ఇక సినీవాలి గురించి చెప్పాలంటే సాధారణంగా మనకు తెలిసిన మోసాలు, ద్వేషాలే ఇక్కడా ఉంటాయి. సినిమా మీద అపారమైన ఇష్టం ఉన్న యువకుడు అన్ని వదులుకుని ఓ మూసలో కాకుండా ఏ అవార్డులు, రివార్డులు ఆశించకుండా తాను నమ్మిన విలువల కోసం సినిమా తీయడానికి పడిన పాట్లు, సంతోషం, బాధ, ఆకలి, కోపం, ఆవేశం, ఏడుపు ఇలా అన్ని సహజంగా చెప్పడం, మనుష్యుల్లో, మనసుల్లో కలిగే వికారాలు, వికృతాలు అన్ని మనకు కనిపిస్తాయి. చాలా మంది అనుకున్నట్టు దీనిలో శృంగారం, నేరాలు, ఘోరాలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. దానికి రచయితను తప్పు పట్టనక్కరలేదు, నిజం చెప్పాలంటే మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. నిక్కచ్చిగా అన్ని నిజాలు రాసినందుకు.
" సినిమా అన్నది రంగుల ప్రపంచమే కానీ ఆ రంగుల ప్రపంచాన్ని సృష్టించడానికి ఎన్ని వందలమంది కృషి చేస్తారన్నది సామాన్య ప్రజల అంచనాకు చిక్కదు."  ఇదే నిజమని మనకూ తెలుసు. ఓ మూడు గంటలు సినిమా చూసేసి మనకిష్టమైనట్లు నాలుగు మాటలు సమీక్షగా రాసేసి చేతులు దులిపేసుకుంటాం. కానీ ఆ సమీక్షలు అనేవి కూడా ఇప్పుడు ఎంత అసహజంగా ఉంటున్నాయో మనందరికీ తెలుసు. మంచి చెడు బేరీజు వేసుకోవడంలో కాస్త నిజాయితీ, నిబద్దత చూపిస్తే చిన్నా, పెద్దా తేడా లేకుండా మన ముందుకు వచ్చే మూడు గంటల సినిమా వెనుక కష్టాన్ని గుర్తిస్తే మాట తూలడం చేయలేము. మన ఆదరణని బట్టే సినిమాలు తీస్తూ నాలుగు డబ్బులు రాబట్టుకోవాలనుకునే వ్యాపారులే ఎక్కువ ఈ రంగంలో కూడా. సగటు ప్రేక్షకుడిగా మనలో మార్పు వస్తే సినీ రంగమే కాదు ఏ రంగమైనా మంచి వైపుకే పయనిస్తుందనడానికి ఈ సినీవాలి ఓ సరికొత్త ఉదాహరణ.
   సినీ రంగంలో వాస్తవాలను ఒక్కటి కూడా వదలకుండా, దేనికి భయపడకుండా మంచి, చెడు ఉన్నదున్నట్టుగా నిజాయితీగా అక్షరీకరించిన ప్రభాకర్ జైనీ గారికి మనఃపూర్వక అభినందనలు.

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner