22, ఆగస్టు 2017, మంగళవారం

జీవన 'మంజూ'ష (2)...!!

నేస్తం,
        తరాల ఆంతర్యాల అనుభవాలకు చిహ్నంగా మిగిలిన విలువలు వెల వెలా పోతున్నాయి. ఈనాటి తల్లిదండ్రులు ఒకప్పటి పిల్లలే అన్న సంగతి మరచి తమ గొప్ప కోసమో లేదా నలుగురిలో తమ హోదాను చాటుకోవడం కోసమో పిల్లల మనసులతో ఆడుకుంటున్నారు. ఈ కార్పొరేట్ చదువులు వచ్చిన  తరువాత చదువుని కొనుక్కోవడం మామూలై పోయింది.  రాంకుల కోసం తపన మొదలైంది. మన ఇష్టాయిష్టాల కోసం పిల్లల ఇష్టాలు కాలరాయడం ఎంత వరకు సబబు..?
అలా అని తప్పంతా పెద్దలదే అనుకోవడం కూడా పొరపాటే. మధ్య తరగతి కుటుంబాలను తీసుకుంటే పిల్లలు తమలా కష్టపడకూడదని పిల్లలకు అన్ని అమర్చి పెడుతుంటే వాళ్ళకు రూపాయి విలువ, చదువు ఆవశ్యకత తెలియకుండా పోతోంది. విలాసాల మోజులో పడి మానవతా విలువలనే మర్చిపోతున్నారు. సరదాల అవసరాలకు, ఆడంబరాలకు అమ్మానాన్నలను వాడుకుంటున్నారు. ప్రచార మాధ్యమాలు, ముఖ పుస్తకాలు, ట్విటర్లు మొదలైన సేవలు, సెల్ ఫోన్ల వాడకం వచ్చాక ఒకే ఇంట్లో ఉన్నా పెద్దల పిల్లల మధ్య దూరం పెరిగిపోయింది. "ఎవరికీ వారే యమునా తీరే" అన్న నానుడి అక్షరాలా నిజమైంది.
అనుబంధాలను పెంచుకుంటూ, మార్కులతోనూ, రాంకులతోను పిల్లల తెలివితేటల్ని అంచనా వేయడం మానివేసి వాళ్లలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసే ప్రయత్నం మొదలుపెడితే ప్రతి విద్యార్థి ఓ అబ్దుల్ కలాం కాక మానడు.
ఇప్పటికి ఈ ముచ్చట్లకు సశేషం.

9, ఆగస్టు 2017, బుధవారం

రెక్కలు..!!

1. అందని
ఆకాశం
అంతేలేని
కడలి

మనసుకు
ప్రతిరూపాలు...!!

2. గతాలు
జ్ఞాపకాలు
వాస్తవాలు
వర్తమానాలు

అక్షరాలుగా
కాగితాలపై..!!8, ఆగస్టు 2017, మంగళవారం

మెరిసిన కవితాకన్నియ...!!

రెప్పపాటు ఈ జీవితానికి
కనురెప్పల మాటున కలలెన్నో
కనపడని వ్యధల కథలెన్నో

మాటల చాటున మౌనానికి
వినిపించే వితరణ వేదనలెన్నో
వివరించలేని గాయపు గురుతులెన్నో

పెదవి దాటని పలుకులకు
మిగిలిన గుండె సవ్వడులెన్నో
నినదించలేని గొంతు రోదనలెన్నో

పరుగులెత్తే కాలానికి
పోటీ పడలేని జీవనాలెన్నో
ఓటమి ఓదార్పుల వెతలెన్నో

జ్ఞాపకాల గువ్వలలో
గూడు కట్టుకున్న గతాలెన్నో
గాలికెగిరిపోయే గాథలెన్నో

అంతేలేని అక్షర ప్రవాహానికి
అడ్డుపడే ముద్రారాక్షసాలెన్నో
మనసు వాకిట నిలిచిన భావాలెన్నో

ఒలికిన కవనపు చినుకుల్లో
చిలికిన చిరు జల్లులెన్నో
మెరిసిన కవితాకన్నియ హరివిల్లులెన్నో..!!

3, ఆగస్టు 2017, గురువారం

త్రిపదలు ..!!

1. కన్నీరు నీరైంది
నీరవమైన  మదిని
ఊరడించలేక...!!

2. బాధ్యత భారమైంది
బతుకు భళ్ళున తెల్లారి
గూడు చెదిరితే..!!

3. అక్షరం ఆయుధమై
భావం విస్ఫోటనం చెందితే
అగ్నికణ వర్షమే కాగితాల నిండా..!!

మీరుగానే మిగిలిపోతారు రేపటి రోజున...!!

నేస్తం,

   బంధాలు, బంధుత్వాలు ఎంతగా పలచబడి పోతున్నాయంటే చెప్పడానికి కూడా ఏదోలా ఉంది. అక్క బిడ్డలు, అన్న బిడ్డలు అని మనకున్నా, ఎంతగా మన చేతుల్లో పెరిగినా వారి నుండి ఓ పలకరింపు కరువై పోతోంది ఈనాడు. పలకరింపు అనేది మనసునుంచి రావాలి, తెచ్చిపెట్టుకొనకూడదు. వరుసలను వాడుకునే వారు కొందరైతే, మనసులతో, మనుష్యులతో డబ్బు కోసం ఆడుకునే వారు మరికొందరు. డబ్బు జబ్బు సోకగానే ఆప్యాయతలు మరచిపోతున్నారు. సంపాదన మనకు ఉంటే మనమే అనుభవిస్తాము కానీ ఎవరికీ ఒక పైసా పెట్టము. మాటలు, చేతలు మాత్రం కలకాలం నిలిచిపోతాయి. అసలు ఒకరు మనలని పలకరించలేదు అనుకోవడానికి ముందు మనం ఎంత వరకు పలకరిస్తున్నాం అనేది చూసుకుంటే బంధాలు కొన్ని రోజులైనా నిలబడతాయి. నాలుగు రోజులు ఒకరితో, మరో నాలుగు రోజులు మరొకరితో మన అవసరాలు గడుపుకోవడం ఎంతవరకు సబబు..? మనం చేసిన తప్పొప్పులను నిజాయితీగా ఒప్పుకున్న రోజు మనకు ఓ మనస్సాక్షి ఉందని అనిపిస్తుంది. అందరం బతికేస్తున్నాం కనీసపు విలువలు లేకుండా అన్ని బంధాలను దుయ్యబడుతూ అల్లరిపాలు చేస్తూ కొన్నిరోజులు, తరువాతేమో తప్పయిపోయింది అని మన అవసరాలు తీర్చుకోవడానికి ఆ బంధాలను వాడుకుంటున్నాము. అన్నం పెట్టిన చేతినే కాటు వేసే విషపు పురుగులున్న సమాజం మనది. ఇక ఈ అభిమానాలకు, అనుబంధాలకు చోటు ఉంటుందని ఎదురుచూడటం కూడా అత్యాశే అవుతుంది.  చదువులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయగానే సరి కాదు, పెద్దలు తప్పుచేసినా సరిదిద్దే పిన్నలు ఉండాలి. అంతేకానీ ఆ తప్పుని సమర్ధించే వ్యక్తిత్వం మీకుంటే మీరుగానే మిగిలిపోతారు రేపటి రోజున.

అన్నట్టు చెప్పడం మరిచా .. ఇది నా బ్లాగులో 1401 వ పోస్టు.
 
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner