18, అక్టోబర్ 2018, గురువారం

ఏక్ తారలు...!!

1.  సంద్రమంత సంతోషమే_గగనమంత చెలిమి సొంతమయ్యిందని...!!

17, అక్టోబర్ 2018, బుధవారం

ఎందుకు...!!

గాయాల గతమెందుకు
గమనమెరుగని బతుకులుండగా

మరలిపోయిన నవ్వులెందుకు
మసకబారిన కలలుండగా

కాలిపోయిన ఆశలెందుకు
కలతబారిన మనసుండగా

వదిలిపోయిన బంధాలెందుకు
ముడిబడని సంబంధాలుండగా

సడిలేని సందడెందుకు
చాటుమాటు సరదాలుండగా

చెరిగిపోయిన రాతలెందుకు
చెరగని విధిరాతలుండగా

రాలిపోయిన పువ్వులెందుకు
పూజకు నోచని విగ్రహాలుండగా

మరచిపోయే జ్ఞాపకాలెందుకు
మరపు వరమిచ్చే కాలముండగా

నీ కోసం మరుజన్మెందుకు
యుగాల నిరీక్షణకు తెరదించగా...!!

15, అక్టోబర్ 2018, సోమవారం

మరణ రహస్యం...!!

మౌనమెా మరణ రహస్యమే ఎప్పటికి
మాట్లాడటానికి అక్షరాలను
పేర్చుకుంటున్న మనిషి
నిస్సత్తువగా ఓ మూల ఒదిగిన క్షణాలు

బావురుమంటున్న ఏకాంతము
మనసుతో సహకరించని శరీరము
అప్పుడప్పుడు వినవస్తున్న రోదనలు
పైపైన పలకరిస్తున్న పరామర్శలు

కలలన్నింటిని కుప్పగా పోసి
ఆశలను హారతిచ్చేస్తూ
గతాన్ని బుజ్జగిస్తూ జ్ఞాపకాలుగా
మారిన గురుతులు వాస్తవానికి మిగిల్చి

నాకై నేను కోరుకొన్న ఈ ఒంటరితనం
కాస్త భయమనిపించిందనుకుంటా
ఓ కన్నీటిచుక్క అలా జారినట్టున్నా
కాలానికి అలవాటైన అంపశయ్య ఇది...!!

7, అక్టోబర్ 2018, ఆదివారం

రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి...!!

                   తెలుగు సాహితీ మానస పుత్రిక రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి...!!        

             రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి ఈ పేరు తెలుగు భాష గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి సుపరిచితమే. మృదు స్వభావి, స్నేహశీలి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావాన్ని కలిగి, ఎన్నో బిరుదులు, సత్కారాలు పొందినా అతి సామాన్యంగా కనిపించే వాగ్దేవి వర పుత్రిక. చిన్నతనం నుంచే తెలుగు భాషపై మక్కువను, మమకారాన్ని పెంచుకుని, తెలుగు భాషకు తన వంతుగా ఎన్నో విలువైన పుస్తకాల సంపదను భావి తరాలకు అందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి.
                   గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా మైనేనివారి పాలెంలో జన్మించిన మల్లీశ్వరి తన బాల్యం ఆనందంగా ఎటువంటి ఆంక్షలు, కట్ట్టుబాట్లు లేకుండా కృష్ణమ్మ అలల సందడిలో, ఎటి ఒడ్డున పిచ్చుక గూళ్ళ ఆటలతో, పల్లె పైరగాలుల పలకరింతల మధ్య స్వేచ్ఛగా సంపూర్ణంగా గడిచిందని గర్వంగా చెప్తారు. కళాశాల విద్య వరకు గుంటూరులోనూ, ఎం ఏ భీమవరంలోని డి ఎన్ ఆర్ కళాశాలలో పూర్తి చేసారు. ఉద్యోగ పర్వం విజయవాడలోని సిద్దార్థ పబ్లిక్ స్కూల్ తో మొదలై 26 ఏళ్లకు పైగా హైదరాబాద్ బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో పదవీ విరమణతో ముగిసింది. పాటలు, నాట్యం మీద చిన్నప్పటి నుండి ఉన్న ఇష్టంతో తాను నేర్చుకోలేక పోయినా వాటి మీద ఆసక్తిని వదులుకోలేక, పిల్లల మీదనున్న మక్కువతో కళాశాల బోధనా కన్నా పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయినిగా చేరి అందరి మన్ననలను పొందారు. అంతకన్నా ఎక్కువగా ఆత్మతృప్తిని అనుభవించారు. పర భాషకు ప్రాముఖ్యత పెరుగుతున్న ఈ రోజుల్లో అంతరించిపోతున్న తెలుగు భాషను నిలబెట్టడానికి ఉపాధ్యాయులకు తెలుగు భాష పట్ల నిబద్ధత ఉండాలని, పిల్లలకు సులభ రీతిలో ఉచ్చారణ, రాయడం నేర్పాలని, కనీసం ఇంట్లోనయినా తల్లిదండ్రులు పిల్లలకు తెలుగులో మాట్లాడటం, రాయడం, చదవడంపై కథలు, కబుర్ల ద్వారా ఆసక్తి కలిగించాలని, తద్వారా తెలుగు భాష బతుకుతుందని అంటారు. మన భాషను మనం మర్చిపోతే మనని మనం మర్చిపోయినట్లే అంటారు.
       పఠనాసక్తి మెండుగానున్న తనకు పదవ తరగతి తరువాత వచన కవితా రాయడం మొదలైందని, అధ్యాపకుల బోధనలలో కొత్త పదాలను సేకరిస్తూ, ప్రముఖ కవుల రచనలు చదవడం ద్వారా తన కవితా రచనకు మెరుగులు దిద్దుకున్నానంటారు. పోతన, కృష్ణశాస్త్రి, కరుణశ్రీ, శేషేంద్ర శర్మ, బాల గంగాధర తిలక్, దాశరథి, నారాయణరెడ్డి మొదలైన వారు తన రచనలకు ప్రేరణ అని చెప్తారు. మొదటి రచన వచన కవితగా చెప్తూ విజయవాడ ఆకాశవాణి యువవాణి కార్యక్రమంలో కవిత చదవడం, దానికి లభించి పారితోషికాన్ని ఇంట్లో అందరితో పంచుకోవడంలో ఆనందాన్ని తీయని జ్ఞాపకంగా చెప్తారు. వచన కవిత్వం, కథ, నవల, పద్యం, వ్యాసం, టాబ్లో, స్కిట్, గేయాలు, గేయ కథలు, లేఖా సాహిత్యం, భావ గేయాలు, గజళ్లు, బాల సాహిత్యం ఇలా తెలుగు భాషా ప్రక్రియలన్నింటిలోనూ తనదైన శైలిలో రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు. విశాలాంధ్ర, వార్త వంటి ప్రముఖ పత్రికల్లో అనేక వ్యాసాలు రాశారు. మొలక అనే పిల్లల పత్రికలో ఇప్పటికి కరుణశ్రీ గారి తెలుగుబాల పద్య వ్యాఖ్యానం రాస్తున్నారు.
    తెలుగు భాషాసాహిత్యాలకు సంబంధించి దాదాపు 900 వ్యాసాలకు పైగా, 1300 పద్యాలు, 400 కవితలు, 200 గీతాలు రాశారు. 26 పుస్తకాలకు పైగా ప్రచురించారు. సంగీతం, సాహిత్యం, నాట్యం, నటన, దర్శకత్వం తదితర విభాగాల్లో ప్రవేశముండి, రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్న రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి ప్రతిభకు దక్కిన పురస్కారాలు బాలసాహితీ పరిషత్ వారి జ్ఞాపిక, రావూరి భరద్వాజ స్మారక ఉత్తమ గ్రంథ పురస్కారం, గురజాడ ఫౌండేషన్ వారి తెలుగు కవితా పురస్కారం ఇలా 15 వరకు బిరుదులు, పురస్కారాలు పొందారు. ఇవి కాకుండా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ వారు మరియు భారత కల్చరల్ అకాడమి వారు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో విశిష్ట సాహితి సేవా పురస్కారం,  ఆంధ్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం ఈ రెండు మూడు రోజుల వ్యవధిలో అందుకున్న ఏకైక వ్యక్తి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి. నాలుగేళ్ళ  కఠోరశ్రమకోర్చి ఎంతో పరిశోధన చేసి నుడి గుడి అన్న 400 పేజీల పై చిలుకు భాషా పరిశోధక వ్యాసాల పుస్తకంలో కనుమరుగౌతున్న తెలుగు పద సంపదను అర్ధ సహితంగా ఏ ఏ పద్యాల్లో ఎలా వాడారో అన్నది సహేతుకంగా వివరించారు. దానికిగాను గిడుగు రామమూర్తి పంతులు పురస్కారాన్ని అందుకోనున్నారు.
తెలుగు భాషకు ఎనలేని సేవ చేస్తున్న రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి మరిన్ని బాషాసాహిత్య సంపదలను మనకందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి హృదయపూర్వక అభినందనలు.


మైనపు బొమ్మలు సమీక్ష...!!

                      ఆంతర్యాలను స్పృశించిన అక్షరాలు ఈ మైనపు బొమ్మలు..!!     

సుధాకర్  లోసారి కవిత్వం చదువుతుంటే వృత్తికి, ప్రవృత్తికి, సామాజిక విలువలకు, మానవత్వానికి, మంచితనానికి ప్రతీకలుగా చిన్న చిన్న పదాలతో అర్ధవంతమైన భావాలను అక్షరీకరించారని చెప్పడం అతిశయోక్తి కాదు. మైనపు బొమ్మలు సమీక్ష రాయడానికి చదవడం మొదలు పెట్టిన వెంటనే మొదటి కవిత నుంచి చివరి కవిత వరకు మనసు తడి గుండెలను తాకుతూనే ఉంది.
   వానాకాలం మన చిన్నప్పుడు ఎలా ఉండేదో, వాన కోసం ఎదురుచూసిన కరువు నేల తడిసి ముద్దైన తీరు, దాన్ని చూసిన సంతోషాల సంబరాలు, వాస్తవంలో రాని వాన కోసం తపన పడుతూ రాతిరి కలలో
" వానలో తడిచిన నేను
నాలో తడిచిన వాన
తడిచి తడిచి చెరిసగం మట్టిముద్దలవుతాం. " అంటూ కలల పక్షుల కోసం ఎదురుచూడటం చాలా బావుంది.
ఓ నా ప్రియ సైనికుడా కవితలో
" ఏ వీర స్వర్గపు ద్వారాల వద్దో నీవు
నన్నీ చీకటి తీరాన్నొదిలి..." తన వద్దకు వస్తాడో రాడో తెలియని సందిగ్ధతను సైనికుడి భార్య పడే వేదనను, వియోగాన్ని ఇంతకన్నా బాగా ఎవరు చెప్పలేరేమో.
" బతుకు ద్వార బంధాల వద్ద తలక్రిందులై వేలాడే గబ్బిలాల జీవితాలు మావి, చీకటి ఖండాలు మా జీవితాలు, దేవుడా నగ్న హృదయంతో నమస్కరిస్తున్నా, మావి కాని జీవితాలు మాకెందుకని గబ్బిలాలు కవితలో పావలాకి, పాతిక్కి అంగడి సరుకులైన బతుకుల ఆక్రోశాన్ని వినిపిస్తారు తనదైన గొంతుకతో.
కర్ఫ్యూ కవితలో యుద్దానికి, విధ్వంసానికి మధ్యన ఓ గంట విరామ కాలాన్ని వాస్తవాల దృశ్యాలను మన కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారు. మానవీయుడు కవిత మనలో మరో మనిషిని మేల్కొల్పుతుంది. ట్రాఫిక్ పోలీస్ గురించి చెప్పిన అక్షర సత్యం ఇది.
" కాలుతూ నానుతూ సహనమై
మానవీయ స్నేహమై
నాలుగు రోడ్ల కూడలిలో
అతనలా అలుపెరగని యోధుడై
కాలానికి క్రమశిక్షణ నేర్పుతూ.."
ఉద్యమ గీతంలో నిజాలకు, అబద్ధాలకు మధ్యన నిలిచిన శాసనాల చీకటిపై ధిక్కారాన్ని ప్రకటిస్తారు.
అమ్మని లేకుండా చేసిన కాలం మీద కోపాన్ని, అమ్మతోనూ, తనకి జ్ఞాపకాలనిచ్చిన అమ్మ గదితోనూ తన అనుబంధాలను తల్చుకుంటూ అమ్మ గురుతులు దాచుకోవడానికి అక్షరాలను హత్తుకోవడం అద్భుతం.
ఏకాకి ప్రయాణం కవితలో అపరిచితులుగా మిగిలిపోయిన రెండు మనసుల మద్యన ప్రేమ ఏకాకిగా నిలిచి ఎవరిది  వారిది ఒంటరి ప్రయాణం అంటూ ముగించడం కొత్తగా ఉంది. లోకమంతా వెలుగులు చిమ్మే మానవతా దీపాన్నవుతానంటారు మానవత్వం నా మతం కవితలో. జ్ఞాపకాల స్వప్నాలను వెదుకుతుంటారు నిరీక్షణ కవితలో.
పోగొట్టుకున్నది ఎవరికీ దొరకదని, కాలం ఎవరిదీ కాదని వెదకాలి కవితలో చెప్తారు. చావుకి, బతుక్కి,  ఆనందానికి,విషాదానికి పెద్ద తేడా లేదంటూ పల్లె గొడవల్లో ఇరు కుటుంబాలు క్షతగాత్రులే అంటూ ఫ్యాక్షన్ గొడవలకు వాస్తవ రూపాన్ని ఆవిష్కరించారు. అరుణిమ కవితలో అన్యాయానికి సమాధానం చూపించారు. నిశ్శబ్దంగా చెట్టు కరిగిపోయి ఒక అనాధ గీతమాలపించడం, మనసైన జ్ఞాపకంగా ప్రియసఖి, డయానా స్మృతికి స్వేచ్చా గీతాన్ని ఆలపించడం, జీవితం ఓ పెద్ద అబద్దం, బతుకు బార్లా తెరిచిన రహస్యం, ఎప్పుడు తడి గాయాల పర్వమే అంటూ అంగడి బొమ్మల ఆవేదనను ఎండుపూలు కవితలో చెప్తారు. వెలుతురు పాట పాడుతూ ప్రశ్నించడం కావాలంటూ తుపాకీ నీడలో నిలబడతారు. ఊరి పొలిమేర గ్రామదేవత గ్రామ కక్షలకు, కార్పణ్యాలకు సాక్ష్యమని ఆ పరిస్థితులను వివరిస్తారు. నిషేధించే నిజాలను, విజేతలను, పరాజితులను, అక్షరాల పరమార్ధాన్ని అందించిన ఆమెకు ప్రణామాన్ని, చరిత్ర మరచిన రాత్రులను గుర్తుచేస్తూ, ఊహారేఖలో అనువదించుకుంటూ, విశ్వమానవ దీపావళి కోసం కాలానికి అటు ఇటు గాయాలను తుడుస్తూ, రాలుతున్న పసి మొగ్గల కథనాలను అక్షరాల్లో చూపిస్తూ కవిగా కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. ఓ యుగాంతానికి ఎరుపెక్కిన ఆకాశాన్ని పరిచయం చేస్తూ, పంజరంలోని ఆమె దేహాన్ని, శూన్యమైన అస్థిత్వపు బతుకును, హెచ్ ఈ వి తో ఆఖరి పోరాటాన్ని, ఇరు సంధ్యల అందాన్ని, ఆట వేట అడవిలో మొదలైనా నేటి నగరపు అడవిలో నాగరికత ఓ మహా అనాగరికత అని చెప్తారు. మానని గాయానికి మందు రాసి మహానుభావుల కోసం ఎదురు చూడటం, మా ఊరొక  వసుదైక కుటుంబం అంటూ సేద దీరడానికి తన ఊరెళ్ళినప్పుడు కనిపించిన, అనిపించిన భావాలకు, ఒకప్పటి జ్ఞాపకాల గురుతులను మేళవించి మన అందరిని కూడా మన ఊరికి పయనింపజేస్తారు. వియోగాన్ని ది బెడ్ రూమ్ కవితలో, మనసులోని ప్రేమను ప్రవహించే జ్ఞాపకంగా, రెండు గుండె గొంతుల ఏక గీతాన్ని గాయ పడిన ఒక మౌన శబ్దంలో, విషాద మోహనాన్ని విరచించడం, సూర్య చంద్రులను, ఉన్మాద ప్రేమను, నిజాలను నీడలను నిర్భయంగా చెప్తారు. ప్రశ్నించడం ఒక చారిత్రక అవసరమంటూ, నల్ల పంజరపు అవశేషాలను వెలికి తీస్తారు. పిడికిలి పట్టును గుర్తెరగమంటారు. వాస్తవికతను దూరం చేస్తున్న ఆధునికతను నాలోంచి నాలోకి కవితలో ఎవరికి వారు తరచి చూసుకునేటట్లు చెప్తారు.
ఘనీభవించిన జీవితం మరో జన్మకు వాయిదా మన జ్ఞాపకాల సాక్షిగా అంటూ అగాధాన్ని సృష్టించి విడిపోయిన ప్రిన్స్ డయానాలకు తన సున్నిత హృదయాన్ని చాటుకుంటారు. విస్మృతి కవిత వింత సోయగంతో చెప్పడానికి మాటలు చాలలేదు. నాకు బాగా నచ్చిన కవిత. చివరగా ఈ కవితా సంపుటి పేరైన మైనపు బొమ్మలు కవితలో
"దేహం వ్రణమై
బతుకు రణమై
క్షణక్షణం ఓ పదునైన కరవాలమై .." అంటూ సాగే అక్షర శరాలు మహాకవి శ్రీ శ్రీ ని  గుర్తుకు తీసుకురాక మానవు.
జీవితంలో తారసపడే ప్రతి చిన్న సంఘటనకు స్పందిస్తూ అక్షరికృతం చేసే సున్నిత హృదయమున్న సుధాకర్ లోసారి మైనపుబొమ్మలు కవితా సంపుటికి హృదయపూర్వక అభినందనలు. 
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner