11, జనవరి 2018, గురువారం

రెక్కల కవచం..!!

జీవితాన్ని ఇష్టపడిన నేను
నిన్ను అంతే ఇష్టపడుతున్నా

పక్కనే ఉంటూ పలకరిస్తావు
పర్లేదు రమ్మంటే పారిపోతున్నావు

అలసిన మదికి సాంత్వనగా
అక్కున చేర్చుకోవాలన్న ఆరాటం నీది

విడివడని అనుబంధాల నడుమ
విడవలేని అగచాట్లు నావి

జ్ఞాపకాల తాయిలాలు ఊరిస్తూ
గతమూ ఘనమైనదని వాపోతున్నాయి

నువ్వు చేరువౌతున్నావంటే వాపోయే
కన్నీటి పలకరింపుల పలవరితలు

రెప్పలార్పే క్షణాల రెక్కల కవచం
ఆపలేని ఆయువు కేరింతల్లో చిన్నబోతోంది...!!

9, జనవరి 2018, మంగళవారం

రాధామాధవీయం...!!

ప్రేమ పారవశ్యంలో
అనురాగ మధువులు గ్రోలుతూ
సాన్నిహిత్యపు సంతసంలో
సరాగాల మధురిమల
సుస్వర వేణునాదపు మైమరపులో
ప్రణయ ప్రబంధ ప్రియలాలసులు
రాధామాధవులు..!!

2, జనవరి 2018, మంగళవారం

ఈ తపనెందుకో ....!!

కథలెందుకో
కలలెందుకో
మరులెందుకో
మమతలెందుకో
కనులెందుకో
కన్నీరెందుకో
మాటలెందుకో
మౌనమెందుకో
భయమెందుకో
భారమెందుకో
వలపెందుకో
వలలెందుకో
పాటెందుకో
పగుగెందుకో
ప్రేమెందుకో
పగలెందుకో
మనసెందుకో
మరపెందుకో
జీవమెందుకో
జీవితమెందుకో
గతమెందుకో
జ్ఞాపకమెందుకో
ఎందుకో
నీకెందుకో
ఈ తపనెందుకో ....!!

27, డిసెంబర్ 2017, బుధవారం

కొత్త స్నేహాలతో జాగ్రత్త...!!

నేస్తం,
          స్నేహం చాలా విలువైనది, తీయనైనది. 1977 లో మొదలైన చిన్నప్పటి స్నేహం 2017 కి .. ఇప్పటికి అలానే ఉందంటే నిజంగా అదృష్టం అనే చెప్పాలి.  36 ఏళ్ల క్రిందట చూసిన చిన్ననాటి మిత్రుడు మొన్నీమధ్యన వచ్చి వెళితే ఆ ఆనందాన్ని పంచడానికి కాస్త సమయమే పట్టింది.
       గత రెండు నెలలుగా జరిగిన కొన్ని సంఘటనల మూలంగా స్నేహంలో అతి హేయమైన కోణాన్ని చూసిన నా మనసు కుదుటబడటానికి చాలా సమయమే పట్టింది.  నాకు ఎదురైన అనుభవాల దృష్ట్యా ఇప్పటి స్నేహాల్లో చాలా వరకు వ్యాపార సంబంధిత స్నేహాలే ఎక్కువ.  అవసరాలకు నటించడం వారి నైజంగా మారింది. డబ్బు కోసం ఎంతటి నీచానికైనా దిగజారడం, నమ్మిన స్నేహాన్ని నట్టేట ముంచడం, వారి స్వార్థం కోసం ఎంతకైనా దిగజారడం చాలా హేయంగా ఉంది. బెదిరింపులు, అరవడాలు అనేవి కొంత వరకే పని చేస్తాయి. మనిషి మీద నమ్మకం పోవడానికి ఒక్క మాట చాలు. మనమేమయినా శిభి చక్రవర్తులమా అన్న మాట మీద నిలబడటానికి, ప్రాణ త్యాగం చేయడానికి. నా దగ్గర ఒక ఆడియో రికార్డ్ ఉంది. అది వింటే ఏమి జరిగింది అన్నది అందరికి తెలుస్తుంది. కాకపొతే అది వినడానికి ఓపిక కావాలి. మధుర కలయిక అంటూ ఓ పెద్ద మాయని మచ్చకలయికగా మార్చిన కొందరిని జీవితంలో మరచిపోలేము. వాళ్ళ మీద వీళ్ళకి వీళ్ళ మీద వాళ్ళకి చెప్పి పబ్బం గడుపుకోవాలని చూసే కొందరికి ఇప్పటికికయినా తెలిస్తే బావుండు నటనకు ఎక్కువ రోజులు అవకాశం ఉండదని. సూక్తులు పెట్టడం కాదు అవి మనకే వర్తిస్తాయని తెలుసుకుంటే బావుంటుంది. ఓ ఇద్దరు సూక్తి సుధలు నా కళ్ళు బాగా తెరిపించారు.
       ఒకరు పుస్తకం వేయమని వేరే వాళ్ళతో అడిగిస్తే భువన విజయం తరపున వేస్తాము అనిచెప్పాము. డి టి పి చేయించి ఇవ్వమని చెప్పాము. డిసెంబర్లో వేసి ఇస్తాము అని చెప్పినా వారు తన పుస్తకాలు వేయడానికి దాతలు కావాలని ముఖపుస్తకంలో పోస్ట్ పెట్టారు కనీసం  మాకు చెప్పకుండా. ఆ పోస్ట్ చూసి నేను మాట్లాడదామని ప్రయత్నం చేసినా వారు మాట్లాడలేదు. భువన విజయం ఎవరికైనా తమ మొదటి పుస్తకం అచ్చులో చూసుకోవాలని కోరికగా ఉండి అచ్చు వేయించుకోలేని వారి కోసమే స్థాపించబడిన సాహితీ సంస్థ. వ్యవస్థాపకులు శ్రీ వంకాయలపాటి చంద్రశేఖర్ గారు. అంతరించిపోతున్న తెలుగుకు జీవం పొసే సాహితీ కృషిలో తర తమ బేధం లేని నిస్వార్ధపరులు. మన కుటుంబం మధుర కలయికలో పెట్టిన ఖర్చులో కొంత అయినా ఇస్తాము అన్న డబ్బులు కూడా ఇవ్వని వారు, ఈ పుస్తక ప్రచురణలో నా మూలంగా నష్ట పోయిన చంద్రశేఖర్ గారికి నా క్షమాపణలు తెలియజేస్తున్నాను.
         ఒకరి మూలంగా జరిగిన చాలా నష్టాలు ఇవి. వారు వారి స్నేహితులు అందరు ఒక్కటే. మంచితో పాటు ఇలాంటి పంటి క్రింద గులకరాళ్లు ఉంటాయని గుర్తుంచుకోవాలని 2017 పోతూ పోతూ నాకు నేర్పిన గుణపాఠం. అందుకే కొత్తవారిని నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలనే ఈ పోస్ట్. 

జీవన 'మంజూ'ష (5)..!!

నేస్తం,
       అహం అనేది ఎలా ఉంటుంది అని చెప్పడానికి మనచుట్టూ ఉన్న కొందరిని చూస్తుంటే అహానికి అర్ధం తేటతెల్లంగా తెలిసిపోతుంది. నేను అని అనడంలోనే అహం రూపం తెలిసిపోతుంది. ఆత్మాభిమానం మనలో ఉంటే అది ఎదుటివారిని చిన్నబుచ్చదు. అదే అహంకారమనుకోండి ఎదుటివారి లోపాలు ఎట్టి చూపడమే లక్ష్యంగా ఉంటుంది. మన గత అనుభవాలు, ఎదురు దెబ్బలు, కష్టాలు, కన్నీళ్లు ఏమి గుర్తుండవు. నిన్ను పొగిడేవాడెప్పుడూ నీకు మంచి మిత్రుడు కాలేడు, అలా అని తిట్టేవాళ్ళందరూ నీ శత్రువులూ కాదు. ఎప్పుడయినా మన క్షేమం కోసం ఆలోచించేవారు ఆత్మీయులుగా ఉండిపోతారు.
         డబ్బు అనేది అప్పుడు, ఇప్పుడు , ఎప్పుడూ మనలోని అహానికి కారణం అవుతోంది. మన చేతి నిండా డబ్బుంటే గతంలో మనకి సాయపడిన ఏ బంధము గుర్తుకే ఉండటం లేదు. ఒకప్పుడు నచ్చినవారు ఇప్పుడు నచ్చడం లేదు. మన అవసరానికి మంచి చెడు విచక్షణ మరిచిపోతున్నాం. పెద్దలు అన్నట్లు బంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే కాకుండా, వ్యాపార సంబంధాలుగా, నాటకీయంగా రూపాంతరాలు చెందుతున్నాయి. మన స్వార్ధం కోసం అమ్మానాన్న, సోదర సోదరీ, స్నేహం, భార్యాభర్తల, పిల్లల అనుబంధాలన్నీ అస్తవ్యస్తంగా మార్చేసి డబ్బే లోకంగా బతికేస్తున్న ఎందరిలోనో మనమూ ఒకరిగా మిగిలిపోతున్నాము.
        అవసరానికి డబ్బు ప్రతి ఒక్కరికి కావాలి కానీ ఆ డబ్బే అవసరంగా మార్చేసుకున్న నేటి మన జీవితాలు ఏమి కోల్పోతున్నాయో కూడా తెలుసుకోలేని దుస్థితిలో మనం కొట్టుకుపోతున్నాం. ఆత్మీయ పలకరింపులు కోల్పోతున్నాం, బంధాలను విచ్చిన్నం చేసుకుంటున్నాం, జీవితపు విలువలు నష్టపోతున్నాం, మానవత్వాన్ని మర్చిపోతున్నాం. ఇలా చెప్పుకుంటూ పొతే బోలెడు... చివరాఖరికి మనల్ని మనమే కోల్పోతున్నామని మనకు తెలియకుండానే మన జీవితం ముగిసిపోయేలా చేసుకుంటున్నాం. నీతులు ఒకరికి చెప్పకుండా ముందు మనం ఎంత వరకు పాటిస్తున్నామని బేరీజు వేసుకుంటే మన తరువాతి తరాలకు కొన్ని అయినా మానవతా విలువలు మిగిల్చిన వాళ్ళం అవుతాము. ఎదుటి మనిషి వెనుకనున్న డబ్బుకు విలువ ఇవ్వకుండా వ్యక్తిత్వానికి విలువ ఇవ్వడం మొదలైతే మన సమాజంలో ఓ మంచి మార్పుకు బీజం పడినట్లే....!!
ఇప్పటికి ఈ ముచ్చట్లకు సశేషం.

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner