30, జూన్ 2012, శనివారం

ధరణి మనసు...!!

కదిలించే కధల్లో వినిపించే వ్యధలెన్నో....!!
మనసుతో చూడు మాటలెన్నో వినిపిస్తాయి...!!
కనిపించని కన్నీరు ఏరులై పారుతోంది...!!
కంటికి మంటికి ఏకధాటిగా ఏడ్చినా...
తడవని భూదేవి మండే సూర్యుడికి
భయపడి ఎండి బీటలు బారినా....
వర్షం కోసం ఆకాశం వైపు చూడటానికి కూడా...
తటపటాయిస్తోంది...!!
తన మీద ఆధార పడిన జీవితాలెన్నో...
అతలాకుతలమౌతుంటే...!!
చూడలేక ...ఏమి చేయలేక...
సతమతమౌతూ...వరుణుడి
కరునారుణ వీక్షణాల కోసం
పడిగాపులు కాయటం తప్ప..!!

27, జూన్ 2012, బుధవారం

ఎక్కడా లేని వింత...!! మనకు మాత్రమే...సొంతం !!


ఈ వింత విన్నారా..!! ఎప్పుడో వాడుకున్న కరంట్ కి ఇప్పుడు డబ్బులు కట్టాలంట..!! పావలా వడ్డీలు , ఆ శ్రీలు ఈ శ్రీలు అని మనలను మాయలో ముంచి ఆకుకూరల దగ్గర నుంచి పెంచిన ధరలు ఆకాశానికి ఎగిరితే....!! పండిన పంటకు గిట్టుబాటు ధరకు ధర్నాలు చేసినా కనీస ధర కూడా కట్టలేని మన ప్రభుత్వం...మరి ఈ కరంటు గోల ఏంటో..!! ఇక నుంచి
పీల్చే గాలికి , అమ్మ పాలకి కూడ పన్ను కట్ట మంటుందేమో..!! మద్య తరగతి జీవితాలు ఏమవ్వాలో...!!
ఓటు కోసం మాటలు చెప్పే నాయకులను వెలి వేయాలి.... ఏ రాజకీయ పార్టి ని గెలిపించక పొతే..!! మనం ఊరుకున్నంత వరకు నాయకులు మన జీవితాలతో ఇలా ఆడుకుంటూనే వుంటారు. దొరికినంత భోంచేసి ఖజానా ఖాళి అంటూ పన్నుల భారం మన నెత్తిన వేస్తున్నారు...!!
ఎన్నికలను బహిష్కరిస్తే...ఎలా వుంటుంది...?? దూకుడు రాజకీయాలు, భజన రాజకీయాలు , భోజన రాజకీయాలు, ఇలా అన్నిటికి కాస్త కళ్ళెం వేయవచ్చేమో...!! అప్పుడయినా ఓటు నోటుకి అమ్మడు పోకుండా ఓటు తూటా లా మారితే మన నాయకుల కుతంత్రాల రాజకీయాలకు తెర పడుతుందేమో..!!
2009 లో వాడిన కరంట్ కి ఇప్పుడు బిల్లు వేస్తారంట. ఏదో సామెత చెప్పినట్లు అమ్మ పొట్టలో వున్నప్పుడు నీకు ఇంత ఖర్చు పెట్టాను ...అని అన్నట్లు గా వుంది. ఓ తమ్ముడు అన్నకి నీ పుట్టుకకి బోల్డు ఖర్చు పెట్టాను అని చెప్పినట్లుగా...!!
ఇలా వాళ్ళు వేస్తూ వుంటే మనం కట్టుకుంటూ పోతుంటే....దరి అంతు వుండదేమో..!!

26, జూన్ 2012, మంగళవారం

నా చిరునామా....!!

కధలు చెప్పినా... కలల్లో ఉంచినా...
ఊసులు చెప్పినా... ఊహల్లో తేల్చినా..
మాటలు చెప్పినా...మాయలు చేసినా...
గాయం చేసినా....ఓదార్చినా...
నిజం చెప్పినా...అబద్ధం ఆడినా...
నీతోనే...ఉండాలనిపిస్తుంటే...!!
నన్ను నేను మరచి కొన్ని యుగాలయింది...!!
నేనెవరో తెలియక తికమక పడుతుంటే....!!
వెదుకులాటలో దొరికిన చిరునామా....!!
నీ దగ్గరే నా నెలవంది....!!
మరి చోటుందా...నీ సన్నిధిలో...??

24, జూన్ 2012, ఆదివారం

వదలి పోనంటోంది .....!!

సడి లేని నా గుండె గూటిలో...
ఆనంద సరాగమై వచ్చావు...!!
విరచిత కవనమై విరాజిల్లినావు...!!
మరచిన ఆశలను మరల మేల్కొలిపావు ...!!
మనసు లేదనుకుంటే...నా మది నిండా...
నీవే నిండి వున్నావు...!!
వద్దు పొమ్మన్నా పోనంటున్నావు...!!
జ్ఞాపకాలు కలల అలలై కమ్ముకుంటే...
ఆ కమ్మదనంలో....నువ్వే వున్నావు...!!
నా నుండి మనసును విడదీసి ...
నిను పొమ్మని అందామంటే...!!
మనిషిని పోయినా మనసు లోని
జ్ఞాపకం నను వీడి పోనంటోంది....!!
అచ్చం నీలానే..!!

20, జూన్ 2012, బుధవారం

స్నేహమంటే....!!


స్నేహమంటే....!!
ప్రాణ స్నేహితులమని చెప్పుకోవడానికి మాత్రమే కాదు అవసరమైనప్పుడు చేతనైన ఆసరా కూడా ఇవ్వగలగాలి..
చిన్నప్పుడు ఏమి తెలియని కల్మషం లేని స్నేహం...!!
తరువాత పెరుగుతున్న కొద్ది...
చదువుకునే రోజుల్లో కొందరు...తరువాత ఉద్యోగ ప్రయత్నాల్లో కొందరు.. ఉద్యోగాల్లో...ఇంటా బయటా...ఇలా...
చాలా మంది మన జీవితంలో తారసపడతారు కాని అన్ని స్నేహాలు కలకాలం వుండవు...
కొన్ని స్నేహాలు మాత్రమే చిరకాలం స్నేహ సౌరభాలు వెదజల్లుతూనే వుంటాయి...!!
మన అవసరాన్ని బట్టి కూడా స్నేహాలు మారి పోతూ వుంటాయి.
సాయం చేయగలిగిన స్థితిలో వున్నప్పుడు సాయం చేయడం లో తప్పు లేదు...!!
కాకపొతే చేసిన సాయాన్ని మర్చిపొతే...?? స్నేహాన్ని మర్చిపోతే..??
స్నేహానికి అర్ధమే వుండదు....!!
జీవితం లో మంచి చెడు ఉన్నట్లే స్నేహం లో కూడా వుంటుంది...!! కాకపొతే చెడుని ద్వేషించినట్లుగా
స్నేహాన్ని ద్వేషించలేము...!! ఆదే స్నేహం గొప్పదనం..!! ఎంత కాదనుకున్నా ఎప్పుడో ఒకసారి గుర్తుకు రాని స్నేహం వుండదేమో..!! అదేనేమో స్నేహ బంధం గొప్పదనం....!!
అందుకే స్నేహానికన్న మిన్న లోకాన లేదు....!!
(నా హితులకు...సన్నిహితులకు...స్నేహితులకు... స్నేహానికి ప్రాణమిచ్చే అందరికి ఈ టపా అంకితం..!!)

19, జూన్ 2012, మంగళవారం

ప్రయాణాల్లో పాడు గోల....!!

ఏమిటోనండి ఒక్కోసారి ప్రయాణం అంటేనే భయం వేస్తోంది ....మొన్ననే విశాఖపట్టణం మా అన్న కొడుకుది నిశ్చితార్ధం వుంటే వెళ్ళాము వెళ్ళేటప్పుడు వెతలే వచ్చేటప్పుడు వెతల్ వెతల్...!! వెళ్ళేటప్పుడు రెండు సీట్లు వేరే బోగీలో వచ్చాయి నేను మా పిన్ని వెళ్ళాము వెళ్ళేసరికే ఖాళి లేదు అడిగితే మావి అన్నారు రిజర్వేషన్ అని చూపిస్తే మాది అదే అన్నారు తీరా చూస్తే వెయిటింగ్ లిస్టు ....హన్నా..చూసారా వాళ్ళ తెలివి...కాకపొతే మా సీట్లు మాకు ఇచ్చేసారు లెండి...!!
అంతకు ముందు ఒకసారి హైదరాబాదు నుంచి వస్తుంటే ఇలానే వెయిటింగ్ లిస్టు లో ఒక పెద్దావిడ బానే చదువు కుంది కాని కంపార్టుమెట్ మొత్తం చెప్పినా వినకుండా నా సీటులోనే కూర్చుంది అడిగితే టి.సి చెప్తే కాని కుదరదంది. విజయవాడ వరకు టి.సి రాలేదు నోరు వున్న వాళ్ళదే రాజ్యమని ....!!
విశాఖ నుంచి తిరుగు ప్రయాణం లో కోణార్క్ లో బెర్తులు తీసుకుంటే అందరమూ ఉన్నాము కదా అనుకుంటే అన్ని చెక్ చేసి టి.సి వెళ్ళగానే ఒక పది మంది కాళ్ళ దగ్గర కింద పేపర్లు వేసుకుని బెర్తుల మద్యలో పడుకోవడము ఇద్దరు అర్ధరాత్రి ఒంటిగంటకు ఆ టైములో లైట్ వేసి టి.సి సీటులో కూర్చుంటే అడిగినందుకు పెద్దగా గొడవ. టి.సీ ని పోలీసుని పిలిస్తే వాళ్ళు ఏదో చెప్పి ఇలా ఇరవై ఆరు చూడాలి అన్నారు ...మరి వాళ్ళు జీతం తీసుకునేది అందుకే కదా....ఆడిగితే గొడవ ఊరుకుంటే ఎన్నిపోతాయో తెలియదు....వాళ్ళు వాళ్ళు అందరూ ఒకటేనేమో...ఎవరి వాటాలు వాళ్లకి అందుతాయి కదా..!!
ఇలా ప్రయాణాల్లో ఇబ్బందులు తప్పవు మనకు మరో అపరిచితుడు రావాలో లేక మనమే అపరిచితుడిలా మారాలో....!!
ఆ టైం లో నాకు మాత్రం అపరిచితుడే గుర్తు వచ్చాడు....!!

18, జూన్ 2012, సోమవారం

నా ఊహల ఊసుల రూపం...నువ్వే..!!

మెలకువలో నిదురో...
నిదురలో మెలకువో....
కలో కలవరమో కలకలమో...
వేకువలో వెన్నెలో...
రాతిరిలో మండుటెండలో...
చల్లని పైర గాలో....మండించే గ్రీష్మ తాపమో...
సేదతీర్చే మలయమారుతమో...
పరవశించి మెల్లగా జాలువారే
తుషార బిందువో....
అందమైన ప్రకృతిని ముద్దిడే
మంచు ముత్యాలో....ముత్యపు చినుకులో...
ఏదైనా...!!
నీ సమక్షం లో...నీ సాన్నిహిత్యం లో...
నీ సాహచర్యంలో...నేనుంటే....!!
నీ అనుభూతి...నీ ఆస్వాదనే ...నాది..!!

17, జూన్ 2012, ఆదివారం

అరుదైన వ్యక్తి..!!


నాన్న అంటే నమ్మకం
నాన్న అంటే నాయకుడు
నాన్న అంటే ఆసరా..!!
నాన్న అంటే నిజం
నాన్న అంటే ఆలంబన
నాన్న అంటే అభిమానం
నాన్న అంటే మనం ఎదగడానికి
అన్ని కూర్చిపెట్టే అరుదైన వ్యక్తిత్వం...!!
నాన్న కు నమో వందనం....!!

15, జూన్ 2012, శుక్రవారం

గెలుస్తున్న ఓదార్పు యాత్ర...!!

మొత్తానికి జగన్ గెలుస్తున్నాడు...ఆదిష్ఠానం పై ....గెలుపు కి నాకనిపించిన కారణాలు..
జనాలు ఎలా ఆలోచిస్తున్నారంటే అందరూ తిన్నారు కాకపొతే తండ్రి మనకు కాస్త పెట్టాడు అది కాక జైలు , విచారణలు అన్ని కలిసి సానుభూతి పవనాలు బాగా పని చేసాయి వీటికి తోడూ ఉండనే వుంది ధనం మూలం మిదం జగత్..!!
చూద్దాం ఇక మన దేశ రాష్ట్ర రాజకీయాలు నాయకులు ఎలా మలుపులు మార్పులు చేసుకుంటారో..!!
దూకుడు రాజకీయాలు ఊపందుకుని మళ్ళీ ఎన్నికలకు సిద్దంగా వుండాలి అందరూ..!!

11, జూన్ 2012, సోమవారం

పాము కన్నా ప్రమాదం....!!

పెట్టిన చేతిని కాటు వేసే నైజమున్న పాము కన్నా ప్రమాదకరమైన జంతువు మనిషి....పాముకి కోరల్లో మాత్రమే విషముంటుంది. మనిషి కి మాత్రం కాలి గోటి నుంచి వెంట్రుక చివరి వరకు విషమే...!! మన ఖర్మ కాలి ఇలాంటి విషపురుగుల చేతిలో పడ్డామో....ఇక చచ్చే వరకు నరకం చూడటమే...!! ఇంట్లో తిని తిండి పెట్టిన వాళ్ళనే నాశనం చేయాలనే దీక్ష తీసుకున్న వాళ్ళని ఏం చేయాలి? జీవితమిచ్చి విలువను ఇస్తే....వాళ్ళ నాశనం కోరుకుంటున్న వాళ్ళని క్షమించాలా...!! బతుకునిచ్చిన వాళ్ళ చావుని చూడాలనుకుంటే..??
చాలా జాగ్రత్త గా వుండాలి ఇలాంటి వాళ్ళు చాలా మంది మనతోనే వున్నారు మంచితనం ముసుగు వేసుకున్న రాక్షసత్వానికి మరో రూపం..!! ఎదుటి వాళ్ళకి చెప్పేది శ్రీరంగ నీతులు ఇంట్లో చేసేది మాత్రం...శాడిజం..!!
అందుకే మంచితనం నటించే వాళ్ళని తొందరగా నమ్మకండి...జాలి కబుర్లు చెప్పి మోసం చేస్తారు జాగ్రత్త గా వుండండి ....!!

8, జూన్ 2012, శుక్రవారం

అ...మాయకత్వం..!!

అందమైన జీవితం లో నుంచి పెళ్లి అనే మలుపు తో అత్తింటి నుంచి ఆరు నెలల్లో అరవై ఏళ్ల జీవితం చూసిన కొన్ని సత్యాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తున్న జీవిత సుడిగుండాలు.....కొన్ని ....!!
అందుకే అమ్మ నాన్నలకు తెలియకుండా వాళ్లకు ఇష్టం లేకుండా ఇంట్లో నుంచి వెళ్లి పోయే అమ్మాయిలూ మీరు వెళ్లి పోయే ఒక్క క్షణం ముందు మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన మీమీదే ప్రాణాలు పెట్టుకు బతుకుతున్న ఇంట్లో వాళ్ళ గురించి క్షణం లో ఒక వంతు ఆలోచించండి ...ప్రేమించడం తప్పు కాదు కాని అపాత్రదానం చేయకండి అది సినిమాల్లో చూసే హీరో ఇజం కాదు నిజ జీవితం అలా వుండదు నాకు తెలిసి చూసిన జీవితాలే అందుకు సాక్ష్యం ....!!
ఇంట్లో వాళ్లకి ఇష్టం లేక పోయినా సొమ్ము చదువు లేక పోయినా మాట కోసం జీవితాన్ని ఫణంగా పెడితే మిగిలింది చేజారిన జీవితం తిరిగిరాని కాలం.
పెళ్లి చేసి మూడు రోజులకే డబ్బుల లెక్కలు చెప్పిన ఘనులు ఒకరు ....బాద్యత లేకుండా తిరిగే తమ్ముడిని దారిలో పెట్టడం చేతకాక మరదలి మీద పడి...మనుష్యులు పైకి నటిస్తూ లోపల అసలు రూపం వేరేగా ఉంటుందన్న నిజాన్ని చెప్పి లోకం పోకడ ఇంతే అని చెప్పిన పుణ్యాత్మురాలు. చెప్పేవి మాత్రమే నీతులు ఆచరణలో మాత్రం వుండవు. పేరుకి మాత్రం అమ్మ నాన్న లేక పొతే చెల్లెళ్లకి తమ్ముళ్ళకి పెళ్ళిళ్ళు చేసి బాద్యతలు పంచుకున్నాను అని అందరి దగ్గరా చెప్పుకోడం....
పసి పిల్లాడితో బైటకి గెంటిన అతి జాలి కల ఇల్లాలు....!!
అమెరికా వెళ్ళడానికి వదిన సాయం తీసుకుని వాళ్ళ ఇంట్లోనే
కుటుంబం మొత్తం వుండి లక్షలకు లక్షలు తిని అడిగితే ఒక్క పైసా ఇవ్వనక్కర లేదని అన్న వదినకు విడాకులు ఇప్పించడానికి అవిరామంగా కృషి చేసిన తమ్ముడు తమ్ముడి పెళ్ళాము.....
చెల్లెలి పెళ్లి చేస్తే అది వద్దని గొడవలు గొడవలు చేసి డబ్బులు వదిలించి వీళ్ళ జీవితాన్ని నాశనం చేసిన మరో పుణ్యాత్మురాలు.....
ఇలా చెప్పుకుంటూ పొతే చాలా వుంటాయి కాబట్టి నిర్ణయం తీసుకునే ముందు ఒక్క క్షణం ఆలోచించండి
తప్పటగుడు ...తప్పుటడుగు వేయవద్దు....
రంగులు మార్చే ఊసరవెల్లులు...జాలి కబుర్లు చెప్పి మోసం చేసే వాళ్ళు వుంటారు జాగ్రత్త ...!!

5, జూన్ 2012, మంగళవారం

ముసుగు మనిషితో..జాగ్రత్త...!!

వెధవలకి కి ఎనలేని విలువ ఇచ్చి మనమే అందరి కన్నా పెద్ద వెధవలమై పోతున్నాము....!!
కుటుంబం అంటే తెలియని వారికి ఇంటి పెద్ద పెత్తనం ఇచ్చినట్లు గా...!!
ప్రేమ ఆప్యాయతలు తెలియని వాడికి ఎంత పంచినా వ్యర్ధమే..!!
పెళ్ళాం పిల్లలు ఇల్లు అంటే తెలియని వాడికి అన్ని ఇస్తే మాత్రం లాభం ఏంటి..???
కొంత మంది డబ్బుల కోసమే బతుకుతారు... మరి కొంత మంది బయట జనాల మెప్పు కోసమే జీవితాన్ని తగలబెట్టుకుంటారు....మరి కొంత మంది ఇంట్లో వాళ్ళు ఏమైనా పర్వాలేదు బయటి వాళ్ళు నువ్వు ఇంత గొప్పవాడివి అంత గొప్పవాడివి....నువ్వు లేక పొతే ఊరు లేదు మేము లేము అంటే చాలు ఇక పట్టపగ్గాలే వుండవు వాళ్ళ ఆనందానికి...!!
ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత లెక్కన అన్నమాట.... !!
ఏంటో....ఈ జనాలు పెళ్ళాం పిల్లలు కూడా నమ్మని ఇలాంటి వాళ్ళ బతుకులు మరి ఏ తీరం చేరతాయో..!!
కొంత మందేమో... ఎవరు ఎలా పోయినా నాకేంటి నేను నా పెళ్ళాము/మొగుడు పిల్లలు బాగుంటే చాలు దానికోసం ఏ గడ్డి కరిచినా పర్వాలేదు అమ్మని నాన్నని విడగోట్టినా సరే నా అవసరం గడిస్తే చాలు అనుకుంటారు...!! మరో రకం వాళ్ళేమో.... మాటలు కోటలు దాటిస్తారు పని జరగదు....మనమేమో ఆ మాటల మత్తులో పడి మనకు మాట ఇచ్చారు కదా చేస్తారులే అనుకుంటాము ... కాని ఎన్ని ఏళ్ళు ఎదురు చూసినా అంతే చూడటమే మిగులుతుంది....!!
అంతా నేను చూసుకుంటాను అని చెప్తారు కాని మనం ఎప్పుడు పోతామా అని చూస్తారు...!!
అన్నట్టు అస్సలు వాళ్ళను మర్చి పోయాను నేనే గొప్ప అందరూ తప్పులే చేస్తారు నేను మాత్రమే అన్ని సరిగ్గా చేస్తాను అందరూ నా కాళ్ళ దగ్గరే వుండాలి అనుకుంటారు....!!
మొత్తం మీద అందరి దగ్గరా ఒక్కటి మాత్రం సమానం డబ్బుల కోసమే ఈ అందరి కృషి....అది ఎలా అయినా ఓ కే నే...!!
కాని చెప్పే మాట ఒక్కటే డబ్బులకి
అందరూ విలువ ఇస్తున్నారు కాని నేను మాత్రం వాటిని లెక్క చేయను అని...!!
వాళ్ళ మస్సాక్షి కి తెలుసు నిజం ఏంటో..!!
మరి కొందరేమో....ముందొక మాట వెనుక ఒక మాట చెప్తారు... ...!! వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని వాళ్ళ ఫీలింగ్ ..!!
ఇలా చెప్పుకుంటూ పొతే చాలా రకాలు....
ఈ మేక వన్నె పులులు..!!
మీకు తెలుసు కదా ఇవి అన్ని...!!
ఎక్కడో ఓ చోట తగిలే వుంటారు ఇలాంటి రకాలు....లేదా తగులుతారు జాగ్రత్త మరి....!!

3, జూన్ 2012, ఆదివారం

మనో వందనం...!!


కంట నీరొలికే ఆ క్షణం....!!
మనసు వేదన తెలిపే లిపి లేని భాషకు...
మౌన సాక్ష్యం...!!
చెప్ప లేని బాధైనా...
పంచుకోగలిగే ఆనందమైనా....
వ్యక్త పరచలేని భాష..భావం...ఒక్కటే...!!
అదే...ఆనంద విషాద భాష్పం...!!
కన్నిటికి వెల ఎంతో...!! విలువెంతో...!!
తెలిసిన మనసులకు మనో వందనం..!!
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner