26, జనవరి 2016, మంగళవారం

భగవంతుడినే నిందిస్తున్నాను .. !!

అందరికి గణతంత్రదినోత్సవ శుభాకాంక్షలు ...
  దేవుడు చాలా స్వార్ధపరుడు .. తొమ్మిది నెలలు అమ్మ కడుపులో ఉంటే అమ్మ కష్టం ఆడదాని విలువ తెలిసేది .. ఉమ్మనీళ్ళు ఎలా ఉంటాయో ఏమిటో ఆ కష్టం ఏమిటో తెలిసేది .. మా ఇంటి పక్కన ఈమధ్యన రోజు వినబడుతున్న సుప్రభాతం ఓ తొంభై ఏళ్ళ పైబడిన ముసలి ఆవిడని కూతురు కాదనుకుంటా కూతురు ఐతే అంత ఘోరంగా తిట్టదు కదా .. చెప్పలేని తిట్లు .. అవి వింటూ ఉంటే తిట్టే ఆవిడ మీద కోపం రావడం లేదు .. ఆ పెద్దావిడని తీసుకువెళ్ళని దేవుడి మీద కోపం .. దానికి చాలా మంది చెప్పే మాట ఖర్మ సిద్దాంతం .. అది ఒక కారణం కావచ్చు కాని  దైవానికి తొమ్మిది నెలల అమ్మ కడుపు కమ్మదనం తెలిస్తే ఏ అమ్మని ఇంతగా ఇబ్బంది పెట్టేవాడు కాదేమో .. లేదా దేవుడు మగజాతి అని అహంకారమేమో .. చాలా కొన్ని అవతారాలు మాత్రమే అన్ని అనుభవించిన పరిపూర్ణత్వాన్ని అందుకున్నాయి .. అందరి మనసుల్లో ఇప్పటికి చిరస్థాయిగా నిలబడి పోయాయి ..
అన్ని తెలిసిన దివ్యత్వం మానవ జాతికి ఈ నేను అన్న అహాన్ని ఎందుకు వరంగా ఇచ్చిందో ఏమో .. ఓ నా మా లు తెలియక పోయినా అన్ని నాకే తెలుసు అన్న మదంతో కన్ను మిన్ను కానక ప్రవర్తించేది కొందరు .. పుణ్య కార్యాలు చేసేస్తున్నాము మనకంతా పుణ్యమే ఎన్ని పాపాలు చేసినా కొట్టుకు పోతాయి అనుకుంటూ మరికొందరు ... ఆలుబిడ్డలు అలో లక్షణా అని ఏడ్చినా పర్వాలేదు .. ఊరిలో వాళ్ళు నాకు విగ్రహం కట్టి దండ వేస్తే చాలు అనుకునే వెధవలు మరికొందరు .. గతించిన రోజులు మరచి అన్నం పెట్టిన చేతిని కాటేసిన విషపు పురుగులు ..
మా పెదనాన్న గారు చెప్పినట్టు కష్టం తెలియక పొతే సుఖం విలువ తెలియదని భగవంతుడు ఇవి అన్ని మనకు ఇచ్చాడని అనుకోవాలి .. నిజమే .. కాని బతికినంత కాలం జీవితాన్ని కాలరాయాలి అని చూసే నటనాగ్రేసరులను  ఏం చేయాలి .. ? ఇలా ఎన్నో రకాల జీవితాలను చూసిన తరువాత వీటికి కారణమైన భగవంతుడినే నిందిస్తున్నాను .. దేవుడైతే మనని ఏమి అనడు కదా .. తప్పు చేసిన వాడిని అన్నాం అనుకోండి .. వాడు ఊరుకోడు కదా ... మరి మన కోపం చల్లారాలి అంటే మరో దారి లేదు .. తప్పదు ఆ శిక్ష దేవుడికే .. !!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner