10, మార్చి 2017, శుక్రవారం

పుట్టగతులు లేకుండా పోతారు...!!

నేస్తం,

        పాత సామెతే అయినా మళ్ళి ఓ సారి గుర్తు చేయాల్సి వస్తోంది. "పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది" అన్న మాట మరోసారి నిజమైంది. తాగుడు, తిరుగుడు ఎవరి ఇష్టం వాళ్ళది. కొంత మందికి పెళ్ళాం, పిల్లలు, బాధ్యతలు ఉండవు. ఒక్క మగాడు అన్న అహం తప్ప. అది కూడా ఎంత అంటే వీడు ఎక్కడైనా తిరగొచ్చు, ఎంత మందితోనైనా ... సాక్ష్యాలతో పట్టుబడితే పెళ్ళాన్ని అందరి ముందు కొట్టొచ్చు.. జీతం బత్తెం లేని పనిమనిషిగా పెళ్ళాం పడి ఉండాలి వీరి దృష్టిలో. నాలుగు రోజులు కన్నవారింటికి వెళ్ళినా అనుమానించి  అవమానించే మహా పురుష పుంగవులు, బయటివారికి అపర శాంతిదూత. ఇలాంటి వారు ఈ రోజుల్లో కూడా ఉన్నారంటే నమ్ముతారా..! మరి వీళ్ళకి ఇదేం పోయేకాలమో అర్ధం కావడం లేదు ఇంట్లో ఆలి పనికి రాదు కానీ వయసుతో పని లేకుండా బంగారాలు, సింగారాలు, పండులు ఇలా బోలెడు మంది ముద్దుపేర్ల మందారాలు అవి వడలినా, ముడుచుకున్నా వీరికి వాళ్ళ దగ్గర రోజు పండగే మరి. నాకయితే మరో సామెత కూడా గుర్తు  వస్తోంది.. "ముసలోడి దసరా పండగ" అంటే ఇదేనేమో. వీళ్ళు దిగజారిపోయి ఎదుటివాళ్ళు కూడా వీళ్ళ లానే అనుకుని తృప్తి పడుతూ ఉంటారు.
పదవులు డబ్బులు ఉంటే సరిపోదు ప్రతి మనిషికి వ్యక్తిత్వం అనేది ఉండాలి. మనకి లేదని ఎదుటివాళ్ళకు లేదు అనుకుంటే అది మీ భ్రమ. మేము తాగాలి, తిరగాలి అనుకుంటే ధైర్యంగా తాగగలం, తిరగగలం. మాకంటూ కుటుంబ విలువలు ఉన్నాయి. తప్పేదో ఒప్పేదో బాగా తెలుసు. మీరు చేసే ఎదవ పనులకు మామీద పడి ఏడవద్దు. ఇచ్చిన విలువ పోగొట్టుకోవద్దు. శాడిజం ఆభరణం కాదు. మానసిక రోగం. అది తెలుసుకుని ముందు దానికి మందు వేసుకుంటే కనీసం చివరి క్షణాల వరకు మీ అన్న నలుగురు తోడు ఉంటారు లేదా ఏకాకుల్లో కాకిలా మిగిలి పోతారు. మానసిక హింసకు శిక్ష లేదు అని మీరు అనుకోవచ్చు కానీ పైవాడు ఒకడు ఉన్నాడు కదా వాడు అందరి లెక్కలు, అన్ని కూడికలు తీసివేతలు సరి చేస్తాడు. మీ తప్పులను సహించే బంధాన్ని హింసిస్తే పుట్టగతులు లేకుండా పోతారు. జాగ్రత్త...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner