15, అక్టోబర్ 2017, ఆదివారం

ఇట్లు... నీ... పుస్తక సమీక్ష...!!

ముఖపుస్తక మిత్రురాలు గాయిత్రి కనుపర్తి గారి ఇట్లు...  నీ... పుస్తకం గురించి చెప్పాలంటే..
ముందుగా పుస్తకాన్ని చూడగానే ఆకర్షించే ముఖ చిత్రంతో కనిపించింది. కాస్త లోపలి పేజీలు తిరగేయగానే అందమైన చిత్రాలతో అర్ధవంతమైన కవితా భావజాలాలు ఆర్తిగా పలకరించాయి. ఇట్లు... నీ... అన్న పేరులోనే అంతర్గతంగా పరిచిన ఓ ఆత్మీయత, ప్రేమపూర్వక అక్షరాల అక్షింతలు మనకు కనిపిస్తాయి.
మొదటి కవనంలోనే ఆరు కాలాల అలరింపులని అందంగా అందిస్తూ వాసంతాల వనవాసం నుంచి పరితాపాల గ్రీష్మంతో పలకరించి చినుకుల సందడిని స్పర్శిస్తూ వర్షాన్ని, విరహాన్ని ఓదార్చే శరత్తును తాకి, చల్లని సమీరంగా హేమంతాన్ని, రాలుపూల శిశిరపు సవ్వడిలో ఆరు ఋతువుల ఆనందాలను కానుకగా చేసి అందించడంలోనే భావాలను అద్భుతంగా పండించారు పుస్తకానికి తగ్గ పేరును సార్ధకం చేస్తూ.  తలపుల నెమలీకలు ఎడబాటులో జ్ఞాపకాల పరిమళాలు యుగళ గీతాలుగా వినిపిస్తాయి. నీవెవరివో కదా అంటూనే.. ఎవరు నీవంటే అని జీవిత తోటమాలిని ఆద్రతగా అడుగుతారు. రాత పుట్టుకని రెప్పపాటు కాలానికి కనికట్టుగా వర్ణిస్తారు. రమ్మని పిలవకుండానే వచ్చిన అతిథిని రాకోయి అనుకోని అతిథీ అంటూ ఆహ్వానిస్తారు. మనసుకి హెచ్చరికలు చేస్తూనే మానసాన్ని మేల్కొలుపుతారు. ప్రణయ వీణ సరిగమల్లో సరాగాలను,నవరాగా మాలికలను అన్వేషిస్తారు. బ్రతుకు అంతర్ముఖాన్ని అద్దంలో చూపిస్తారు. ఊహాలోకంలో మనసులో గీసుకున్న ప్రకృతి చిత్రాన్ని మనోజ్ఞంగా చూపిస్తారు. కళల తీరంలో ఏకాంతపు రాణివాసాన్ని వాస్తవ కలల విహారంలో ప్రణయ కావ్యంలో వేచి చూసే అభిసారికను చూపిస్తారు. తొలకటిలో తొలి వలపుని, అక్షరసావాసంలో నిరీక్షణల ఆరాటాన్ని, వెన్నెల పుష్పంలో వలపులని అందించే ఏకాంతపు కాంతని, క్షణాలు సాక్షిగా కాలాన్ని నిలిచి పొమ్మంటూ నెమలి కన్నుల కలని నిజం చేయమని ప్రేమార్థిగా శోధిస్తూ కన్నీళ్లను కారణమడుగుతూ, వన్నెల వసంతంలో వెన్నెల కొంటెతనాన్ని ఊహల సవ్వడిలో ఏకాంతపు సంకెళ్లను వివరిస్తూ, ప్రేమ దివ్యత్వాన్ని పలవరిస్తూ, వడిలో వాలిన క్షణాలను వల్లె వేస్తూ, అర్ధంకాని పుస్తకమని ఎందరన్నా నాకే తెలియని నేను ని మనసులోని మనసుకు పరిచయిస్తూ, ఆత్మైక్యంలో మమేకమై, మనసు మజిలీకి శాశ్వత క్షణాలను లెక్కలేస్తూ, జ్ఞాపకాల పారిజాత పరిమళాలను ఆఘ్రాణిస్తూ, తలవని జ్ఞాపకాన్ని తలపుల్లో దాచుకుంటూ, మౌన సవ్వడిని హృదయ సవ్వడిగా కలసిన మనసుల సాక్షిగా అనుబంధంగా ప్రమాణం చేద్దామా అని అడుగుతారు. అంతరంగ రణరంగాన్ని,పాణిగ్రహణానికి పరమార్ధాన్ని, అక్షర నిరీక్షణలో అవ్యాజమైన ప్రేమార్తిని, వలపు వనమాలిలో ఒంటరి గీతాన్ని, ఎదురుచూపుల కథను, మైమరపుల ఆరాటాన్ని, అవ్యక్త మాధుర్యాన్ని, నిండైన నా మదంటూ గొంతు గడప దాటలేని భావాన్ని అలవోకగా అలా అలా ఎగసిపడే అలల వయ్యారంలో నిలిచిన గమ్యాన్ని, ఆశల ఆజ్యంలో చీకటి వెలుగుల సందె పొద్దుల్లో శ్రావణ మేఘాల ప్రణయ కావ్యాల మౌన భాష్యాలను లిఖించడంలో ప్రేమను మురిపించడమే కాకుండా చదువరులందరిని తన అక్షర సంద్రంలో, భావజాలాలతో మరిపించి మురిపించారు తనదైన శైలిలో. ఈ పుస్తకానికి సమీక్ష రాయడంలో ఎంత వరకు కృతకృత్యురాలని అయ్యానో తెలియదు కానీ చదువుతున్నంత సేపు ఓ చల్లని పైరగాలి పలకరించినట్లు అనిపించింది.
అందమైన భావుకతతో, అర్ధవంతమైన చిత్రాలతో ఇట్లు... నీ... కవితా సంపుటి అందరిని అలరిస్తుందని ఆశిస్తూ..
గాయిత్రి కనుపర్తి గారికి అభినందనలతో... 
మంజు యనమదల

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner