15, డిసెంబర్ 2017, శుక్రవారం

తరతరాలకు చెదరని ఆస్తిగా...!!


 ఈనాడు అవసరాల కోసమో, ఆనందాల కోసమో, నలుగురు వెళుతున్నారు నేను వెళ్లకపోతే ఎలా అన్న ఆలోచనతోనో మనలో చాలా మంది విదేశాలకు వెళ్ళడం పరిపాటి అయిపొయింది. భారత దేశాన్ని వదలి వెళ్ళినంత మాత్రాన మన భారతీయతను వదులుకోవాల్సిన అగత్యం ఏమి లేదు. మహాకవి రాయప్రోలు సుబ్బారావుగారు అన్నట్టు " ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము" అన్న మాటలు మనకు గుర్తు ఉంటే చాలు. మన సంస్కృతీ సంప్రదాయాలను మనం ఆచరించడమే కాకుండా తరువాతి తరాలకు కూడా అందించగలం. తరతరాలకు చెదరని ఆస్తిగా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు మిగిలిపోతాయి.

ఏళ్ళ తరబడి విదేశాల్లో ఉండి అక్కడి అలవాట్లకు అలవాటు పడిపోయిన మన భారతీయులు తమ పిల్లలకు ముందుగా కుటుంబ బంధాలను వివరించడం ముఖ్యం. బంధుత్వపు వరుసలు, వస్త్రధారణ, మాతృభాషపై మమకారాన్ని పెంపొందించడం, మన పండుగలు వాటి ప్రాధాన్యతలు చెప్తూ దైవ భక్తి పెంపొందించడం, మన భారతీయ కళలు నాట్యం, సంగీతం వంటి వివిధ కళలు పిల్లలకు నేర్పించడం ద్వారా  మనం లేక పోయినా తరువాతి తరాలకు ఈ కళలు అందుతాయి. మన వేదాలు, పురాణాలలోని నైతిక విలువలు తెలియజెప్పే కథలు చెప్పడం ద్వారా పిల్లలకు వాటి  పట్ల ఆసక్తిని పెంచవచ్చు.
ఈ ఉరుకు పరుగుల జీవితంలో పిల్లలకు ఆటవిడుపుగా ఆత్మీయుల కలయికలో ఆనందాన్ని చూపించడం, కుటుంబంలో నలుగురు కలిసి కష్టసుఖాలు పంచుకోవడం, పెద్దల సలహాలు, సూచనలు పాటించడం, పిల్లలకు పెద్దల యెడ గౌరవంగా మెలగడం, విదేశీ చదువులతో పాటు స్వదేశీ విలువలు నేర్పించడం, అనుబంధాలను, అభిమానాలను ఎలా పెంపొందించుకోవాలో తెలియజెప్పడం, ఒక్కరు కాదు అందరం అన్న భావన (నా అన్న భావన నుండి మనం అన్న భావన) కలిగేలా చేయడం.
ఇవి అన్ని మనం ఆచరిస్తూ పిల్లలు నేర్చుకునేలా చేస్తే మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు తరతరాలకు అందుతూనే ఉంటాయి.  

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner