15, డిసెంబర్ 2017, శుక్రవారం

నేను రాసుకున్న లేఖ..!!

నేస్తం,
నాలుగు తరాలకు సాక్ష్యంగా మిగిలిన నా మనస్సాక్షి ఎందుకో ఈ రోజు మాట్లాడాలనుకుంటోంది. మనుష్యులతో, మానవ బంధాలతో సంబంధాలు లేని ఈ రోజుల్లో వినడానికి శ్రోతలే లేరు కాని వినిపించాలన్న ఆతృత మాత్రం చావలేదు.' స్వ'గతంలోని గతం నాతోపాటుగా నాలుగు జ్ఞాపకాలు నెమరు వేసుకుంటోంది.

అల్లారుముద్దుగా అందరి మధ్యలో పెరిగిన బాల్యాన్ని మళ్ళి మళ్ళి కోరుకుంటోంది మనసు. చేజారిన క్షణాల్లోని సంతోషాన్ని అందుకోవాలని మది తహ తహలాడటం, తప్పొప్పుల తక్కెడలో నేనెక్కడ ఉన్నానో చూసుకోవాలని ఈ ఐదు పదుల జీవితాన్ని మరొక్కసారి చదవడం మొదలుపెట్టా మనసు పుస్తకం తెరిచి..

అమాయకమైన బాల్యం అమాయకంగానే ఆడుతూ పాడుతూ అందమైన జ్ఞాపకాలను అందించింది. అనుబంధాల పొదరింటిలో ఆత్మీయతారాగాల నడుమ బంధాలకు పుట్టినిల్లుగా, మమతల వెల్లువలో అన్ని ప్రేమలను అందుకుంది.
కౌమారం సెలఏరు చల్లగాలిలా హాయిగా సాగిపోయింది. చదువు అయిపొయింది ఇక అసలు జీవితం మొదలయ్యింది.

ఆడపిల్లను 'ఆడ'పిల్లగా పెంచలేదు నాన్న. కాలు కింద పెడితే కందిపోతుందేమో అని తన చేతులతో అరుగు మీద మట్టి తుడిచి నన్ను నిలబెట్టిన నాన్న.. చిన్నప్పటి నుంచి ఇద్దరి ఇష్టాలు ఒకటిగా నాన్న కూతురిగానే పెరిగాను. అడగకుండానే అన్ని అమర్చి పెట్టేవారు, అందుకేనేమో ఇప్పటికి నాకిది కావాలి అని అడగడం చేతకాదు. ఎవరి విషయంలోనైనా సరే చిన్న తప్పుని కూడా ఒప్పుకోలేని నేను పెళ్లి విషయంలో నాన్న చేసిన పనికి ఎదురు తిరిగాను. పరిణామం నాన్న నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపేశారు. జనారణ్యంలోనికి తొలి అడుగు పెట్టాను. ఆరు నెలల వ్యవధిలో అరవై ఏళ్ళ జీవితాన్ని చూపించి జీవిత పాఠాలు నేర్పిన తొలి గురువుతో మొదలు పెట్టి జీవిత సంద్రాన్ని ఈదడం మొదలుపెట్టాను. అటు మంచివాడు కాదు ఇటు చెడ్డవాడు కాదు భర్త. తన కోసం అన్ని వదలి వచ్చిన భార్యను పట్టించుకోని నైజం, భాద్యతా రాహిత్యం, సమస్యలకు దూరంగా పారిపోవాలని చూడటం వెరసి నాకు మిగినవి కాసిని కన్నీళ్లు, కష్టాలు. జీవిత వైకుంఠపాళిలో నిచ్చెన ఎక్కాలన్న నా ప్రయత్నాన్ని ఆదిలోనే అడ్డుకునే యత్నాలు బోలెడు తోడు అయ్యాయి. ఓటమి ఒప్పుకోలేని నా నైజం నిరంతరం గెలవాలన్న ప్రయత్నంలో ఎన్నో అడ్డంకులను అధిగమించి ఇద్దరు బిడ్డలకు అమ్మగా, అమ్మానాన్నలకు కూతురిగా, భర్త వైపు బంధువులు కాదన్నా బాధ్యత గల ఇల్లాలిగా బాధ్యతలను నెరవేర్చి ... ఒకప్పుడు కాకులు వర్షంలో తడిచి పోతున్నాయి లోపలకు పిలువు అమ్మా అని చెప్పిన పసితనం ఈనాడు మరణం ఎన్నిసార్లు తలుపు తడుతున్నా మళ్ళి రమ్మని చెప్తూ చావుని సైతం తన చేతిలోనే ఉంచుకుంది. సమస్యలతో ఆడుకున్న నేను విధాతకే సవాలుగా మారాను ఈనాడు. సంకల్పం బలమైనది అయితే మరణం కూడా మన దరి చేరడానికి భయపడుతుంది. మనకున్న చిన్న జీవితంలో ప్రతి క్షణమూ విలువైనదే. జీవితంలో కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలన్న సిద్ధాంతంలో మన డబ్బు అవసరాలకు బంధాలను వాడుకొనకుండా ప్రేమ ఆప్యాయతలను పంచుతూ కొన్నైనా మానవతా విలువలు మన తరువాతి తరాలకు అందిద్దాం.

నేను జీవితంలో గెలిచాను అని చెప్పడానికి ఈ ఒక్క కారణం సరిపోదూ..!!

1 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Padma Sreeram చెప్పారు...

అక్షరాలు ఓడిపోవు.ఆదిశక్తీ ఓడిపోదు. జీవితం ఎప్పుడూ సమస్యలమయమే.సమస్యనే కోరుకొని గెలిచిన నెచ్చెలి(కి) జీవితమే సమాధానమైంది.మీ గెలుపు పలువురికాదర్శం అవుతుందో లేదో తెలియకున్నా స్ఫూర్తి దాయకం.విజయపు గమనాన్ని చూపే ఆత్మీయ ప్రేరకం. శుభాభినందనలు చెలీ....

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner