29, జనవరి 2018, సోమవారం

తుషార మాలిక ...!!

 మాలికలో వచ్చిన నా వ్యాసం                         

                                                      తుషార మాలిక లఘు సమీక్ష  ...!!             

కవితలకు, కథలకు సమీక్షలు రాయడం అంటేనే చాలా కష్టమైన పని.  సిరి వద్దే గారు రాసిన త్రిపదలకు అది 1300 ల త్రిపదలకు నేను సమీక్ష రాయడమంటే సాహసం చేయడమే.  అక్షరాలకు అందమైన పదభావాలను జత చేసి ముచ్చటైన మూడు వాక్యాల్లో త్రిపద కవితలను సిరి వడ్డే మనకు "తుషార మాలిక" తొలి త్రిపద సంపుటిగా అందించారు. ముందుగా వారికి నా ప్రత్యేక అభినందనలు.
                ఒక్కో వాక్యానికి 20 అక్షరాలకు మించకుండా మూడు వాక్యాల్లో ముచ్చటైన కవితలను అందించిన తీరు చదువరులను ఆకట్టుకుంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక తుషార మాలికలో మొదటి త్రిపదం జన్మనిచ్చిన అమ్మతోనే మొదలు.  చరాచర సృష్టికి మూలం అమ్మ. ఆ అమ్మ ఒడి ఓనమాలతో మొదలై జీవిత పాఠాలు నేర్చుకునే వరకు చదువుల తల్లి శారదమ్మలా మనకు బాసటగా ఉంటుందని చెప్పడం. అమ్మని కూడా పసిపాపను చేస్తూ మనల్ని కొట్టి అమ్మ కూడా ఏడవడాన్ని ఎంత బాగా చెప్పారో..
అమ్మ కూడా పసిపిల్లనే ...
నన్ను కొట్టి ,

తను ఏడుస్తోందేమిటో...అలా వెక్కి వెక్కి..!!

పాపాయి బోసి నవ్వులతో నేర్చుకోవడం మొదలైన అమ్మ చదువుకోవడంలో ఎప్పటికి నిత్యా విద్యార్థిగానే ఉందని చెప్పడంలో భావుకురాలి గొప్పదనం తెలుస్తోంది. జ్ఞాపకాల గురించి చెప్పినప్పుడు వాడని పున్నాగపూల పరిమళాన్ని వీడని జ్ఞాపకాల మడతలతో పోల్చడం, ఇష్టమైనవాళ్లు విసిరిన చిరునవ్వు ఎదను హత్తుకున్న అమ్మ చేతి స్పర్శతో పోల్చడం, పాపాయి అలిగి అన్నం తినకపోతే అన్నం తినని అమ్మ అలకని తన చిన్నతనంలో పోల్చుకుని చెప్పడం, నాన్నతో అనుబంధాన్ని జీవితపు అవినాభావ సంబంధంగా, గుప్పెడుగుండేలో ఒదిగిన ప్రేమ అమ్మానాన్నల స్పర్శగా అనుభూతించడం, మానవత్వాన్ని చాటిచెప్పేవి పల్లెలే అని, ప్రపంచాన్ని, పుట్టిన పల్లెటూరును తూకం వేస్తె అనుబంధాలకు తూనిక తమ పల్లెలే అని తేల్చి చెప్పడం, అనుభవ పాఠాలను నేర్పే జీవితాన్ని గురువుగా భావించడం, వెన్నెల్లో విహరిస్తున్నా మాటల అమృతాన్ని మది నిండుగా గ్రోలడంలో ఓ రకమైన తీయని విరహాన్ని చెప్పడం, మనసు కొలనులో స్వప్నసుమాలను, చేజార్చుకున్న స్మృతుల మూటల వేడుకులాటలు, రెప్పలా మాటున దాగిన కలల మంత్రంనగరి మర్మాన్ని ఛేదించడం, కాలాన్ని పట్టి ఆపేసిన జ్ఞాపకాల డైరీని, అల కల  దూరాల తీరాలని,నిశీథి సుమాలను ఏరి వెన్నెల నవ్వులకివ్వడం, మది వేదన శిశిరాన్నిదాటి ఆశతో పోల్చడం, కలిసిన క్షణాలన్నీ అందెల మువ్వల నవ్వులే అని, దైన్యాన్ని దాటి ధైర్యాన్ని అందుకోవడం, మౌన ధ్యానంలో వరమైన ప్రేమని, విధి పంపకాలను అప్పగింతలుగా, హృదయపు తికమకలను, మనోనేత్రపు మనసును, ప్రక్రుతి, సనాతన ఆవర్తనాలను, సెలయేటి గలగలలు, మబ్బు గిన్నెలు తొలకరి వర్షపు పూలజల్లులను, ఆకులపై అలరాలే చినుకుల ముత్యాలను, పాత పరిచయాన్ని పడే పడే పలవరించడం, చిగురాకు సవ్వడిలో పూమొగ్గల పరిమళాన్ని ఆస్వాదించడం, తలపుల తాకిడిని పెనుగాలికి రాలిపోయే పూలతో పోల్చడం, నది నడకలను,  రాకను, పోకను కూడా సంధ్యానాదంతో పోల్చడం చాలా చాలా బావుంది. కదిలే మేఘాలను, పొద్దుపొడుపుల అందాలను, చీకటి దుప్పటిలో వెన్నెల నక్షత్రాలను, జ్ఞాపకాల తుంపర్లను, ప్రేమలో విజయ కేతనాన్ని,  ధీరత్వాన్ని జీవితంలో ఆటుపోట్లకు వెరవని మనసని చెప్పడం, పొగడ్త మంచిదికాదని, సాగర సంగమం జీవితమని, పున్నమి, కలువల అనుబంధాన్ని, కలల నిరీక్షణలో వేసారిన కనురెప్పలకు,  రెప్పల పరదాలను  వేయడం చాలా అద్భుతమైన భావం. 
రెప్పల పరదాలను వేసేసాను...
కనుల సౌధానికి,
నీ కలలను గుట్టుగా దాచుకుందామనే..!!

ఇలాంటి ఎన్నో అద్భుతమైన త్రిపదలు ఈ సంపుటి నిండా పరుచుకుని మనలను ఆపకుండా చదివిస్తాయనడంలో సందేహం లేదు. అన్ని సమీక్షించడం కన్నా చదవడం బావుంటుంది. ఓ చక్కని తుషార మల్లికను అందించిన సిరి వడ్డేకి మరోసారి మనఃపూర్వక అభినందనలు. 

మంజు యనమదల 
విజయవాడ 


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner