18, ఫిబ్రవరి 2018, ఆదివారం

ఏక్ తారలు...!!

1.  ప్రతి క్షణము పున్నమే_కనుల ఎదుట నీవుంటే... !!

2.  మనసు చిత్తరువులే అన్నీ_మంజువాణి మనోభావాలుగా...!!

3.  గోదారి గలగలలే మనసంతా_నీ స్నేహారాధన సవ్వడికి....!!

3.   స్వరజతులుగా సాగుతున్నాయి_గోదారి గంగమ్మ పరవళ్ళ ఉరవళ్ళు...!!

4.   నిస్తేజమౌతున్న అనుబంధాలు_కపట స్నేహాల పాలబడి..!!

5.  చీకటింటికి చుట్టాలొచ్చారు_నిశ్శబ్దానికి వరసలు కలుపుతూ..!!

6.  తడిసిన కన్నుల్లో వి రిసింది_నిశ్శబ్దరాగంలో ప్రేమ మెరుపు...!!

7.   ఆలాపనలన్నీ నీతోనే ముడి పడ్డాయి_మనసు మౌనాలను చిత్తగిస్తూ...!!

8.  మనసు మురిసింది నీ స్నేహానికి_మమతలను అల్లుకుంటూ...!!

9. మనసులొక్కటైన చెలిమి_మది నిండిన జ్ఞాపకాల చిరునామాతో...!!

10.   జీవితం తెరచిన పుస్తకమే_చూడలేని కాగితాలెన్నో దానిలో...!!

11.  నిశ్శబ్దంలోనూ శ్లేషలే_మన ఆంతరంగికాలను అక్షరబద్దం చేస్తూ....!!

12.  మర్మాలెన్నున్నా కలిసిన మనసులే_అరుదైన చెలిమి నీడలో...!!

13.  శకలాలన్నీ ఏరుకుంటున్నా_ముక్కలన్నీ పేర్చి జ్ఞాపకంగా పదిలపర్చుకుందామని...!!

14.   వ్యాపకాలన్నీ నీతోనే_జ్ఞాపకాలకు తావు లేకుండా...!!

15.   చెలిమి స్వచ్ఛమైనదే_మనసుకు మాలిన్యమంటనంత వరకు..!!

16.  ఆంతర్యానికెంత ఆనందమెా_జనించే ప్రతి భావనలోనూ నీవుంటుంటే...!!

17.  మౌనం మనదైంది_అంతరంగాలోకటైన వేళ...!!

18.   అతిశయమే మనసుకి_విడిపోనిది మన స్నేహమని...!!

19.  కలలన్నీ కల్లలే_విలువలేని అనుబంధాల ఆటల ముందు...!!

20.  మూడుముళ్ళెప్పడూ ముచ్చటైనవే_అర్ధాంతరపు బంధాలకు కనువిప్పు కలిగిస్తూ...!!

21.   కల కల'వరిస్తోంది'_మెలకువలో మరవద్దని..!!

22.  సశేషాలన్నీ విశేషాలే_శ్లేషలను మిగిల్చేస్తూ...!!
23.  మకరందమూ మత్తెక్కించే మధువే_అక్షరాలకు భావాల లేపనమై...!!

24.  పెదవంచున చిరునవ్వవుతావా_పరితపించే మనసుకు సాంత్వనగా...!!

25.   ఓటమితో వాదిస్తున్నా_గెలుపు చిరునామా నీవని చెప్తూ...!!

26.   విస్మయానికీ అచ్చెరువే_విశేషణమైన నీ పద విన్యాసానికి...!!

27.  జ్ఞాపకాలన్నీ మనవే_విడివడని మన చెలిమికి ప్రతిరూపాలై....!!

28.  మౌనమే అక్షరమైంది_కాగితాన్ని కలలతో నింపేద్దామని...!!

29.   వాడినా పరిమళాలే అనునిత్యం_కాలాన్ని మెాసుకెళ్తూ మిగిలిన జ్ఞాపకాలు...!!

30.   గతానికి భయమెక్కువ_వర్తమానంతో రాజి పడలేక...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner