12, జూన్ 2018, మంగళవారం

ఒక కవితా సంపుటి సమీక్ష...!!

                            "ఒక " పదంతో అంటూనే భావాల వెల్లువలో ఓలలాడించిన సిద్దార్థుడు    


           పాత తరానికి కొత్త తరానికి మధ్యన సాహిత్యంలో వస్తున్న పెను మార్పులకు అనుగుణంగా తెలుగు సాహిత్యం ఎన్నో మార్పులకు లోనవుతోంది. వచన కవిత్వంలో వస్తు, శిల్ప, భావ ప్రకటనలో తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటూ దూసుకువస్తున్నఈ తరం యువ కవి సిద్ధార్థ కట్టా "ఒక" కవితా సంపుటి సమీక్ష ఈ వారం గోదావరి సాహిత్యంలో మీ అందరి కోసం ...
          "ఒక" కవితా సంపుటి లోనికి తొంగి చూస్తే అమ్మని, ఆకాశాన్ని, పసి హృదయాన్ని ఎంత బాగా ఆవిష్కరించారంటే చెప్పడం కన్నా చదివితే బావుండేంతగా..ఆమె ఆవలితీరంలో ఆకాశం అనుభవాలను మనం ఆస్వాదించడం ఎలానో, అర్ధం చేసుకోవడం ఎలానో వివరిస్తారు. నీకోటి చెప్పనా అని సుతిమెత్తని సంభాషణ వినిపిస్తారు. మా అమ్మలో మన అమ్మలనూ చూపిస్తారు. నిషిద్ధ హృదయంలో హృదయాన్ని గాయాల బావిలో జారవిడుచుకోవడం, అంతరించిందంటూ మగ జాతి అహంకారాన్ని నిరసించడం, పాప నాన్నతోలో పసితనపు పాప అమాయకత్వాన్ని లాలించిన తండ్రి మనసును, ఒట్టి హృదయానివి అంటూ హృదయపు అంతర్లోచనాన్ని, జ్ఞాపకమొస్తే ఏమేం చేయాలో చెప్తూ మారాం చేస్తూ జీవితంలోకి దూకమనడం వంటి సరి కొత్త ప్రయోగంతో ఆకట్టుకుంటారు. రాత్రి మెట్లపై గాలి , మనసు మాటల మౌనాన్ని సముద్రం, ఆకాశంతో పోల్చడం, తిరిగి ఎంత రక్తం తీసుకుంటే, రాజ్యమా కవితలలో ఉద్యమాల బాటలో విషాదాన్ని, అప్పుడు గుర్తించు అంటూ మనసును గుర్తించమనడం, పెద్దవ్వాలని లేదు లో పసిపిల్లల మీద, ఆడపిల్లల మీద అఘాయిత్యాలకు తన అక్షరాలు తల్లడిల్లడం చూడొచ్చు. ఆద్ధంలో అబ్బాయీ, ఐదు రెక్కలు కవితల్లో ఊహలను, కలలను దృశ్యాదృశ్యాలలో చూపించడం, ఉమ్ము లో ఓ రణ  నినాదాన్ని, ధిక్కార స్వరాన్ని,  గాయాలను వెదకాలి అంటూ మన గాయం మానితే మరో గాయపు గేయాన్ని వెదకడం, ERROR 404 లో కనపడని జీవితపు పేజీని వెదకడం, సూర్యుడ్ని అతికించగలడు, నీళ్లగొంతుతో, ఎలా వస్తుందో తెల్సా కవితలలో కాస్త కొత్తదనపు శైలితో ఊహలకు ఊపిరి పోయడం, జ్ఞాపకం లేని మైలురాయి వద్ద  మళ్ళీ కలుస్తాను ఈ సారి ఒంటరిగా వినమంటారు. ఆనవాళ్ళను మోసుకుంటూ పావురమెగిరిపోయింది, ఆకాశం నిండిపోయేలా, పసిపిల్లకు జ్వరమొచ్చింది కవితల్లో రాత్రి నక్షత్రాలను తెంపుకు పోవడం, ప్రకృతికి పిల్లల్ని ఇవ్వడం, ప్రశ్న అనుకుని కవితలో ప్రశ్న అనుకుని ప్రాణాన్ని తీసుకుపోవడం, Our Kid లో కార్పొరేట్ విష పంజాలో చిక్కుకుని విల విలాడుతున్న పసితనాన్ని, ఒక అర్ధరహితం లో అర్ధంకాని మనిషితనాన్ని,  చిన్నారి శివ శ్రీ లో ఓ సమస్యను, ఆఖరి అద్భుతంలో తెలిసాడే నాటకంలో హృదయాలను యధాస్థానంలో మొలకెత్తనివ్వడమే ఆఖరి అద్భుతం అంటారు. ఏళ్ల క్రిందటా, యుగాల క్రిందటా తిప్పేసిన పేజీల చాటుగా ఓ పాతమనిషి పూర్వీకుడు అని చెప్పడం చాలా బావుంది. భర్తీ అయిన  శీర్షిక లో స్వచ్ఛమైన ప్రేమ భావాన్ని, పూలు..పాప.. డోరా లో పసితనంలో కావాల్సిన స్వేచ్ఛను స్కూల్ డ్రస్ లేని బడి, కొన్ని ప్లాస్టిక్ పువ్వులు కావాలని పాపతో అడిగించడం అందరి మనసులను తడి చేస్తుంది. ఆరు రెక్కలు లో "మనుషులంతా ప్రేమను నమిలి మింగిన వారు / పాపాయి ఏడుపుకు / అందరు తలలు తిప్పుతారు / తమనెవరో పేరు పెట్టి పిలిచినట్టు " ఇది అందరి ఆమెల ఆత్మకథ అని ఎంత హృద్యంగా చెప్పారో. చివరిగా, గాయాల గేయాలే నీకు ఉరితాళ్ళు, సీతాకోకచిలుక, భర్తీ కాని శీర్షిక, బాగుంటుంది, మీకు కల, గొప్పదేశం, మనిషి ఒక అద్భుతం, దిగులు, ఇన్క్లూడింగ్ మీ, వాళ్లిచ్చే పిట్టతనం, విప్లవం ప్రకృతి ధర్మం, అతడు-ఆమె వంటి కవితలన్నింట్లో ఆర్ద్రత, ప్రేమ, తప్పులను సహించలేని తత్త్వం, అన్యాయం మీద తిరుగుబాటు ధోరణి, సమాజపు పోకడ మీద దిగులు, చేజారుతున్న విలువలు దక్కించుకోవాలన్న ఆరాటం కనిపిస్తుంది. చెట్టు నేల చెప్పిన రహస్యం లో అదృశ్యమౌతున్న పచ్చదనాన్ని కాపాడమనే ఆవేదన, నీలో చిన్నప్పుడే లో ఓ ఆవేశం, అని ఉంటావు, గాలిరంగు పాట, కలకోసం,  నీలాంటి, పాపలాంటి, మనుషుల్లాంటి, నువ్వన్నట్టుగానే కవితల్లో వెదుకులాటలు, వేడికోలు, కొన్ని సర్దుబాట్లు కనిపిస్తాయి. నాన్న చెమట చుక్క దేహం లో నాన్నలంటే చెమట చుక్కల దేహం, ఆకలే తెలియని శ్రామికుల సమూహం అని ఎవ్వరు చెప్పని అభివ్యక్తిని వ్యక్తీకరించారు. జీవితాన్ని జీవించడం ఎలాగో, చేయగలిగిన పని లో బతికున్నంత కాలం పెద్దవాళ్ళం అవడం కుదరనప్పుడు జీవితాంతం పిల్లల్లా బతికేయమనడం, మెత్తటి కలవరింత లో ఒక తేనే కల,పువ్వు ఊహ, మెత్తని కలవరింత అంటూ మరో జననానికి నాంది గీతాన్ని ఆలపిస్తూ ఈ కవితా సంపుటిని ముగించడం ఓ చక్కని నిండుతనాన్ని తెచ్చింది.
               కొన్ని కవితలు చదువుతున్నప్పుడు విశ్లేషణ రాయడం చాలా క్లిష్టంగా ఉంటుంది. కొత్త తరం వచన కవులు తీసుకునే వస్తువు కానివ్వండి, అభివ్యక్తి కానివ్వండి వారు చెప్పాలనుకున్న విషయాన్ని మూసలో కాకుండా  సరి కొత్తగా చెప్పడం అభినందించదగ్గ విషయం. ఈ " ఒక " కవితా సంపుటి సమీక్ష రాస్తున్నప్పుడు నాకు నేనుగా వేసుకున్న ప్రశ్న కొంత వరకైనా సరిగా రాయగలుగుతున్నానా లేదా అని. రాయడానికి ఓ క్షణం సంశయించాను రాయగలనా లేదా అన్న మీమాంశ నన్ను వెంటాడి. ఎంత వరకు న్యాయం చేయగలిగానో నాకు తెలియదు. వైవిధ్యంగా తన భావాలను తీర్చిదిద్దిన "ఒక " కవితా సంపుటి కవి సిద్దార్థ కట్టాకు మనఃపూర్వక అభినందనలు.

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner