20, జూన్ 2018, బుధవారం

మట్టి పొరల్లోంచి... సమీక్ష....!!

                                 "మనసు పొరలను తడిమిన మట్టిపొరలు... "
     ఆరు కవితా సంపుటాలు వెలువరించి విశిష్ట నానీల కవిగా అందరికి సుపరిచితులైన డాక్టర్ సోమేపల్లి వెంకట సుబ్బయ్య ఏడవ కవితా సంపుటి "మట్టి పొరల్లోంచి..."  సమీక్ష మీ అందరి కోసం..
    మొదటి కవిత నాలో నేనులో మానవీయ పలకరింపుల పరిమళాల జ్ఞాపకాల దొంతర్లు మనోపేటికలో నిరంతరం ప్రవహిస్తూ,  మనసు మర కాదని మమతల పొర అని, ఎప్పటికి మానవీయపు మల్లెచెండే అని సరిక్రొత్త మనిషిని పరిచయం చేస్తారు. వెన్నెముక గోడులో చాలా అద్భుతంగా" రైతు నిఘంటువులో అన్ని ఉన్నాయి.. పేగు నింపే గిట్టుబాటు ధర తప్ప" అని వాస్తవాన్ని ఎలుగెత్తి చాటారు. అంకెలు కవితలో ఎక్కడ చూసినా అంకెల ఆరాటమే, ఆర్ధిక అనుబంధాలే అన్ని అని, భాష, బంధం అనేవి ఈ అంకెల గారడితో పడి గగన కుసుమాలైపోతాయని అంటూ ప్రస్తుతం మనం కూరుకుపోయిన కార్పొరేట్ వ్యవస్థ గురించి కళ్ళకు కట్టినట్టుగా చెప్పారు. మాటల బేహారిలో "అతడు అనుసంధాత కాదు/ అన్నదాత అడుగుల్ని శాచించే విధాత" అని ఎవరు ఇప్పటి వరకు చెప్పని కోణంలో మార్కెట్లో దళారుల అక్రమాల్ని చెప్పారు అనడం కంటే చూపించారు అనడం సబబుగా ఉంటుంది. సుడిగుండం చుట్టూలో పొట్టకూటి కోసం ఆశల వలలు వేయడం దినచర్యగా బతుకీడుస్తున్న మత్యకారుల జీవితాలను, చిక్కుల సుడిగుండాలను మానవ జీవితాలకు అన్వయించి చెప్పడం చాలా బావుంది. మళ్ళీ అమ్మ ఒళ్ళోకి అంటూ పసితనపు కాలాన్ని దాటిన జ్జ్ఞాపకాల అలలు తలపుకొస్తే వయసు వేగంగా వెనక్కి వెళ్ళి కళాశాల ముంగిట్లో వాలుతుందని చెప్పడం మనం చదివితే ప్రతి ఒక్కరు ఆ అనుభూతిని అందుకుంటారనడంలో సందేహం లేదు. పసి (డి ) ప్రపంచంలో బాల్యాన్ని నెమరువేసుకుంటూ కళ తప్పిన పల్లె చిత్రాన్ని సజీవంగా చూపించారు. ఆ నేల నిండా లో  రైతు గోడు వెళ్ళబోసుకోవడానికి ఒక కాగితం ముక్క చాలు వినే నాధుడుంటే అంటారు. జిందగీలో క్యాష్ అండ్ క్యారీ యూజ్ అండ్ త్రో అంటూ జీవిత సత్యాన్ని, డాలర్ యవనికలో ఆర్ధిక అవసరాలు దేశాలను, జీవితాలను శాసిస్తున్నాయని అది డాలర్ కాల మహిమని, భాషే నా శ్వాసలో మాట మట్టి వాసనల్ని కోల్పోతోంది, భాష బండరాయి కింద నలిగిపోతోంది అంటూ పేగు భాషతో బంధాలను నిలబెట్టుకోవాలని, సూక్ష్మ 'వ్రణం'లో చక్రవడ్డీ కోరలకు చిక్కి ఎన్నో కుటుంబాలు నాశనమైపోతున్న వైనాన్ని, మళ్ళీ బతికేందుకులో అవయవ దానం ప్రాశస్త్యాన్ని, దృక్పథంలో చిట్టి చీమల శ్రమ మనిషికి ఆదర్శమని, పాదు నీడలో మట్టి,  చెట్టు,చినుకు, చేను, మనిషిది గొప్ప హరితానుబంధమని, గుప్పెడు బంగారంలో అమ్మ చుట్టూ తిరుగాడిన బాల్యపు క్షణాలను, ఉట్టిలో ఉట్టి ఇప్ప్పుడు ఓ తెలియని వస్తువయినా పాడిపంటలకు, ప్రేమాభిమానాలకు ఎప్పటికి ప్రతికే అని, ఎక్కడని వెదకడంలో కలివిడితనం అంటే ఇప్పటి సామాజిక మాధ్యమాల స్నేహాలు, చుట్టరికాలు కాదని మనిషిని మనిషిలో వెదకమని చెప్పడం, చప్పిడి బతుకులో ఉప్పుమడికి, బతుకుబండికి దళారులే అనుసంధానమౌతుంటే బతుకంతా చప్పిడి మెతుకులే  అంటారు. గుండె తడిలో చదువు స్వదేశం కోసం కాకుండా డాలర్ల సంపాదన కోసమై, బాల్యాన్ని నేలరాస్తున్న ఇప్పటి చదువులకు హృదయపు తడితో వినయము, విలువలు కావాలంటారు. మానవత్వపు పతాకలో కోల్పోయిన తనానికి మానవత్వపు పరిమళం అద్ది జీవితాన్ని చిగురింపజేయమంటారు. దాహం బాబోయ్ .. దాహం,లో నీటిని పొదుపు చేయకపోతే వచ్చే నష్టాలను, ఫేస్ బుక్ లో అమ్మలో సాంకేతికతను పురోగమనానికి కాకుండా బంధాల, అనుబంధాల తిరోగమనానికి ఎలా వాడుకుంటున్నామన్నది స్పష్టంగా చెప్పారు. జలో రక్షతి రక్షితఃలో ఒకప్పటి స్వచ్ఛమైన నీటికి, ఇప్పటి అమ్మకాల నీటికి తేడాలు, ప్రతిదీ వ్యాపారమైయమైన మన జీవితాలను, లింకుల కర్రలో నాన్నతో జ్ఞాపకాల అనుబంధాన్ని అప్పట్లో ఊరితో పెనవేసుకున్న లింకుల కర్ర ఉపయోగాన్ని హృద్యంగా చెప్పారు. దిగులు గూడులో అసలైన విషాదం ఊపిరి పోసుకున్న ఇంట్లోకి, ఊపిరి పోయాక చేరుకోవడంతో ఎన్నో జ్ఞాపకాలను దాచుకున్న ఆ ఇంటికి మిగిలినవి దిగులు చూపులని బాధని కూడా అందంగా చెప్పారు. రామయ్య పంతులు బడిలో ఒకప్పటి పల్లెటూరి బడి జ్ఞాపకాలను ఎప్పటికి చెదరని చెరగని జ్ఞాపకాలని గుర్తు చేసారు. ఆకలి మట్టీలో ఇటుకబట్టి కూలి కష్టాన్ని, పల్లెపటంలో డాలర్ మోజులో పడి ప్రేమానురాగాలు కూడా ప్రియమైపోయాయని (దొరకడం లేదని) వెలిసిపోయిన పల్లె పటాన్ని మన ముందుంచుతారు. 'వెదురు' చూపులో మేదర్ల వెతలను, ఉల్టా ఉగాదిలో ప్రపంచ ద్రవ్య భాషలో మనిషి అమ్మకపు సరుకని, పండుగలు కూడా ఊహల్లోనేనని చాలా బాగా చెప్పారు. కాసేపు విరామంలో కాసేపు విరామం చాలు దేహానికి విశ్రాంతి అవసరం లేదని మనల్ని మనమే ఉత్తేజపరచుకోవాలని జీవితం ఓ సుదీర్ఘ కావ్యమని చక్కని భావంతో ఈ చివరి కవితతో ఈ కవితా సంపుటిని ముగించారు.
        ఈ కవితా సంపుటిలో సామాన్య  జీవితాల కష్టాలు, కన్నీళ్లు, దిగుళ్ళు, కాలం చేసిన గాయాలు, సేదదీర్చే జ్ఞాపకాలు, మరచిపోతున్న మానవత్వపు చిరునామాలు, బడుగు రైతు వ్యధలు, సాంకేతిక మాయాజాలం ఇలా అన్ని కలిపి ఒకప్పటి జీవితాలు, ఇప్పటి మార్పులు చేర్పులు అన్ని కలిపి తనదైన శైలిలో చిన్న చిన్న పదాలతో మనమూ మట్టి మనుష్యులమే అని మన మనసు పొరలను స్పృశించారు మట్టి పొరల్లోంచి ...చక్కని అక్షర కావ్యాన్ని అందించినందుకు హృదయపూర్వక అభినందనలు...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner