3, జులై 2018, మంగళవారం

గోదావరిలో నా గురించి...!!

మాటలకందని సంతోషమిది..నా రాతలకు ఇంతటి వన్నెనద్దిన వాణి గారికి మనఃపూర్వక కృతజ్ఞతలు... ప్రచురించిన గోదావరి యాజమాన్యానికి, కత్తిమండ ప్రతాప్ గారికి మనఃపూర్వక ధన్యవాదాలు..


మనసున్న కవయిత్రి మంజు మనసు భావాలు అరుదైన అంతర్లోచనాలు.....
మనసు ఎన్నో రకాలుగా మనతో చర్చిస్తుంది. రోజు మొదలయ్యే దగ్గరనుండి వేకువ మేల్కొపేదాకా ఎన్నో అనుభూతులు , అనుభవాలు. నిదురలో కూడా మనసు శాంతిగానో కలల కలవరాలుగానో , కలలే వరాలుగానో మొత్తానికి మనసు అనేది పదిలమైన అనుబంధం.
మనసును గురించి ఇంతలా ఎందుకు చెప్పానంటే భావకవులు ఎక్కువగా మనసుతోనే బంధించ బడి వుంటారు. సమాజం నేర్పిన పాఠాలన్నీ తమ అనుభూతులకు మేళవించి తాత్వికంగా,హృద్యంగా తమ భావాలను అల్లుకుంటారు.
వెలుగు,చీకటులు కాలపు అడుగులను ఆత్మ విశ్వాసపు మెళుకువలుగా సునితంగా గొప్పగా తమ కవిత్వాన్ని అక్షరబద్ధం చేయగలరు.
ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అచ్చం అలాంటి భావాలతో "కబుర్లు కాకరకాయలు" అనే బ్లాగ్ ద్వారా మరియు మంజు యనమదల అనే ముఖపుస్తక ఐడి ద్వారా తన అక్షర ప్రయాణాన్ని సాగిస్తున్న మంజు గురించి కాసిన్ని మాటలు అందరితో పంచుకోవాలనే చిన్న ప్రయత్నమిది.
అలతి పద విన్యాసాలు దుఃఖాలను ఓదార్చుకున్న ఆత్మవిశ్వాసాలు , ఏకాంతానికి ఎడబాటుగా అక్షరాలను నేస్తాలుగా చేసుకుంటూ ఙ్ఞాపకాలతో అనుబంధం కవిత్వమై పరిమళించింది.
గుండెచప్పుడు వేదనగా వినిపించినా కలత కన్నీళ్ళలో సేదతీరుతుంది. వాస్తవాలు వెక్కిరిస్తున్నా ' కలం ' స్నేహంగా వెన్నుతడుతుంది.
స్నేహశీలిగా, హుందాతనానికి ప్రతిరూపంగా మృదువైన పదశైలి ఆమె సొంతం అక్షరాలను అనునయిస్తూ భావాల పంటను పండిస్తారు.
అక్షరాల సాక్షిగా నేనోడిపోలేదంటూ మొదటి పుస్తకంలోనే గెలుపునూ తన సొంతం చేసుకున్నారు.
మౌనం రాల్చిన అక్షరాల్లొ మసకబారిన జ్ఞాపకాలు కదులుతున్న కాలంలో చెరిగిపోని ఆనవాళ్ళు’ ఆమె పేర్చిన అక్షరాలు అంతులేని ఆత్మ విశ్వాసాలు పదాల పొందికలో లోతైన భావాలు.
తన గెలుపుకు అక్షరాలే సాక్ష్య౦ అంటూ కవితా సంపుటి పేరులోనే విజయాన్ని ప్రకటించారు ఇలా ....”అక్షరాల సాక్షిగా ... నేనోడిపోలేదంటు.......”.తొలి పుస్తకం లోనే అందరి మనసుల్లో తన భావాలను నిలబెట్టేస్తూ...
మరో పుస్తకం చెదరని శిధిలాక్షరాలు మంజు లోతైన కవితలు ఇందులో ప్రత్యేకంగా వుంటాయి..
అంతుపట్టని మనసు అంతర్మధనమే శి(థి)లాక్షరాలు. కలానికి సాయంగా మిగిలిన తెల్ల కాగితం చిన్నబోవడం అద్భుతమైన భావుకత. కాలంతో మనసు పోటీ పడి భావాలను నిలువరించలేని ప్రయత్నం. మనుష్యులతో బంధాలు అల్లుకున్నవై మనసును వీడిపోవడం లేదు అక్షరాలు చీకటికి చుట్టాలయ్యాక చెదరని శిల్పాలై వెన్నెల కాంతులు వెలువరిస్తాయని అంటున్నారు.
ఆశలు ఆశయాలు , వాంఛలు వలపులు ,పలుకులు పలుకరింపులు మౌనం మాటలు ఇవే కాదు జీవితమసలే లేకున్నా..ఏదీ నాది కాకున్నా ..న్యాయంగా నిలవాలన్న తపన నాదంటూ ..స్వల్పమైన జీవితానికి అల్పమైన కోరిక ...రెప్పపాటు జీవితంలో స్వప్నంగా మిగలాలని వుందంటున్నారు మంజు.
స్వార్ధం ముసుగుకప్పుకున్న సమాజాన్ని, మారుతున్న మనుష్యుల స్వభావాన్ని, విలువలు దిగజారుతున్న వైనాన్ని అంతర్జాలపు మాయల వైఖరిని నిశ్శబ్దంగానే నిలదీస్తారు.
ఓదార్పు కోల్పోతున్న ఒంటరి జీవితాలు మానవ సంబంధాలకై వెంపర్లాడుతూ వేసారుతున్నాయి . మానవత్వం మనిషితత్వాన్ని కోల్పోయాక ఒంటరి అడుగుకు తోడు దొరకడం కష్టమే.
శిధిల క్షణాలుగా మిగిలిన ఙ్ఞాపకాలు నిశ్శబ్దం నిర్వచించిన భావాలు గుప్పెడు గుండె వెలిబుచ్చిన గాయాల గీతాలు సడి చేయని అక్షరాలు.
బంధాల ఉనికి ఏమార్చుకున్నా శాశ్వతమైన చెలిమి చిరునవ్వు సంతకం చేయిస్తుంది. అలసిపోయిన నిన్నలపై ఆత్మీయస్పర్శగా స్నేహం స్వాంతన నిస్తుంది.
అవసరం కోసం ఆంగ్ల భాషపై మక్కువ పెంచుకోక తప్పలేదు , మాతృప్రేమ మాతృ భూమిపై మమకారం చంపుకోలేని నిస్సహాయత . బ్రతుకుదెరువు సముద్రాలు దాటించినా డాలర్లు బ్రతుకు యుద్ధానికి బాసటగా నిలిచినా ...నాదేశం నా భాష అంటూ మమతను నింపుకోవడం అమ్మప్రేమ లాంటిదే అంతిమం దాకా పురిటిగడ్డను వీడిపోనంటారు తన అనుభవాలు వల్లె వేసుకుంటూ......
కవిత్వమే కాకుండా తన నేస్తాంతో చెప్పే కబుర్లన్ను మనతో చెపుతూ సందడి చేస్తారు ఈ వ్యాసాలన్నీ కూడా ఓ పుస్తకంగా అముద్రిత అక్షరాలంటూ ముద్రించి మన ముందు పెట్టేశారు . మరుగై పోయిన ఉత్తరాల కాలాన్ని ఈ పుస్తకం చదువుతూ గుర్తు చేసుకోవచ్చన్నమాట.
సడిచేయని (అ)ముద్రిత అక్షరాలు ఇలా ఉంటాయి చూడండి.
ఇప్పుడు తన నేస్తంతో చెపుతున్నట్లుగా ...రాసిన లేఖలు అందరినీ తన నేస్తాలుగా పలుకరిస్తూ సాగిన వ్యాసాల పరంపర అందరితొ ముచ్చట్లు చెపుతాయి ...సడి చేెయవు అక్షరాలంటూ ... తన అముద్రిత అక్షరాలను ముంద్రించి సందడి చెయించారు.
స్నేహానికి మంజు ఇచ్చే ప్రాధాన్యత ఈ పుస్తకంలో ముందు పేజీ నుంచే కనిపించింది తన ఈ పుస్తకాన్ని చిన్ననాటి స్నేహితులు " వాసు వేదుల" గారికి అంకితమివ్వడం ఆమె గొప్ప మనసుకు తార్కారణం ..చదువులో పోటి పడ్డ స్నేహితుడు మరణంలో సైతం తానే గెలిచానని స్వర్గంలో వున్న నేెస్తానికి అంకిత మిచ్చారు
నువ్వే చెప్పు ఏం చేయాలో. అంటూ... ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తారు తన నేస్తంతో చెప్పుకున్న ఈ కబుర్లన్నీ ఎవరికీ వారు తమకే చెపుతున్నట్లుగా భావిస్తారు. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగ పడేలా..చదివితీరాల్సిన సడి చేయని అందమైన అక్షరాలు .
సందేహాలు, సందేశాలు ,సమస్యలు, సమాధానాలు ఇలా కొనసాగిన అక్షర ప్రయాణం.... ఇది
ఇంకా విదేశీ సంస్కృతి మోజులో మనమెంతలా కూరుకు పొయామో కదా ..! ఈ మాటలు అద్దం పడుతున్నాయి.
“ ఇప్పటికి మన మీద గెలుస్తున్నది తెల్లవాడే... మన సంప్రదాయపు పండగల కన్నా మన అందరికి గుర్తుండే పండుగ న్యూ ఇయర్... మనం ఇష్టపడే దుస్తులు జీన్స్... మాతృభాష కన్నా మనకు బాగా వచ్చిన భాష ఇంగ్లీష్...ఈ పదాలు తెలుగులో చెప్పినా అర్ధం కాని వారు ఎందరో.. అందుకే మనం ఎంతగా పరాయితనంపై మక్కువ పెంచుకున్నామో చెప్పడానికే ఈ ఉదాహరణలు...
విశిష్టమైన మన మత గ్రంధాల కన్నా మనకు తెలిసిన ముఖ పుస్తకమే ఎక్కువ ఇష్టం...బానిసత్వం నుంచి విముక్తి ఇచ్చినట్టే ఇచ్చి ఇప్పటికీ పరాయి తత్వానికి బానిసలుగా చేసుకున్న తెల్లవాడే గెలిచాడు మన మీద...”
భగవంతుడినే నిందిస్తున్నాను అనే వ్యాసంలో దేవుడు స్వార్ధపరుడంటు
తొమ్మిది నెలలు అమ్మ కడుపులో ఉంటే అమ్మ కష్టం ఆడదాని విలువ తెలిసేది .. ఉమ్మనీళ్ళు ఎలా ఉంటాయో.. ఆ కష్టం ఏమిటో తెలిసేది.
అహంకారం .. ధన దాహంతో రోజులు బిజీగా గడిచి పోతున్నాయి , నిజమైన అనుబంధాల విలువల రుచి మరిచి పోతున్నాము.నిత్య సంఘర్షణల మధ్య ఆత్మీయస్పర్శను కుడా అనుభవించలేని అంధకారంలో గడిపేస్తున్నాం. చుట్టూ మనుష్యులు వున్నా ఒంటరితనం వెంటే వుంటోంది .
నలుగురితో కలసి గంజితాగినా రుచిగా వుండదా..? ఎన్ని కోట్లు సంపాదించినా అమ్మ పెట్టే ముద్ద కమ్మదనం ముందు దిగదుడుపే కదా...!
అంతిమ ప్రయాణం గురించి చెప్పిన మాటలు ఇలా …
ఒక్క మనం తప్ప అందరు చూడగలరు అది.. ఈ ప్రపంచంతో బంధాలను వదిలించుకుని సాగే ప్రయాణం అదే అంతిమ యానం. జీవితానికి చిట్ట చివరి మజిలీ అని , అప్పటి వరకు మనతో ఉన్నదేది మనతో రాదంటూ మనకిచ్చే కన్నీటి వీడ్కోలు మనం చూడలేనిది, ఆఖరి ప్రయాణపు అంతర్మదానాన్ని జీవి తెలుసుకునే భాష ఇంకా రాలేదు. అంటున్న ఈ మాటలు ఆలోచింప చేస్తాయి.
"కలుషితమైంది పర్యావరణమా!! మనమా...!!"
నిజమే ఆలోచించిల్సిందే ....మానవ సంబంధాలే కలుషితమయ్యాయి ...మనుగడ కావాలనుకున్న మనిషే స్వార్ధాన్ని అందలమెక్కించాడు... ధన దాహంతో మానవత్వాన్నే మంట గలుపుతున్నాడు ....నాలుగు ముక్కల్లో కుండ బద్దలు కొట్టిన ఈ వ్యాసం ఆలోచింప చేస్తుంది.
"ప్రేమ ....పెళ్ళి..."
కన్నవాళ్ళను కన్నీళ్ళు పెట్టించి అన్నీ తుంచుకున్న తమదైనదనుకున్న జీవితం పంచుకునే వారులేని ప్రశ్నార్ధక పయనం కాదా ...ఒక్కసారైనా గుర్తుపెట్టుకోమంటుంది ఈ వ్యాసం...
"సమాధానం తెలియక...."
ఆది అంతాలు తెలియని జీవితం ఆలోచించడం మొదలెట్టాక సందేహంగానే వుంటుంది కదూ... బాధ్యతల నిర్వర్తించడం కోసం ఎదురయ్యే ఆటంకాలను అధిగమిస్తూ జీవన ప్రయాణం సాగిస్తూ వుంటాం అది అందరికీ తప్పని పరిస్దితి.
"ఆత్మహత్యలు ..ఎందుకు ..."
ఏ జీవికీ లేని ఆలోచనా శక్తి మనిషికే సొంతమయ్యింది తమకు తెలిసిన భాషలో మాట్లాడుకునే అవకాశం మనిషికి మాత్రమే సాధ్యమైయింది.
మనకు తెలియక ఎదురయ్యాయో... మనతప్పుకు మనకు ఎదురయ్యే శిక్షనో ...బాధ అనుభవించడం తప్పని పరిస్ధితి సమస్య మొదలయ్యాక సమాధానం దొరక్క పోదు ఆత్మహత్యలు పిరికితనం అన్న ఈ వ్యాసం సంఘర్షణకు స్వాంతన నిస్తుంది
నాకూ ఙ్ఞాపకాల నిండా గాయాలే ఆత్మ విశ్వాసాన్ని మంజు అక్షరాల నుండే నేర్చుకున్నాను
ఇదేగా జీవితం గతం గాయంగా మిగిలిందో ఆత్మీయతలు అద్దుకుందో అంతరంగం మాత్రం జ్ఞాపకాల కావ్యాన్ని రచిస్తోంది చెమరించిన దృశ్యాలన్నీ కావ్యాలై మిగులుతున్నాయి ...
అందరి మనసుల్లో ఆత్మీయంగ మిగిలిపోయిన సిరివెన్నెల గారి పాట మనసు పెట్టి విన్నప్పుడు తమ జీవితాన్ని గుర్తు చెసుకోకుండా వుండలేము ..." జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది సంసార సాగరం నాది సన్యాసం శూన్యం నాది ..." నిజమనుకోక తప్పని నిజం ఇది.
మార్పు కోసం ఎదురుచూస్తూ సాగుతున్న జీవితాన్ని మౌనంగానె మొస్తున్నాం కదూ...ఇవన్ని మంజుమాటలే నేనూ ఇలానే అనుకున్నా .. మీరూ అంతే అనుకుంటారు.
మంజు మనసు ముచ్చటే ఇది కూడా.. కొన్ని పుస్తకాలు చదువుతున్నప్పుడు మన మనసే కనిపిస్తుంది చెమ్మగిల్లిని కన్నులు గుండెను తడుముకుంటాయి .ఊరడించే అక్షరాలూ ఇక్కడె దొరుకుతాయి కాస్తయినా మనసును ప్రక్షాళన చేసుకోవచ్చు ..
స్నేహం గురించో.... , జ్ఞాపకాల నిధుల నుంచో... .అన్నీ తానై మనసుతో పడ్డ సంఘర్షణ. నిజాలు నిక్కచ్చిగా చెపుతూ .. అనునయించే అక్షరాలు ..
మానవతా విలువలు ..అనుబంధాల ఆప్యాయతలు ఇలా ఈ వ్యాసాల పరంపర .
మంజు గారి శైలి ని తన భావ ప్రయాణిన్ని ఆమె పుస్తకాల సంపద నుండి కొన్ని విశ్లేషించాను.
తన స్నేహితురాలితో కలిసి "గుప్పెడు గుండె సవ్వడులు " అనే మరో పుస్తకాన్ని వెలువరించారు. ఇందులోని భావాలలో రెండు గుండె చప్పుళ్ళను లోతుగానే వినవచ్చు.
"అక్షరాల సాక్షిగా నేను ఓడిపోలేదు
సడి చేయని (అ)ముద్రిత అక్షరాలు
చెదరని శి(ధి)లాక్షరాలు
గుప్పెడుగుండె సవ్వడులు"
ఇవి మంజు యనమదల గారు వెలువరించిన పుస్తకాలు.
ముద్రితం కాని ఎన్నో భావాలు పుస్తక రూపంలోకి రావాల్సిన అవసరం వుంది.
మనసు అన్వేషణ మౌనంగా సాగిపొతుంది మనిషి జీవితంలో ఎదుర్కొనే ఒడుదుడుకులు ఎన్నో... అంత:సంఘర్షణ అక్షరీకరించడం అందరూ చెయ్యలేక పోవచ్చు ఒక్కోరిది ఒక్కోరకమైన ప్రయాణం.
సమాజాన్ని తట్టి లేపినా ..జ్ఞాపకాన్ని ఒడిసి పట్టినా అలతి పదాలలో ప్రకటించడం మంజు నేర్పరితనం. తన కవిత్వంలో లోతైన భావాన్ని అలవోకగా అల్లేయడం కనిపిస్తుంది.
"అక్షరానికి ఊపిరి పోసిందేమో జీవితాన్నిచ్చింది
భారమంతా భావమై కురిసిందేమో బ్రతుకు బావుటా ఎగరేసింది
ఓటమికి విజయతిలకం దిద్దేసి వేదనకు వెన్నెలమరకలద్దేసి
కాలానికి కన్నీటిని కానుకగా ఇచ్చి
వేకువను మెలువనుకుని నమ్మకానికి చిరునామాను రచించింది"
చుట్టూ జరిగే అన్యాయాలకు మనసుతోనే యుద్ధం ప్రకటించింది . స్ర్రీ లపై జరుగుతున్న వివక్షలను కలంతోనే నిలదీసింది. మానవతా విలువలు కలగలసిన మనసు కవిత్వం మంజు కవిత్వం.
శోకం శ్లోకంగా మారిపోయింది.. వెంట పడుతున్న గమ్యాన్ని గడపదాటి రావద్దంటూ వెళ్ళగొడుతూనే వుంది.
అక్షరాల ఆలింగనంలో ఆత్శవిశ్వాసాన్ని గెలుచుకుంది చేతన కోల్పోనివ్వక తనువుకు ధైర్యమనే మలాము రాస్తూనే వుంది. నిశీధి చెంతలో నిశ్శబ్దాన్ని అక్షరమై జయించింది . భావాల రాశులు పోస్తూ కవిత్వమై పరిమళించింది.
చెదరని శిలాక్షరాలు ఇవి......
మంజు పుస్తకాల్లోవే నేను ఎంచుకున్నాను ముఖపుస్తకంలో ఎన్నో కవితలు వ్రాశారు. అక్షరానికి అలుపు వుండదు. మానసిక ఉల్లాసానికి కవిత్వం ఒక అవకాశం.
మంజు అలసిపోని అక్షరమై ప్రయాణించాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
..........వాణి కొరటమద్ది, visakhapatnam

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner