4, జనవరి 2019, శుక్రవారం

అంతర్లోచనాలు పుస్తక ఆవిష్కరణ సభ సమీక్ష...!!


                           " అంతర్లోచనాలు...అందరి ఆలోచనల సమాహారం"   

          నవ్యాంధ్ర రచయితల సంఘం, భువన విజయం, తెలుగురథం సంయుక్తంగా విజయవాడ ఠాగూర్ స్మారక గ్రంధాలయంలోలో నిర్వహించిన " అంతర్లోచనాలు " పుస్తక ఆవిష్కరణ సభ కాస్త ఆలశ్యంగా మొదలైనా ఆద్యంతమూ నవ్వుల చతురోక్తుల మధ్యన దిగ్విజయంగా జరిగింది.
          నవ్యాంధ్ర రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి, నవ మల్లెతీగ సంపాదకులు, " అంతర్లోచనాలు " పుస్తక ప్రచురణ సంస్థ వ్యవస్థాపకులు కలిమిశ్రీ సభా కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ సభాధ్యక్ష్యులు బిక్కి కృష్ణ గారిని, శాసనసభ ఉప సభాపతి డాక్టర్ మండలి బుద్ధప్రసాద్, చందు సాంబశివరావు, బండారు హనుమంతరావు ,సాగర్ శ్రీరామకవచం, డాక్టర్ కత్తిమండ ప్రతాప్, కొంపెల్ల శర్మ, నన్నపనేని సునీల్ కుమార్, రాజా వాసిరెడ్డి మల్లీశ్వరిలను, అంతర్లోచనాలు పుస్తక రచయిత్రినైన నన్ను వేదిక మీదకు ఆహ్వానించి శాలువాలతో, గులాబీలతో గౌరవించి సభను నడిపించవలసిందిగా సభాధ్యక్ష్యులు బిక్కి కృష్ణకు సభా బాధ్యతలు అందించారు. 
         బిక్కి కృష్ణ సభను జ్యోతి ప్రజ్వలనంతో ప్రారంభించవలసినదిగా మండలి బుద్ధప్రసాద్ గారిని, చందు సాంబశివరావు తదితర పెద్దలను కోరగా అందరు దీపాన్ని వెలిగించి సభను మొదలు పెట్టారు. ముందుగా సాగర్ శ్రీరామకవచం మాట్లాడుతూ నేను రాసిన 4 పుస్తకాలను, నేను వాణి వెంకట్ కలిపి రాసిన గుప్పెడు గుండె సవ్వడులు కవితా సంపుటిని కూడా గుర్తు చేసారు. నా కవితలను, వ్యాసాలను వాటిలోని భావాలను చాలా పరిశీలనాత్మకంగా వివరించారు. వాణి కవితలను కూడా వినిపించి విశ్లేషించారు. నా ఆత్మీయ నేస్తం వాణి సభలో లేని లోటును గుర్తు చేసుకున్నారు. సాగర్ ఉపన్యాసం కాస్త ఆవేశంగా సాగింది. మధ్య మధ్యలో కాస్త సందడి చేసారు అతిథులను అల్లరి చేయకుండా సభ వినమని, నన్ను కూడా..
      మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ వారికి పుస్తకం ముందుగా అందివ్వని కారణంగా సభలో పుస్తకం చదవడానికి సమయాన్ని తీసుకున్నానని చెప్తూ వారి దివిసీమ ప్రాంతీయురాలినే నేను అని గుర్తు చేస్తూ, లోతైన కవిత్వాన్ని రాస్తున్నానని, నావి మూడు పుస్తకాలు ఆయనే ఆవిష్కరించారని చెప్తూ, ప్రపంచం అంతా గుర్తించాక వారు గుర్తించామని చెప్పారు. ఆ కాస్త సమయంలో చదివిన వ్యాసాల్లో కార్పొరేట్ వ్యవస్థ మీద ఎక్కుపెట్టిన శరాలు తమ మనసులో మాటలని చెప్తూ, సమాజంలో ఏ వ్యవస్థనూ వదలలేదని, కార్పొరేట్ పై మొదటగా వచ్చిన రచనగా పేర్కొంటూ, కవులు, రచయితలూ సమాజంలోని లోపాలపై తమ రచనలు ఉండేటట్లు చూసుకోవాలని సూచించారు. చందు సాంబశివరావు మాట్లాడుతూ పుస్తకం తాను ఇప్పుడే చదివానని చెప్తూ, ఇంటిపేర్లు ఈ ప్రపంచంలో మన ఒక్కరికే ఉన్న సంప్రదాయమని, మన సంప్రదాయాలను గౌరవించాలని సూచించారు. మన పేరుకి ముందు ఇంటిపేరు ఉండటం మన సంప్రదాయమని చెప్పారు. సభలో నవ్వులు మెరిపించారు ఈ విషయంపై.
      అంతర్లోచనాలు పుస్తకాన్ని నేను, మావారు రాఘవేంద్రరావు కలిసి తెలుగు రథం అధ్యక్షులు కొంపెల్ల శర్మకు అంకితమీయగా, వారు మమ్మల్ని శాలువాలతో సత్కరించారు. తరువాత డాక్టర్ కత్తిమండ ప్రతాప్ మాట్లాడుతూ నా అక్షర భావాల గురించి చెప్తూ, అంతర్లోచనాలు అందరి ఆలోచనలుగా అభివర్ణించారు. నన్నపనేని సునీల్ కుమార్ మాట్లాడుతూ నా రాతలు తనని కూడా ఎంతో మార్చాయన్నారు. రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి మాట్లాడుతూ మంజు మనసు ముచ్చట్లయినా మన అందరి మనసు మాటలే ఇవి అన్నారు. కొంపెల్ల శర్మ మాట్లాడుతూ అందరు అన్నట్లుగా అంతర్లోచనాలు లేఖా సాహిత్యం కాదన్నారు. మ్యూజింగ్స్ అని అంటూ అంతర్లోచనం అంటే సరిపోతుందని చెప్తూ, అంతర్లోచనాలు పుస్తకంలో ఉన్న శీర్షికలపై తన అభిప్రాయాలను సభికుల ముందుంచారు. లోతైన కవిత్వాన్ని రాస్తున్నందుకు బిక్కి కృష్ణ అభినందించారు. అంతర్లోచనాలు కి ముందు మాటలను తాను కూడా రాసి ఉంటే బావుండేదని అన్నారు. మాట్లాడటం రాని నాటో కూడా రెండు మాటలు మాట్లాడించారు.
     ఆప్తులు, ఆత్మీయులు అందరు వచ్చి సభను దిగ్విజయం చేసారు. పూతరేకులు ప్రత్యేకంగా చేయించి తెచ్చిన శ్రీనివాసరెడ్డి గారికి, పూర్ణాలు, వడలు, అరటి, మిర్చి బజ్జిలు, కేక్, సున్నుండలు, డ్రింక్స్, టీ అందించిన వంకాయలపాటి చంద్రశేఖర్ సోదరునికి, అంతా తమదే అన్నంతగా అన్ని ఏర్పాట్లు చేసిన కలిమిశ్రీ గారి కుటుంబానికి వ్యయ ప్రయాసలకోర్చి నా కోసమే సభకు వచ్చిన, నా వారైన ప్రతి ఒక్కరికి నా మనఃపూర్వక కృతజ్ఞతలు ఈ గోదావరి పత్రిక సాక్షిగా....
   
  

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner