20, ఫిబ్రవరి 2019, బుధవారం

ఆమె తప్పిపోయింది సమీక్ష...!!

                           " అతివ అంతరంగాన్ని వెదుకుతున్న అక్షరాభావాలు ఆమె తప్పిపోయింది.."
       గట్టు రాధిక మోహన్  అమ్మానాన్న పేర్లను తన కలం పేరు వెంకి గా మార్చుకుని కవిత్వం రాస్తూ మానసిక, సామాజిక అసమానతలపై ఎక్కుపెట్టిన అక్షర శస్త్రాలు ఆమె తప్పిపోయింది కవితా సంపుటిలో కనిపిస్తాయి. ప్రాంతీయతను ఎంతగా అభిమానిస్తారో రాధిక ప్రతి కవితలోను స్పష్టంగా కనిపిస్తుంది.
      ఆమె తప్పిపోయింది కవితా సంపుటిలో మొదటి కవితలోనే తన కవిత్వ భావాలను రాత్రులను తరిమేస్తూ, ఉదయాలకు ఊపిరయ్యే భావాల కన్నీళ్లను, అంతరంగాన్ని అక్షరాలుగా మలిచి కవిత్వం అనే మూడు అక్షరాల్లో నియంతృత్వానికి నిద్ర లేకుండా చేయాలనే యుద్దాన్ని ప్రకటిస్తారు. ఆకలీ..చచ్చిపో కవితలో పిడికెడు బువ్వకు పిడిగుద్దులు అందుతున్న ఈ సమాజంలో ప్రాణాలతో బతకడానికి ఆకలి పేగులను పెట్రోలుతో తగులబెట్టాలని ఉందని సరికొత్త అభివ్యక్తితో చెప్పడం చాలా బావుంది. అవ్వపాల భాష కవిత ప్రాంతీయతమీదున్న ప్రేమను చాటుతూ కాళోజిని స్మరణకు తెచ్చుకోవడం అభినందించదగ్గ విషయం. నువ్వొక పొడిచే పొద్దువి కవిత ఇప్పటి చదువుల భారాన్ని చూస్తూ ఏమి చేయలేని నిస్సహాయతను చూపిస్తుంది. బ్లాక్ మినిట్స్ కవిత మౌనంలో మనసు భావాలను చెప్తుంది కొత్తగా. మా నాయిన కవితను చదువుతుంటే మళ్ళి కొడుకుగా పుట్టిన బిడ్డని చూస్తూ దేవుని వరమని తలపోస్తూ, " అమ్మ పక్కనే కూసోని (వెంకి ) కవిత్వమైతడు  అందనంత దురానున్నా.. అందనంతెత్తుకు ఎదుగుబిడ్డాని దీవెనార్తి పెడ్తడు " అంటూ దూరమైన నాయిన జ్ఞాపకాల గురుతులను యాది చేసుకుంటారు. అసిఫా మాట్లాడితే కవిత చదువుతుంటే మనసు చెమ్మగిల్లక మానదు. నీ ఊహల మేఘాలు, నీతో.. నువ్వు కవితలు చక్కని భావుకత్వంతో ఉన్నాయి. తెలంగాణ సిద్ధాంత కర్త కొత్తపల్లి జయశంకరుని గురించి చెప్పడం బావుంది. ఊహామాత్రంగా మిగిలిన అమ్మను దూరం చేసిన కరకు కాలాన్ని శపిస్తూ అమ్మను మనసులో దాచుకున్న పసి హృదయాన్ని అమ్మ చిత్రంలో హృద్యంగా చూపెడతారు. సంక్షోభ స్త్రీ, గొంగళి పురుగు, అనంత రూపసి, అమ్మ  కొంగు, ఆమె తప్పిపోయింది, నేనొక దాచిన హక్కుని, కీచక పర్వం, గర్భాలయం, సీతాయణం, ఆ శాపం, ఆమె వెళ్ళిపోతుంది, వి'తంతు' , ఆమె మెదడే ఆమెకు శత్రువట వంటి కవితలు స్త్రీలపై జరుగుతున్న అమానుషాలను ప్రశ్నిస్తూ, అతివ మనసులోని ఎన్నో వేదనలను సూటిగా అక్షరబద్దం చేసారు. జ్ఞాపకాల శకలాలతో అందమైన శబ్దం చేయించారు. అలసిన శరీరం ఎలా అద్భుత శక్తిగా వెలగాలన్న ఊహను చూపించారు. డాక్టర్ సూర్య కవిత తమాషాగా చీకటిని, వెలుగుని చెప్తుంది. రైతే రాజీనామా చేస్తే..? కవితలో అన్నదాతకు అగ్ర తాంబూలం ఇచ్చారు సరికొత్తగా. అడ్డుపడే గౌరవం కవిత బంధాల మధ్య దూరాన్ని తగ్గించే దారిని చెప్తుంది. ఆటలే అనాథలైన వేళ కవితలో ఈ ఆధునిక యుగంలో, అంతర్జాల మాయాజాలంలో మరుగున పడిపోయి కనుమరుగౌతున్న బాల్యపు ఆటపాటలను, పసితనపు జ్ఞాపకాలను కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారు. అగ్నికణుడు దాశరథి కవితలో కలాన్ని హలంగా చేసి, జనంపై అభ్యుదయ అక్షరాలను చల్లిన దాశరథిని కీర్తిస్తారు. వేల రాత్రులను దిగమింగుతున్న సూర్యుడు కవితలో ఒకే పేగు తెంచుకుని, ఒకే రక్తం పంచుకున్న అన్నాచెల్లి రక్త సంబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. ఏడున్నది ప్రాణం గ్యారంటీ క్షణంలో పోయే  ప్రాణమున్న దేహానికి ఈర్ష్యా అసూయలు ఎందుకంటూ  తాత్వికంగా అడుగుతారు. నాయిన బిడ్డ కవిత చక్కని తెలంగాణా యాసలో తండ్రిబిడ్డల ప్రేమను చెప్తుంది. పిత్తలి పీతాంబరం కవిత మది బాధని గుర్తు చేస్తుంది. మనసు వాసన కవిత మనిషి మనసు ఆరాటాన్ని, ఆరాధనను చెప్తుంది. మానవత్వమా.. ఘర్ వాపస్ ఆజావ్ కవిత ఈ నిర్జీవపు సమాజ విలువలపై సూటిగా ఎక్కుపెట్టిన అక్షర శరం. రాలిపడుతున్న సమయం, విధి రాత, I am not alone, పరదేశి, అవుటాఫ్ కవరేజ్ ఏరియా వంటి కవితలు విభిన్న  కవితా వస్తువులతో చదువరులను అలరిస్తాయి. పాలిథిన్ సమాధి, పొడుపు కొండ, నాలుగ్గోడలు, కలం వారసులు, ఏంజెయ్యను అని సమాజపు లోపాలను ఎత్తి చూపిస్తూ  చివరిగా తన అందమైన తెలంగాణా యాసలో ప్రాంతీయత మీద తనకున్న అపారమైన అభిమానాన్ని ఇఫ్తార్ విందుగా జ్ఞాపకాల గుట్టను కదుపుతూ సమానత్వాన్ని చాటి చెప్తారు.
స్త్రీ వాదాన్ని, సమాజపు అసమానతలను, మనసు వేదనలను, జ్ఞాపకాల చిట్టాను, బాల్యపు అనుభూతులను ఇలా జీవితపు ప్రతి క్షణాన్ని తనదైన చక్కని ప్రాంతీయపు యాసలో, తెలంగాణా వాడుక భాషలో అందంగా " ఆమె తప్పిపోయింది " అంటూ అక్షరీకరించారు గట్టు రాధిక మోహన్. చక్కని, చిక్కని భావాలను అందించిన రాధిక మోహన్ కి హృదయపూర్వక అభినందనలు.... 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner