15, మార్చి 2019, శుక్రవారం

జీవన "మంజూ"ష (ఏప్రియల్)...!!

నేస్తం,
                పుట్టుకతో మనకు వచ్చేది కులం. మతం అనేది మనకిష్టమైనట్లు మనం ఆపాదించుకునేది. సాహిత్యం, సంగీతం మొదలైన కళలు కొందరికి జన్మతః ప్రాప్తిస్తాయి. నేర్చుకోవాలన్న తపన ఉన్న మరికొందరు నిరంతర అభ్యాసంచే ఆయా కళల్లో ప్రావీణ్యం సంపాదిస్తారు. ఏ కళైనా సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడని నాడు ఆ కళ వ్యర్థమే. కనీసం మానసిక వికాసానికైనా ఉపయోగపడినప్పుడే ఆ కళకు సార్థకత. మన పూర్వీకుల చరిత్రలు చూస్తే అనాది నుండి ఈ కళలు సామాజిక జీవితాల్లో ప్రముఖ పాత్ర వహించాయనే చెప్పాలి. వైద్యానికి, మానసిక ఉల్లాసానికి, సమాజ అభివృద్ధికి ఎంతో దోహదపడిన కళలు ఇప్పుడు కులమతాల పేరుతో చిచ్చులు పెడుతూ రావణ కాష్ఠంలా రగులుతూనే  ఉన్నాయి. మనందరం ఇలాంటి సంస్కృతిని పోషిస్తున్నందుకు చాలా సిగ్గు పడాల్సిన విషయం.
             అమ్మానాన్న మనకంటూ ఓ గుర్తింపునిస్తారు ఈ సమాజంలో. మన చదువు, మన నడవడి మనకంటూ ఓ వ్యక్తిత్వాన్ని, సంస్కారాన్ని అందిస్తుంది. సమాజ హితానికి సాహిత్యం కాని, కులమతాల కుమ్ములాటలకు కాదు. ఏ మతము పరాయి మతాన్ని దూషించమని చెప్పదు, అవహేళన చేయమని చెప్పదు. విజ్ఞానం వినయాన్నివ్వాలి కాని వివేకాన్ని కోల్పోయేటట్లు చేయకూడదు. ఎవరి కులం, మతం, ప్రాంతీయత వారికి గొప్ప. అభిమానం ఉండటం తప్పు కాదు, విచక్షణ లేకుండా ప్రవర్తించడం చాలా తప్పు. ఆ తప్పుని సమర్థించే వారిది, వారు ఎవరైనా సరే క్షమించరాని నేరం. పిల్లలు తప్పు చేస్తే దండించాల్సిన పెద్దలే ఇలాంటి వారికి కొమ్ము కాస్తుంటే సాహిత్యం సమాజానికి కాస్తయినా మంచి చేయడం అటుంచి విషాన్ని చిమ్మడంలో ప్రముఖ పాత్ర వహిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
          వ్యక్తిగతాన్ని ఎవరమైనా గౌరవించాల్సిందే, అదే సమయంలో వ్యవస్థకు కీడు చేసే ఎలాంటి సాహిత్యమైనా, కళైనా గర్హించదగినదే. అలా చేయనినాడు ఆ తప్పుని సమర్ధించిన ప్రతి ఒక్కరూ శిక్షార్హులే. సమాజ నాశనానికి కారకులే. సాహిత్యకారులకైనా, కళాకారులకైనా ఓ గుర్తింపు వచ్చిన తరువాత వారి బాధ్యత ఈ సమాజంపై మరింత పెరుగుతుంది. మన భారతదేశంలో వాక్ స్వాతంత్ర్యం ఉందని మన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే సరిపోదు. దేశద్రోహుల్ని సైతం గౌరవిస్తున్న సంస్కారం మన భారతీయులది. అలాంటి దేశంలో పుట్టినందుకు మనం గర్వపడాలి కాని, పుట్టిన గడ్డను, సంస్కృతిని అవహేళన చేయడం అన్నది అమ్మని అంగట్లో అమ్మేసినట్లే అని ప్రతి మనిషి గుర్తించాలి. మన చేష్టలతో ఒక వర్గాన్ని ఆకట్టుకోవాలని సాహిత్యాన్ని కాని, కళను కాని ఎంచుకోకూడదు. ఎదుటివారి మనోభావాలను గౌరవించడంలోనే మన సంస్కారం బయటపడుతుంది. కళాకారులు, సాహిత్యకారులు దయచేసి వ్యక్తిగతాన్ని వ్యవస్థకు ఆపాదించకండి. పదిమందికి మార్గ నిర్దేశకులు మీరు. మీ మీదున్న గురుతర బాధ్యతను నెరవేర్చడానికి ప్రయత్నించండి కానీ సమాజంలో విష బీజాలు నాటకండి. తప్పులు సరిదిద్దండి కానీ మరో తప్పు చేయడానికి దోహదపడకండి. సమాజ హితానికి చేయూతనివ్వండి.
చివరిగా ఓ మాట..
తప్పులు అందరు చేస్తారు కాని ఆ తప్పుని ఒప్పుకోవడంలోనే ఆ వ్యక్తి గొప్పదనం బయట పడుతుంది. అది మీకందరికీ ఉండాలని ఆకాంక్షిస్తూ...
ఇప్పటికి ఈ ముచ్చట్లకు సశేషం...
            

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner