25, ఏప్రిల్ 2019, గురువారం

ఏక్ తారలు...!!

1.   ఆశ్రిత పక్షపాతే అక్షరమెప్పుడూ_ఓదార్పు తన ఇంటిపేరంటూ...!!

2.   అక్షరానుబంధం ఆసరా ఇస్తూనే ఉంటుందెప్పుడూ_మనసును పంచుకోవడానికి...!!

3.  టెక్నాలజీ పనితనమిది_చావు పుట్టుకల మాయాదర్పణాన్ని క్షణాల్లో చూపుతూ...!!

4.  అనుబంధం అపహాస్యమైంది_నటనల విశ్వరూపాలను చూస్తూ...!!

5.   మనసు లోగిలి నిండా నీ ఆనవాళ్ళే_వీడని బంధపు జ్ఞాపకాలై మెసలుతూ..!!

6.   కలతై కరుగుతున్న గతం_వెంటాడే వర్తమానాన్ని గుర్తుచేస్తూ...!!

7.  పదాల పరుగు పాతదే_నీ ఊహలతో చేరినందుకే ఇలా కొత్తగా...!!

8.   నిన్ను వెంబడిస్తూనే ఉంది మనసు_గతజన్మ మౌనాలను వెంటేసుకుని...!!

9.   మనసుదెప్పుడూ గెలుపే_నమ్మకానికి అపనమ్మకానికి మధ్యన నలుగుతున్నా..!!

10.   కన్నీరింకని కనులకు చెప్తున్నా_మది లాలింపులో మార్దవంకమ్మని...!!

11.   వెన్నెలకే వర్ణాలన్నీ_మచ్చలేని మనసుకు చీకటి రంగు పులిమేస్తూ....!!

12.  ఒక పుస్తకాన్ని తెరిచి చూసా_మనసాక్షరాలే ప్రతి కాగితంలోనూ....!!

13.   భావ పరిమళాలనెన్ని పంచాయెా_అనుభూతులను ఆవిష్కరిస్తూ...!!

14.   వీడ్కోలెరుగని కలయికే మనది_వేవేల వర్ణాలకు రూపాన్నిస్తూ...!!

15.    బంధానికి భాష్యమక్కరలేదు_అక్కున చేర్చుకునే మనసే దాని ఊపిరి...!!

16.   బదులెలా చెప్పను_ఆనవాళ్ళే ప్రశార్థకమౌతుంటే..!!

17.   చెదరని అభిమానమది_నకిలీల నకళ్ళు బయటబెడుతూ...!!

18.   అంతరాయాలను అధిగమించడమే_పదాల ఆసరాతో నిలదొక్కుకుంటూ...!!

19.   చూపులు చురుకే_నీ జాడ తెలియక చిరునవ్వులే వెలవెలబోతూ...!!

20.   తప్పుకోనంటున్నాయి ఆత్మీయతలు_తడిగుండెకు తోడుగా నిలుస్తూ...!!

21.   సాక్ష్యాలు చెల్లని నోట్లైనాయి_నటిస్తున్న బంధాల నటనల ముందు...!!

22.  కలల సాగరమే జీవితం_అలల ఆటుపోట్లకు తలొగ్గుతూ...!!

23.  మనసంతా ఖాళీనే_పూరించే పూరణలు కరువై..!!

24.    కొన్ని జ్ఞాపకాలంతే_మెురాయిస్తూనే ఉంటాయి వదలిపోలేమంటూ....!!

25.   కొన్ని మనసులంతే_గాయాల బారినుండి బయట పడలేక నలుగుతూ...!!

26.   కూడికలు తీసివేతలు_తప్పనిదే ఈ జీవితం....!!

27.   నువ్వు చేసిన గాయమెుక్కటి చాలు_జన్మజన్మలకు వెంటాడుతూ..!!

28.   మరో నామజపమెలా చేస్తాయి మరి_అక్షరాలను అల్లుకుంది నువ్వయితే..!!

29.    వింతలెప్పుడూ విచిత్రాలే_కాలం కదలికలను సచిత్రాలుగా మలచలేక...!!

30.   కాలమెప్పుడూ ప్రశ్నార్థకమే_శబ్దానికి నిశ్శబ్ధానికి మధ్యన...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner