21, జూన్ 2019, శుక్రవారం

జీవన "మంజూ"ష.. !! ( జూన్)

నేస్తం, 
     కొన్ని జీవితాలింతేనేమో. తాము సంతోషంగా ఉండలేరు, తన అనుకున్నవారిని సంతోష పెట్టలేరు. లేని పెద్దరికాన్ని తమకు తాము ఆపాదించేసుకుంటారు అహంకారానికి గుర్తుగా, కాని బాధ్యతలకు మాత్రం దూరంగా బతికేస్తూ కుటుంబ బాధ్యతలన్ని తామే మోస్తున్నట్టుగా నలుగురిలో చెప్పుకుంటారు. బాధ్యతలకు అక్కరకు రాని పెద్దరికం, హక్కులలో ముందుంటుందనుకుంటా. మనిషి జీవితంలో బాధ, సంతోషం ముఖ్యమైనవి. సంతోషంలో ఉన్నప్పుడు మనచుట్టూ ఎవరున్నా లేకున్నా పర్వాలేదు. అదే బాధలో ఉన్నప్పుడు మన అనుకున్న నలుగురి కోసం వెదుక్కుంటాము, కాని మనం ఎదుటివాళ్ళ కష్టంలో ఎంతవరకు పాలుపంచుకున్నామో గుర్తుకు రాదు ఆ సమయంలో. పెద్దలు చెప్పిన సద్దిమూటను " ఆ ఇల్లు ఈ ఇంటికెంత దూరమో ఈ ఇల్లు కూడా ఆ ఇంటికంతే దూరమని " మర్చిపోతే ఎలా? డబ్బే లోకంగా బతికేస్తూ అనుబంధాలు అవరార్థమే అనుకుంటే మనం పోయిన నాడు కరువయ్యేది కూడా " ఆ నలుగురే " అన్న మాట గుర్తు చేసుకుంటే బంధాలు ఇలా వెలవెలబోయి వెలిసిపోవు.
       కుటుంబంలో పెద్దరికమన్నది పిల్లలు తప్పు చేస్తుంటే సరిదిద్దేదిగా ఉండాలి కాని ఆ పిల్లలే మన తప్పులను ప్రశ్నిచేంతగా, మన ప్రవర్తన ఉండకూడదు. బాధ్యతారాహిత్యం చాలా ప్రమాదకరం. నాలుగు మాటలు నలుగురికి చెప్పేస్తుంటాం కాని ఆ నాలుగు మాటల్లో ఎన్ని మనం పాటించి ఎదుటివారికి చెప్తున్నామని మనల్ని మనం ప్రశ్నించుకోలేం. ఎందుకంటే నిజాన్ని ఒప్పుకునే ధైర్యం మనవద్ద లేదు కనుక. ఎదుటివారిని తప్పు పట్టేముందు మనమెలా వారితో ఉంటున్నామని మన మనస్సాక్షిని అడిగితే అది చెప్పే సమాధానాన్ని ఒప్పుకోగలమా నిజాయితీగా...! మన అవసరాలే వారికి ఉంటాయని, మనకూ వారితో అవసరాలుంటాయని మర్చిపోయి ఏకాకుల్లా బతికేద్దామని నిర్ణయించుకుంటే ఎవరు చేయగలింది ఏమి ఉండదు. కుటుంబ విలువలు నాశనం, తద్వారా సమాజంలో నైతిక విలువల పతనానికి మనమూ ఓ చేయి వేసినవారమౌతున్నాం. మార్పు అనేది మంచికి దారి తీయాలి కాని చెడుకి కాదు అని మన ప్రవర్తన ఋజువు చేయాలి. కుటుంబ హితమే సమాజ హితమని నమ్మిన నాడు సమాజంలో ఓ మంచిపనికి మనమే పునాదిరాయిగా మారతాం. అంతరించి పోతున్న కుటుంబ విలువలు నిలబడాలని కోరుకుందాం. 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner