21, జూన్ 2019, శుక్రవారం

అవార్డుల కబుర్లు...!! జీవన "మంజూ"ష (జులై )....!!

నేస్తం, 
      తెలుగు సాహిత్యంలో ఇప్పుడు నడుస్తున్న చర్చ ఏంటంటే అవార్డులు, బిరుదులు ఎలా తెచ్చుకోవాలి. చాలా బావుంది కదా ఈ చర్చ కూడా.  అసలు అవార్డులు ఎలా వస్తాయి? వాటికీ ఉండాల్సిన అర్హతలు ఏమిటి అని తెలియని వారి కోసం చేసిన చిన్న ప్రయత్నమే ఈ వ్యాసం.
       ఒకప్పుడు రచయితలంటే చాలా గొప్పగా ఉండేది, సినిమా వాళ్ళతో పాటుగా వీళ్లకు కూడా అంతే క్రేజ్ ఉండేది. ఈ అంతర్జాల మాయాజాలం వచ్చాక సాహిత్యం అదీ తెలుగు సాహిత్యం ఎంత వింత పోకడలు పోతోందో మనందరికి తెలియని విషయమేం కాదు. అవార్డుల కోసం అప్పటికప్పుడు పుస్తకం వేసేసి అవార్డులు తెచ్చుకున్న వారు ఇప్పుడు కోకొల్లలు. ఒక అవార్డు రావాలంటే కనీసం ముద్రితమైన పుస్తకం ఒకటి ఉండాలన్న నియమం కూడా ఇప్పుడు లేనట్టుగా ఉంది. అవార్డు కమిటీలో ఎవరో ఒకరు తెలిసుంటే చాలని ఎంతోమంది అవార్డు గ్రహీతల ద్వారా తేటతెల్లం అయ్యింది. మందు పార్టీలు, రాసుకుపూసుకు తిరగడాలు, డబ్బులు వెదజల్లడాలు ఇలా అనేక దారులు మన తెలుగు సాహిత్యంలో తెరుచుకోబడ్డాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.
      ఇక పురస్కారాలు, సన్మానాలు, బిరుదులు వగైరాల కోసం ఏమాత్రం కష్టపడనక్కరలేదు. 1000, 2000 రూపాయల నుండి అందరికి అందుబాటు ధరలలోనే ఉన్నాయి. పక్కన డాక్టరేట్ పెట్టుకోవాలన్నా కూడా ఏమాత్రం శ్రమ పడనక్కరలేదు. ఓ 70, 80 వేలలోనే చాలా చవక ధరలకే తెలుగు సాహిత్యపు మార్కెట్ లో సరసమైన ధరలకే దొరుకుతున్నాయి. ఒక్క రాత్రిలోనే సంచలనాలు సృష్టించాలంటే ఏదో ఒక మతాన్ని హేళన చేస్తూ నాలుగు ముక్కలు రాయడమో, లేదా అంగాంగ వర్ణనలు చేస్తూ పచ్చిగా భావ ప్రకటనా స్వేచ్ఛను ప్రదర్శిస్తే చాలు. కావాల్సినంత పేరు, కీర్తి వచ్చి పడతాయి. వీటితోపాటుగా కేంద్ర సాహిత్య అకాడమి అవార్డులు, అనేక పేరున్న పెద్ద పెద్ద సాహితీ సంస్థల నుండి బిరుదులు, సన్మానాలు కుప్పలుతెప్పలుగా వచ్చి చేరి మీ సాహిత్యానికి వన్నె తెస్తాయి.
        ఇంతకీ సంక్షిప్తంగా అవార్డులు, బిరుదులు కావాలంటే..నే చెప్పోచ్చేదేటంటే పార్టీలు, ఫంక్షన్లు బాగా చేయడంతోపాటుగా పెద్దలకు కాస్త అందుబాటులో ఉంటూ, వాళ్ళ అడుగులకు మడుగులు ఒత్తుతుంటే చాలు. వీటితోపాటుగా డబ్బులు పంచగలిగితే కోరుకున్న అవార్డు, బిరుదు మీ సొంతమే. దీని కోసం కష్టపడి రాయనక్కరలేదు, పుస్తకాలు ముద్రించనక్కరలేదు. మరెందుకాలశ్యం ఎవరికేది కావాలో తెచ్చేసుకోండి. 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner