13, ఆగస్టు 2020, గురువారం

ఊసులాడే ఒక జాబిలట సమీక్ష...!!

                                      "  కాలం అందించిన జ్ఞాపకాల ఊసుల కలం స్నేహ మాధుర్యం.. "

                ఎన్నో పుస్తకాలు చదువుతాం, కాని ఆ పుస్తకం చదివిన అనుభూతి మనసులో కొన్ని కాలాలపాటు వెంటాడటం చాలా అరుదు. అలాంటి ఓ పుస్తకమే " ఊసులాడే ఒక జాబిలట. " నాకు బ్లాగర్ గా నిషిగంధ గారు పరిచయం. కౌముది డాట్ నెట్ లో నా తెలుగు పుస్తకాల వెదుకులాటల్లో దొరికిన ఓ వెన్నెల జలతారే ఈ " ఊసులాడే ఒక జాబిలట. " యదార్థ సంఘటనకు అద్భుతమైన అక్షర రూపం. ఆధునికత మాయలో పడి అందరం యాంత్రికంగా మారిపోతున్న ఈరోజుల్లో, మనం కోల్పోతున్నదేమిటో కాస్త తరచి చూసుకోవడానికి ఓ ఆలోచనను అంకురింపజేసే భావుకత నిండిన స్నేహాన్ని, అది పంచిన అనుభూతులను అత్యంత హృద్యంగా అక్షరీకరించిన నవల " ఊసులాడే ఒక జాబిలట. "

                 " గువ్వల కువకువల సుప్రభాతంతో నిద్ర లేస్తున్న బాలభానుడు అసురసంధ్య అల్లరి తట్టుకోలేక ఎర్రబడ్డ మొహంతో అస్తమిస్తున్న సూర్యుడు.. తొలిపొద్దు మలిపొద్దూ గోరువెచ్చగా, నిన్ను గుర్తు చేస్తే అది నా తప్పు కాదు..!!
కను రెప్పల కింద భాష్యాలకే కాదు కలలకీ చోటు ఉందని.. ఉండాలని..
వాడిన పువ్వు మూగవేదనే కాదు స్వచ్ఛమైన పచ్చదనం సాక్షిగా రేపు విచ్చుకోబోతున్న మొగ్గ తెచ్చే ఆశల వర్ణాలనీ గుండె నిండా నింపుకోవాలనీ..
మిత్రమా! నా నిశ్శబ్దపు ప్రపంచంలో, నా వెతల కలతను దూరం చేస్తూ నువ్వు ఆలపించిన ఆత్మీయతా రాగం గాయత్రీమంత్రమై, నా దోసిలిని నమ్మకాల పూలతో నింపుతూ..
మలయమారుతమై మనసుని కమ్మి..
పదాలే లేని నా బ్రతుకుని శ్లోకంలా మలచుకునేందుకు స్ఫూర్తివైన నువ్వున్న తీరాన్ని నేను చేరగలనా!?
ఒక్కసారి ఒకే ఒక్కసారి.. నిన్ను చూడాలనీ.. నువ్వు నేర్పిన నా బ్రతుకు పాట నీకు వినిపించాలనీ.. అది విని నీ పెదవులపై విరిసిన ఆనందపు నెలవంకను దొంగిలించి దిగంతాల అంచులకి పరిగెట్టి పారిపోవాలనీ..
నేస్తం కళ్ళలో దీపాలు వెలిగించాను. ఇంక నీ నిరీక్షణలో నాకు చీకటైనా పర్వాలేదు!!"

             ఇలా నవల మొదలౌతుంది. ఇదంతా ఎందుకు రాశానంటే ఇందులో ఏ ఒక్క అక్షరమూ వదలడం నాకు ఇష్టం లేదు. అది ఎందుకో చదివిన మీకూ ఈపాటికి అర్థమై ఉంటుంది.  ఈ నవల ప్రత్యేకత కూడా ఇదే. మన తరం  మాత్రమే ఆస్వాదించిన ఉత్తరాల అనుభూతిని మరోసారి మనకు గుర్తు చేస్తూ, ఇప్పటి తరానికి తెలియని ఆ లేఖల మాధుర్యాన్ని పంచిన నవల. ఈ నవల ఆసాంతమూ లేఖలలోనే సాగుతుంది. ఓ వారపత్రికలో కవితకు అభిమాని స్పందించి అభినందిస్తూ రాసిన లేఖతో మొదటి లేఖ ప్రారంభం అవుతుంది. దానికి తిరుగుజవాబు రాకపోతే మరోలేఖలో అది గుర్తు చేస్తూ తాను చదివిన మరో కవిత " వానచినుకు "ను విశ్లేషిస్తూ, చక్కని భావుకత్వాన్ని ఉత్తరంలో నింపేసి, తన కోరికను తెలుపుతూ ఆ కవయిత్రి ఆటోగ్రాఫ్ కావాలని రిప్లై కవరుంచుతూ, దానికి సంజాయిషీ చెప్తూ ఉత్తరాన్ని ముగిస్తుంది తన పేరు మరోసారి గుర్తు చేస్తూ.
            దానికి ఆ కవయిత్రి జవాబిస్తూ ఉత్తరం రాయడంతో వీరిద్దరి కలం స్నేహం మొదలౌతుంది. ఆ ఉత్తరంలో అభిమానికి కృతజ్ఞతలు చెప్తూ, అభిమాని చేతి రాతలోని ప్రత్యేకతను చెప్పడం, తాను అమ్మాయి కాదని అబ్బాయినని, కలం పేరుతో రాస్తుంటానని చెప్తూ, నిజం తెలిసాక కొందరు దూరం అవుతారని, కొందరు ఏం మాట్లాడక ఉండిపోతారని, మరి మీరు ఏ కోవకి చెందుతారని అడుగుతూ ముగిస్తారు కవిగారు తన మొదటి ఉత్తరాన్ని. తాను అభిమానించే కవి నుండి తనకు అందిన ఉత్తరాన్ని చింపడానికి పడిన ఉద్విగ్నతను, అది చదివిన తరువాత తన భావాలను పంచుకోవడంతో కవికి, అభిమానికి మధ్యన ఉత్తరాల స్నేహం కొనసాగటం, స్నేహానికి ఆడ, మగ తేడా లేదని నిరూపిస్తూ వీరిరువురి స్నేహం ఉత్తరాల్లోనే సాగుతుంది ఒకరిని ఒకరు చూసుకోకుండానే.
          ఎన్నో విషయాలు, కుటుంబ విషయాలు, అభిప్రాయాలు, అభిరుచులు, సమాజ పరిస్థితులు, చుట్టూ ఉన్న పరిచయస్తుల పరిచయాలు ఇలా ప్రతి చిన్న విషయాన్నీ ఇద్దరు తమ తమ ఉత్తరాల్లో పంచుకుంటూ మనల్ని కూడా ఆ స్నేహానుభూతుల ప్రపంచంలో విహరింపజేస్తారు. అభిమాని తాను పనిచేసే స్కూలు, పిల్లల, ఉపాధ్యాయుల కబుర్లు చెప్తూ, తనకున్న కోరిక కూడా పంచుకుంటుంది. పై చదువులు చదవాలనుకున్న తన ఇష్టాన్ని కాదనే అమ్మమ్మని ఒప్పించడానికి చేసే ప్రయత్నాలు, ఉత్తరం రాసేటప్పుడు చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను తన ఊహలను ఉసులుగా చెప్పడం, ఉత్తరాల్లోనే కుటుంబ పరిచయాల కార్యక్రమాలు, వ్యక్తుల పరిచయాలు, తమ చుట్టూ జరుగుతున్న సంఘటనలను ఇద్దరు ఒకరితో ఒకరు పంచుకుంటారు. పెళ్ళంటే విముఖత ఉన్న అభిమాని ఏ పరిస్థితుల్లో ఇంట్లో వాళ్ళను కాదని పెళ్ళి చేసుకోవాల్సి వచ్చిందో, ఆ తరువాతి సంఘటనలు ఇలా ఆ ఇరువురి ఉత్తరాలతోపాటు మరికొందరి ఉత్తరాలు కూడా చోటు చేసుకుంటాయి ఈ నవలలో.
          ఇద్దరు ఆడ మగ అపరిచితులు ఉత్తరాల్లో పరిచయం కావడం, అదే విడలేని స్నేహబంధం కావడం, ఒకరినొకరు అభిమానించుకుంటూ, అభిప్రాయాలు గౌరవించుకుంటూ, సలహాలు తీసుకుంటూ సాగడం, చివరి వరకు ఒకరినొకరు ప్రత్యక్షంగా చూసుకోలేక పోవడం అనేది చాలా అరుదైన స్నేహం. ఇలా చెప్పుకుంటూపోతే నవలను మించిపోతుంది నా సమీక్ష. చదవడం మొదలుపెడితే ఒక్క అక్షరం కూడా వదలకుండా చదివించే పుస్తకం ఇది. నేను చదివి పది సంవత్సరాలు దాటినా నన్ను ఇప్పటికీ వెంటాడే పుస్తకం " ఊసులాడే ఒక జాబిలట ." నవల ముగింపు చదివిన తరువాత ఓ కన్నీటి చుక్క మీ చెక్కిలిని స్పృశించక మానదు. ఇంత హృద్యంగా వాస్తవ సంఘటనను అక్షరీకరించిన నిషిగంధ గారికి, ఆమెతో రాయించిన కిరణ్ ప్రభ గారికి ఇద్దరికీ ప్రత్యేక అభినందనలు.

పుస్తకం లింక్... 

http://www.koumudi.net/books/usulade_jabilata_koumudi_novel.pdf
     

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner