9, జనవరి 2020, గురువారం

జీవన 'మంజూ'ష (జనవరి2020)

నేస్తం,
     హింస మానసికమైనా, శారీరకమైనా ఫలితం మాత్రం మరణమే అవుతోంది. ఆ మరణం బలవన్మరణం కావడానికి వ్యవస్థ, వ్యవస్థలోని మనం ఎంత వరకు కారణమన్నది ఆలోచించాలి. ఒంటరితనం, ఆర్థిక అవసరాలు, అధికారిక వేధింపులు, ప్రేమ వైఫల్యాలు, కోపతాపాలు ఇలాంటి మరెన్నో కారణాలు పేదా గొప్ప తేడా లేకుండా ఆత్మహత్యలకు కారణాలవుతున్నాయి. క్షణాల నిర్ణయాలు ఎన్నో జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. అధికార దాహం, ఆర్థిక అవసరాలు, కులమత విభేదాల వంటి సవాలక్ష కారణాలు హత్యలకు కారణాలౌతూ ఎన్నో ప్రాణాలను అవలీలగా తీసేస్తున్నాయి. లింగ వివక్ష భ్రూణ హత్యలకు మరో కారణం.
        పైశాచిక, పాశవిక హత్యలకు ఎన్ కౌంటర్లు సమాధానం కాదు, తాత్కాలిక ఊరట మాత్రమే. ఈ ఎన్ కౌంటర్లు హైలీ రెస్పెక్టెడ్ దోషులకు మినహాయింపుగా ఉన్నాయి. చట్టం దృష్టిలో అందరు సమానమయినప్పుడే సమ న్యాయం జరుగుతుంది సామాన్యులకు. సమస్య మూలాలను నాశనం చేయగలిగినప్పుడే వ్యవస్థలో నేరాలు తగ్గుతాయి. తప్పు చేయాలంటే చట్టం వేసే శిక్ష ముందు గుర్తు రావాలి. చట్టం, న్యాయం అధికారానికి తలొగ్గినప్పుడు సామాన్యులకు న్యాయం అందని ద్రాక్షే అవుతుంది.
      చనిపోవడానికి కావాల్సిన ధైర్యంలో ఓ వంతు ధైర్యం చాలు దివ్యంగా బతికేయడానికి. సమస్య జీవితకాలం మన జీవితకాలంతో పోల్చుకుంటే చాలా చిన్నది. సమస్యలు వస్తూపోతూ ఉంటాయి. క్షణికావేశంలో తీసుకునే ఈ ఆత్మహత్యల నిర్ణయాల వలన ఎన్ని అవమానాలు కుటుంబానికి ఎదురౌతాయెా అని ఓ క్షణం ఆలోచిస్తే ఈ నిర్ణయం తీసుకోరు. సమస్యను అధిగమించడానికి చావు పరిష్కారమనుకుంటే ఈ ప్రపంచంలో మనిషి మనుగడే ఉండకూడదు. ఏ సమస్యా లేని మనిషి ఒక్కడు కూడా ఉండడు. సమస్యకు భయపడుతూ బతకకూడదు. సమస్యను భయపెడుతూ బతకాలి.
      చావు పుట్టుకలు సహజం. అలాగే మనిషన్నాక ప్రతి వారికి సమస్యలూ సహజమే. సమస్యను అధిగమించడానికి ప్రయత్నించాలి కాని చావు పరిష్కారమని మన తరువాతి తరాలను తప్పు దోవ పట్టించకూడదు. చావు సహజ మరణం కావాలి కాని కారణమేదైనా బలవన్మరణం కాకూడదు.  మరో మనిషికి బతకడానికి ఆదర్శం కావాలి మన జీవితం. అంతేకాని అర్ధాంతర ముగింపుకి అంకురం కాకూడదు. గొప్పదనం చావుతో రాదు. బతకడంలో వస్తుంది. బతికించడంలో వస్తుంది...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner