6, మార్చి 2020, శుక్రవారం

నా రాతల గురించి అబ్దుల్ రజాహుస్సేన్ మాస్టారి విశ్లేషణ..!!

కౌంట్ డౌన్..29

(అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.)

ఆమె ఎల్లలు తెలియని ఏకాంతవాసి, ...ఆమె అక్షరాలు ‘ ఆకాశ విహంగాలు ‘  !!

మంజు యనమదల కవిత్వం...విహంగావలోకన‌!!

ఆమె….అక్షరాల “ఏకంత వాసి . ఆమె అక్షరాలు ఆకాశ విహంగాలు. అందుకేనేమో?
తను “ రెక్కలు “  తొడుక్కని విహంగమై..సాహితీ గగనంలో ఎగురుతుంటుంది.
పేరు..మంజు యనమదల.ఇంజినీరు పట్టభద్రురాలు. కవిత్వం ప్రవృత్తి.తన గురించి,
తన కవిత్వం గురించి ఆమె మాటల్లోనే వినండి.

“నేను స్వేచ్ఛాజీవిని
నిత్య సంచారిని
నిరంతరాన్వేషిని

అడ్డుకట్టలు
ఆనకట్టలు
అసలాపలేవు

బంధాల
అనుబంధాల
ముసుగులు మెాసగించలేవు

ఏతావాతా 
ఎల్లలు తెలియని
ఏకాంతవాసిని

అందుకే
నా అక్షరాలు
ఆకాశ విహంగాలు...!!

తను విహంగంలా.. స్వేచ్ఛాజీవి..సాహితీ గగనంలో నిత్య సంచారిణి.కవిత్వ రహస్యాల 
నిరంతరాన్వేషి .ఆమె స్వేచ్ఛకు,ఇచ్ఛకు అడ్డుకట్టలు,ఆనకట్టలు అసలాపలేవు. బంధాల,
అనుబంధాల ముసుగులో  మోసగించలేవు.ఏతావాతా.! ఆమె ‘ ఎల్లలు లేని ఏకాంత వాసి ‘,
ఆమె అక్షరాలు ఆకాశ విహంగాలు. అయితే చూపు మాత్రం నేలపైనే.ఆమె కవిత్వానికి నేల
విడిచి సాము చేయడం తెలీదు మరి.!

ఆమె ఆలోచనలు క్రిస్టల్ క్లియర్ గా వుంటాయి.ముసుగులో గుద్దులాట లేదు.ఉన్నదేదో కుండ
బద్దలు కొట్టినట్లు చెప్పడం ఆమె అక్షరాలకు అలవాటైపోయింది.ఆమె కవిత్వానికి  ఈ ముక్కు 
సూటి తత్వం ,నిక్కచ్చితనం సహజాలంకారాలు.

ఈ కింది కవిత చదవండి..విషయం మీకే తెలుస్తుంది.!

*వెలి వేయమంటున్నా.,”..కవిత !!

“అక్కరకు రాని అనుబంధాలను
వద్దనుకుంటున్నా

గతమే మరచిన మనుషులకు
జ్ఞాపకాలే లేవంటున్నా 

నాటకీయతే జీవితమనునే వాళ్ళను
నచ్చలేదంటున్నా

స్నేహం ముసుగేసుకున్న మెుసళ్ళను
చీదరించుకుంటున్నా

పిలుపుకు పలుకుకు తేడా తెలియని జీవాలకు
జీవించే అర్హత లేదంటున్నా

మంచిలో చెడు వెతికే నైజాలకు
సూక్తిసుధలు చెప్పే నైతికతెక్కడిదంటున్నా

వ్యక్తిత్వ హీనులకు
వ్యక్తిగతమే ఉండదంటున్నా

సమాధానం చెప్పలేని బతుకులకు
ప్రశ్నించే హక్కు ఎక్కడిదంటున్నా

బాధ్యత లేని బంధాలకు
కుటుంబమెందుకని వెలి వేయమంటున్నా.” !!

అక్కరకు రాని అనుబంధాలను ఆమె మెళ్ళో వేసుకోదు. వద్దని వదిలించుకోడానికీ వెనుకాడదు.
గతం మరిచి వ్యవహరించే మనుషులంటే ఆమెకు ఒళ్ళుమంట.అటువంటి వారికి ఇంకా..జ్ఞాపకాలు
ఏముంటాయన్నది ఆమె ప్రశ్న? నాటకీయతే జీవితంలా గడిపే వాళ్ళంటే ఆమెకు అస్సలు నచ్చదు.
స్నేహం ముసుగేసుకునే మొసళ్ళంటే ఆమెకు చీదర. కమ్మని పిలుపుకు , కఠినమైన పలుకుకు తేడా
తెలియని వారికి జీవించే హక్కు లేదన్నది ఆమె నిశ్చితార్థం.‌మనుషుల చేతల్లో,పనుల్లోమంచీ చెడు
వెతికేవారికి సూక్తిసుధలు చెప్పే నైతికత ఎక్కడుంటుంది? వ్యక్తిత్వ హీనులకు వ్యక్తిగతమేముంటుంది?
అసలు సమాధానం చెప్పలేని బతుకులకు ఎదుటి వారిని ప్రశ్నించే హక్కు ఎక్కడిది? అన్నది మంజు
అభిప్రాయం.బాధ్యత లేని బంధాలకు కుటుంబం ఎందుకు? వెలేసతేపోలా? అంటుంది.
ఓ కవికి జీవితం పట్ల ఇంత స్పష్టమైన అవగాహన వుండటం బహుఅరుదు.

మంజు ఎనమదల కు అమ్మంటే ఎంతిష్టమో? మాటల్లో చెప్పలేం.
అదేదో ఆమె మాటల్లోనే‌ విందాం..!

*అమ్మంటే..!!

“అమ్మ బొజ్జలో హాయిగా ఉందని
ఓ నెల ఎక్కువున్నా విసుక్కోకుండా
పదిలంగా పాపాయిని హత్తుకుంది

పట్టుకోవడానికి సన్నగా ఉండి చేతికి అమరకున్నా
అపురూపంగా చూసుకుంటూ
కాకిపిల్ల కాకికి ముద్దంటూ ముద్దు చేసింది

అమ్మ చేతి మహిమనుకుంటా
గొంగళిపురుగును సీతాకోకచిలుకలా మలచడంలో
విధాతకే సవాలు విసిరింది

ఆకలిని తెలియనీయలేదు
అల్లరినీ భరించింది ఆనందాన్ని పంచింది
ఆటలన్నీ ఆడిస్తూ జోలపాటలు పాడి నిదురపుచ్చింది

కలలో కలత భయపెడితే
దగ్గరకు తీసుకుని ధైర్యానిచ్చి
ఆదమరిపించే అమ్మ చేయి నాదయ్యింది

అక్షరాలు దిద్దిస్తూ పుస్తకాలు తాను చదువుతూ
కథలన్నీ వినిపిస్తూనే కమ్మని తాయిలాలందించి
బడికి సాగనంపి బంగరుబాట పరిచింది

బిడ్డ మీద ఈగ వాలనీయదు తల్లి
బతుకు పయనంలో బాసటగా నిలుస్తూ
నా జీవితమే తానైంది అమ్మ

ఎంత చెప్పినా 
ఇంకా ఏదో మిగిలిపోయినట్లున్న
మహా కావ్యమే అమ్మంటే..” !!

అమ్మ గురించి టన్నులకొద్దీ కవిత్వం వచ్చింది. ఇప్పుడీమె కొత్తగా చెప్పేదేముంది? అన
అనిపించవచ్చు. అమ్మ ప్రేమ హిమనగమంత . ఎంత పంచినా తరగదు ..అలాగే అమ్మ 
గురించి ఎంతమంది ఎంత రాసినా కూడా రాయడానికి ఇంకా మిగిలే వుంటుంది.ఆత్మా
శ్రయమా? అన్నట్లు మంజు రాసిన ఈ కవిత మనసుకు హత్తుకుంటుంది.

నవమాసాల్లో అమ్మకడుపునుండి బిడ్డ బయటకు రావడం సహజం.కానీ ..అమ్మ కడుపులో
హాయిగా వుందనీ,ఏ బాదరాబందీ లేదని ఆమె ఓ నెల ఎక్కువగానె వుందట.అయినా... అమ్మ 
విసుక్కోలేదు.సరికదా పదినెలలకు బయటకు వచ్చినా ప్రేమగా ఎత్తుకొని 💓 గుండెకు హత్తు
కుంది.పుట్టుకలో సన్నగా,పీలగా  వుండి,చేతుల్లో పట్టుకోడానికే రానప్పుడు కూడా తనను  అపు
రూపంగాచూసుకుంది.కాకిపిల్ల కాకికి ముద్దయితే..తన పిల్ల తనకు ముద్దురాదా ఏమిటి? 
అందుకే  ప్రేమతో ముద్దుపెట్టుకుంది.ముద్దు చేసింది.

అమ్మ చేతి మహిమ..రోజులు తిరక్కుండానే తనుళ ఆరోగ్యంగా,పుష్టిగా తయారైంది.గొంగళి 
పురుగును సీతాకోక చిలుకగా మార్చడంలో ఆ దేవుడికి ఏదైనా ఇబ్బంది వుంటుందేమో కానీ..
పేగు తెంచుకు పుట్టిన బిడ్డ విషయంలో అమ్మ ఏమాత్రం తక్కువ చేయదని  రుజువు చేసింది.
ఓ రకంగా ఆ దేవుడిక్కూడా ఆమె సవాలు విసిరింది.

అమ్మంటే అక్షయపాత్ర.బిడ్డకు ఆకలి తెలీనివ్వలేదు.భూదేవంత సహనంతో తన అల్లరినీ సహించింది.
భరించింది.ఆనందాన్ని పంచింది.తనకు తెలిసిన ఆటలన్నీ ఆడిస్తూ..జోలపాట పాడి నిద్రబుచ్చింది.

కలత నిద్దట్లో  భయపడితే తనను దగ్గరకు తీసుకొని ధైర్యాన్నిచ్చింది.ఆదమరిపించే అమ్మ చేయి 
తనదైంది.అక్షరాలు దిద్దించింది.పుస్తకాలు చదువుతూ..తనకు కథలు వినిపించింది.
కమ్మని తాయిలాలందించి,బడికి సాగనంపి 
తనకు బంగారు బాట పరిచింది.భవోష్యత్తుకు మార్గదర్శకమైంది.

బిడ్డమీద ఈగను కూడా వాలనీయదు తల్లి.అమ్మ ప్రేమంటే అదే.బతుకు పయనంలో చేయిపట్టుకొని
బాసటగా నిలిచింది.తానున్నానన్న భరోసా ఇచ్చింది.తన జీవితమే తానైంది .

అమ్మ గురించి ఎంత చెప్పినా..ఇంకా ఏదో ...మిగిలిపోయే మహాకావ్యమే అమ్మ.చదవగలిగే ఓపిక,
అర్థం చేసుకునే విజ్ఞతవుండాలే కానీ...
అమ్మ విలువైన ఓ పాత సందూకు పెట్టె.
అనుభవాల కాసారం.మమ
కారానికి ఆకారం.ప్రేమకు ఓంకారం. 
త్యాగానికి శ్రీకారం.

అమ్మంటే..అమ్మే..అమ్మకు నిర్వచనం లేదు.
లోకంలో దేనికైనా ప్రత్యామ్నాయం వుండొచ్చు.కానీ
అమ్మకు మాత్రం ప్రత్యామ్నాయం లేదు.

*ఆకాశం 
చేతికి అందదు
సముద్రానికి 
ఆవలి తీరం తెలియదు

మనసు గుట్టు
విప్పలేము...!! అంటూనే …,తన మనసు గుట్టును విప్పి చెప్పారు మంజు యనమదల.!!
మంజు గారి ”రెక్కలు “ బాగా రాస్తున్నారు.మరెప్పుడైనా ఆ “ రెక్కలు “ గురించి తెలుసుకుందాం.!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

చక్కగా విశ్లేషించారు మీ మాస్టారు అబ్దుల్ రజా హుస్సేన్ గారు.

వారు ప్రస్తావించిన “రెక్కలు” అనే కవితలు మీ బ్లాగులో ఆల్రెడీ పోస్ట్ చేశారా?

చెప్పాలంటే...... చెప్పారు...

రెక్కలు అని ఉంటుందండి బ్గాగులో..
30 వరకు ఉంటాయి ఓక్కో దానిలో

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner