30, జూన్ 2020, మంగళవారం

భూతల స్వర్గమేనా...16

పార్ట్... 16
             అనోన్య స్కూల్ లో నోటీస్ బోర్డ్ మీద ఓ స్లోగన్ రాసుండేది. అది నాకు బాగా నచ్చింది కూడా... 
" No one can do everything 
   But Every men can do something "...నిజమే కదా  ఇది. 

         రోజులు గడిచిపోతున్నాయి మామూలుగానే. నాకు పిల్లల పని, అప్పుడప్పుడు వంట, ఫోన్లు ఇలా జరిగిపోతోంది. డాక్టర్ గారు మూడ్ బావుంటే బానే ఉండేవారు, లేదంటే అప్పుడప్పుడూ ఏదోకటి అనేవారు. నా టైమ్ బాలేదులే అని సరిపెట్టుకునేదాన్ని.  ఓ రోజు డాక్టర్ గారికి వాళ్ళాయన ఫోన్ చేస్తే, ఆవిడ తీయలేదు. అందుకని ఇంటికి చేసారు. నేను ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాను. ఇక ఆ సాయంత్రం డాక్టర్ గారు నన్ను ఫోన్ ఎక్కువ వాడవద్దని చెప్పారు. నాకు వేరే ఫోన్ లేదు. ఆరోజు చాలా బాధనిపించింది. నాకేదయినా బాధనిపిస్తే పుస్తకంలో రాసుకునేదాన్ని అప్పుడు. పెళ్ళైనప్పటి నుండి ఇలా ఎవరితో ఒకరితో మాటలు పడాల్సి వస్తోందని దిగులు వేసింది. నాకంటూ ఏమి లేకపోబట్టే కదా ఇలా జరుగుతోందనిపించింది. ఇలా బాధ పడిన క్షణాలెన్నో. ఉమకి విషయం చెప్పాను. నాకు చెప్పకుండానే ఉమ సెల్ ఫోన్ బుక్ చేసింది. అది వచ్చే ముందు చెప్పింది.  మెుత్తానికి నా మెుదటి సెల్ ఫోన్ రావడమూ, దానిని యాక్టివేట్ చేయడమూ జరిగిపోయింది. స్ప్రింట్ నెట్ వర్క్ అన్నమాట. అప్పటి నుండి అమెరికా వదలి వచ్చే వరకు అదే నెట్ వర్క్ వాడాను. 
       నా H1B అమెరికన్ సొల్యూషన్స్ ఫైల్ చేయడము, LIN నెంబర్ రావడమూ జరిగింది. ఓ రోజు సుబ్బరాజు ఇందుకూరి కాల్ చేసి 3వీక్స్ జాబ్ ఉంది. వెంటనే జాయిన్ కావాలి వెళతారా అన్నారు. మరి డాక్టర్ గారు నేను సడన్ గా వెళిపోతే ఇబ్బంది పడతారు కదా, అదీనూ 3 వారాలే అంటున్నారు, మీ ఇష్టం వెళ్ళమంటే వెళతాను అన్నాను. ఏ విషయం మళ్ళీ ఫోన్ చేస్తానన్నారు. ఇదంతా డాక్టర్ గారు ఇంట్లో ఉన్నప్పుడే జరిగింది. మరుసటి రోజు సుబ్బరాజు ఫోన్ చేసి మరేదైనా జాబ్ చూద్దాంలెండి అన్నారు. అప్పటి నుండి డాక్టర్ గారు బావుండేవారు నాతో. నాకు ఫోటోలు తీయడం, అందరివి కలక్ట్ చేయడం బాగా ఇష్టం చిన్నప్పటి నుండి. అమెరికా వచ్చాక కెమేరా కొనలేదు. పిట్స్ బర్గ్ వచ్చాక 10 డాలర్లకు కెమేరా షాప్ లో చూసి, అది కొన్నాను. దానితో నాకు వచ్చినట్టు ఫోటోలు తీసేదాన్ని. 
            మధ్యలో క్రిస్మస్ కి హాలిడేస్ వచ్చాయి. డాక్టర్ గారి హజ్బెండ్ పిట్స్ బర్గ్ వస్తానన్నారు. డాక్టర్ గారికి కూడా శలవలే. బాల్టిమెార్ లో ఉండే శిరీష వాళ్ళు డెల్లాస్ వెళిపోయారు. తనేమెా వాళ్ళింటికి రమ్మని, నా ఫ్రెండ్ వెంకట రమణ కాలిఫోర్నియా రమ్మంటే, డాక్టర్ గారు వెళ్ళిరా ఓ 4,5 రోజులు, నేను చూసుకుంటాను పిల్లలని, ప్రసాద్ కూడా వస్తారు కదా  అన్నారు. సరేనని రానుపోనూ ఫ్లైట్ టికెట్ రమణతో బుక్ చేయించుకున్నా నా డబ్బులతోనే. శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ పోర్ట్ కి. మెర్సీ గారి హజ్బెండ్ నన్ను ఎయిర్ పోర్ట్ లో డ్రాప్ చేస్తూ, పాస్ పోర్ట్ బయటకు తీయకండి, స్టేటస్ ఇబ్బంది అవుతుందేమెా, డ్రైవర్ లైసెన్స్ ఇవ్వండి ఐడిప్రూఫ్ కి అంటే లైసెన్స్ లేదండి, స్టేట్ ఐడి ఉంది అంటే, అది చూపించండి చాలు అన్నారు. మెుత్తానికి శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ పోర్ట్ లో దిగాను. లగేజ్ తీసుకుంటుంటే వెంకట రమణ ఫోన్, ఎక్కడ ఉన్నావని, నన్ను చూడలేదు కదా గుర్తు పట్టడానికి. చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు. నా ఫ్రెండ్ శోభ, అబ్బు కూడా కాలిఫోర్నియాలోనే ఉన్నారు. వాళ్ళకు ఫోన్ చేసాను. అబ్బు వాళ్ళ అన్నయ్య వాళ్ళింట్లో ఉంటున్నాడు. రమణ వాళ్ళింటికి దగ్గరలోనే. తోలు ఓ రోజు భోజనానికి కూడా వెళ్ళాం. శోభ వచ్చి వాళ్ళింటికి తీసుకువెళ్ళింది. బోలెడు మా కాలేజ్  కబుర్లు చెప్పుకుని, హైదరాబాదులోని శ్రీదేవికి ఫోన్ చేసాము. ఇద్దరం మాట్లాడుతుంటే తనకి నేను అమెరికాలో ఉన్నానా అని డౌట్. నువ్వు కూడా అమెరికా వెళ్ళావా అంది. ఏం వెళ్ళననుకున్నావాఅన్నాను. అలా కాసేపు తనని ఏడిపించాం. నన్ను షాప్ కి తీసుకువెళ్ళి, నా ఫోటో పిచ్చి తెలుసు కనుక, నాకు ఓ ఆల్బం కొనిపెట్టి, మళ్ళీ రమణ వాళ్ళింట్లో వదిలేసింది. వాళ్ళు ముగ్గురు రూమ్మేట్స్. ఇద్జరు తెలుగు, మరొకరు కన్నడ. నాకు కన్నడ వచ్చుగా, చాలా రోజుల తర్వాత కన్నడ మాట్లాడాను ఈ రూపంగా. మెుత్తానికి పుస్తకాల్లో చదివిన గోల్డెన్ గేట్ చూడటం ఓ థ్రిల్. పోర్ట్ కూడా చూసాను. వెస్ట్ సముద్రం వర్షంలో చూడటమెా మంచి అనుభూతి. మెుత్తానికి కాలిఫోర్నియా ట్రిప్ బాగా జరిగింది నా కెమేరాతో ఫోటోలు తీసుకోవడంతో సహా. 
         అలా ఓ ఆరు నెలలు పిట్స్ బర్గ్ లో గడిచిపోయాయి. ఆ టైమ్ లోనే ఓ అమెరికన్ లాయర్ తో చికాగో బాబ్ గురించి మాట్లాడాను. బాబ్ కి మెయిల్ కూడా పెట్టాను. నాకు బాకీ ఏది ఉంచుకోవడం ఇష్టం ఉండదు. కుక్కకయినా జాబ్ వస్తుంది, నాకు రాదన్నాడు కదా, డాలర్ కూడా ఇవ్వనన్నాడు. అది గుర్తు చేస్తూ, అవును కుక్కకి వస్తుంది, నాకు వస్తుంది జాబ్. కాని నీకు రాదు అని వాడికి మెయిల్ పెట్టాను. వినయ్ గుమ్మడి గారు ఫోన్ చేసి HNC బాబ్ మీద కేస్ ఫైల్ చేద్దామన్నారు. అనవసరమండి అంటే కాదు ఇద్దరం కలిపి వేద్దామన్నారు. 1500 డాలర్లు పంపండి, నేను తర్వాత ఇస్తాను లెక్కలు చూసి అన్నారు. సరేనని పంపించాను. లాయర్ బాబ్ కి నోటీస్ పంపాడు. లాయర్ తో కపుల్ఆఫ్ డాలర్స్ ఇస్తాను సరి చేయమన్నాడట. నవ్వుకున్నా.. నాకు రావాల్సినవి ఇమ్మనండి చాలన్నాను. మన లాయర్సే కాదు అక్కడి లాయర్స్ కూడా అంతే. వినయ్ గారు కొన్ని రోజులు ఫాలోఅప్ చేసి, లాయర్ కి తలో 2,3 వేల డాలర్లు సమర్పించి, బాబ్ మాకు ఇవ్వాల్సిన వాటికి ఇవి మేం కట్టిన వడ్డీ అని సరిపెట్టేసుకుని ఓ దణ్ణం పెట్టి వదిలేసాం. తర్వాత నా పుట్టినరోజుకి డాక్టర్ గారు పట్టుచీర, కేక్ కట్ చేయించారు. మెర్సీ గారు కూడా వచ్చారు. 
         ఇంతలో నాకు H1B కి డబ్బులు కట్టిన రామస్వామి యనమదల గారికి మనుషులు కావాల్సివచ్చారు. మా ఆయన ఫోన్ లో చికాగో రామస్వామి గారి దగ్గరకు వెళ్ళు, అన్ని వాళ్ళు చూసుకుంటారని చెప్పాడు. ఫోన్ చేసి మాట్లాడితే వచ్చేయమన్నారు. ఓ వారం, పది రోజులు టైమ్ కావాలని చెప్పాను. డాక్టర్ గారికి మరో మనిషి దొరికి ఆమెకు పిల్లలను, పనిని అలవాటు చేసి, చికాగో బయలుదేరాను. అనోన్య బాగా ఏడిచింది, నాకూ బాధనిపించింది. నేను వెళిపోతున్నానని డాక్టర్ గారి ఫ్రెండ్ మెర్సీ వాళ్ళు వచ్చి నాకో 25 డాలర్లు కూడా ఇచ్చారు. అభీని స్కూల్లో దించేటప్పుడు నాకో అమెరికన్ మంచి ఫ్రెండ్ అయ్యిందని చెప్పాను కదా. తను ఓసారి ఇంటికి కూడా వచ్చింది, నన్ను డ్రాప్ చేయడానికి. చికాగో వెళడానికి బస్ టికెట్ తీసుకున్నా. నన్ను డ్రాప్ చేయడానికి అమెరికన్ ఫ్రెండ్ వస్తానంది. తనకి నేను కొన్న కెమేరా ఇచ్చేసాను అప్పటికే. తను వాళ్ళింటికి తీసుకువెళ్ళి డిన్నర్ పెట్టి, బస్ స్టేషన్ లో బస్ ఎక్కించి, జాగ్రత్తలు చెప్పి,గిఫ్ట్ ఇచ్చింది. అది 35 డాలర్స్ గిఫ్ట్ కార్డ్. వద్దంటే వినలేదు. మరోసారి చికాగో బయలుదేరాను బస్ లో. 

మళ్ళీ కలుద్దాం... 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner