10, జులై 2020, శుక్రవారం

కాలం వెంబడి కలం...9

       మాకు సెకెండ్ ఇయర్ లో ఫోట్రాన్ లాబ్ ఉండేది. ఎప్పుడో ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో మా అంబా రమణ గారి పుణ్యమా అని ఓరోజు మా MPC బాచ్ అందరిని వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి తీసుకువెళ్ళి కంప్యూటర్ చూపించారు. మనం తప్పు చేస్తే మెుమాటం లేకుండా తిట్టేస్తుంది మేడం అంటే మేడంతోపాటు అందరూ నవ్వేసారు. 1986 లో చూసిన కంప్యూటర్ మళ్ళీ 1990 లో చూసాను. కంప్యూటర్ లాబ్ కి వెళ్ళే మెుదటిరోజు బోలెడు ఎగ్జైట్మెంట్. లాబ్ బయట చెప్పులు వదిలేసి లోపలికి వెళ్ళడం, లోపల AC తో ఉన్న చిన్న పెట్టెలోనికి వెళ్ళినట్టనిపించింది. మాకు ముగ్గురికి కలిపి ఒక సిస్టమ్ ఇచ్చారు. నాతో ఉన్న వాళ్ళిద్దరు ఫస్ట్ ఇయర్ లో మెుదట మా నాన్న పరిచయం చేసిన అమ్మాయిలు శ్యామల, వాణిశ్రీ అన్నమాట. ఫ్లాపీ కొనుక్కోవడం, దానిని సిస్టమ్ లో ఇన్సర్ట్ చేయడం, ఫైల్ కి పేరు పెట్టుకోవడం సరదాగా అనిపించింది. నవ్య, కావ్య అని పెడదామంటే వాణిశ్రీ అలా వద్దు ఫైల్ పేరు మన ప్రోగ్రామ్ తెలిసేదిగా ఉండాలంది. సరే అని ఊరుకున్నా. ఫ్లో చార్ట్ గీయడం వరకు పర్లేదు, ఏంటో ప్రోగ్రామ్ రాయాలంటే లాజిక్ తెలియాలని అనడం అర్థం అయ్యేది కాదు అప్పట్లో. ఇన్ పుట్ ఇచ్చి, అవుట్ పుట్ రిజల్ట్ రావాలని, సిస్టమ్ కమాండ్ లు తెలుసుకోవడం ఇలా అప్పుడప్పుడూ అరుదుగా దొరికే కంప్యూటర్ తో ఆడుకోవడం భలే బావుండేది.ఫైనల్ ఎగ్జామ్స్ లో ఫోట్రాన్ లాబ్ ఉంది మాకు. థియరీ ఎగ్జామ్స్ లో ECT ఎగ్జామ్ రోజు నేను మెయిన్ ఆన్సర్ షీట్ మెుత్తం నింపేసాను. ఎడిషనల్ తీసుకున్నాను. నా ముందు కూర్చున్న మెాహన్ వెనక్కి తిరిగి అన్ని రాశావా అంటే రాస్తున్నా అన్నాను. సరే నీ మెయిన్ షీట్ ఇవ్వు అన్నాడు. కాస్త భయం వేసింది. 
       చిన్నప్పుడు అడిగిన వాళ్ళకి ఆన్సర్లు చూపించడం, చెప్పడం, లేదా వాళ్ళ పేపర్ తీసుకుని రాసివ్వడం అలవాటు. అలా ఓసారి హింది పేపర్ మెుత్తం మా జూనియర్ కి రాసిచ్చేసాను. జాగ్రత్తగా ఓ 80 మార్కులకే రాసిచ్చాను. కాని మన రైటింగ్ హింది టీచర్ కి తెలుసు కదా, ఆ అమ్మాయికి అంత బాగా రాదని తెలుసు, ఎవరు రాసిచ్చారు చెప్పు అంటే, ఆ అమ్మాయి చెప్పకపోతే మంజు రాసిచ్చింది కదా నిజం చెప్పు అంటే ఆ పిల్ల స్వాతి భయంతో చెప్పేసింది. తర్వాత క్లాస్ లో తిట్లు, మా ఇంటికి వచ్చినప్పుడు అమ్మావాళ్ళకు నా మీద కంప్లయింట్స్, కోపంగా కాదులెండి ఇష్టంగానే చెప్పారు. కొత్తగా వచ్చిన తెలుగు టీచర్, ఆవిడ కొత్త లూనాతో డ్రైవింగ్ కూడా నాకు నేర్పారు. 
       మెాహన్ పేపర్ అడగ్గానే నాకు ఆ విషయం గుర్తు వచ్చింది. సరే ఏదైతే అది అవుతుందని మెయిన్ షీట్ మెాహన్ కి ఇచ్చాను. నేను ఎడిషనల్ రాసుకుంటున్నా. ఈలోపల స్వ్కాడ్ వచ్చారు. ఇక చూడాలి నా సంగతి. లోపల భయపడుతూనే పైకి రాసుకుంటున్నట్టు నటిస్తున్నా. నాకో ఎడ్వాంటేజ్ ఏంటంటే నా ఇనీషియల్ ప్రకారం లాస్ట్ నెంబర్స్ లో వస్తుంది. స్వ్కాడ్ మా వరకు రాకుండానే వెళిపోయారు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాం. ట్విస్ట్ ఏంటో తెలుసా ఆ సబ్జెక్ట్ నాకు ఉండిపోయింది. మెాహన్ కి క్లియర్ అయ్యింది. ఫోట్రాన్ లాబ్ ప్రోగ్రామ్ రాయడం మాత్రమే అన్నారు. ఎగ్జిక్యూషన్ లేదన్నారు. ప్రిపేర్ కాలేదు. సరే వస్తే రాద్దాం లేదంటే వచ్చేద్దాం అనుకున్నా. ఏదో రాశాను మెుత్తానికి. వైవా కి ఎక్స్ట్రనల్ మేడం నాకు తెలిసినావిడ. ఫస్ట్ ఇయర్ లో నాకు మా క్లాస్ రూమ్ తెలియక ఈ మేడం ఉన్న స్టాఫ్ రూమ్ కి వచ్చి, ఆవిడనే అడిగాను. అప్పటినుండి ఆవిడకు నేను బాగా గుర్తు. వైవా బానే ఆన్సర్ చేసాను. 
       అన్నట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయానుగా. మేమూ సీనియర్స్ అయ్యాం కదా. నేనెవరిని రాగింగ్ చేయలేదండోయ్. కాకపోతే మా హాస్టల్ లో సరదాగా ఇంట్రడక్షన్ తీసుకున్నాం. పాపం కొత్తలో నేనంటే జూనియర్స్ (హాస్టల్ అమ్మాయిలు) భయపడేవారు. తర్వాత అనేవారు " నిన్ను చూసి ఎందుకు భయపడ్డామెా తెలియదు " అని. మరో విషయమేంటంటే మా పెద్ద అమ్మమ్మ మనుమడు బాలకృష్ణ నాకు జూనియర్. వాడితోపాటుగా విజయనగరంలో అప్పుడప్పుడూ మాతో ఆడుకున్న సురేంద్ర అంకుల్ కొడుకు భానుకృష్ణ కూడా. బాలకృష్ణని చిన్నప్పుడు చూసాను. మా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయ్యాక నాన్న, నేను ఇంటికి వచ్చేటప్పుడు ట్రైన్ లో మా సెక్షన్ శోభన్ బాబు వాళ్ళు అందరు ట్రైన్ లో బాగా గోల చేసారు. వీడు కూడా వాళ్ళతో ఉన్నాడు. క్లాస్ లో, లాబ్లలో అప్పుడప్పుడూ కనబడుతూ, నిదానంగా వుండే శోభన్ బాబు విశ్వరూపం చూసామన్న మాట. మా బాలు గాడు మేం ఎక్కిన బస్సే విజయవాడలో ఎక్కాడు. బస్ లో సిగిరెట్ కాల్చి పొగ వదిలితే నాకు చాలా కోపం వచ్చింది. తర్వాత కాసేపటికి మెాపిదేవిలో బస్ ఆగి బయలుదేరుతుంటే వీడు గబుక్కున దిగాడు. ఎవరబ్బా ఇక్కడ దిగేవాడు అని ఆరాగా చూసాను. తర్వాత మా పిన్ని చెప్పింది, వీడూ మా కాలేజ్ లోనే జాయిన్ అయ్యాడని. అప్పుడనుకున్నా ఆరోజు హడావిడిగా బస్ దిగింది వీడే అని. బాలు, భాను ఇద్దరు అలా మళ్ళీ కలిసారు.

వచ్చే వారం మరిన్ని కబుర్లతో.... 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner