22, ఆగస్టు 2020, శనివారం

భూతల స్వర్గమేనా...22

పార్ట్... 22

నేను రోనెక్ సిటికి వచ్చిన కొన్ని రోజుల తర్వాత నుండి, ఇది మూడు వారాల ప్రాజెక్టే కదా అని నా ప్రయత్నాలు నేను చేసుకోవడం మెుదలుబెట్టాను. ప్రాజెక్ట్ వారం వారం ఎక్స్టెెండ్ అవుతూ ఉంది.  మెాటల్ లో ఉంటుంటే ఎక్కువ ఖర్చు అవుతోంది. మా ప్రాజెక్ట్ మేనేజర్ టీనాని ఎప్పుడు పంపించేస్తావు నన్ను అని అడుగుతుంటే, తను నవ్వేస్తూ..ఏం ఇక్కడ నచ్చలేదా అనేది. నాకేమెా వర్క్ లేకుండా ఖాళీగా కూర్చుంటే అస్సలు తోచేది కాదు. అప్పుడప్పుడు జలజ వదినతో, ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉండేదాన్ని ఆఫీస్ ఫోన్ నుండి. ఓ రోజు టీనా మా టీమ్ అందరిని లంచ్ కి ఔటింగ్ కి తీసుకువెళ్ళింది. నాకేమెా ఏ ఫుడ్ పడేది కాదు. వెజ్ శాండ్విచ్ తిన్నాను. తర్వాత ఇండోర్ గేమ్స్ ఆడారు అందరు. అప్పటి వరకు సినిమాల్లో చూడటమే తప్ప, రియల్ గా చూడని బ్రిలియర్డ్స్ అందరు ఆడుతూ నన్నూ ట్రై చేయమన్నారు. సరదాగా ఓసారి ట్రై చేసా రాదంటూనే. 
      మా టెస్టింగ్ టీమ్ దగ్గరే ఆఫీస్ వర్క్ స్టాఫ్ డస్క్ ఉండేది. శాండి ఆఫీస్ వర్క్ చూసేది. అప్పుడప్పుడు నాకు లంచ్ తెచ్చిపెట్టేది. ఉండటానికి రూమ్ కావాలని అడిగితే చూస్తానని చెప్పి, 2 డేస్ లో నా దగ్గరకు వచ్చి, ఇష్టమైతే తన ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉండమని అంది. మరి ట్రాన్స్ పోర్టేషన్ ఎలా అని అడిగితే తను రైడ్ ఇస్తానంది. సరేనని శాండి ఇంటికి షిప్ట్ అయ్యాను. అంతవరకు చూడని కొత్త ఎన్విరాన్మెంట్. అది మెాబైల్ హౌస్. నేను అప్పటి వరకు వినను కూడా లేదు. ఈ మెాబైల్ హౌస్ ని మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి షిప్ట్ చేసుకోవచ్చు. ఈ మెాబైల్ హౌస్ సెట్ చేసుకునే ప్లేస్ కి రెంట్ కట్టుకోవాలి. 2 బెడ్ రూమ్స్, బాత్ టబ్, కిచెన్ సింపుల్ గా బావుంది. తనకి ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయికి పెళ్ళి అయిపోయింది. చిన్నమ్మాయి చదువుకుంటోంది. అప్పుడప్పుడు వచ్చి వెళుతుంది. శాండికి హజ్బెండ్ తో డైవోర్స్ అయ్యి, మరొకతనితో రిలేషన్ షిప్. అతను అప్పుడప్పుడు వచ్చివెళతాడు. మనకి ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న సహజీవనమన్న మాట.  ఓ రెండు పెద్ద పిల్లులు కూడా ఉన్నాయి. మామూలుగా నాకు పిల్లులంటే భయం లేదు. కాని వీటిని చూస్తే ముందు ఏం అనిపించలేదు కాని తర్వాత తర్వాత చాలా భయం వేసేది. రూమ్ డోర్ లాక్ చేసుకుంటే డోర్ గీరుతూనే ఉండేవి. హాల్లో కూర్చుంటే వచ్చి పక్కన లేదా ఒళ్ళో పడుకునేవి. తోస్తే వాటికెంత కోపమెా. అరిచేవి బాగా. ఆ చూపులకు, అరుపులకి బాగా భయం వేసేది. శాండితో చెప్తే ఏం చేయవులే భయపడకు అనేది. తర్వాత అలవాటై పోయాయి. రోనెక్ సిటి పుణ్యమా అని నాకు తిండి విలువ బాగా తెలిసిందని చెప్పాను కదా. అమెరికన్ ఫుడ్ తినలేనని శాండి నన్ను 45 మినిట్స్ డ్రైవ్ లో ఉన్న ఇండియన్ గ్రాసరిస్టోర్ కి తీసుకువెళ్ళింది. అది చాలా చిన్న గాస్ స్టేషన్. దానిలోనే ఇండియన్ గ్రాసరీ ఉంది. ఎప్పుడూ తినని మాగీ నూడిల్స్ తీసుకున్నాను మిగతా సరుకులతో పాటు. శాండికి ఇండియన్ ఫుడ్, అదీ సెనగపప్పు, కొబ్బరి కూర చాలా ఇష్టం. నా వంటలు రుచి చూస్తూ ఉండేది తన బాయ్ ఫ్రెండ్ తో కలిపి. 
 అప్పటికే నాకు ఫోర్త్ మంత్ వచ్చేసింది. ఏం తిన్నా, తాగినా వామిటింగ్స్ అయిపోయేవి. బాగా నీర్సంగా ఉండేది. డాక్టర్ చెక్ అప్ కి వెళ్ళడానికి ముందుగా మన హెల్త్ ఇన్ష్యూరెన్స్ ప్రొవైడర్ ఎవరో చూసుకుని, ఏ హాస్పిటల్ ఎవైలబుల్ ఉందో చెక్ చేసుకుని, ముందుగా ఫోన్ చేసి అప్పాయింట్మెంట్ తీసుకోవాలి. వాళ్ళు ఫలానా డేట్, టైమ్ చెప్తారు. ఆ టైమ్ కి డాక్టర్ ఆఫీస్ కి వెళ్ళాలి. అమెరికాలో హాస్పిటల్స్ వేరు, డాక్టర్ ఆఫీస్ వేరుగా ఉంటాయి. నా అప్పాయింట్మెంట్ రోజు శాండి, నేను బయలుదేరాం. ఎందుకో తెలియదు ఆరోజు పొద్దుటి నుండి బాలేదు. కళ్ళు తిరుగుతున్నాయి. కాఫీ పెట్టుకుని కూడా తాగలేక మళ్ళీ వచ్చి పడుకున్నా. తర్వాత శాండి ఆఫీస్ కి రడి అయ్యాక, తను కప్ కేక్స్ చేసి ఆఫీస్ కి తీసుకుని బయలుదేరింది. ఆ కేక్స్ నేను పట్టుకుని మెట్లు దిగబోయి నాలుగు మెట్ల మీద నుండి  జారిపోయాను. శాండి కంగారు పడుతుంటే ఏం కాలేదని చెప్పాను. తర్వాత శాండి నన్ను డాక్టర్ ఆఫీస్ వద్ద డ్రాప్ చేసి వెళిపోయింది. చెక్ అప్ అయ్యాక కాబ్ లో వస్తానని చెప్పాను. టీనాకు ముందే ఇన్ఫామ్ చేసాను లేట్ గా వస్తానని. కొత్తగా డాక్టర్ అప్పాయింట్మెంట్ తీసుకుంటే ఓ త్రీ అవర్స్ ఎగ్జామ్ రాసినట్టుగా పెద్ద బుక్ లెట్ ఫిల్ చేయాలి మన హెల్త్ హిస్టరీ గురించి. అంతా అయ్యాక ఎనిమిక్ గా ఉన్నానని చెప్పి రెగ్యులర్ టాబ్లెట్స్ తో పాటు ఐరన్ టాబ్లెట్స్ ఇచ్చి పంపించారు. వామిటింగ్ అప్పుడు ముక్కు, నోటి వెంట కూడా బ్లడ్ పడేది. దానితో బాగా వీక్ అయ్యాను. 
నా ఇంజనీరింగ్ క్లాస్మేట్ జ్యోతి అప్సానీ కూడా వర్జీనియాలోనే కాస్త నాకు దగ్గరలోనే ఉంది. ఫోన్ లో తనతో కూడా మాట్లాడుతుండేదాన్ని. అప్పటికి తనకి చిన్న బాబు. వీలైతే నేనే చూడటానికి వస్తానని చెప్పాను. శిరీష వదిన కూడ కుదిరితే నా దగ్గరకు వస్తామని చెప్పింది.

మళ్ళీ కలుద్దాం...

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner