29, ఆగస్టు 2020, శనివారం

భూతల స్వర్గమేనా.. 23

మూడు వారాలు అన్న ప్రాజెక్ట్ అలా అలా  గడిచిపోతూ ఉంది. శాండి మెాబైల్ హౌస్ లో రోనెక్ సిటీ జీవితం బాగానే జరుగుతోంది. అమ్మానాన్నకు, మౌర్యకు అమెరికా రావడానికి పేపర్స్ పంపాను. ఆ పేపర్స్ నోటరి చేయించి పంపడంలో శాండి చాలా హెల్ప్ చేసింది. శాండి ఇంట్లో ఉండగానే మా చిన్న ఆడపడుచుకి పెళ్ళి సంబంధం అనుకోకుండా AMSOLరవి మూలంగా కుదిరింది. నేను ఇండియా వెళ్ళినప్పుడు మా పెద్దాడపడుచు వాళ్ళాయన కాస్త సూటిపోటి మాటలన్నారు. ఏదో మాటల మీద రవి ఈ సంబంధం గురించి చెప్తే, ఆ పిల్లకు ఫోన్ చేసి విషయం చెప్పాను. ఫోటో పంపించి, చదువు, మిగతా వివరాలు చెప్పి నీకు నచ్చితేనే మాట్లాడతాను అని చెప్పాను. వాళ్ళ అక్కాబావ ఇష్టం అంది. అమ్మానాన్న లేరు చిన్నప్పుడే చనిపోయారు. తర్వాత వాళ్ళతో మాట్లాడితే సంబంధం మాట్లాడమన్నారు. అబ్బాయి జీతం గురించి అడిగితే 4000, 5000 నాకు తెలియదు అని ఫోన్ నెంబర్ ఇస్తాను, మీకేం అనుమానాలున్నా మాట్లాడండి అని నెంబర్ ఇచ్చాను. నాకుగా వాళ్ళు మాట్లాడిన వివరాలేం చెప్పలేదు. మా ఆయన అప్పుడు ఇండియాలోనే ఉన్నారుగా. మెుత్తానికి మాట్లాడి సంబంధం కుదిర్చారు. పెళ్ళికొడుకు..మరి పెళ్ళి ఖర్చులు ఇవ్వరా అంటే వాళ్ళేం ఇవ్వలేరండి. నేనే ఇవ్వాలి అంటే నవ్వేసి ఊరుకున్నాడు. ఎంగేజ్మెంట్ అయ్యింది. ఓ రోజు మా మరిది ఫోన్ చేసి పిల్లకి ఇష్టం లేదని చెప్పాడు. ఆయన అప్పుడు అక్కాబావతో మాట్లాడడు. నేను వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి, ఆమెకు ఇష్టం లేకపోతే మానేయండి, ఆవిడ సంగతి మీకు బాగా తెలుసు కదా, చదువు ఏం చేసిందో గుర్తు చేసుకోండి. వాళ్ళకి నేను ఏదోకటి చెప్పుకుంటాను అని అంటే, మేం మాట్లాడతాం అని చెప్పారు. 
       ఇదంతా శాండి వింటూనే ఉంది. విషయం ఏంటని అడిగితే ఇలా ఇలా అని వివరంగా చెప్పాను. మీకు ఇంత ప్రాసెస్ ఉంటుందా పెళ్ళికి అని ఆశ్చర్యపోయింది. ఈలోపల మా టెస్టింగ్ టీమ్  పుణ్యమా అని, నేను ఫోన్ ఎక్కువ మాట్లాడుతున్నానన్న కంప్లైంట్ తో, మా టీనాకి ఎగైనెస్ట్ గా, నా జాబ్ తీసేయించారు. టీనాకి తన పనిలో కూడా చాలా హెల్ప్ చేసేదాన్ని. టెస్టింగ్ చేయమంటే, బగ్స్ తో పాటు, కోడింగ్ ఏం చేయాలో, ఎక్కడ ఛేంజ్ చేయాలో చెప్తుండేదాన్ని. టీనానేమెా మంజూ మనం బగ్స్ ఐడెంటిఫై చేయాలంతే అని నవ్వేది. రామస్వామి నన్ను బెదిరిస్తే ఆ విషయం కూడా టీనాకి తెలుసు. చాలా సపోర్టివ్ గా ఉండేది నాతో. అది మిగతావాళ్ళకి కంటగింపు. నాకు పని లేకపోతే ఏం చోష్యం ఫోన్ మాట్లాడేదాన్ని జలం వదినతో, చికాగోలో కొందరితో. ఆఫీస్ వాళ్ళు నేను ఫోన్ మాట్లాడిన అవర్స్ లెక్కబెట్టుకున్నారు కాని నేను పని చేసిన టైమింగ్స్ గుర్తుంచుకోలేదు. అవి అన్ని మా టీమ్ లో అందరికి తెలుసు. ఎక్స్ట్రా అవర్స్ పే చేయరు. అయినా వర్క్ చేసేదాన్ని. ఎప్పుడైనా స్నో పడి లేట్ అవుతుంది రావడానికంటే, టీనా లీవ్ తీసుకోమనేది. తర్వాత టైమ్ షీట్ ఫిల్ చేసేటప్పుడు లీవ్ ది కూడా టైమ్ వేసుకో, నీకెలాగు మేం ఎక్స్ట్రా అవర్స్ పే చేయడం లేదు. నువ్వు లంచ్ టైమ్ కూడా తీసుకోవు అనేది. ఎంతయినా అందరు అమెరికన్స్ మధ్యన టీనా నాకు ఫేవర్ గా ఉండటం వారికి నచ్చలేదు. మెుత్తానికి నా మూడు వారాల ప్రాజెక్ట్ మూడు నెలలతో ఇలా ముగిసిందన్న మాట. అన్నట్టు చెప్పడం మరిచా మా శాండి వాళ్ళ ఫాదర్ మంచి కార్ రేసర్ అంట. నాకు శాండి డ్రైవింగ్ చూసి అనుమానమెుచ్చి అడిగితే ఆ విషయం చెప్పింది. అక్కడే ఓ రెండు రోజులుండి తర్వాత నా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ క్లాస్మేట్ శ్రీనివాసరెడ్డి వాళ్ళు ఏదైనా జాబ్ చూద్దాం, డెట్రాయిట్ వచ్చేయమంటే డెట్రాయిట్ బయలుదేరాను. 

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో 3 వారాలనుకున్న జాబు 3 నెలలవరకు... మల్లి ఉద్యోగ ప్రయత్నాల తో డెట్రాయిట్ ప్రయాణం...



నా అమెరికా కబుర్లను ప్రచురిస్తున్న ఆంంధ్రాప్రవాసి డాట్ కాం వారికి,   రాజశేఖర్ చప్పిడి గారికి మన:పూర్వక ధన్యవాదాలు..



ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో 3 వారాలనుకున్న జాబు 3 నెలలవరకు... మల్లి ఉద్యోగ ప్రయత్నాల తో డెట్రాయిట్ ప్రయాణం...

28, ఆగస్టు 2020, శుక్రవారం

మనసాక్షరాలు..!!

ఎందరిలో తానున్నా
మౌనం మాటాడితే
మనసు విన్నదట

గుండె గుబులుగా బదులిస్తే
గుప్పెడు జ్ఞాపకాలను పంచి
గువ్వలా ఒదిగిందట

అమ్మ పరిచయం చేసినా
ఆ తల్లినే మరిపించే 
ప్రేమ మురిపెం తనకుందట

ఆర్తిగా అక్కున చేర్చుకుని
సుఖదుఃఖాలను పంచుకునే
ఆత్మీయ నేస్తమైందట

శరాన్ని కరముతో కలిపి
ఆయుధమై అన్యాయాన్ని ఎదిరించే  
అరుదైన లక్షణమే తనదట

అందుకేనేమెా..జీవిత పుస్తకాన్ని 
అనుభవాల పుటలతో నింపే 
మనసాక్షరాలు కొన్నైనా కావాలనిపిస్తాయట..!!








24, ఆగస్టు 2020, సోమవారం

కాలం వెంబడి కలం..16

 కాలం వెంబడి కలం..16

       మా యశోదా వాళ్ళ లీలక్క మాకు సీనియర్. అక్క పెళ్ళికి కర్నూల్ వెళ్ళాము. నేను, పొడుగు మాతో లడ్డు(శ్రీనివాసరెడ్డి, తిరుపతి). పెళ్ళి బాగా జరిగింది. అంజయ్య చౌదరి కూడా వచ్చాడు. ఓ రోజు  వెంకట్రావు మా బస్ దగ్గరకి వచ్చి మాట్లాడాలంటే నేను మాట్లాడను అన్నా. సరదాగా ఏడిపించాం అదేం గుర్తు పెట్టుకోవద్దు. కోపం తెచ్చుకోకు అని, మామూలుగా మాట్లాడాడు. మా నీలిమ మేం థర్డ్ ఇయర్ లో ఉన్నప్పుడే హెచ్ ఎం టి బాబాయ్ ని పెళ్ళి చేసుకుంది. ఆ టైమ్ లో నేను ఇంట్లో ఉన్నాను. నీలిమ వాళ్ళ ఇంట్లోవాళ్ళు ముందు ఒప్పుకోలేదు. తర్వాత బానే ఉన్నారు. ఇప్పుడంతా హాపినే. మా జూనియర్స్ కూడా మాతో ఫైనలియర్ చదివేటప్పుడే వెళిపోయి పెళ్ళి చేసుకున్నారు. ఆ అమ్మాయి బాగా చదివేది. హాస్టల్ బాచ్ అందరం కలిసి మంత్రాలయం వెళ్ళి దర్శనం చేసుకున్నాం. అందరు పూజలు చేస్తున్నారని నేను, అను విగ్రహాల చుట్టూ పదకొండు  రోజులు తిరిగి పూజ చేయించడము, రామకృష్ణ మఠానికి వెళ్ళడము ఇలా బోలెడు జ్ఞాపకాలు. 

      మా షర్మిల ఎం టెక్ కోయంబత్తూర్ లో చదువుతోంది అప్పుడు. ఓ రోజు మా క్లాస్ పిల్లలు ఎవరో చెప్పారు. షర్మిల వాళ్ళ అమ్మగారు చనిపోయారు. పేపర్ లో కూడా వేసారని. అందరికి తెలుసు షర్మిల నాకు బాగా క్లోజ్ అని. వెంటనే నేను, 

ఉమారాణి షర్మిల వాళ్ళింటికి వెళ్ళాము. ఆంటీ బెస్ట్ టీచర్. చాలా బాగా మాట్లాడేవారు ఇంటికి వెళ్ళినప్పుడల్లా. మెుదటిసారి షర్మిల వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఆంటీ చక్కగా మాట్లాడుతూ ఉన్నారు, కాని షర్మిల వాళ్ళ అక్క కనిపించలేదు. ఏంటి అక్క లేదా అని అడిగితే ఉందని చెప్పింది. ఇంటికి వచ్చిన వారిని పలకరించరా, మీ ఇంట్లో ఎవరి ఫ్రెండ్స్ వారికేనా అని అడిగాను. ఆ తర్వాత నుండి ఎప్పుడు వెళ్ళినా అక్క చాలా బాగా మాట్లాడేది. పాపం వాళ్ళే ఉన్నారింట్లో. వాళ్ళ అమ్మానాన్నగారిది ఆ రోజుల్లోనే ప్రేమపెళ్ళి. శాఖలు మాత్రమే వేరైనా ఇంట్లో ఒప్పుకోలేదట. చుట్టాలెవరూ పెద్దగా రారట. మైల అని అందరు దూరంగా ఉంటున్నారు. ఎవరు రావడం లేదు. మా ఇంట్లో భోజనం చేస్తావా అని నా ప్రియ నెచ్చెలి అడిగితే చాలా బాధనిపించింది. నాకేం పట్టింపు లేదు, తింటానని చెప్పాను. కాకపోతే ఆంటీని చివరిసారిగా చూడలేకపోయానని చాలా బాధనిపించింది. చిన్నప్పటి నుండి చనిపోయిన వారిని చూడటానికి మాత్రం వెళ్ళేదాన్ని. మళ్లీ కనబడరని. అంటుకోవడాలు, స్నానాలు అలాంటివేం పట్టవు నాకు. షర్మిల ఉన్నన్ని రోజులు తనకోసం వెళ్ళేదాన్ని. తనకి మల్లెమెుగ్గలు పెట్టుకుంటారని కూడా తెలియదు. మా కాలేజ్ లో లెక్చెరర్ గా చేసినప్పుడు అక్క చీర కట్టి, పూలు మాలకట్టి తలలో పెట్టేదట. వాళ్ళింట్లో పెద్ద మల్లెపొద భలే గుబురుగా ఉండి, బోలెడు పూలు పూసేది. ఏంటి మెుగ్గలు కోయలేదంటే మెుగ్గలు పెట్టుకుంటారా అని ఆశ్చర్యపోయిన అమాయకత్వం నా నెచ్చెలిది. 

         మా కాలేజ్ డే ఫంక్షన్ ఉందని ఎనౌన్స్ చేసారు. చాలా గేమ్స్ కూడా ఉన్నాయన్నారు. మనకేం పెద్దగా రావు కాని టెన్నీకాయిట్ ఆడతామని పేర్లు ఇచ్చాము. మేం చేసిన తప్పేంటంటే నేను, అను రెండు టీమ్ లు గా అయ్యాము. నాతో లత, అనుతో మరొకరు పేరు గుర్తులేదిప్పుడు. ఐదువేళ్ళు కలిస్తేనే గుప్పిడి అన్న మాట మరిచాము అప్పుడు. అను కూడా బాగా ఆడుతుంది. కాని మా రెండు టీమ్ లు ఓడిపోయాయి. మరో రీజన్ జడ్జ్ కి రూల్స్ కూడా సరిగా తెలియకపోవడము. ఏదైతేనేం కాలేజ్ డే బాగా సరదాగా జరిగింది. మాకు సెండాఫ్ పార్టీ కూడా జూనియర్స్ బాగా ఇచ్చారు. 

         నాకు ఇంటికి వెళ్ళడానికి కుదరలేదని అమ్మానాన్న, పిన్ని, బాబాయ్, వాళ్ళ అబ్బాయి తేజ అందరు నా దగ్గరకి వచ్చారు. ఓ రోజు హోటల్ లో నా ఫ్రెండ్స్ అందరికి లంచ్ ఏర్పాటు చేసారు నాన్న. మా సీనయ్య పెదనాన్న కళ్యాణదుర్గం దగ్గరలో ఉండేవారు. మా పెదనాన్న కూతురు కూడ అక్కడికి దగ్గరలోనే ఉండేది. రాజా అన్నయ్య అక్క దగ్గరకి వచ్చినప్పుడు నేను, నీలిమ వెళ్ళాం. మా అజాత, అపర్ణ ఉన్నప్పుడు పెదనాన్న వాళ్ళింటికి వెళ్ళాను. అమ్మావాళ్ళు వచ్చినప్పుడు అపర్ణ నా దగ్గర కొన్ని రోజులుండి వెళ్ళింది. 

            మాకు ఫైనల్ ఇయర్ ప్రాక్టికల్ ఎగ్జామ్ మెుదలయ్యాయి. ప్రాజెక్ట్ వర్క్ ప్రిపరేషన్ అంతా నీలిమ చూసుకుంది. మాటర్ సేకరించి, టైప్ చేయించడము, పుస్తకాలు బైండ్ చేయించడము అంతా నీలిమనే చూసుకుంది. టూర్ డిటెయిల్సు సబ్మిట్ చేయడం, సెమినార్ పేపర్స్ ఎవరివి వారు చేసుకున్నాం. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ముందు రికార్డ్ సబ్మిషన్ ఓ పెద్ద ప్రహసనం. మెుత్తానికి ప్రాక్టికల్స్ అన్ని బానే జరిగాయి. ఎందుకో తెలియదు కాని ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయ్యాక నా హెల్త్ పాడయ్యింది.కిడ్నీలో స్టోన్స్ అని సెలైన్ లు మూడు రోజులు పెట్టారు. తర్వాత బాగా ఫీవర్ వచ్చి బాగా వీక్ అయ్యేసరికి ఇంటికి ఫోన్ చేసి చెప్పారు పొడుగు వాళ్ళు. అమ్మానాన్న వచ్చారు. నన్ను అలా చూసి అమ్మ చదువు వద్దు, ఏం వద్దు, ఇంటికి వెళిపోదాం పదా.. అని ఒకటే గొడవ. థియరీ పరీక్షలు ఉన్నాయి కదమ్మా మళ్లీ రాయడమంటే కష్టం. ప్రాక్టికల్స్ అయిపోయాయి కదా. ఓ నెల ఓపిక పడితే అయిపోతాయి అని అమ్మకు నచ్చజెప్తే, ఓ పది రోజులు అమ్మను నా దగ్గర ఉండమని నాన్న వెళిపోయారు. పాపం అమ్మకు బోర్ కొట్టేసింది నాలుగు రోజులకే. సరేనని అమ్మను బస్ ఎక్కించేసాం. మా పొట్టి, పొడుగు నా హెల్త్ బాలేనప్పుడు చాలా హెల్ప్ చేసారు. ఎగ్జామ్స్ ముందు అయితే పొట్టి నేను పడుకుని ఉంటే అది నోట్స్ లో రాస్తూ నాకు ఎక్స్ ప్లెయిన్ చేసేది. మూడు గంటలు కూర్చుని ఎగ్జామ్ రాసే ఓపిక కూడా లేదప్పుడు. మావాళ్ళందరికి చాలా బుుణపడిపోయాను ఇప్పటికి కూడా. 

      ఆటోగ్రాఫ్ మా వెంకటస్వామి చిన్న చిన్న అక్షరాలతో శ్రీ శ్రీ మహాప్రస్థానం లో కవితల్లా ఓ నాలుగు పేజీలు రాశాడు. థియరీ ఎగ్జామ్స్ ఆఖరి పరీక్ష అయినరోజే నేను, అను ఇంటికి బయలుదేరడానికి బస్ టికెట్ బుక్ చేసుకున్నాం. ఎగ్జామ్ రాసేసి, మురుగన్ సర్ దగ్గరకి వెళుతున్నామని చెప్పడానికి వెళ్ళి, సర్ కి ఆటోగ్రాఫ్ బుక్ ఇచ్చాను రాయమని. ఇప్పటికిప్పుడు ఇస్తే ఎలా రాస్తాను అన్నారు. బయట ఆటో ఉంది సర్, బస్ కి టైమ్ అయిపోతోంది రాసివ్వండి అంటే... నీ ఎఫెక్షనేట్ వర్డ్స్ ఎప్పటికి గుర్తుండిపోతాయి అని రాసిచ్చారు. అలా బోలెడు తీపి జ్ఞాపకాలతో ఇంజనీరింగ్ విజయనగర్ ఇంజనీరింగ్ కాలేజ్, బళ్ళారి, కర్నాటకలో ముగిసింది.


వచ్చే వారం మరిన్ని కబుర్లతో....

ఎంత సంతోషమెా...!!

నేస్తం, 
          నాకెంత సంతోషంగా ఉందంటే మాటల్లో చెప్పలేను. మనకు చదువు నేర్పిన గురువులు మన రాతలను మెచ్చుకుంటుంటే ఎంత బావుంటుందో. నా చిన్నప్పటి గురువులు శిశు విద్యామందిరం అవనిగడ్డ హెడ్ మాస్టారు ఆకుల వెంకట రత్నారావు గారు, విజయనగరం జొన్నవలస హైస్కూల్ హింది టీచర్ రత్నకుమారి గారు నా రాతలు చదివి మెచ్చుకోవడం బోలెడు సంతోషాన్ని ఇస్తే, ఈ మధ్యన మా బళ్ళారి విజయనగర్ ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చరర్ మురుగన్ సర్ నా పుస్తకాలు అమెరికాలో నాలుగు లైబ్రరీలలో ఇచ్చారు. మరో సీనియర్ పూర్ణచంద్ కూడా నా ముచ్చట్లు చదివి తనూ అదే కాలేజ్ అని చెప్పారు. 
       మరో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే మా కాలేజ్ అని ఒకాయన పరిచయం చేసుకున్నారు మెసెంజర్ లో. నేను మా సీనియర్ అనుకున్నాను, కాని గుర్తు పట్టలేదు. ఈ రోజు మెసెంజర్ లో మాకు తెలిసిన షార్ట్ నేమ్ తో చెప్పారు. మా ఎలక్ట్రికల్ ఎచోడి సర్ ఎమ్ ఆర్ రెడ్డి గారు. ఆయన పెట్టిన మెసేజ్... 
"Wish you can recognise me if I say myself as M.R.REDDY, HOD- E&E DEPT & not as RAVINDRANADHA REDDY. MANDAPATI. Where & how long you were in USA ? Today, I have spent almost an hr in going thro your great Telugu quotes."
ఇది చూసాక ఇక నా ఆనందాన్ని మాటల్లో చెప్పతరమా..చెప్పండి. కలలో కూడా ఊహించని బహుమతి ఇది. 
నాతో అమెరికా ముచ్చట్లు రాయిస్తున్న ఆంంధ్రాప్రవాసి వెబ్ సైట్ రాజశేఖర్ చప్పిడి గారికి, నా జీవితాన్ని రాయిస్తున్న కవితాలయం పవన్ తమ్ముడికి, ఆదరిస్తున్న మీ అందరికి మనఃపూర్వక ధన్యవాదాలు...

22, ఆగస్టు 2020, శనివారం

భూతల స్వర్గమేనా...22

పార్ట్... 22

నేను రోనెక్ సిటికి వచ్చిన కొన్ని రోజుల తర్వాత నుండి, ఇది మూడు వారాల ప్రాజెక్టే కదా అని నా ప్రయత్నాలు నేను చేసుకోవడం మెుదలుబెట్టాను. ప్రాజెక్ట్ వారం వారం ఎక్స్టెెండ్ అవుతూ ఉంది.  మెాటల్ లో ఉంటుంటే ఎక్కువ ఖర్చు అవుతోంది. మా ప్రాజెక్ట్ మేనేజర్ టీనాని ఎప్పుడు పంపించేస్తావు నన్ను అని అడుగుతుంటే, తను నవ్వేస్తూ..ఏం ఇక్కడ నచ్చలేదా అనేది. నాకేమెా వర్క్ లేకుండా ఖాళీగా కూర్చుంటే అస్సలు తోచేది కాదు. అప్పుడప్పుడు జలజ వదినతో, ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉండేదాన్ని ఆఫీస్ ఫోన్ నుండి. ఓ రోజు టీనా మా టీమ్ అందరిని లంచ్ కి ఔటింగ్ కి తీసుకువెళ్ళింది. నాకేమెా ఏ ఫుడ్ పడేది కాదు. వెజ్ శాండ్విచ్ తిన్నాను. తర్వాత ఇండోర్ గేమ్స్ ఆడారు అందరు. అప్పటి వరకు సినిమాల్లో చూడటమే తప్ప, రియల్ గా చూడని బ్రిలియర్డ్స్ అందరు ఆడుతూ నన్నూ ట్రై చేయమన్నారు. సరదాగా ఓసారి ట్రై చేసా రాదంటూనే. 
      మా టెస్టింగ్ టీమ్ దగ్గరే ఆఫీస్ వర్క్ స్టాఫ్ డస్క్ ఉండేది. శాండి ఆఫీస్ వర్క్ చూసేది. అప్పుడప్పుడు నాకు లంచ్ తెచ్చిపెట్టేది. ఉండటానికి రూమ్ కావాలని అడిగితే చూస్తానని చెప్పి, 2 డేస్ లో నా దగ్గరకు వచ్చి, ఇష్టమైతే తన ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉండమని అంది. మరి ట్రాన్స్ పోర్టేషన్ ఎలా అని అడిగితే తను రైడ్ ఇస్తానంది. సరేనని శాండి ఇంటికి షిప్ట్ అయ్యాను. అంతవరకు చూడని కొత్త ఎన్విరాన్మెంట్. అది మెాబైల్ హౌస్. నేను అప్పటి వరకు వినను కూడా లేదు. ఈ మెాబైల్ హౌస్ ని మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి షిప్ట్ చేసుకోవచ్చు. ఈ మెాబైల్ హౌస్ సెట్ చేసుకునే ప్లేస్ కి రెంట్ కట్టుకోవాలి. 2 బెడ్ రూమ్స్, బాత్ టబ్, కిచెన్ సింపుల్ గా బావుంది. తనకి ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయికి పెళ్ళి అయిపోయింది. చిన్నమ్మాయి చదువుకుంటోంది. అప్పుడప్పుడు వచ్చి వెళుతుంది. శాండికి హజ్బెండ్ తో డైవోర్స్ అయ్యి, మరొకతనితో రిలేషన్ షిప్. అతను అప్పుడప్పుడు వచ్చివెళతాడు. మనకి ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న సహజీవనమన్న మాట.  ఓ రెండు పెద్ద పిల్లులు కూడా ఉన్నాయి. మామూలుగా నాకు పిల్లులంటే భయం లేదు. కాని వీటిని చూస్తే ముందు ఏం అనిపించలేదు కాని తర్వాత తర్వాత చాలా భయం వేసేది. రూమ్ డోర్ లాక్ చేసుకుంటే డోర్ గీరుతూనే ఉండేవి. హాల్లో కూర్చుంటే వచ్చి పక్కన లేదా ఒళ్ళో పడుకునేవి. తోస్తే వాటికెంత కోపమెా. అరిచేవి బాగా. ఆ చూపులకు, అరుపులకి బాగా భయం వేసేది. శాండితో చెప్తే ఏం చేయవులే భయపడకు అనేది. తర్వాత అలవాటై పోయాయి. రోనెక్ సిటి పుణ్యమా అని నాకు తిండి విలువ బాగా తెలిసిందని చెప్పాను కదా. అమెరికన్ ఫుడ్ తినలేనని శాండి నన్ను 45 మినిట్స్ డ్రైవ్ లో ఉన్న ఇండియన్ గ్రాసరిస్టోర్ కి తీసుకువెళ్ళింది. అది చాలా చిన్న గాస్ స్టేషన్. దానిలోనే ఇండియన్ గ్రాసరీ ఉంది. ఎప్పుడూ తినని మాగీ నూడిల్స్ తీసుకున్నాను మిగతా సరుకులతో పాటు. శాండికి ఇండియన్ ఫుడ్, అదీ సెనగపప్పు, కొబ్బరి కూర చాలా ఇష్టం. నా వంటలు రుచి చూస్తూ ఉండేది తన బాయ్ ఫ్రెండ్ తో కలిపి. 
 అప్పటికే నాకు ఫోర్త్ మంత్ వచ్చేసింది. ఏం తిన్నా, తాగినా వామిటింగ్స్ అయిపోయేవి. బాగా నీర్సంగా ఉండేది. డాక్టర్ చెక్ అప్ కి వెళ్ళడానికి ముందుగా మన హెల్త్ ఇన్ష్యూరెన్స్ ప్రొవైడర్ ఎవరో చూసుకుని, ఏ హాస్పిటల్ ఎవైలబుల్ ఉందో చెక్ చేసుకుని, ముందుగా ఫోన్ చేసి అప్పాయింట్మెంట్ తీసుకోవాలి. వాళ్ళు ఫలానా డేట్, టైమ్ చెప్తారు. ఆ టైమ్ కి డాక్టర్ ఆఫీస్ కి వెళ్ళాలి. అమెరికాలో హాస్పిటల్స్ వేరు, డాక్టర్ ఆఫీస్ వేరుగా ఉంటాయి. నా అప్పాయింట్మెంట్ రోజు శాండి, నేను బయలుదేరాం. ఎందుకో తెలియదు ఆరోజు పొద్దుటి నుండి బాలేదు. కళ్ళు తిరుగుతున్నాయి. కాఫీ పెట్టుకుని కూడా తాగలేక మళ్ళీ వచ్చి పడుకున్నా. తర్వాత శాండి ఆఫీస్ కి రడి అయ్యాక, తను కప్ కేక్స్ చేసి ఆఫీస్ కి తీసుకుని బయలుదేరింది. ఆ కేక్స్ నేను పట్టుకుని మెట్లు దిగబోయి నాలుగు మెట్ల మీద నుండి  జారిపోయాను. శాండి కంగారు పడుతుంటే ఏం కాలేదని చెప్పాను. తర్వాత శాండి నన్ను డాక్టర్ ఆఫీస్ వద్ద డ్రాప్ చేసి వెళిపోయింది. చెక్ అప్ అయ్యాక కాబ్ లో వస్తానని చెప్పాను. టీనాకు ముందే ఇన్ఫామ్ చేసాను లేట్ గా వస్తానని. కొత్తగా డాక్టర్ అప్పాయింట్మెంట్ తీసుకుంటే ఓ త్రీ అవర్స్ ఎగ్జామ్ రాసినట్టుగా పెద్ద బుక్ లెట్ ఫిల్ చేయాలి మన హెల్త్ హిస్టరీ గురించి. అంతా అయ్యాక ఎనిమిక్ గా ఉన్నానని చెప్పి రెగ్యులర్ టాబ్లెట్స్ తో పాటు ఐరన్ టాబ్లెట్స్ ఇచ్చి పంపించారు. వామిటింగ్ అప్పుడు ముక్కు, నోటి వెంట కూడా బ్లడ్ పడేది. దానితో బాగా వీక్ అయ్యాను. 
నా ఇంజనీరింగ్ క్లాస్మేట్ జ్యోతి అప్సానీ కూడా వర్జీనియాలోనే కాస్త నాకు దగ్గరలోనే ఉంది. ఫోన్ లో తనతో కూడా మాట్లాడుతుండేదాన్ని. అప్పటికి తనకి చిన్న బాబు. వీలైతే నేనే చూడటానికి వస్తానని చెప్పాను. శిరీష వదిన కూడ కుదిరితే నా దగ్గరకు వస్తామని చెప్పింది.

మళ్ళీ కలుద్దాం...

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో ఉండటం మొబైల్ హౌస్ లో... ఒకసారి కాలు జారి పడితె, ఆసుపత్రిలో ఏమైందంటే...

నా అమెరికా కబుర్లను ప్రచురిస్తున్న ఆంంధ్రాప్రవాసి డాట్ కాం వారికి,   రాజశేఖర్ చప్పిడి గారికి మన:పూర్వక ధన్యవాదాలు..

అందరికి వినాయక చవితి శుభాకాంక్షలతో...



ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో ఉండటం మొబైల్ హౌస్ లో... ఒకసారి కాలు జారి పడితె, ఆసుపత్రిలో ఏమైందంటే...

20, ఆగస్టు 2020, గురువారం

ఓ మరణం...!!

ప్రేమను పంచిన పెన్నిధి
బాధ్యతల బరువును మెాస్తూ
ఊహకందని రీతిలో
కరోనా యమపాశానికి బలై
బంధాలను అల్లుకున్న గూటిని
అర్ధాంతరంగా వదలిపోతే..

మానవత్వం మరచిపోయిన
మనిషితనం దిగజారిపోతే
అక్కరకు రాని అయినవారిని 
ఆపదలో ఆదుకోలేని 
సమాజాన్ని వెలి వేసి
కటుంబమంతా కలిసి 
ఒకేసారి బలవన్మరణానికి పాల్పడితే... 

ఎవరిదా పాపం? 
ఓ మాట సాయమదించి
ధైర్య వచనం చెప్పలేని 
ఇరుగు పొరుగుదా! 
దగ్గరలోనే ఉండి 
ఆదుకోని ఆత్మీయులదా! 
పలుకరించలేని ప్రియ స్నేహితులదా! 
కష్టం మనది కాదులే 
అనుకున్న సమాజానిదా! 

అందరికి తెలిసిన సమాధానమే 
అయినా అడిగింది మనల్ని కాదని
తలవంచుకు వెళిపోదాం...!! 











నిర్ణయం...!!

నేస్తం, 
         పలకరించి చాన్నాళ్ళయినా, మనసులో మాట్లాడుతూనే ఉన్నా నీతో. మన మధ్యన మౌనం కూడా మాట్లాడుతుందని నీకు తెలుసు కదా. జీవితంలో అతి ముఖ్యమైన నిర్ణయం తీసుకునే క్షణాలను గాలికి వదిలేస్తే, తరువాత బతుకంతా గాలిలో దీపమేనని తెలియకపోవడంతో, రాబోయే విపత్తు ఊహకందదు. గాలికి అడ్డు పెట్టే చేయి దొరకక ఎప్పుడు ఆ దీపమారిపోతుందో తెలియదు. ఒక్కరు తీసుకునే నిర్ణయం మీద కుటుంబం మెుత్తం ఆధారపడి ఉంటుందని ఆలోచించక పోవడమూ తప్పే. ఆవేశంలోనో, జాలిపడో తీసుకునే నిర్ణయాలెప్పుడూ తప్పుల తడకలే. అది ఏ విషయంలోనైనా నిజమే. 
      ఆడపిల్లని ఓ ఇంటికి ఇచ్చేటప్పుడు అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలని మన పెద్దలు ఊరికినే చెప్పలేదు. ఇప్పటి రోజుల్లో ముత్తాతల పేర్లే తెలియని బంధాలు మనవి. ఏడు తరాలు, మూడు తరాలు ఎలాగూ చూడలేం. కనీసం ఇప్పటి తరమూ చూడలేం. అందుకే పిల్లనయినా, పిల్లాడినయినా ఇచ్చేటప్పుడు కుటుంబం, పెరిగిన వాతావరణం అయినా చూడాలి. అందుకే మన పెద్దలు మరో మాట కూడా చెప్పారు. వియ్యానికైనా, కయ్యానికైనా సమవుజ్జీ ఉండాలని. ఇది అనుభవపూర్వకంగా నేనెరిన సత్యం కూడానూ. 
      కుటుంబం విలువ తెలియని వారికి విలువ ఇవ్వడం కూడా ఓ నేరమే. దానికి శిక్ష మనమే అనుభవించాలి తప్పదు. పైకి అందరు సాధు జీవులుగానే కనబడతారు. నటనేదో, నిజమేదో తెలుసుకోవడం చాలా కష్టం. రెండు నాలుకలున్న మనిషి పాము కన్నా చాలా ప్రమాదకరం. పాముకి కోరల్లో మాత్రమే విషముంటుంది. ఈ ధోరణి మనుషులకు ఒళ్ళంతా విషమే. అవసరానికి అనుగుణంగా రంగులు మారుస్తూ ఉంటారు. తెల్లారి లేస్తే సూక్తిసుధలు ప్రవహింప చేస్తారు. కాని తామెంత వరకు పాటించారో ఆలోచించరు. ప్రపంచమంతా వీరి అడుగుజాడల్లోనే నడుస్తోందన్న భ్రమలో బతికేస్తుంటారు. ఇంటి అవసరాలు పట్టవు కాని ప్రపంచంలో అందరి బాగోగులు సమీక్షిస్తారు. తాము తప్ప మిగిలిన వారంతా పనికిరాని వాళ్ళన్న అహంకారం ఎక్కువ. గురివింద గింజకు దాని నలుపు తెలియనట్లన్న మాట. మన సమాజంలో అందరూ గురివింద గింజలే మరి. 

 

18, ఆగస్టు 2020, మంగళవారం

మృత్యుహేల..!!

భారాన్ని మెాయాల్సిన భర్త 
అర్ధంతరంగా వదిలిపోతే
నక్కజిత్తుల ఈ లోకంలో
వలసకూలిగా మారి
తన బతుకు తాను బతుకుతూ
బిడ్డ అడగకుండానే
ఆకలి తీరుస్తూ
పట్టు పరుపులు లేకున్నా 
తన గుండెలనే 
పానుపుగా చేసి
చీర కొంగును 
రక్షగా కప్పుతూ
కంటికి రెప్పలా
కాచుకునే కన్నతల్లి
తిరిగిరాని లోకాలకు చేరిందని
తెలియని ఆ పసిప్రాణం
అమ్మ కప్పిన దుప్పటితో
దాగుడుమూతలాడుతూ
ఆడుకుంటున్న దృశ్యం చూస్తే
కరడుగట్టిన కసాయికైనా
మనసు కరగకుండునా.. 
మృతకణపు మృత్యుహేలకు
మరణశాసనం రాయాలన్న తలంపు 
విధాతకు కలిగేదెన్నడో మరి...!! 


 

17, ఆగస్టు 2020, సోమవారం

కాలం వెంబడి కలం..15

      ఇంజనీరింగ్ ఫైనలియర్ జూనియర్స్ తో కలిసి మెుదలైంది. మా క్లాస్మేట్స్ కూడా చాలా మంది ఉన్నారు. కృష్ణకాంత్ వెళిపోతూ దినేష్ ని పరిచయం చేసారు. అమ్మాయిల్లో లాస్ట్ రెండు బెంచ్ లు మావే. మా ముందు అను, పొడుగు, పొట్టి వాళ్ళు కూర్చునేవారు. మా బెంచ్ లో నేను, వెంబడి నిర్మా,, నీలిమ, ఉమారాణి కూర్చునేవాళ్ళం. మా వెనుక బెంచ్ లో దినేష్ వాళ్ళు, రాంమెాహన్ వాళ్ళు కూర్చునేవారు. దినేష్ నవ్వేవాడు ఏంటి లాస్ట్ బెంచ్ లు మీవేనా అని. ఎమ్ టెక్ చేయడానికి వెళ్ళిన మురుగన్ సర్ మళ్ళీ మాకు AWT(యాంటెనా వేవ్ థియరీ) చెప్పడానికి వచ్చారు. మా బద్దకిస్ట్ శివప్రసాద్ సర్ మ్యూపి (మైకోప్రాసెసర్), ఈరన్న సర్, ఇంకా మిగిలిన సర్ లు అంతా పాతవాళ్ళే. ఎకనమిక్స్ మాకు కొత్త సబ్జక్. ప్రాజెక్ట్ గైడ్ హరికృష్ణ మా క్లాస్మేట్. ఇక ప్రాజెక్ట్ టీమ్ కోసం మేం ఎవరిని అడగలేదు. మామూలుగా అబ్బాయిలు ఎక్కువమంది ఉంటూ ఒకరో, ఇద్దరో అమ్మాయిలుండటం సాధారణంగా జరుగుతుంది. సరే జూనియర్స్ కి అంటే మేం పెద్దగా తెలియదు. మా వాళ్ళు కూడా ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. వాళ్ళెవరు అడగకపోతే మాకేం భయం. నేను అన్నాను...మనమే చేసుకుందాం అని. సరేనని మా టీమ్ నేను, నీలిమ, నిర్మా, ఉమారాణి అని అనుకున్నాం. మాతోపాటు మా ప్రాజెక్ట్ లో మా క్లాస్మేట్ వెంకటస్వామి కూడా జాయిన్ అయ్యాడు. 
ఎలివేటర్ కంట్రోల్ సిస్టమ్ మా ప్రాజెక్ట్.
         మా బద్దకిస్ట్ శివప్రసాద్ సర్ మ్యూపి చాలా బాగా చెప్పేవారు. థర్డ్ ఇయర్లోలా సరదాగా ఉండేవారు కాదు. ఆయన క్లాస్ ఫుల్ అటెండెన్స్ ఉండేది. చాలా కామ్ గా వినేవాందరు. మధ్య మధ్య ప్రశ్నలు కూడా అడిగేవారు. ఒక్క క్లాస్ బంక్ కొట్టినా మన పని అయిపోయినట్లే అనుకునేవారం. మ్యూపి లాబ్ కూడా ఉండేది. శివప్రసాద్ సర్ ఇన్ఛార్జ్. నేను, నా క్లాస్మేట్ కళ్యాణ్,జూనియర్ మహేష్ కన్నడ అబ్బాయి బాచ్మేట్స్ మి. నేను మ్యూపి ప్రాక్టికల్ ప్రోగ్రామ్ ముందే రాసుకుని వెళ్ళేదాన్ని. శివప్రసాద్ సర్ క్లాస్ లో అందరం భయపడేవాళ్ళం. లాబ్ లో నన్ను ప్రోగ్రామ్ రాయమనే వారు. రాశాక మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమనేవారు. ఏదోక ప్రశ్న అడుగుతూనే ఉండేవారు. ఆయన అడిగే పద్ధతికి నాకు నవ్వు వచ్చేది. పుస్తకం అడ్డుపెట్టుకుని నవ్వుతూ ఉండేదాన్ని. సర్ చూసి నవ్వుతారేంటండి చెప్పండి అనేవారు. మహేష్ ని నేను, కళ్యాణ్ ఏడిపిస్తూ ఉండేవాళ్ళం. అసలు సంగతేంటంటే నేను, మా పొట్టి క్లాస్లు ఎగ్గొట్టి సినిమా రిలీజ్ అయిన రోజే వెళిపోయేవాళ్ళం. ఈ శివప్రసాద్, ఈరన్న సర్ లు బైక్ మీద సినిమాకి వచ్చేవాళ్ళు.అదన్న మాట అసలు విషయం. ఇలా మ్యూపి లాబ్ సరదాగా ఉండేది మా అల్లరితో. 
        మా మురుగన్ సర్ క్లాస్ లో జనాలు గొడవ చేస్తే సర్ అలిగి క్లాస్ వదిలి వెళిపోయేవారు. మళ్ళీ సర్ ని బ్రతిమాలి, ఏంటి సర్ చిన్నపిల్లోడిలా మీరిలా అలగడం ఏం బాలేదని చెప్పి క్లాస్ కి వచ్చేటట్లు చేసేవాళ్ళం. మురుగన్ సర్ బాగా సెన్సిటివ్. అప్పుడప్పుడూ ఇలాంటి విషయాల్లో ఆయనకు క్లాస్ మేం తీసుకోవాల్సి వచ్చేది. ఫైనల్ ఇయర్ లో సెమినార్ ఉండేది. మురుగన్ సర్ ఇన్ఛార్జ్ దానికి. మా వెంకటస్వామి సెమినార్ క్లాస్ మెుత్తానికి హైలెట్. చాలా చాలా చిన్న అక్షరాలతో పేపర్లలో మెుత్తం రాసుకుని వచ్చి బోర్డ్ మీద రాసేసాడు. అందరం భలే ఎంజాయ్ చేసాము తను సెమినార్ చెప్పేటప్పుడు అదేలెండి రాసేటప్పుడు. ఇక నా సెమినార్ సంగతంటారా...జనం ఎక్కువగా లేరని మెుదలు పెడితే కంప్యూటర్స్, మెకానికల్ వాళ్ళు కూడా వచ్చేసి క్లాస్ నిండుగా ఉంది. మనకేమెా మాట్లాడటం రాదాయే. ఎప్పుడో చిన్నప్పుడు ప్రతిసారి డిబేట్ లో నాకే ఫస్ట్ వచ్చిందని, ఇంజనీరింగ్ లో సెమినార్ అదీ అంతమంది ముందు చెప్పేద్దామనుకుంటే ఎలా? మురుగన్ సర్ ఓన్లీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు మాత్రమే ఉండి మిగతావాళ్ళని వెళిపొమ్మన్నారు. హమ్మయ్య అనుకున్నా. అయినా ఓ పదిమంది ఉంటారులే ఏదో చెప్పేసి మమ అనిపించుకుందామని నేను అనుకుంటే, మరి ఎలా తెలిసిందో ఏమెా అందరు వచ్చేసారు. ఏం చేస్తాం చెప్పాలి కదా అని చేతిలో పేపర్స్ తో డయాస్ ఎక్కాను. అందరికి విష్ చేసి నేను ఇయర్ గాప్ లో నేర్చుకున్న కంప్యూటర్ డాటాబేస్ గురించి చెప్పడం మెుదలుపెట్టాను. నాకే తెలుస్తోంది చేతులు ఒణకడం. పాపం అందరు చూస్తున్నారు కాని ఎవరు నవ్వలేదు. ఇలా కాదని స్పీచ్ టేబుట్ పేపర్స్ పెట్టేసి నేనే నవ్వేసి, ఓ నిమిషం ఆగి గబగబా చెప్పేసి ఎనీ డౌట్స్ అని, ఎవరు అడగరులే అనుకుని, హమ్మయ్య అని ఊపిరి పీల్చుకోబోతుంటే, మురుగన్ సర్ లేచి ప్రశ్నలు అడగండి, మీకు మళ్ళీ ఛాన్స్ రాదని చెప్పారు. మా రాంమెాహన్ ని కూడా అడగమన్నారు. మిమ్మల్ని వదలదు అడగకుండా, అందుకే మీరు అడగండి అని. ఎవరు ప్రశ్నలు అడిగే సాహసం చేయలేదు. మురుగన్ సర్ మాత్రం నాలుగైదు ప్రశ్నలు అడిగి నా సెమినార్ ముగించారు. సెమినార్ అయ్యాక మా కాలేజ్ కాంటీన్ లో మా అల్లరి బాచ్ కి, మురుగన్ సర్ కి మిర్చి బజ్జి, సాఫ్ట్ డ్రింక్ పార్టీతో సరిపెట్టేసాను. మా కాలేజ్ కాంటీన్ లో మిర్చి బజ్జి భలే బావుండేది. మీకు నోరు ఊరుతోంది కదా... మిర్చి బజ్జీ టేస్ట్ ఊహించుకోండి ఇప్పటికి..... 

వచ్చే వారం మరిన్ని కబుర్లతో.... 

16, ఆగస్టు 2020, ఆదివారం

ఆఫ్ట్రాల్ ఆంధ్రుడు..!!

సమాజానికి సమాధి కట్టి, నోరు తిరగని నిరక్షరాశ్యతను నిరారక్షితంగా మార్చి, అభివృద్ధి అంటే అప్పుల్లో ఆరితేరడమని చెప్తూ, న్యాయమే తెలియని సమన్యాయంతో ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టి, ఆరంగేట్రం చేయించిన అమ్మకు ధీటుగా ముక్కలు చెక్కలు చేయడంలో తన వంతుగా కృషి చేస్తూ....నోరు తిరగడం లేదని మాతృభాషనే చంపేయాలనుకునే నువ్వురా నాయకుడంటే. నీలాంటి నాయకుడిని ఎన్నుకున్న జనానికి యావత్ తెలుగుజాతి బుుణపడి ఉంటుంది. తరతరాల ఆంధ్రుల చరిత తలరాతను మార్చిన ఓ నాయకుడా నీ పాలనకు, నీ తెలివికి ప్రపంచమే నీకు పాదాక్రాంతం. ఆఫ్ట్రాల్ ఆంధ్రుడెంత? 

13, ఆగస్టు 2020, గురువారం

ఊసులాడే ఒక జాబిలట సమీక్ష...!!

                                      "  కాలం అందించిన జ్ఞాపకాల ఊసుల కలం స్నేహ మాధుర్యం.. "

                ఎన్నో పుస్తకాలు చదువుతాం, కాని ఆ పుస్తకం చదివిన అనుభూతి మనసులో కొన్ని కాలాలపాటు వెంటాడటం చాలా అరుదు. అలాంటి ఓ పుస్తకమే " ఊసులాడే ఒక జాబిలట. " నాకు బ్లాగర్ గా నిషిగంధ గారు పరిచయం. కౌముది డాట్ నెట్ లో నా తెలుగు పుస్తకాల వెదుకులాటల్లో దొరికిన ఓ వెన్నెల జలతారే ఈ " ఊసులాడే ఒక జాబిలట. " యదార్థ సంఘటనకు అద్భుతమైన అక్షర రూపం. ఆధునికత మాయలో పడి అందరం యాంత్రికంగా మారిపోతున్న ఈరోజుల్లో, మనం కోల్పోతున్నదేమిటో కాస్త తరచి చూసుకోవడానికి ఓ ఆలోచనను అంకురింపజేసే భావుకత నిండిన స్నేహాన్ని, అది పంచిన అనుభూతులను అత్యంత హృద్యంగా అక్షరీకరించిన నవల " ఊసులాడే ఒక జాబిలట. "

                 " గువ్వల కువకువల సుప్రభాతంతో నిద్ర లేస్తున్న బాలభానుడు అసురసంధ్య అల్లరి తట్టుకోలేక ఎర్రబడ్డ మొహంతో అస్తమిస్తున్న సూర్యుడు.. తొలిపొద్దు మలిపొద్దూ గోరువెచ్చగా, నిన్ను గుర్తు చేస్తే అది నా తప్పు కాదు..!!
కను రెప్పల కింద భాష్యాలకే కాదు కలలకీ చోటు ఉందని.. ఉండాలని..
వాడిన పువ్వు మూగవేదనే కాదు స్వచ్ఛమైన పచ్చదనం సాక్షిగా రేపు విచ్చుకోబోతున్న మొగ్గ తెచ్చే ఆశల వర్ణాలనీ గుండె నిండా నింపుకోవాలనీ..
మిత్రమా! నా నిశ్శబ్దపు ప్రపంచంలో, నా వెతల కలతను దూరం చేస్తూ నువ్వు ఆలపించిన ఆత్మీయతా రాగం గాయత్రీమంత్రమై, నా దోసిలిని నమ్మకాల పూలతో నింపుతూ..
మలయమారుతమై మనసుని కమ్మి..
పదాలే లేని నా బ్రతుకుని శ్లోకంలా మలచుకునేందుకు స్ఫూర్తివైన నువ్వున్న తీరాన్ని నేను చేరగలనా!?
ఒక్కసారి ఒకే ఒక్కసారి.. నిన్ను చూడాలనీ.. నువ్వు నేర్పిన నా బ్రతుకు పాట నీకు వినిపించాలనీ.. అది విని నీ పెదవులపై విరిసిన ఆనందపు నెలవంకను దొంగిలించి దిగంతాల అంచులకి పరిగెట్టి పారిపోవాలనీ..
నేస్తం కళ్ళలో దీపాలు వెలిగించాను. ఇంక నీ నిరీక్షణలో నాకు చీకటైనా పర్వాలేదు!!"

             ఇలా నవల మొదలౌతుంది. ఇదంతా ఎందుకు రాశానంటే ఇందులో ఏ ఒక్క అక్షరమూ వదలడం నాకు ఇష్టం లేదు. అది ఎందుకో చదివిన మీకూ ఈపాటికి అర్థమై ఉంటుంది.  ఈ నవల ప్రత్యేకత కూడా ఇదే. మన తరం  మాత్రమే ఆస్వాదించిన ఉత్తరాల అనుభూతిని మరోసారి మనకు గుర్తు చేస్తూ, ఇప్పటి తరానికి తెలియని ఆ లేఖల మాధుర్యాన్ని పంచిన నవల. ఈ నవల ఆసాంతమూ లేఖలలోనే సాగుతుంది. ఓ వారపత్రికలో కవితకు అభిమాని స్పందించి అభినందిస్తూ రాసిన లేఖతో మొదటి లేఖ ప్రారంభం అవుతుంది. దానికి తిరుగుజవాబు రాకపోతే మరోలేఖలో అది గుర్తు చేస్తూ తాను చదివిన మరో కవిత " వానచినుకు "ను విశ్లేషిస్తూ, చక్కని భావుకత్వాన్ని ఉత్తరంలో నింపేసి, తన కోరికను తెలుపుతూ ఆ కవయిత్రి ఆటోగ్రాఫ్ కావాలని రిప్లై కవరుంచుతూ, దానికి సంజాయిషీ చెప్తూ ఉత్తరాన్ని ముగిస్తుంది తన పేరు మరోసారి గుర్తు చేస్తూ.
            దానికి ఆ కవయిత్రి జవాబిస్తూ ఉత్తరం రాయడంతో వీరిద్దరి కలం స్నేహం మొదలౌతుంది. ఆ ఉత్తరంలో అభిమానికి కృతజ్ఞతలు చెప్తూ, అభిమాని చేతి రాతలోని ప్రత్యేకతను చెప్పడం, తాను అమ్మాయి కాదని అబ్బాయినని, కలం పేరుతో రాస్తుంటానని చెప్తూ, నిజం తెలిసాక కొందరు దూరం అవుతారని, కొందరు ఏం మాట్లాడక ఉండిపోతారని, మరి మీరు ఏ కోవకి చెందుతారని అడుగుతూ ముగిస్తారు కవిగారు తన మొదటి ఉత్తరాన్ని. తాను అభిమానించే కవి నుండి తనకు అందిన ఉత్తరాన్ని చింపడానికి పడిన ఉద్విగ్నతను, అది చదివిన తరువాత తన భావాలను పంచుకోవడంతో కవికి, అభిమానికి మధ్యన ఉత్తరాల స్నేహం కొనసాగటం, స్నేహానికి ఆడ, మగ తేడా లేదని నిరూపిస్తూ వీరిరువురి స్నేహం ఉత్తరాల్లోనే సాగుతుంది ఒకరిని ఒకరు చూసుకోకుండానే.
          ఎన్నో విషయాలు, కుటుంబ విషయాలు, అభిప్రాయాలు, అభిరుచులు, సమాజ పరిస్థితులు, చుట్టూ ఉన్న పరిచయస్తుల పరిచయాలు ఇలా ప్రతి చిన్న విషయాన్నీ ఇద్దరు తమ తమ ఉత్తరాల్లో పంచుకుంటూ మనల్ని కూడా ఆ స్నేహానుభూతుల ప్రపంచంలో విహరింపజేస్తారు. అభిమాని తాను పనిచేసే స్కూలు, పిల్లల, ఉపాధ్యాయుల కబుర్లు చెప్తూ, తనకున్న కోరిక కూడా పంచుకుంటుంది. పై చదువులు చదవాలనుకున్న తన ఇష్టాన్ని కాదనే అమ్మమ్మని ఒప్పించడానికి చేసే ప్రయత్నాలు, ఉత్తరం రాసేటప్పుడు చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను తన ఊహలను ఉసులుగా చెప్పడం, ఉత్తరాల్లోనే కుటుంబ పరిచయాల కార్యక్రమాలు, వ్యక్తుల పరిచయాలు, తమ చుట్టూ జరుగుతున్న సంఘటనలను ఇద్దరు ఒకరితో ఒకరు పంచుకుంటారు. పెళ్ళంటే విముఖత ఉన్న అభిమాని ఏ పరిస్థితుల్లో ఇంట్లో వాళ్ళను కాదని పెళ్ళి చేసుకోవాల్సి వచ్చిందో, ఆ తరువాతి సంఘటనలు ఇలా ఆ ఇరువురి ఉత్తరాలతోపాటు మరికొందరి ఉత్తరాలు కూడా చోటు చేసుకుంటాయి ఈ నవలలో.
          ఇద్దరు ఆడ మగ అపరిచితులు ఉత్తరాల్లో పరిచయం కావడం, అదే విడలేని స్నేహబంధం కావడం, ఒకరినొకరు అభిమానించుకుంటూ, అభిప్రాయాలు గౌరవించుకుంటూ, సలహాలు తీసుకుంటూ సాగడం, చివరి వరకు ఒకరినొకరు ప్రత్యక్షంగా చూసుకోలేక పోవడం అనేది చాలా అరుదైన స్నేహం. ఇలా చెప్పుకుంటూపోతే నవలను మించిపోతుంది నా సమీక్ష. చదవడం మొదలుపెడితే ఒక్క అక్షరం కూడా వదలకుండా చదివించే పుస్తకం ఇది. నేను చదివి పది సంవత్సరాలు దాటినా నన్ను ఇప్పటికీ వెంటాడే పుస్తకం " ఊసులాడే ఒక జాబిలట ." నవల ముగింపు చదివిన తరువాత ఓ కన్నీటి చుక్క మీ చెక్కిలిని స్పృశించక మానదు. ఇంత హృద్యంగా వాస్తవ సంఘటనను అక్షరీకరించిన నిషిగంధ గారికి, ఆమెతో రాయించిన కిరణ్ ప్రభ గారికి ఇద్దరికీ ప్రత్యేక అభినందనలు.

పుస్తకం లింక్... 

http://www.koumudi.net/books/usulade_jabilata_koumudi_novel.pdf
     

12, ఆగస్టు 2020, బుధవారం

భూతల స్వర్గమేనా..21

రోనెక్ సిటిలో AMSOL రవి ముదునూరు బుక్ చేసిన హోటల్కి వెళ్ళాను. పొద్దున్నే నన్ను అంతకు ముందు ఇంటర్వూ చేసినామెకి కాల్ చేసాను. తను 11 కి వచ్చి పిక్ చేసుకుంటానని చెప్పింది.సరిగ్గా 11 కి మా టెస్టింగ్ మేనేజర్ టీనా ఫీల్డ్స్ ఓ పెద్ద కార్ లో వచ్చి కంపెనీకి తీసుకువెళ్ళింది. కార్ లో తనతో మాట్లాడుతూ నా టెన్షన్ తగ్గించుకోవడానికి ప్రాజెక్ట్ వివరాలడిగాను. అప్పటికి నాకు మాన్యువల్ టెస్టింగ్ వచ్చు కాని ఆటోమేషన్ టెస్టింగ్ రాదు. ఈ ప్రాజెక్ట్ లో ఏ టెస్టింగ్ వాడుతున్నారని అడిగితే మాన్యువల్ అని చెప్పింది. అప్పుడు హమ్మయ్య అనుకున్నాను. టీనా చాలా చాలా మంచిది. నేను ఈ ప్రాజెక్ట్ కి వచ్చేసరికి దగ్గర దగ్గర 7, 8 నెలల నుండి వర్క్ పెండింగ్ ఉండిపోయింది. మెుదటిరోజు సిస్టమ్ అంతా సెట్ చేయడము, నేను వర్క్ ప్లాన్ చేసుకోవడంతో కాస్త పనే చేయగలిగాను. వంచిన కల ఎత్తకుండా ఓ 10, 12 రోజులు పని చేసి పెండింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసేసాను. ఇంతకీ కంపెనీ పేరు చెప్పలేదు కదా అడ్వాన్స్ ఆటో పార్ట్స్. అమెరికాలో చాలా పెద్ద పేరున్న కంపెనీ. ఈ కంపెనీలో ఇండియన్స్ చాలా తక్కువ మంది. ఓ ఐదారుగురు వచ్చి పరిచయం చేసుకున్నారు. కొసమెరుపేంటంటే తెలుగువారు ఒక్కరూ లేదన్న మాట. తమిళ్, మళయాళీ, నార్త్ ఇండియన్స్ ఉన్నారు. ఇలా ఇండియన్స్ ఎవరు వచ్చినా అందరు కలిసి ఒకరింట్లో గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తారట. నన్నూ అలాగే ఇన్వైట్ చేసారు. 
ఆఫీస్ వర్క్ అయ్యాక ఈవెనింగ్ నన్ను పిక్ చేసుకుని తీసుకువెళ్ళారు. అందరం చక్కగా పలకరించుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ చేసాం. తర్వాత మైల్డ్ లేడీస్ డ్రింక్ వైన్ ఆఫర్ చేసారు. అలవాటు లేదని చెప్తే, ఏం కాదు తాగమవ్నారు. నేను ప్రెగ్నెంట్ అని చెప్తూ, ఏదీ పడదని నా కండిషన్ గురించి చెప్పాను. ఆఫీస్ లో పని చేసే తమిళాయన వైఫ్ కూడా ప్రెగ్నెంట్ అని చెప్పింది. గెట్ టుగెదర్ బాగా జరిగింది. 
వర్క్ లో పడి తిండి కూడా సరిగా తినేదాన్ని కాదు. ఓ వేళ తిందామన్నా, కనీసం మంచినీళ్ళు కూడా పొట్టలో ఉండేవి కాదు. వామిటింగ్ అయిపోయేవి. ఆకలికి పేగులు మెలితిరిగి పోయేవి. ఆఫీస్ కాంటిన్ లో అప్పుడప్పుడూ తింటూ, మా టెస్టింగ్ టీమ్ కొలీగ్స్ లంచ్ కి బయటకెళుతూ ఏమైనా కావాలా అని అడిగితే మెక్ డోనాల్డ్స్ డాలర్ చికెన్ శాండ్ విచ్ తెమ్మని చెప్పేదాన్ని. అమెరికన్ గ్రాసరిస్టోర్ లో వేయించిన వేరుశనగపప్పు, ఎగ్స్, పాలు, ఏవో కొన్ని వెజిటబుల్స్ తెచ్చుకునేదాన్ని. ఇంటి దగ్గర నుండి తెచ్చిన వాటిలో నల్లకారం, శనగపప్పు కారం నాతో రోనెక్ తెచ్చుకున్నా. మిగిలినవన్నీ జలజ వదిన వాళ్ళింట్లోనే వదిలేసాను త్రీ వీక్స్ ప్రాజెక్టే కదా అని. అప్పటి వరకు తిండి విలువ తెలియలేదు. రోనెక్ పుణ్యమా అని తిండి విలువ బాగా తెలిసింది. మూడు వారాలే కదా అని హోటల్ లోనే ఉంటానని రవికి చెప్పాను. నా దగ్గర డబ్బులు లేవని కూడా చెప్పాను. 1000 డాలర్స్ అకౌంట్ లో వేశారు. 
ఆఫీస్ లో ఉన్నంతసేపు నా సెల్ సిగ్నల్ వచ్చేది కాదు. చాలా దూరం బయటకు రావాల్సి వచ్చేది బ్రేక్ టైమ్ లో. అందరూ సిగిరెట్లు కాల్చుకుంటుంటే నేను ఫోన్ మాట్లాడుకునేదాన్ని. కాని నా ప్లాన్ లో డే మినిట్స్ ఎక్కువ ఉండేవి కాదప్పుడు. అందుకని ఆఫీస్ లాండ్ లైన్ అదీ లంచ్ టైమ్ లోనో, ఈవెనింగ్ ఆఫీస్ అవర్స్ అయిపోయాకో వాడేదాన్ని. మధ్య మధ్యలో మరో జాబ్ కోసం ఆఫీస్ లాండ్ లైన్, ఈమెయిల్ వాడాల్సివచ్చేది రెజ్యూమ్ పంపడానికి.ఈ ప్రాజెక్ట్ ఉండేది మూడు వారాలే కదా అని. ఆఫీస్ కి మార్నింగ్ నడుచుకుంటూ వచ్చేదాన్ని. సాయంత్రం ఎవరో ఒకరు హోటల్ దగ్గర డ్రాప్ చేసేవారు. స్నో బాగా పడినప్పుడు కాబ్ బుక్ చేసుకునేదాన్ని. కాబ్  రానప్పుడు టీనాకి రావడం లేటవుతుందని ఫోన్ చేసి చెప్తే, రావద్దులే రెస్ట్ తీసుకో అని చెప్పేది. మాకు ప్రాజెక్ట్ రివ్యూ మీటింగ్స్ జరుగుతూ ఉండేవి. నేను ముందే టీనాకి వివరమంతా చెప్పేసేదాన్ని నేను చేసిన వాటి గురించి. మీటింగ్ లో తను నా గురించి కూడా బాగా మెచ్చుకుంటూ చెప్పేది. అది కొందరికి నచ్చలేదు. మా టెస్టింగ్ టీమ్ లో అందరు అమెరికన్సేనండోయ్. మా గోపాలరావు అన్నయ్య, వదిన వాళ్ళు, జలజ వదిన వాళ్ళు, ఉమ, మధు, సంధ్య, ఉష ఇలా అందరు ఫోన్ చేసి నా క్షేమ సమాచారాలు కనుక్కుంటూ ఉండేవారు. అలా మూడు వారాలు గడిచిపోయాయి. 

మళ్ళీ కలుద్దాం..

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో మరో కొత్త ఉద్యోగం కొత్త సిటీ లో... కేవలం 3 వారు మాత్రమె... అయితే...

నా అమెరికా కబుర్లను ప్రచురిస్తున్న ఆంంధ్రాప్రవాసి డాట్ కాం వారికి,   రాజశేఖర్ చప్పిడి గారికి మన:పూర్వక ధన్యవాదాలు..



ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో మరో కొత్త ఉద్యోగం కొత్త సిటీ లో... కేవలం 3 వారు మాత్రమె... అయితే...

11, ఆగస్టు 2020, మంగళవారం

కాలం వెంబడి కలం... 14

         ఎప్పుడూ ఇంట్లోవాళ్ళను వదిలి ఉండని నన్ను, మా నాన్న బళ్ళారిలో ఇంజనీరింగ్ లో చేర్పించడానికి మరో కారణం మా బేబమ్మ, కృష్ణ మామయ్య వాళ్ళు కూడా. ఫస్ట్ ఇయర్ అంతా బానే వచ్చి చూసి వెళ్ళేవారు కృష్ణ మామయ్య. నాకు వైట్, ఖాకి ఏప్రాన్ లు కుట్టించడం, కాలిక్యులేటర్ కొనివ్వడము ఇలా అన్ని చూసుకునేవారు. వాళ్ళ అబ్బాయి లీలాకుమార్ నాకు చిన్నప్పటినుండి మంచి ఫ్రెండ్, నా క్లాస్మేట్ కూడానూ. బొమ్మలు బాగా వేసేవాడు. 
ఆంధ్రాలో మెువ్వలో డిగ్రీ చదివేవాడు. తర్వాత మరి ఏమైందో తెలియదు కాని రావడం మానేసారు. నేనే ఓ రెండు మూడు సార్లు వాళ్ళ కాంప్ కి వెళ్ళి వచ్చాను. బస్ దిగి ఓ మూడు మైశ్ళ పైనే నడిచి వెళ్ళాలి వాళ్ళింటికి. చిన్న కాలిబాట ఉండేది. రెండు పక్కలా పొద్దుతిరుగుడు పూలతో పొలాలు చూడటానికి భలే అందంగా అనిపించేవి. నడిచిన దూరమే తెలిసేది కాదు. కాకపోతే ఒకే ఒక్క భయముండేది నడుస్తున్నంతసేపూ. ఎటునుండి ఏ పాము వస్తుందోనని. చాలా పెద్ద పెద్ద పాములుండేవి అక్కడ. నాకు భయమనేమెా పాపం ఓ పామూ కనబడలేదెప్పుడూ. 
       థర్డ్ ఇయర్లోనే అనుకుంటా ఓ ఆదివారం రోజు నాకు బాగా ఆకలి వేస్తోంది పొద్దు పొద్దున్నే. ఆ ముందురోజు ఏమి తినలేదు. హాస్టల్ మెస్ లో బిసిబేళా బాత్ టిఫిన్ ఆరోజు. నా తమిళ్ ఫ్రెండ్ ఉమారాణిని బయటికి వెళ్ళి టిఫిన్ తినివద్దాం పదా అంటే, తను రడీ అవుతోంది. సండే కదా అంత పొద్దు పొద్దున్నే ఎవరు లేవరు కదా. మీ అందరికి కూడా తెలుసుగా ఆ విషయం. ఈ లోపల వాచెమెన్ విజిటర్స్ వచ్చారని చెప్పాడు. కిందకి వెళితే ఇద్దరు అబ్బాయిలు కనిపించారు. మీకు లీలాకుమార్ తెలుసు కదా వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఓపిడి దగ్గర ఉన్నారని చెప్పారు. నాకు లీలాకుమారి అని అనిపించింది. మా యశోదా వాళ్ళ అక్క లీలాకుమారి. మాకు 3 ఇయర్స్ సీనియర్. వాళ్ళ నాన్నగారు చనిపోతే నాకు చెబుతారేంటి అనిపించింది.మళ్ళీ అడిగాను వివరం. వాళ్ళు మళ్ళీ వివరంగా చెప్పారు. సరే నేను హాస్పిటల్ కి వస్తానని చెప్పాను. ఉమరాణిని తీసుకుని వెంటనే ఓపిడి హాస్పిటల్ మార్చురి రూమ్ దగ్గరకి వెళ్ళాను. మా కాలేజ్ నుండి అప్పుడప్పుడూ బస్ మిస్ అయినప్పుడు నడుచుకుంటూ దీని పక్కనుండే వచ్చేవాళ్ళం బస్ స్టాప్ దగ్గరకి. కాని ఇలా రావాల్సిన అవసరం పడుతుందని అస్సలు అనుకోలేదు. లీలాకుమార్ అక్కడే ఉన్నాడు. హాస్పిటల్ ఫార్మాలిటీస్ పూర్తి చేసే ముందు, చూస్తారా అని అడిగితే చూస్తానని తల ఊపాను. లోపలికి తీసుకువెళ్ళారు. శరీరమంతా బాండేజ్ చుట్టేసారు. ముఖం మాత్రం కనబడుతోంది. ఏంటోగా అనిపించింది మామయ్యను అలా చూసేసరికి. అయినవాళ్ళంతా దూరాన ఉన్నారు. ఉమని హాస్టల్ కి వెళ్ళమని చెప్పి, రేపు వస్తానని వార్డెన్ కి కూడా ఇన్ఫామ్ చేయమని చెప్పాను. మామూలుగా అయితే మా వార్డెన్ పర్మిషన్ ఇవ్వదు. ఓ రోజు ముందే పుస్తకంలో రాయాలి. తర్వాత తిడితే తిడుతుందిలే అని అనుకున్నాను. లీలాకుమార్ తో కార్ లో కాంప్ కి వెళ్ళాను. మా వెనుక ట్రాక్టర్ లో కృష్ణ మామయ్యను తీసుకువచ్చారు. నన్ను చూడగానే బేబమ్మ ఇలా రావాలని ఇన్ని రోజులు రాలేదా అని ఏడిచింది. అంతకు ముందున్న చోటు నుండి మారారు. ఈ ఇంటికి ఇదే వెళ్ళడం నేను. మా ఊరు నుండి అయినవారందరు తెల్లవారు ఝాముకి వచ్చారు. పొద్దున్నే తీసుకువెళిపోగానే నేను హాస్టల్ కి వచ్చేసాను. ఆ మధ్యాహ్నం నిద్రపోతుంటే విజిటర్స్ అని పిలుపు. ఎవరాని వెళితే నాన్న, శ్రీధర్ అంకుల్ ఉన్నారు. ఈ శ్రీధర్ అంకులే నాకు ఇంజనీరింగ్ సీట్ తక్కువ డొనేషన్ కు ఇప్పించింది. నా హెల్త్ ప్రోబ్లం అప్పుడు ఇంటికి వెళుతుంటే ట్రైన్ లో పరిచయం అంకుల్, ఆంటి. తర్వాత నాన్న చెప్పారు. కృష్ణ మామయ్య విషయం హాస్పిటల్ లో అంతా శ్రీధర్ అంకుల్ చూసారు. కేస్ అదీ లేకుండా, బాడి తొందరగా ఇచ్చేటట్లు చేసారు. కాసేపు మాట్లాడి వెళిపోయారు. 

వచ్చే వారం మరిన్ని కబుర్లతో... 
           

4, ఆగస్టు 2020, మంగళవారం

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో నుండి ఇండియా రాక... తిరిగి వెళ్ళిన తరువాత ఉద్యోగాల వేట... ఎన్ని ఎబ్బందులో...

నా అమెరికా కబుర్లను ప్రచురిస్తున్న ఆంంధ్రాప్రవాసి డాట్ కాం వారికి,   రాజశేఖర్ చప్పిడి గారికి మన:పూర్వక ధన్యవాదాలు..



ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో నుండి ఇండియా రాక... తిరిగి వెళ్ళిన తరువాత ఉద్యోగాల వేట... ఎన్ని ఎబ్బందులో...

భూతల స్వర్గమేనా..20

పార్ట్..20
పినాకిని మమ్మల్ని విజయవాడ చేర్చింది. అక్కడి నుండి ఇంటికి చేరాము. నా కొడుకు నన్ను గుర్తు పట్టలేదు కాని నా గొంతు గుర్తు పట్టాడు. హమ్మయ్య నా ఫోన్ ఖర్చు వేస్ట్ కాలేదన్న ఆనందం. ఎందుకంటే తిన్నా తినకపోయినా వీలయినంత వరకు రోజూ ఫోన్ చేసేదాన్ని. కనీసం 5 నిమిషాలయినా వాడితో మాట్లాడేదాన్ని. వాడి మూడో పుట్టినరోజుకి ఇంటికి వచ్చాను. వాళ్ళ నాన్న ఇల్లంతా పూలతో డెకరేషన్ చేయించారు. ఊరిలో పిల్లలందరిని పిలిచి పుట్టినరోజు వేడుక బాగా చేసాము. అప్పటికి మా ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు. మా మామయ్య కూతురు ప్రియ, మావాడు మౌర్య. ఎవరి పుట్టినరోజయినా ఇద్దరు పిల్లలు కేక్ కట్ చేసేవారు. అమెరికా నుండి వచ్చాక నేను ఇబ్బందిలో ఉన్నప్పుడు, అమెరికా వెళ్ళేటప్పుడు కనబడని బంధువులందరు కనిపించారు. మౌర్య డాబా పైనుంచి పడిపోయినప్పుడు అమ్మ తిరుపతి వెంకన్నకు ఏడూళ్ళు జోగి, నిలువుదోపు ఇస్తానని మెుక్కుకుందట. ఇంట్లో పూజ చేసుకుని,  అయినవాళ్ళందరితో తిరుపతి మెుక్కు తీర్చుకున్నాం. నా పాస్పోర్ట్, మా ఆయన పాస్పోర్ట్ కలిపి, డాక్యుమెంట్స్ అన్ని పెట్టి వీసా స్టాంపిగ్ కి పంపించాము. అప్పుడు పోస్ట్ లో పంపించడమే. అమెరికా వాళ్ళు ఒక్కోసారి ఒక్కో రూల్ పెడతారు. మళ్ళీ 2 ఇయర్స్ కి వీసా స్టాంపిగ్ అయ్యింది ఇద్దరికి.  రోజులు తొందరగా గడిచిపోయి, తిరుగు ప్రయాణం దగ్గరకి వచ్చేసింది. విజయవాడలో షాపింగ్, పచ్చళ్ళు, కారాలు సర్దుకుని అమెరికా తిరిగి బయలుదేరాను. 
         చికాగో ఎయిర్ పోర్ట్ కి బాబి వచ్చి పికప్ చేసుకున్నాడు. మరుసటి రోజు రెస్టారెంట్ కి వెళ్ళేసరికి కవితక్క వాళ్ళు లేరు. బిగ్ ఆపిల్ బేగిల్స్ లో వినోద్ ఉన్నాడు. మా కిరణ్ కి జాబ్ కావాలని అడిగితే రామస్వామి గారు రమ్మని చెప్పారు. వాడు వేరే చోట ఏదో మెాటల్ లో చేస్తున్నాడు అప్పుడు. MS చదువుకునే మనవాళ్ళందరు హాలిడేస్ లో ఇలా జాబ్ లు చేయడం మామూలే. కిరణ్ బాబీ వాళ్ళతో ఉండేవాడు. క్షణం కూడా ఖాళీ లేకుండా పని సరిపోయేది. బేగిల్స్ లో బేగిల్స్ బేక్ చేసే అతన్ని కూడా మానిపించేసారు. బేక్ చేయడానికి ఓ మెక్సికన్ వచ్చేవాడు. వింటర్ లో హెవీ స్నో  పడుతున్నా కూడా నేను తెల్లవారు ఝామున రెండింటికి వెళిపోయేదాన్ని బేగిల్స్ షాప్ కి. కొన్ని రోజుల తర్వాత వినోద్, వెంకటేశ్వరరావు కూడా మానేసారు. తర్వాత మా ఆయన కజిన్ రమణ గారు కొన్ని రోజులు చేసి ఆయనా మానేసారు. తర్వాత కిరణ్ వాళ్ళ బంధువు భాను గారు చేసారు. ఆయనా సాఫ్ట్ వేరే కాని అప్పటి పరిస్థితి అలాంటిది మరి. ఎవరి రాజకీయాలు వాళ్ళు చేసుకుంటూ ఉండేవారు. రామస్వామి గారు నన్ను డ్రైవింగ్ నేర్చుకోమని అంటూ, కాస్త పెడసరంగా మాట్లాడటం మెుదలుబెట్టారు. డ్రైవింగ్ నేర్చుకునే టైమ్ ఇవ్వాలి కదా. ఆ గోల పడలేక ఓ రోజు వెళ్ళి లెర్నర్ పర్మిట్ తెచ్చుకున్నాను. అమెరికాలో డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ముందు లెర్నర్ పర్మిట్ రిటెన్ టెస్ట్ రాసి తెచ్చుకోవాలి. ఈ రిటెన్ టెస్ట్ ఏ స్టేట్ కి ఆ స్టేట్ కే సపరేట్ గా ఉంటుంది. తర్వాత డ్రైవింగ్ టెస్ట్ రోడ్ టెస్ట్ ఇవ్వాలన్నమాట. లెర్నర్ పర్మిట్ ఉంటేనే రోడ్ టెస్ట్ ఇవ్వాలి. అప్పుడప్పుడూ మధు, సంధ్యా వాళ్ళు నేర్పించేవారు వాళ్ళ కార్ తో. 
నేను హైదరాబాదు హాస్టల్ లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ వినితో పాటు ఉషామాధవి అని మరో ఫ్రెండ్ ఉండేది. తను MSC కెమిస్ట్రీ చేసింది. నేను అమెరికా రాకముందే తనకి అమెరికా రావడానికి రాజగోపాల్ వాళ్ళ అన్నయ్య ద్వారా H1B వీసా కోసం మద్రాస్ వెళ్ళి డబ్బులు కట్టి పేపర్స్ ఫైల్ చేయించాము. పేపర్స్ రావడం, స్టాంపిగ్ కావడం అయ్యింది. కాని జాబ్ మార్కెట్ అప్పటికే అమెరికాలో బాలేదు. అందుకని వాళ్ళ ఎంప్లాయర్ రిస్క్ తీసుకోను, మీరు కావాలంటే మా ఆఫీస్ ఉన్న శాన్ఫ్రాన్సిస్కో వచ్చి తర్వాత మీకు కావాల్సిన చోటికి వెళ్ళండి. అలా అయితేనే పేపర్స్ ఇస్తాను అన్నాడు. అందుకని ఉషకి శాన్ఫ్రాన్సిస్కో నుండి చికాగోకి టికెట్ బుక్ చేసాను. తనని జలజ వదిన వాళ్ళు పిక్ చేసుకున్నారు. నాతోపాటు రామస్వామి గారింట్లోనే ఉండేది. అప్పుడప్పుడూ మాతో ఇండియన్ గ్రాసరిస్టోర్ లో ఉంటూ వుండేది. మా సీనియర్ రాంకుమార్ గారు సెయింట్ లూయీస్ లో సబ్ వే లో పని చేసేవారు. తన రూంమేట్ కూడా సబ్ వే లోనే.  వాళ్ళిద్దరు నువ్వే వేరేవాళ్ళింట్లో ఉంటున్నావు. ఉషని మా దగ్గరకి పంపు అని చెప్పారు. నచ్చితే సబ్ వే లో చేస్తుంది లేదా జాబ్ ట్రయల్స్ వేసుకుంటుంది అని అంటే ఉషని సెయింట్ లూయిస్ పంపించాను. ఉష వచ్చిన టైమ్ లోనే మా ఆయన కూడా అమెరికా వచ్చారు. మా ఆయన అమెరికా వచ్చినప్పుడు జలజ వదిన, అన్నయ్య చికాగో ఎయిర్ పోర్ట్ లో రిసీవ్ చేసుకుంటే, బాబీ వెళ్ళి  తీసుకువచ్చాడు. రెస్టారెంట్ లో పని చేస్తూ ఉండేవారు. పెరుగన్నం మాత్రమే తిన్నారు ఉన్నన్ని రోజులు. ఓ ఆరు నెలలు ఉండి ఉండలేక ఇండియా వెళతానని అన్నారు. రామస్వామి గారికి చెప్పాను. అప్పటికే నేను రామస్వామి గారితో సరిగా మాట్లాడటం లేదు, మాధవి అక్కని వేరే వారి దగ్గర చాలా తేడాగా మాట్లాడారని. నా పని నేను చేసుకుంటున్నాను. మీ ఆయనకు డబ్బులు ఏమి ఇవ్వను, నీకు కూడా రోజుకి ఎనిమిది గంటలకు మాత్రమే ఇస్తాను అని అంటే నేను పని చేయను వెళిపోతానని చెప్పాను. రోజుకి 20, 22 గంటలు 10 నెలలు పని చేసాను. మూడు చోట్లా మెుత్తం పని చేసేదాన్ని. ఇలా అంటారని ఊహించలేదు. ఆడపిల్ల సొమ్ము తిని బాగుపడిందెవరులే అనుకున్నాను. ఓ 30 వేల డాలర్లు ఎగ్గొట్టారు. మాధవక్క నన్ను చాలా బాగా చూసుకుంది. మాధవి అక్క మాత్రం వెళిపోతున్నానంటే బాగా ఏడిచింది. నీకు ఈ ఇంట్లో ఉండే హక్కు ఉంది. నువ్వు నీ జాబ్ చూసుకునే ఇక్కడనుండి వెళ్ళు అంది. ఎక్కడికి వెళతావు అంటే జలజ వదిన వాళ్ళింటికి వెళతాను అన్నాను. నా సంగతి అక్కకు బాగా తెలుసు. నువ్వు ఎన్నిసార్లు వాళ్ళింటికి వెళ్ళావో నాకు తెలుసు. నీకు జాబ్ వచ్చేవరకు ఇక్కడే ఉండు. ఏ పని చేయనక్కర్లేదు అంది. లేదక్కా ఉండలేను, వెళిపోతానన్నాను. వెంటనే నేను, మావారు మధు వాళ్ళింటికి వెళ్ళాము. రెండు రోజులు అక్కడే ఉన్నాము. మధు వాళ్ళింటికి వచ్చిన మరుసటి రోజు పొద్దున్నే బాబి వచ్చాడు మా దగ్గరకు. తర్వాత మేము జలజ వదిన వాళ్ళింటికి వెళ్ళాము. మావారికి నాకు ప్రెగ్నెన్సీ అని అనుమానమని చెప్పాను. మావారు ఇండియా వెళ్ళారు 20 రోజులలో వచ్చేస్తానని. నేను జాబ్ వెదుకులాటలో పడ్డాను. రాంకుమార్ వాళ్ళు నన్ను కూడా సెయింట్ లూయీస్ వచ్చేయమంటే మిగతా లగేజ్ అంతా వదిన వాళ్ళింట్లో వదిలేసి, బట్టలు మాత్రం తీసుకుని సెయింట్ లూయీస్ ట్రైన్ లో వెళ్ళాను. చాలా బావుంది ట్రైన్ జర్నీ. అప్పటికే నాకు ప్రెగ్నెన్సీ అని కన్ఫామ్ అయ్యింది. సబ్ వే లో చేయలేనని చెప్పాను. నేను సెయింట్ లూయీస్ వచ్చిన 4,5 రోజులలోనే మధు వాళ్ళు వచ్చారు. వాళ్ళతో చికాగో వచ్చేసాను. 
మధు వాళ్ళింట్లో ఉన్నప్పుడే 2, 3 ఇంటర్వ్యూలు ఫోన్లోనే ఎటెండ్ అయ్యాను. జనరల్ గా అమెరికన్స్ ఇంటర్వ్యూ చేస్తే మాగ్జిమమ్ 20 మినిట్స్ ఉంటుంది. మన ఇండియన్స్ మాత్రం మనకు రాదనే వరకు చేసి వారి ఇగో శాటిస్ఫై చేసుకుంటారు. నేను ఎటెండ్ చేసిన కాల్స్ ఒకటి సైన్ ఆన్ మీద. అది నాకు రాదు కాని వేరే ఎవరో ఫోన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంటర్వ్యూ  ఎటెండ్ చేసాను. బానే చెప్పాను కూడా. మరొకటి AS/400 టెస్టింగ్ మీద. ఇంటర్వ్యూ చేసింది అమెరికన్. 45 మినిట్స్ చేసింది. బానే చెప్పాను కాని అంతసేపు చేసేసరికి డౌట్ వచ్చింది. ఈ ఇంటర్వ్యూ ఎరేంజ్ చేసింది వర్మ గారు. మధ్యలో 4 లేయర్స్.మా ఎంప్లాయర్ తో కలిపి ఐదన్న మాట. 
సరే మార్కెట్ బాలేదు కదా అని వేరే జాబ్స్ కూడా ట్రై చేస్తున్నాను. మధు, సంధ్య వాళ్ళు కూడా బయట జాబ్స్ ట్రై చేస్తున్నారు. మాల్ లో కళ్ళజోళ్ళు అమ్మే జాబ్ దొరికింది ఒహాయెా, సిన్ సినాటిలో నాకు, ఉషకు కూడా కలిపి. వెళదామని డిసైడ్ అయ్యాము అందరం. నేను, మధు, సంధ్య చికాగో నుండి, ఉష సెయింట్ లూయీస్ నుండి బయలుదేరడానికి రడి అయ్యాము. రేపు బయలుదేరాలనగా నాకు AS/400 టెస్టింగ్ జాబ్ రోనెక్ సిటీ, వర్జీనియా స్టేట్ లో వచ్చింది. అందరికి పోనూ నాకు అవర్ కి 20 డాలర్స్ వస్తాయి. మళ్ళీ దానిలోనే కంపెనీ టాక్స్ కట్టాలి. అసలు 80 డాలర్స్ బిల్లింగ్ ప్రాజెక్ట్. కాని 3 వీక్స్ ప్రాజెక్ట్ అన్నారు. మా AMSOL సుబ్బరాజు కి చెప్తే ప్రాజెక్ట్ కి వెళ్ళండి. మీకు గ్రీన్కార్డ్ కి లేబర్ ఫైల్ చేస్తాను అన్నారు. 3 వారాలే కదా అని వెళదామని డిసైడ్ అయ్యాను. మధు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. నా దగ్గర ఓ 250 డాలర్స్ ఉంటే వాటిలో 150 డాలర్లు వాళ్ళకు  ఇచ్చి నేను రోనెక్ సిటీ కి బయలుదేరాను. 


మళ్ళీ కలుద్దాం....
 

3, ఆగస్టు 2020, సోమవారం

అగమ్యగోచరం...!!

       కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజల కోరికను బాగా తీర్చారు కదా... మీకు కావాల్సింది ఇదే కదా.. 
ఎంజాయ్ చేయండి...చిలక్కి చెప్పినట్టు చెప్పినా వినని బతుకుల రాత ఇంతే.. అనుభవించండి.. అభివృద్ధి పధంలో మునుముందుకు దూసుకుపోతున్నందుకు...ప్రపంచానికే ఆదర్శ పారదర్శక పరిపాలనకు, ఓ కులాన్ని దూషిస్తూ తన మంచి మనసు చాటుకున్న, సదరు దైవస్వరూపుని అసలు నైజం అర్థం అయ్యిందా ఇప్పటికైనా...రాజకీయ పార్టీలలకతీతంగా మీ మీ పదవులకు రాజీనామాలు చేసి కనీసం మనుషులుగా మిగలండి. లేదంటారా ఈ వంచనకు ఫలితం అనుభవించక తప్పదు. ఎన్నికలు ముందోమాట...పట్టం కట్టాక నియంత పాలన... ఇదేగా అందరు తెలిసి ఓటు వేసిన పాలన. 
      అయినా పెద్దాయనా మీకున్న అనుభవం ఏమైంది? తెలిసి తెలిసి ఇలా చేసారేంటి? ఏదైనా పని ప్రారంభించేటప్పుడు తరతరాలు స్థిరంగా ఉండేటట్లు చూడాలి కాని, అధికారం మారితే రాజధానులు ఇష్టారాజ్యంగా పెంచే చట్టాలకు చెక్ పెట్టడం మీకు తెలియాలి కదా. ఈ విషయంలో తప్పు మీదే పెద్దాయనా.
      దైవసమానుల మాటకే వద్దాం అభివృద్ధి పరిపాలన వికేంద్రీకరణతో జరుగుతుందని ఎన్నికలు ముందు ఎందుకు చెప్పలేదు సామి? రాజధానులు పెరిగితే అభివృద్ధి జరుగుతుందనుకుంటే జిల్లాకో రాజధాని, లేదా మండలానికో రాజధాని చేయండి. ఎన్ని రాజధానులైతే అందరు ముఖ్యమంత్రులూ ఉండండి. ఇక కుప్పలు తెప్పలుగా కంపెనీలు మన రాష్ట్రానికే వచ్చిపడతాయి. అప్పుడు ఉద్యోగాలు చేసే మనుషులు తక్కువై పరాయి రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకుందాం. ముందు జనానికి కావాల్సిన సదుపాయాలు చూడండి సార్. జనం బతికుంటే మీ అధికారం సాగుతుంది. శవాలతో పరిపాలన చేయలేదెవరూ ఇప్పటి వరకు. 151+ అనే అహంకారం కదా... చేయండి చేయండి మీకేదనిపిస్తే అదే చేయండి... గుడ్ లక్.

కాలం వెంబడి కలం.. 13

        సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మా బాచ్ వాళ్ళలో నాకు తెలిసిన కొందరితో ఆటోగ్రాఫ్లు రాయించడానికి భాస్కర్ కి ఆటోగ్రాఫ్ బుక్ ఇచ్చాను,  మన వాళ్ళందరితో రాయించి నువ్వు రాయి అని. భాస్కర్ ఫస్ట్ ఇయర్ లో మా సెక్షన్ కాకపోయినా, నీలిమ ద్వారా బాగా పరిచయం. రఘుతో కలిసి ఉండేవాడు. అలా బాగా దగ్గరైన మరో తమ్ముడు అప్పట్లో. తర్వాత కృష్ణకాంత్, రామకృష్ణ, గోపి, శ్రీను, రాంమెాహన్, రాంప్రసాద్ వాళ్ళతో కలిసి ఉండేవాడు. మేమంతా ఎలక్ట్రానిక్స్ కదా మరి అందుకన్న మాట. ఆటోగ్రాఫ్లు రాయించిన తర్వాత పుస్తకం చూస్తే, వీళ్ళందరి ఆటోగ్రాఫ్లతో పాటుగా అంజయ్య చౌదరి ఆటోగ్రాఫ్ కూడా ఉంది. ఏంటి భాస్కర్ అంటే.. మనవాళ్ళందరితో రాయించమన్నావుగా, అందుకే రాయించాను అని చెప్పాడు.
" ఈ తప్త హృదయంపై 
నీ స్నేహ నీహారికా బిందువు వాలితే
వీచే పరిమళం గొప్ప అనుభూతి " అని ఉంది. నిజంగా చెప్పు ఇది ఎవరు రాశారంటే కంప్యూటర్ సైన్స్ లో వేణు అని మా దూరపుబంధువు తను రాశాడు అని చెప్పాడు. రాయమంటే ఇలా రాయిస్తారా, అర్థం తెలుసా అసలు అని కాసేపు పోట్లాడాను కూడా సరదాగానే. చూపించే రాశాడులే అని చెప్పాడు. భాస్కర్ ఏమెా మనం విడిపోవడమే లేదు కదా మన మధ్య ఈ ఆటోగ్రాఫ్లు అవసరం లేదని, కృష్ణకాంత్ ఏ అవసరమున్నా సాయం చేస్తానని ఇలా బోలెడు ఆటోగ్రాఫ్లతో ఇంటరు నుండి ఓ 6 ఆటోగ్రాఫ్ పుస్తకాలు నా దగ్గర ఉండేవి. మా షర్మిల ఇంగ్లీష్ లో ఓ కవిత రాస్తే వాళ్ళ అమ్మగారు అది తెలుగులో ట్రాన్స్లేట్ చేసి రాశారు. అది డబుల్ ధమాకా నాకు. శ్రీధర్ అని నా ఫస్ట్ ఇయర్ క్లాస్మేట్ స్నేహం గురించి రాశాడు. వెంట నారాయణ అయితే ఓ లంగా ఓణి అమ్మాయి చేతిలో పుస్తకాలు పట్టుకుని, బస్ స్టాప్ లో నిలబడి ఉండటం, అదీ 2020లో. నేను అస్సలు మారనని మావాళ్ళకి ఎంత నమ్మకమెా చూసారా. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి వచ్చినా, ఎవరు ఏమన్నా నేను ఇప్పటికి నేనుగానే ఉన్నాను. హేళనలు, వెకిలి నవ్వులు నా పట్టుదలను పెంచేవి గాని, ఏమాత్రం వెనకడుగు వేయనిచ్చేవి కావు. మా సీనియర్స్ వసుంధర, శృతి వాళ్ళు హాస్టల్ లో నీ వస్తువులు మర్చిపోకుండా జాగ్రత్త చేసుకున్నట్లే మమ్మల్ని గుర్తుంచుకో అని రాశారు..
            ఉత్తరాల ఫ్రెండ్స్ లిస్ట్ అలా అలా పెరిగిపోయింది. శలవల్లో నా ఫ్రెండ్ రాసిన ఉత్తరం గుడివాడ దగ్గర కోడూరులో లలిత అనే అమ్మాయికి వెళ్ళిందట.  ఆ అమ్మాయి లెటర్ చదివి మళ్ళీ నా లెటర్ తోపాటు తనూ ఓ లెటర్ రాసి నాకు పోస్ట్ చేసింది. తర్వాత తనని విజయవాడ పాలిటెక్నిక్ కాలేజ్ వద్ద కలిసాను. మా పొడుగు, పొట్టి వాళ్ళు నవ్వేవారు..బస్, ట్రైన్ ఫ్రెండ్సే కాకుండా ఇలా కూడా వదలవా అని. మా పిన్ని వాళ్ళింటికి వెళ్ళినప్పుడు అక్కడ స్కూల్ కి వెళ్ళే పిల్లలు పరమేష్ వాళ్ళు, జాబ్ చేసే కేశవ కూడా లెటర్స్ రాస్తుండేవారు. మా వాసు ఫ్రెండ్ బాలు, బాలు ఫ్రెండ్ సురేష్ కూడా లెటర్స్ రాస్తుండేవారు. నాకు కాస్త కమ్యూనిజం భావాలు ఎక్కువ అప్పట్లో. చదువైపోయాక పెళ్ళి చేసుకోకుండా నక్సలైట్లలోకి వెళిపోతాననేదాన్ని. అందరికి అదో భయం ఎక్కడ అలా వెళిపోతానోనని. 
      మా ఇంట్లో చాలా స్వేచ్ఛగా పెంచారు చిన్నప్పటి నుండి. విచ్చలవిడితనానికి, స్వేచ్ఛకు తేడా తెలిసే విధంగా అన్నమాట. చిన్నప్పటి నుండి నాకు మెదటి ఫ్రెండ్స్ మా నాన్న, అమ్మ. వాళ్ళ తర్వాతే ఎవరైనా. ప్రతి చిన్న విషయం కూడా వాళ్ళతో పంచుకోవడం నా అలవాటు. ఏది చేసినా ఇంట్లో చెప్పేయడం, లేదా చెప్పి చేయడం అలవాటు. నాన్న ఏది నాకు అడిగే అవసరం రానీయలేదు ఎప్పుడూ. అడగకుండానే అన్ని ఇచ్చేవారు. అందుకేనేమెా నాకు ఏదీ అడగడం అలవాటు కాలేదు ఇప్పటికి. మా నాన్న నాగపూర్ లో బి ఎస్ సి చదువుకునేటప్పుడు తన రూమ్మేట్, ఫ్రెండ్ అయిన నరసరాజు అంకుల్ అమెరికాలో తానా ప్రెసిడెంట్ గా చేస్తున్నప్పుడు, నాన్నకు ఓ ఉత్తరం తెలుగులో టైప్ చేసి పంపారు. ఆ ఉత్తరం చదివి నీకు భలే మంచి ఫ్రెండ్ ఉన్నారు నాన్నా అన్నాను. తర్వాత అంకుల్ ఇండియా వచ్చినప్పుడు మా ఊరు కూడా వచ్చారు. నాన్న వాళ్ళు అంకుల్ కి సన్మానం కూడా చేసారు. నాతో అంకుల్ మాట్లాడుతూ మళ్ళీ అమెరికాలో కలుద్దామమ్మా అన్నారు. 
       
వచ్చే వారం మరిన్ని కబుర్లతో....

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner