29, సెప్టెంబర్ 2020, మంగళవారం

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో కొత్త కొత్త జాబ్స్ కొత్త కొత్త పరిచయాలు ...

నా అమెరికా కబుర్లను ప్రచురిస్తున్న ఆంంధ్రాప్రవాసి డాట్ కాం వారికి,   రాజశేఖర్ చప్పిడి గారికి మన:పూర్వక ధన్యవాదాలు..



ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో కొత్త కొత్త జాబ్స్ కొత్త కొత్త పరిచయాలు ...

భూతల స్వర్గమేనా...27

పిల్లలను వదిలి రావడం కాస్త కష్టమే. అయినా తప్పలేదు. కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి. నన్ను అట్లాంటా ఎయిర్ పోర్ట్ లో మా ఆయన, రెడ్డి అంకుల్ రిసీవ్ చేసుకున్నారు. నేను మళ్లీ హంట్స్విల్ వచ్చేటప్పటికి ఇంట్లో వినయ్ గారు ఉన్నారు. విష్ణు వాళ్ళ తమ్ముడు అనిల్ కూడా అమెరికా వచ్చాడు. నేను వచ్చిన కొద్ది రోజులకే మా ఉమకి డెలివరి అయ్యింది. వాళ్ళ అమ్మా వాళ్ళకు రావడానికి కుదరలేదు. డెలివరి అయ్యాక ఫోన్ చేసారు. ఈయన వెంటనే నన్ను ఒహాయెా బస్ ఎక్కించారు. బాబుకి పేరు రిషి అని పెట్టారు. జాండీస్ ఎక్కువగా ఉండటం వలన మరుసటి రోజు బాబుని ఇచ్చారు. పది రోజులు ఉమ వాళ్ళంట్లో ఉన్నాను. తర్వాత ఈయన, విష్ణు, అనిల్ వీళ్ళ ఫ్రెండ్ శ్రీను పెళ్ళిరోజుకి కొలంబస్ అనుకుంటా పేరు సరిగా గుర్తు లేదు, వచ్చారు. నేను కూడా బస్ లో అక్కడికి వచ్చి, ఫంక్షన్ అయ్యాక మేం నలుగురం హంట్స్విల్ వచ్చేసాము. తర్వాత నేను ఖాళీగా ఉండటమెందుకని మాల్ లో జుయలరి స్టోర్ లో జాబ్ దొరికితే జాయిన్ అయ్యాను. ఓనర్ హాలే ఇరానీ. నన్ను బాగా ఎంకరేజ్ చేసేది. ముందు 4, 6 అవర్స్ అనే మాట్లాడింది. తర్వాత తర్వాత చాలా అవర్స్ ఇచ్చేది. విష్ణు వాళ్ళు కాలేజ్ కి వెళుతూ కాస్త ముందే నన్ను మాల్ లో డ్రాప్ చేసి వెళ్ళేవారు. ఎవరో ఒకరు తీసుకు వచ్చేవారు. విష్ణు వాళ్ళతో చదివే దివ్య కూడా నాతోనే చేసేది. రేఖ, రూఫస్ వాళ్ళు,  మధుమిత, మిలి ఇలా చాలామంది పని చేసేవారు. ఒక మాల్ లో రెండు షాప్ లు, మరో మాల్ లో మరొక షాప్ ఉండేది. నేను జాయిన్ అయ్యాక మా చైతన్య కూడ జాయిన్ అయ్యింది. మెుత్తానికి మళ్లీ మాటలు కలిసాయి అందరికి. ఆ వెంటనే నాకు చికాగోలో క్రాఫ్ట్ ఫుడ్స్ లో సైన్ ఆన్ సాఫ్ట్ వేర్ మీద జాబ్ వచ్చింది. సింధుతో షాపింగ్ చేసి ఫార్మల్స్ కొన్ని తీసుకున్నాను. రేఖావాళ్ళు నాకో టీ షర్ట్ కొనిచ్చారు.  నాకు సైన్ ఆన్ రాదు. అంతకు ముందు ఫోన్ ఇంటర్వ్యూ కి చెప్పినప్పటిది గుర్తుంచుకున్నాను. సరే చూద్దాం రాకపోయినా నేర్చుకున్నంత నేర్చుకుందామని వెళ్ళాను. ఓ నెల రోజులు చేసాను. శిరీష, సీతారాం అప్పుడు చికాగోలో పాప, బాబులతో ఉన్నారు. ఆఫీస్ కి దగ్గరలో హోటల్ లో రూమ్ తీసుకుంటే అది సేఫ్ ప్లేస్ కాదని సీతారాం వచ్చి ఇంటికి తీసుకువెళ్ళాడు. కాకపోతే చాలా దూరం వాళ్ళిల్లు. రోజు రెండు బస్ లు మారి వెళ్ళాల్సి వచ్చేది. కాస్త లేట్ అయినా ఇంటికి రావడానికి కాబ్ కూడా ఉండేది కాదు. వేరే వాళ్ళ ద్వారా సైన్ ఆన్ తెలిసినతనిని హెల్ప్ అడిగితే, అతనికి జాబ్ చికాగోలోనే కావాలని, నాకు హెల్ప్ చేయకుండా, ఈ జాబ్ తను మాట్లాడేసుకున్నాడు టి సి యస్ ద్వారా. నెల డబ్బులు ఇవ్వలేదు టి సి ఎస్. నేనే టికెట్ బుక్ చేసుకుని మళ్లీ హంట్స్విల్ వచ్చేసాను. తర్వాత మరో జాబ్ ఒమహాలో చేసాను. ఇది AS/400 ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్. కైలాష్ ఫ్రెండ్ ఫామిలీ ఉన్నారక్కడ. ఓ రోజు భోజనానికి పిలిచి జూ కి తీసుకువెళ్ళారు. ఏక్వేరియం లోపలికి వెళ్ళాం. చాలా బావుంది. మన చుట్టూ రకరకాల రంగురంగుల చేపలు తిరగడం బాగా నచ్చింది. ఆఫీస్ లో అమెరికన్ రాజకీయాలు మెుదలయ్యాయి. వాళ్ళంతా చాలా పెద్దవాళ్లు. ఇండియా టీమ్ కి, అమెరికా టీమ్ కి కలిపి కో ఆర్డినేషన్ నేను చేయాలి. ఓ పెద్దాయన నన్ను ఈవెనింగ్ ఆఫీస్ నుండి డ్రాప్ చేసేవాడు. రోజూ అనేవాడు.. మీ ఇండియన్స్ తక్కువ సాలరీకి పని చేస్తూ మా జాబ్స్ అన్నీ తీసేసుకుంటున్నారని. నేనూ ఊరుకునేదాన్ని కాదు. ఈయన వెంటనే మీకు చాతకాకే కదా మమ్మల్ని తీసుకున్నారు అనేదాన్ని. అప్పటికి హోటల్ లోనే ఉన్నాను. వెళ్ళేటప్పుడు కాబ్ లో వెళ్ళేదాన్ని. మనకేమెా అమెరికన్ ఫుడ్ తినబుద్ది కాదు. కాస్త దూరంలో చైనీస్ రెస్టారెంట్, ఇండియన్ గ్రాసరీ స్టోర్ చిన్నది ఉండేవి. సాయంత్రం ఏదోకటి తెచ్చుకునేదాన్ని. ఓ రోజు ఫోన్ పాడయ్యింది. స్ప్రింట్ స్టోర్ హోటల్ కి ఎదురు రోడ్డు లో చూడటానికి కాస్త దూరంలో ఉంది. రోడ్ రిపేర్లో ఉందనుకుంటా. నడిచి వెళ్ళడానికి బోలెడు చుట్టు తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. ఏదో చేసి మెుత్తానికి ఫోన్ మార్చుకున్నా. అలా ఆ ప్రాజెక్ట్ అయ్యింది. 

మళ్లీ కలుద్దాం....

28, సెప్టెంబర్ 2020, సోమవారం

కాలం వెంబడి కలం..21

    బస్ లో ఆ రాత్రి నిద్ర పోలేదు. మరుసటి రోజు పొద్దున్నే హైదరాబాదులో బస్ దిగాను. హాస్టల్ కి వెళ్ళేసరికి ఇంకా గేట్ తీయలేదు. నా ఫ్రెండ్స్ ఉషని, విని ని పిలిస్తే వచ్చి గేట్ తీస్తూ, ఏమైంది అలా అయిపోయావేమిటని అడిగారు. తర్వాత చెప్తానని చెప్పి, ముందు ఫోన్ చేసిరావాలి వెళదాం పదమన్నాను. రాఘవేంద్ర వాళ్ళ అక్క కి ఫోన్ చేసి, నిన్న మామయ్య ఇంటికి వచ్చి ఏం మాట్లాడారో తెలియదు. మా నాన్న నన్ను ఇంట్లో నుండి పంపేసారని చెప్పాను. మీరు ఎవరు నా దగ్గరకి రావద్దు. మా నాన్న ఇష్టపడి చేసినప్పుడే చేసుకుంటాను అని చెప్పి హాస్టల్ కి వచ్చేసాను. నా ఫ్రెండ్స్ కి జరిగిన విషయం చెప్పాను. ముందు జాబ్ చూసుకోవాలని కూడా చెప్పాను. ఉష ఫ్రెండ్స్ అంతకు ముందే మా హాస్టల్ కి దగ్గరలో కోచింగ్ సెంటర్ ఓపెన్ చేసారు. నాకు ఇష్టమైతే వచ్చి జాయిన్ అవమన్నారు. సరేనని జాయిన్ అయ్యాను. 
           రాఘవేంద్ర వాళ్ళ అక్క మరుసటి రోజు నా దగ్గరకి వచ్చింది. మళ్ళీ అదే మాట చెప్పాను. ఆ రాత్రికే తను వెళిపోయింది. తర్వాత పెద్దవాళ్ళం చెప్తున్నాం విను అని, పెళ్ళికి ముహూర్తం పెట్టించారు. నా ఇంజనీరింగ్ క్లాస్మేట్ శ్రీధర్ నన్ను కలవడానికి హాస్టల్ కి వస్తే తనకి ఇంట్లోనుండి నన్ను పంపేసారని చెప్పాను. తను బాలానగర్ లోని విజయ ఎలక్ట్రికల్స్ లో ఇంటర్వ్యూకి తీసుకువెళ్ళాడు, తెలిసినవాళ్ళు ఉన్నారని. అప్పటికే నా అమెరికా సన్నాహాలు సాగుతున్నాయి కదా. వివరాలు అడిగితే చెప్పాను. ఎప్పుడు జాయిన్ అవుతారంటే పెళ్ళి డేట్ చెప్పి తర్వాత ఓ 15 రోజులకి జాయిన్ అవుతానని చెప్పాను. 
          నా ఫ్రెండ్స్ ఉష, విని నేను వెళిపోతానని, కాస్త నా దిగులు మర్చిపోతానని బాగా బయట తిప్పేవారు. కోచింగ్ సెంటర్ వాళ్ళు మేము మీ బ్రదర్స్ అండి. కార్డ్స్ మేము ప్రింట్ చేయిస్తామని చెప్పి అంతా వాళ్ళే చూసుకున్నారు. 800 రూపాయలు పెట్టి అప్పట్లో ఓ ప్యూర్ సిల్క్ చీర రాఘవేంద్ర వాళ్ళ అక్కకని తీసుకున్నాను. 
      అమ్మానాన్నకు నా పెళ్ళి కార్డ్ పోస్ట్ చేస్తూ లెటర్ కూడా రాశాను. లెటర్ రాసేటప్పుడు నాకు తెలియకుండానే కన్నీళ్లు కారిపోయాయి. అది వేరే సంగతనుకోండి. అదృష్టమెా దురదృష్టమెా తెలియదు కాని ఎవరు ఇలా తమ పెళ్ళికి అమ్మానాన్నను పిలిచి ఉండరు కదా. నా చిన్నప్పటి విజయనగరం ఫ్రెండ్స్ ని, వాసు ఫ్రెండ్ నా పెన్ ఫ్రెండ్ బాలుని, ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ ని కొందరిని మాత్రమే పిలిచాను. మా పొట్టికి కూడా చెప్పాను. చిన్నప్పటినుండి నేను పెళ్ళి చేసుకోను అనేదాన్ని. చేసుకున్నా ఎవరిని పిలువను అని అనేదాన్ని.  
       మా నాన్న చేసిన పని తప్పు అని అనను. ఆయన తన కూతురు బావుండాలనే కోరుకున్నారు. అలా అని అమ్మది కూడా తప్పు కాదు. ఏ తల్లిదండ్రులయినా తమ పిల్లలు తమకన్నా బావుండాలనే కోరుకుంటారు. బాధ్యత తెలియనివాడని నాన్న భయం అంతే. అనుకోని పరిస్థితుల మూలంగా అలా చేయాల్సి వచ్చింది. నా అభిప్రాయానికి విలువనిచ్చి, నాన్న నన్ను ఇంటి నుండి పంపేసారు. 
       మా ఊరిలో అందరిని రాఘవేంద్ర పిలిచాడు. రాఘవేంద్ర అక్కాబావా పిలవడానికి మా ఇంటికి వెళితే, నాన్న వెళిపొమ్మన్నారట. నాంచారయ్య బాబాయి వెళ్ళి చెప్పబోతే ఏం చెప్పవద్దు అన్నారట. మా రాధ పెదనాన్నకి విషయం తెలిసాక, నేను చూసుకుంటాను అంటే నేను పోయాకా చూద్దువులే అన్నారట. పసి అక్క అని మా ఇంటి పక్కన ఉండేది. ఆ అక్కకి నా విషయాలన్నీ తెలుసు. అమ్మతో, నాతో బాగా దగ్గరగా ఉండేది. పెళ్ళికి రెండు రోజుల ముందు రాఘవేంద్ర హైదరాబాదు వచ్చి, పెళ్ళి ముందు రోజు నన్ను రావివారిపాలెం తీసుకువచ్చాడు. విని చీర పెట్టి హాస్టల్ నుండి సాగనంపింది. రాఘవేంద్ర తమ్ముడు, చెల్లెలు, మా ఫ్రెండ్స్  అందరు వచ్చి బస్ ఎక్కించారు. మా హాస్టల్ ఆంటి అనేది. అమ్మాయ్ రాఘవేంద్ర జాతకుడు అని. ఆవిడ కూడా హాస్టల్ నుండి వచ్చేటప్పుడు నీ పుట్టిల్లు అనుకో. ఎప్పుడయినా రావచ్చు నువ్వు ఇక్కడికి అని చెప్పి పంపింది. 
      బాధ, భయం, సందిగ్ధం, సందేహాలతో రేపేంటి అన్న ప్రశ్నలతో, సమాధానాల కొరకు అన్వేషించడం మెుదలైంది. 
 
వచ్చే వారం మరిన్ని కబుర్లతో... 
    
          

27, సెప్టెంబర్ 2020, ఆదివారం

సాగర ఘెాష...!!

సాగర ఘెాష...!!

అందమైన ఉదయాలను
ఆనందకరమైన సాయంత్రాలను
పౌర్ణమి పండు వెన్నెల జలతారును
చూపిస్తూ ఆహ్లాదపరుస్తుంది

సుడులు తిరిగే గుండాలను
బడబాగ్నులను తనలో ఇముడ్చుకుని
తీరం మాత్రం అలల అల్లరితో 
సేద దీరుతున్నట్లుగా మనల్ని మాయ చేస్తుంది

అనంతమైన ఆకాశానికి తోడుగా
ధరిత్రిని చుట్టిన నీలి వర్ణపు చీరలా
సకల నదుల సంగమానికి సమాయత్తమైన
విశాల హృదయం సాగరానిది 

మదిలోని కల్లోల కడలిని దాచేసి 
కన్నీటిని కంటబడనీయక 
చిరునవ్వుతో జీవనం సాగించే
అతివ అంతరంగానికి సారూప్యమీ సాగర ఘెాష..!!







25, సెప్టెంబర్ 2020, శుక్రవారం

మన కర్తవ్యం...!!

నేస్తం, 
   నాకు తెలియకడుగుతున్నా.. మంచేదో, చెడేదో అందరికి తెలియదంటావా? ఓ నాలుగు రోజులు మత్తుమందుల కేసులంటారు. ఎంక్వైరీలంటారు. తరువాత అందరు మరిచిపోతారు. ఎప్పటికో విచారించిన సెలబ్రిటీలందరు క్లీన్ చిట్లతో బయటికి వస్తారు. విద్యాశాఖలో మార్కుల అవకతవకలు జరుగుతాయి. పోటి పరీక్షల్లో సీట్లు ఎవరెవరికో వస్తాయి. సాక్ష్యాలను పోలీసులే మాయం చేసేస్తారు అధికారం అండదండలతో. కాలం నాడు మెుద్దు శీనుది ఆత్మహత్య అని TV9 మెుదట చెప్పినట్లుగా. ఆ క్లిపింగ్స్ చూసిన ఎవరికైనా అర్థం అవుతుంది అది హత్యో, ఆత్మహత్యో. కులం, మతం పేరుతో నాయకులే రాజకీయాలు చేయడం చూస్తూనే ఉందాం. 
  అయినా తాగేవాడికి తెలియదా. తాగితే తనకు ఏం జరుగుతుందో. కాల్చేవాడికి తెలియదా. కాల్చితే పొగతో పాటు ఏం వస్తుందో. ఆరోగ్యానికి హానికరమంటూ కనబడని అక్షరాలు పాకెట్ ల మీద వేసి చేతులు దులుపుకోవడం, ఈ నగరానికి ఏమైంది? అమ్మ గాజులు అమ్ముకున్నామంటూ బోలెడు ఖర్చులు పెట్టి యాడ్ లు తీయడం. ప్రభత్వాలే మద్యం అమ్మేయడం ఎందుకివన్నీ? ఎవరిని మభ్యపెట్టడానికి? 
    మత్తుమందు కేసులంటూ ఎన్నిసార్లు టివిల్లో చూపలేదు? కనీసం ఏ ఒక్కరి మీదైనా కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు ఉన్నాయా చరిత్రలో. ఒకప్పుడు ఏదైనా నేరారోపణలు కాని, తప్పులు కాని జరిగితే సంబంధిత అధికారులు, మంత్రులు తమ నైతిక బాధ్యతగా రాజీనామాలు చేసేవారు. ఇప్పుడు ఎన్ని నేరారోపణలు ఆయా శాఖల మీద జరిగితే వారికి అంత పాపులారిటి అన్నమాట. అన్నీ చూస్తూ మనం కూడా మనకెందుకులే అని నోరు మెదపకుండా మన పని మనం చేసుకుంటూ మళ్ళీ ఈ నాయకులనే గెలిపించేద్దాం. ఇదేగా మన ప్రజాస్వామ్యం. మన లౌకిక రాజ్యం. 

23, సెప్టెంబర్ 2020, బుధవారం

భూతల స్వర్గమేనా...26

పార్ట్.. 26
శౌర్యతో హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేసాము. ఈయన రెండు గాస్ స్టేషన్స్ లో పని చేస్తున్నాడు. మధ్యలో వాణి సెయింట్ లూయీస్ నుండి మా ఇంటికి వచ్చేసింది. ఈయన తన అవర్స్ లో కొన్ని వాణి కి ఇచ్చి చౌదరి గారి గాస్ స్టేషన్ లో పెట్టారు. ఓ గోడ గడియారం వాణి కొన్నది. చౌదరి గారు ఈయనను చాలా మాటలంటున్నారని చెప్పింది. తను కొన్ని రోజులుండి అట్లాంటా వెళ్ళింది. ఏదో సబ్ వే లో చేయడానికనుకుంటా. నాకు సరిగా గుర్తు లేదు. వాడు ఆమెకు పనేమి రాదని, సాంబార్ పెట్టడమే వచ్చని, ఇలా ఏదోకటి అంటూ టార్చర్ పెడుతున్నాడని చెప్పేది. తర్వాత తర్వాత నాతో మాట్లాడటం మానేసింది. వాడినే పెళ్ళి చేసుకుందని తెలిసింది. కొడుకుని ఇండియా నుండి తీసుకు వచ్చిందని కూడా తెలిసింది. నాకు ఎంతో గుర్తు లేదు కాని డబ్బులు అప్పుగా ఇచ్చింది. తను అడగకుండా వాడితో బెదిరించింది. నేనే ఇచ్చేద్దామనుకున్నా.. ఈలోపలే ఆగలేకపోయింది. మా ఉషకి కూడ ఏం చెప్పిందో తెలియదు. తను మాట్లాడటం మానేసింది. మా పక్కింట్లో ఉండే రెడ్డి అంకుల్ నాన్నకి బాగా పరిచయం అయ్యారు. ఆంటీ మా ఇంటికి వస్తూనే ఉండేది. కాస్త తేడా ఉందనుకుంటా. ఏదేదో మాట్లాడేది. వాళ్ళ అమ్మాయి, అల్లుడు అట్లాంటాలో ఉండేవారు. అల్లుడు డాక్టర్. ఇండియాలో డాక్టర్ చదివినా అమెరికాలో రెసిడెన్సీ చేయాలి. దాని కోసం పరీక్ష రాయాలి. ఇంటర్వ్యూలు ఎటెండ్ అవ్వాలి. వాటి కోసం అంకుల్, అల్లుడు, కూతురు వెళుతూ నాన్నను కూడా రమ్మంటే వాళ్ళతో వెళ్ళి గోవర్థన్, శిరీష, గోపాలరావు అన్నయ్య వాళ్ళని కలిసారు. అన్నయ్య ఆ టైమ్ లోనే ఓసారి అట్లాంటా వచ్చి, మా దగ్గరకి రావడానికి టైమ్ కుదరక ఫోన్ చేసి పలకరించాడు. శౌర్య పుట్టిన తర్వాత జలజ వదిన, బాబన్నయ్య ఫోన్ చేసారు. అన్నయ్య ఏంటమ్మా డబ్బులు అడిగానని కోపం వచ్చిందా మాట్లాడటం మానేసావు అన్నారు. అదేం లేదన్నయ్యా అమ్మావాళ్ళు ఉన్నారు కదా, బాబుతో సరిపోతోంది అన్నాను. మేమే వస్తామమ్మా నెక్స్ట్ మంత్ మీ బాబుని చూడటానికి అని అంటే, తప్పకుండా రండి అన్నయ్యా అని చెప్పాను. ఆ తర్వాత వెంటనే కొద్ది రోజుల్లోనే బాబన్నయ్య హార్ట్ ఎటాక్ తో చనిపోయారు.  

వినయ్ గారికి ఉద్యోగం లేకపోతే సుబ్బరాజు ఇందుకూరితో మాట్లాడి తనకి AMSOL ద్వారా H1B చేయించాను. వినయ్ గారు కూడా మా ఇంటికి వచ్చి శౌర్యని చూసి, వాడికి బొమ్మలు కొనిచ్చి, రెండు రోజులుండి వెళ్ళారు. రాగిణిప్రియ నాకు హైదరాబాదు హాస్టల్ లో ఉన్నప్పుడు పరిచయం. తను మా జూనియర్ సతీష్ వాళ్ళ సిస్టర్. MCA చేసి, అమెరికా వచ్చింది తన హజ్బెండ్ తో కలిసి. వీళ్ళు కూడా సరైన జాబ్స్ లేక సెయింట్ లూయీస్ రాంకుమార్ వాళ్ళ దగ్గరకు వెళ్ళి, సబ్ వే లీజ్ కి తీసుకున్నారు. తను కూడా ఫోన్ చేసి క్షేమ సమాచారాలడుగుతూ ఉండేది. తర్వాత పరిస్థితి బాలేక వాళ్ళు నాకన్నా ముందే ఇండియా వచ్చేసారు.  అప్పుడప్పుడూ హాస్పిటల్ కి శౌర్యని తీసుకువెళ్ళడం, మౌర్య అల్లరి, చౌదరి గారి తమ్ముడు ప్రసాద్, ఆంటీ ఇంటికి వచ్చి పోతుండటం, రమణి గారు, సింధు, విష్ణు వాళ్ళ రాకపోకలతో ఇండియాలో
లానే మా ఇల్లు జనంతో సందడిగా ఉండేది. 

హంట్స్విల్ వచ్చాక మళ్ళీ లెర్నర్స్ పర్మిట్ కోసం రిటెన్ టెస్ట్ రాయడమూ, విష్ణు వాళ్ళతో ఉండే బాలకృష్ణ గారు నాకు డ్రైవింగ్ నేర్పడము, తర్వాత ఆయన వైఫ్ రమణి గారు, కొడుకు పృథ్వి ఇండియా నుండి రావడము, డ్రైవింగ్ లైసెన్స్ కోసం ట్రై చేయడము త్వరత్వరగా జరిగిపోయాయి. మూడవసారి కాని డ్రైవర్స్ లైసెన్స్ రాలేదు. మెుదటిసారి అంతా బానే చేసి, లాస్ట్లో రైట్ సిగ్నల్ వేయమంటే, అంతకు ముందు రెండు రోజులు నేను ప్రాక్టీస్ చేసిన లెఫ్ట్ సిగ్నల్ వేసేసాను హడావిడిగా. రెండవసారి మెుదట్లోనే హాండ్ బ్రేక్ తీయడమే మర్చిపోయాను. శౌర్యని కూడా నాతో తీసుకువెళ్ళాను కదా. వాడు నిద్ర లేచాడు. ఏం ఏడుస్తున్నాడో అన్న ఆలోచనలో రెండుసార్లు అలా అయ్యిందన్న మాట. మూడవసారి వెళ్ళగానే, ఇన్స్ట్రక్టర్ అన్నీ చెప్పి, నవ్వుతూ, ఎనీ డౌట్ అనగానే తల అడ్డంగా ఊపుతూ నవ్వేసాను. డ్రైవ్ టెస్ట్ లో అంతా అయిపోయిందిలే అనుకుంటే... కార్ స్టాప్ చేసి అప్ హిల్ విత్ కర్బ్ కార్ పార్క్ చేసి చూపించమంది. దేవుడా ఈసారి కూడా లైసెన్స్ రాదని ఫిక్స్ అయిపోయి... రిటెన్ ఎగ్జామ్ కి చదివింది గుర్తు తెచ్చుకుని చేసాను. లాస్ట్ లో కార్  క్రాస్ పార్కింగ్ చేయగానే, గో అండ్ పే ద ఫీ అంది....ఆ మాట వినగానే చెప్పలేని సంతోషం నాకు. అలా చిట్టచివరికి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిందన్న మాట.  లెర్నర్స్ పర్మిట్ వచ్చాక పక్కన రెడ్డి అంకుల్ కి సెకండ్ హాండ్ కార్ చూడమని చెప్తే, టయెాటా కామరే తీసుకున్నాము. కార్ లోన్ రావాంటే కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. నాకు లైసెన్స్  వచ్చాక కార్ తీసుకున్నాము. కార్ లోన్, కార్ ఇన్ష్యూరెన్స్ మా నెలవారి లెక్కల్లో యాడ్ అయ్యాయి. పాపం మౌర్య ఏది కొని పెట్టమని అడిగినా, ఏదోకటి చెప్పి వాయిదా వేయడమే అయ్యింది అప్పటి పరిస్థితిని బట్టి. శౌర్యకి ఆరవ నెల వచ్చాక అమ్మావాళ్ళను తీసుకుని ఇండియా వచ్చాను. శౌర్యకి కాకానిలో అన్నప్రాశన చేసి, ఓ నెల ఉండి, పిల్లలని అమ్మావాళ్ళ దగ్గర వదల్లేక వదిలి మరోసారి అమెరికా వెళ్ళాను.

మళ్లీ కలుద్దాం....

22, సెప్టెంబర్ 2020, మంగళవారం

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో డెలివరీ తర్వాత పెరిగిన ఖర్చులు, అప్పులు తీర్చటానికి ...

నా అమెరికా కబుర్లను ప్రచురిస్తున్న ఆంంధ్రాప్రవాసి డాట్ కాం వారికి,   రాజశేఖర్ చప్పిడి గారికి మన:పూర్వక ధన్యవాదాలు..






ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో డెలివరీ తర్వాత పెరిగిన ఖర్చులు, అప్పులు తీర్చటానికి ...

ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు సమీక్ష...!!

                                " తెలుగు సాహితీ లోకానికి సరికొత్త వెలుగు రవ్వలు సాగర వచనాలు "

      రచనలు చాలామంది చేస్తారు, కాని కొందరి రచనలు మాత్రమే సాహితీ చరిత్రలో అజరామరంగా నిలిచిపోతాయి. విలక్షణమైన విషయాలను లక్షణంగా పాఠకులకు అందించడం కొందరికే సాధ్యం.  ఆ కొందరిలో సాగర్ శ్రీరామ కవచం ఒకరు. సాగర్ గారి రచనల శైలి విభిన్నంగా ఉంటుంది. ఎవరు తీసుకోని సరికొత్త వస్తువులతో నవలలు, సాహితీ వ్యాసాలు రాయడంలో అందె వేసిన చేయి. ఇంగ్లీషు సాహిత్యాన్ని, తెలుగు సాహిత్యాన్ని అవపోశన పట్టిన విజ్ఞానగని. ఓ రచయితకు ఉండాల్సిన ముఖ్య లక్షణాలన్ని సాగర్ గారిలో నిండుగా మెండుగా ఉన్నాయి. ఆయన రచనలు చదువుతున్నప్పుడు మనం ఆయా పాత్రల్లో లీనమైపోతామనడంలో ఎట్టి సందేహము లేదు. ఇది మన కథేనా అన్న మీమాంస రాక మానదు. యాతన నవల చదివినప్పుడు...ఆ నవల ప్రభావం నుండి బయటకు రావడానికి చాలా సమయమే పట్టింది నాకు. మా నాన్నగారు యాతన చదువుతూ తన మనోభావాలనే రాశారని చెప్పడమే ఇందుకు సాక్ష్యం. వీరి రచనలు చదివిన పాఠకుడు ఎంతగా పాత్రలో లీనమైపోతాడో తెలియడానికి ఇదో ఉదాహరణ. దహనం, అవస్థ, యాతన వంటి సామాజిక, మనో వైజ్ఞానిక నవలలు అందించిన ఆ చేతి నుండి సాహిత్యం గురించి, రచన, రచయిత, భాష, విమర్శ వంటి విషయాలతో పాటుగా ఇప్పటి వరకు ఎవరు చెప్పడానికి సాహసించని సరికొత్త కోణంలో వస్తువు, శిల్పము, ప్రచ్ఛన్న వస్తుశిల్పాల తీరుతెన్నుల గురించి సోదాహరణముగా వివరించిన వ్యాసాల సమాహారమే ఈ " ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు " పుస్తకం. నిజమైన ప్రతిభకు పట్టం కట్టే రోజులు వస్తే ఈ పుస్తకం తెలుగు సాహితీ చరిత్రలో సముచిత స్థానాన్ని అందుకుంటుంది. తెలుగు సాహిత్యంలో ఓ నూతనాధ్యాయానికి నాంది పలుకుతుంది. 
         మూడు భాగాలుగా ఈ వ్యాస పరంపర కొనసాగుతుంది. మెుదటి భాగములో ప్రచ్ఛన్న వస్తుశిల్పాల గురించి వివరణాత్మక విశ్లేషణ చేసారు. సాహిత్యంలో ఒక వస్తువుని అనుసరించి మరో వస్తువు దానిని అనుసరించి శిల్పశోభితము ఉంటుందన్న సిద్ధాంతం ఉంది. కాని " ఒక వస్తువుని అనుసరించి మరో వస్తువు దానిని అనుసరించి సాగే శిల్పంతో సమాశ్రియంగా మరో ప్రచ్ఛన్న శిల్పం ఉంటుందని " ప్రతిపాదించి దానిని సోదాహరణముగా వివరించిన మొదటి వ్యక్తి సాగర్ శ్రీరామ కవచం గారు. ఈ ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు రచయిత పరిణితి మూలంగా , రచయితకు తెలియకుండానే కథలో కాని, కవిత్వంలో కాని మధ్యలో పుట్టి ముగింపుకి వచ్చేసరికి తారాస్థాయికి చేరుకుంటాయి. సాధారణ రాయిని ఉలితో నేర్పుగా, ఓర్పుగా చెక్కితే నలుగురు మెచ్చే అందమై శిల్పం ఎలా ఏర్పడుతుందో మనందరికి తెలిసిన విషయమే. దీనినే ఉదాహరణగా తీసుకుని కథలో, నవలలో,కవిత్వంలో వస్తుశిల్పాల ప్రాముఖ్యత, వాటి నుండి ప్రచ్ఛన వస్తుశిల్పాల ఆవిర్భావం ఎలా జరుగుతుంది, కవిత్వంపై ప్రచ్ఛన్న వస్తుశిల్పాల ప్రభావం ఏ మేరకు ఉంటుంది తదితర అంశాలను సవివరంగా ప్రచ్ఛన వస్తుశిల్పాలు వ్యాసాలలో వివరించారు. నాణేనికి బొమ్మా బొరుసు ఎలా ఉంటాయెా అలాగే రచనకు వస్తుశిల్పాలని, వస్తువుకి నీడ ఉన్నట్టుగా, శిల్పానికి ఛాయ ఉంటుందని అవే ప్రచ్ఛన్న వస్తుశిల్పాలని సోదాహరణముగా తన వ్యాసాలలో వివరించారు. సాహిత్యంలో వస్తువు, శిల్పము మిధ్య కాదని చెప్తూ, అవి కనబడవు, తారసిల్లుతాయంటారు. ప్రచ్ఛన్న వస్తుశిల్పాల పాత్రకి అనుగుణంగా రచన చేయాలంటే రచయిత ఒకానొక తపోస్థితికి చేరుకుని తాదాత్మ్యం పొందాలి. అప్పుడే ప్రచ్ఛన్న వస్తుశిల్పాల పాత్ర అనుభవమౌతుంది. వస్తు శిల్పాల సాధనలో రచయితలో పొడజూపే భావతీవ్రతే ప్రచ్ఛన్న వస్తుశిల్పాల విస్పోటనానికి కారణమౌతుంది. ప్రతి అద్భుత రచనలోనూ ఈ ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు రచయితకు తెలియకుండానే ప్రవేశించి ఆ రచనను పతాకస్థాయికి తీసుకువెళ్తాయి అని కన్యాశుల్కం, త్రిపుర భగవంతం కథలోనూ ప్రచ్ఛన్న వస్తుశిల్పాల పాత్రను మనం గమనించవచ్చంటారు సాగర్ గారు. ప్రచ్ఛన్న వస్తుశిల్పాలపై విస్తృత పరిశోధనలు జరగడానికి విమర్శకుల సహకారం ఎంతైనా అవసరం ఉందంటారు.
    రచనలో ప్రధాన వస్తుశిల్పాల పాత్ర బలహీనపడి, ఆ క్రమంలో ప్రచ్ఛన్న వస్తుశిల్పాల శకలాలు ఏర్పడి, వాటి పాత్రని క్రియాశీలకంగా నిర్వహించి, రచనకు అత్యుత్తమ స్థాయిని కలిగిస్తాయి. రచనాక్రమంలోప్రచ్ఛన్న వస్తుశిల్పాల శకలాలన్ని ఒకే రకంగా ఉండవు. బలమైనవి, బలహీనంగానూ, బలహీనమైనవి బలంగానూ, శైథిల్యావస్థలోనున్నవి కొన్ని బలపడి రచనను ముందుకు తీసుకుపోతే, మరికొన్ని కనబడకుండా పోతాయి. ఈ ప్రచ్ఛన్న వస్తుశిల్పాల పాత్ర రచయిత భావజాలానికి కేంద్రంగా పని చేస్తుంది. 
      రాయడానికి తీసుకున్న వస్తువుకి, వ్యక్తీకరించే శిల్పానికి మధ్యన శూన్యత ఏర్పడి ఆ రచనను ముందుకి సాగనివ్వదు. బలవంతంగా రాయాలని ప్రయత్నిస్తే సహజత్వం ఉండదు. ఈ స్థితి చాలామంది రచయితలకు అనుభవమే అయివుంటుంది. అలాంటి సమయంలో ఓ ఆలోచనా మెరుపుతో తిరిగి మెుదలైన రచనలో అంతకు ముందున్న వస్తుశిల్పాల స్థితిగతులు మారతాయి. దానికి కారణం రచయితకు తెలియకుండా ప్రవేశించే ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు. రచయిత చేతిలో కీలుబొమ్మలుగా మారకుండా, మెాతాదుకు తగినట్టుగా ఈ ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు ఉంటే మనకు రచన మాత్రమే కనబడుతుంది. రచయిత ఆ రచనలో కనిపించడు. అదే రచన తనంతట తానుగా వచ్చి రాయించుకుంటే, నేరుగా ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు ఆ రచయితను ఆవహించి తమ పాత్రకు న్యాయం చేసి వెళిపోతాయి. ఈ స్థితి రచయితకు, ఆ రచనకు అత్యుత్తమం. 
" వస్తువు శకలాలుగాను, శిల్పం శకలాలుగాను కేంద్ర స్థానం నుండి తప్పుకుని ప్రచ్ఛన్న వస్తుశిల్పాల పాత్ర పోషిస్తాయని " సాగర్ గారు చెప్తున్న సూత్రీకరణపై రాబోయే కాలంలో చర్చలు జరగడం అవసరం కూడాను.
         రచన పరిపుష్టిలో ప్రచ్ఛన్న వస్తుశిల్పాల పాత్రను వివరిస్తూ " వస్తువు రూపము, స్వభావముతో పాటుగా భౌతిక, రసాయన నియమాలననుసరించి అస్తిత్వం ఉంటుందని, ఒక రూపం నుండి మరో రూపానికి మారుతుందని చెప్తూ, పరిణామం చెందడం ద్వారా వస్తువు తన స్థితిని మార్చుకుంటూ లక్షణాలను కూడా మార్చుకుంటుందని నీరు గడ్డ కట్టడం, బాగా వేడి చేసినప్పుడు ఆవిరిగా మారడం ఉదాహణగా చెప్తూ, వస్తువు పరిమాణాత్మక స్థితి నుండి గుణాత్మక స్థితికి చేరుకుంటుందని వివరిస్తారు. వస్తువుకుండే సంకేతాలను, ఆ సంకేతాలు వివిధ భాషలలో వివిధ రకాలుగా ఉంటాయని, వాటికి లిఖితపూర్వక గుర్తింపు, ఉఛ్ఛారణలో పదాలుగా మారడాన్ని సాంకేతికాలు అంటరాని, సాంకేతికాలు సాంకేతీకరణాలు కావడాన్నికూడా తన వ్యాసాలలో వివరించారు. నిజానికి భాషలో వస్తువులుండవట. వస్తువుకి సంబంధించిన భావనలు మాత్రమే ఉంటాయంటారు. వస్తు జ్ఞానం భాషపై ఆధారపడి ఉంటుందని, సమాజ అభివృద్ధికి అనుగుణంగా వస్తువు రూపొందిన్చబడిందని, రచయిత ఒక వస్తువును ఎంచుకునే క్రమంలో ఆ వస్తువుకుండే ద్వంద్వ స్వభావాన్ని గుర్తెరిగి రచన చేయాలని, ప్రతి రచనా సమాజహితానికే అయివుండాలని ఓ హెచ్చరిక కూడా చేస్తారు. భాష బతికి బట్ట కట్టాలంటే ఎన్నో అవసరాలు, సంఘర్షణలు తప్పవంటారు.
" వస్తువు నాశనం అవడం వలన గాని, రూపాంతరం చెందడం వలన గాని భాష ఉనికి ప్రశార్థకమౌతోందని, అందువలన సాహితీకారులు తమ సాహిత్యం ద్వారా వస్తువు ఉనికిని కాపాడాలని చెప్పారు. ఒకే వస్తువుని తీసుకుని పలువురు కవిత్వం చెప్పడం మూలంగా వస్తువు అసలు స్వభావం పోతుందని చెప్పడం గమనార్హం.
           సరికొత్త వస్తువునెంచుకుని, దాని స్వభావాన్ని గమనించి కవిత్వం చెప్పడం ద్వారానే కవి ప్రతిభ బయట పడుతుందని, వస్తువు ముడి సరుకు మాత్రమేనని, దానితో పాటుగా అనేక ఇతర వస్తువుల సహాయ సహకారాలు అవసరమని చెప్తూ, కేవలం వస్తువుని ఎంచుకోవడంతోనే సరైన కవిత్వం ఎవరు రాయలేరని చెప్పారు. విస్తృత వస్తువు రచనాక్రమంలో శకలాలుగా విడిపోయి, వాటి నుండి ప్రచ్ఛన్న వస్తువులు ఏర్పడి, రచన నిర్మాణంలో ప్రధాన వస్తువుని మించిపోయి, రచనను సంపూర్ణంగా ఆక్రమిస్తాయి. దీని మూలంగా రచన అద్భుతస్థాయిని చేరుకుంటుంది. అది రచయితకు తెలియకుండా జరిగిపోతుందంటారు. 
             ఒక వస్తువుని ఆవిష్కరించే ఆలోచన క్రమాభివృద్దే శిల్పం. వస్తువుకి ప్రాణం పోసేది శిల్పం. కవిత ఆరంభంలోనే ఆయువుపట్టుగా మారుతుంది శిల్పం. సక్రమ శిల్ప నిర్మాణం లేని కవితలో జీవముండదు. ఇక్కడ శిల్పానికి, వ్యక్తీకరణకి భాష ప్రధానం. భాష నుండే సరైన శైలి సాధ్యమని, సాహిత్యంలో సమాజ హితానికి భాషను సక్రమంగా వాడాలని, రచన చేసే ముందు రచయితకు సమాజ స్థితిగతుల పట్ల సరైన అవగాహన అవసరమని, సాహిత్యంలో భాషకు భావం కూడా ముఖ్యమేనని ఇలా చాలా విషయాలు తన వ్యాసాలలో చర్చించారు. సాహితీకారులకు తగు సూచనలు కూడా చేసారు. శిల్ప సాధన కోసం పేరున్న కవులను అనుకరించవద్దని, వేరే వారి రచనలు తమ రచనలుగా చెప్పుకోవడం మంచి పద్ధతి కాదని, ఆ రచనలు ఎక్కువ రోజులు మనలేవని కూడా చెప్పారు. శిల్ప సాధనకు అభ్యాసం ముఖ్యమని, శిల్పమంటే అవగాహన అని, కవిత్వం ప్రయత్నించి రాయడం కాకుండా, తనంతట తానుగా వచ్చి రాయించుకునే కవిత్వం, చక్కని శిల్పంతో శోభిల్లే కవిత నాలుగు కాలాలు నిలబడుతుందని, దీనికి కవికి నిజాయితీ ముఖ్యమని అంటారు. ఎక్కువ పుస్తకాలు చదవడం ద్వారా ఎన్నో విషయాలు తెలుకోవచ్చని చెప్పారు. నిజమే కదా అది. 
             వస్తు సాకారమంటేనే ప్రచ్ఛన్న వస్తుశిల్ప సౌందర్యం, దీనిని గురించి విమర్శకుడు రచయితకు సరైన అవగాహన కల్పిస్తే ఆ రచన చక్కగా పండుతుందంటారు సాగర్ గారు. వస్తువు స్వభావాన్ని, ప్రవృత్తిని, నిర్మాణ, పునర్నిర్మాణాన్ని, ప్రచ్ఛన్న వస్తుశిల్పాల సాధనలో అంతర్వాణి పాత్రను, మేధస్సును కూలంకషంగా చర్చిస్తారు. 
ప్రచ్ఛన్న వస్తుశిల్పాల గురించి చర్చించేటప్పుడు వస్తువు బాహ్యముఖీనం. శిల్పం అంతర్ముఖీనమని మరువకూడదని, బంగారం నగగా రూపాంతరం చెందే క్రమంలో జరిగే విధానమే రచనలో ప్రచ్ఛన్న వస్తుశిల్పాల పాత్రని, వస్తువుకి పాజిటివ్, నెగెటివ్ ఛాయలే కాకుండా తటస్థ ఛాయలుంటాయని, రచయిత పదాల దానకర్ణుడంటూ, ఆ పదాల కూర్పుతో కావ్యముగా మలిచే క్రమంలో ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు కనబడకుండా తమ పని తాము చేసుకుపోతాయి. రచన పూర్తయ్యాక అది చూసి రచయితే ఆశ్చర్యానికి గురౌతాడు. రాయించేది రామభద్రుడట అన్న చందాన. ఇప్పటి సాహిత్యానికి ప్రచ్ఛన్న వస్తుశిల్పాల పాత్రని అధ్యయనం చేయడం కనీసావసరమని సాగర్ గారు ఘంటాపథంగా చెప్తున్నారు. 
        రెండవ భాగమైన సాగర వచనంలో రచన ఎలా ఉండాలి, రచయిత లక్షణాలేంటి, రచనలను పాఠకులకు అందిచడంలో పత్రికల పాత్ర తదితర అంశాలను సవివరంగా వివరిస్తారు. రచనను ఓ క్రియాశీలక సృజనాత్మక కార్యాచరణగా అభివర్ణిస్తారు. విమర్శకుల కోణంలో కవిత్వం రెండు పార్శ్వాలుగానే ఉందని చెప్తూ, బాహ్యముఖీన,అంతర్ముఖీన కవిత్వమే కాకుండా, మూడో పార్శ్వమైన రహస్యముఖీన తత్వాన్ని తెలివైన పాఠకుడు ఆస్వాదిస్తాడంటారు. అనుసరణకు, అనుకరణకు తేడా వివరిస్తారు. అనుకరణ తప్పని చెప్పకపోవడం సాహిత్య దోషమని నొక్కి వక్కాణించారు. మహిళా ఉద్యమాలు, స్త్రీ ఉద్యమాల ఆవశ్యకత గురించి, మహిళకు, స్త్రీ కి గల చిన్న తేడాని చూపిస్తారు. మంచి సాహిత్యం మాత్రమే భాషని బతికిస్తుందని, అంతరించిపోతున్న భాషను రాత ద్వారా కూడా బతికించుకోవాలని, సాహిత్యం లేని భాష సజీవభాషగా మనలేదని, సాహిత్యము, విమర్శ వేరు వేరు కాదని, గొప్పదనం రచనదే కాని రచయితది కాదని, అలా కాకుండా ఆ రచన గొప్పదనాన్ని రచయిత ఆపాదించుకుంటే, ఆ కీర్తి కిరీటంతో అక్కడే ఆగిపోతాడన్న హెచ్చరిక కూడా ఉంటుంది. 
          " అనుభూతి యెుక్క తీవ్రస్ధాయిా బేధాలే కవిత్వం " అని అంటూ శక్తి రూపాలను గుర్తు చేస్తూ, సాహిత్యంలో భౌతికశాస్త్ర నియమాన్ని E =mc² ను కవిత్వ వస్తు శక్తిగా వివరించడం, రచయితలు, పత్రికలు ఏ కాలంలోనూ ఓడిపోలేదని, సాహిత్యంలో గురుశిష్యుల అనుబంధాన్ని, వాస్తవాలను పాఠకులకు చేరవేయడంలో రచయిత అనుసరించాల్సిన పద్ధతులు, విమర్శనకారుల రూపంలో ప్రవచనకారులు సమాజంపై చిమ్మే విషాన్ని అరికట్టాలంటారు. అపసవ్య మార్గంలో పోతున్న సమాజానికి సద్విమర్శ మేలు చేస్తుందంటూ, ఈనాడు తప్పు దారిలో అభ్యుదయవాదులమని చెప్పుకుంటూ ప్రభుత్వ ఫండ్స్ బోలెడుమంది నొక్కేస్తున్నారన్న బాధను వ్యక్తపరిచారు. కవి కాని, కవిత్వం కాని సమాజాన్ని మారుస్తాయన్న ఆశాభావం వీరి వ్యాసాల్లో కనిపిస్తుంది. 
                 విభిన్న అంశాలతో మూడవ భాగంలో  అస్తిత్వవాదం గురించి, వర్తమాన విమర్శ గురించి, వస్తు శిల్పాల గురించి, పోస్ట్ మెాడ్నరిజం సిద్ధాంతం గురించి, విమర్శ లేకుండా పాఠకుడు ఉండడు, రచయితా - విమర్శ వేరు కాదని చెప్తూ, సాహిత్యానికి విమర్శ అవసరాన్ని వివరిస్తారు. 
           ప్రచ్ఛన్న వస్తుశిల్పాలకు ముందు మాటలు రాయమంటే నేను ఓ చిన్నపాటి సమీక్ష రాసేటట్లుగా చేసింది  " ప్రచ్ఛన్న వస్తుశిల్పాల " వ్యాస సంపుటి. ఓ నిజమైన సాహితీకారుడు తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాలు ఈ వ్యాసాల నిండా ఉన్నాయి. నా వరకు నాకు ఇవన్ని చాలా అమూల్యమైన అక్షర సంపదే. ఎందుకంటే ఏ సాహితి లక్షణాలు తెలియకుండా రాసే నాకు ఓ రచన వెనుక ఇంత యుద్ధం చేయాలా అని ఆశ్చర్యం వేసింది. ఓ రచన ఎలా ఉండాలి, ఆ రచన చేయడానికి కావాల్సిన ముడి సరుకు, అలంకారాలు, రచయితకు ఉండాల్సిన లక్షణాలు, వస్తువు పై అవగాహన, భాషపై పట్టు, సమాజం పట్ల అంకితభావం, సాహిత్యాన్ని భౌతిక, రసాయన శాస్త్రాలతో కలిపి తాత్విక లక్షణాలను రచయితలు ఎలా ఆపాదించుకుంటారో, సంపూర్ణ రచన ఎలా వెలువడుతుందో మెుదలైన విషయాలన్నింటిని  " ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు " వ్యాసాలలో వివరించి, నాలుగు మాటలు నేను రాసే అవకాశాన్ని కల్పించిన సాగర్ అంకుల్ కి మనఃపూర్వక ధన్యవాదాలు.
              తెలుగు సాహిత్యానికి ఏం కావాలో తెలియజెప్పిన అక్షర మణిహారం " ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు " పుస్తకాన్ని అందించిన సాగర్ శ్రీరామ కవచం గారికి హృదయపూర్వక అభినందనలు.. 

మంజు యనమదల
విజయవాడ
         

       

21, సెప్టెంబర్ 2020, సోమవారం

కాలం వెంబడి కలం..20

        మాది పల్లెటూరు కదా. ఇదిగో పులి అంటే అదిగో తోక అనే రకాలు ఎక్కడైనా ఉంటారు, కాని మా ఊరిలో మరికాస్త ఎక్కువన్న మాట. రాఘవేంద్ర మా ఇంట్లో ఉండటం గురించి, మా చుట్టాలు కొందరు బయట వేరేగా మాట్లాడారు. మా నాన్న దగ్గర కూడా వేరేగా చెప్పారు. నా గురించి కాకుండా మా అమ్మ గురించి మాట్లాడటం, అవి విని పాతికేళ్ళు కాపురం చేసిన మనిషి గురించి చెప్పిన చెప్పుడు మాటలు నాన్న నమ్మడం జరిగాయి. అమ్మకు అప్పటికి కాస్త ఆరోగ్యం బాలేక, రాఘవేంద్ర మంచివాడు, పిల్లను బాగా చూసుకుంటాడని అనుకుంది కాని, రాఘవేంద్ర చదువు, కుటుంబం గురించి ఆలోచించలేదు. 
      మా నాన్న నాతో ఏమి మాట్లాడకుండా, మా భారతి అమ్మమ్మ వాళ్ళింటికి నన్ను పిలిపించి, చుట్టాలందరు ఉండగా, అమ్మమ్మ వాళ్ళ అల్లుడు వెంకటేశ్వరరావు బాబాయితో అడిగించారు ..ఊరిలో వాళ్ళు అనుకుంటున్నారు. నువ్వు రాఘవేంద్రని చేసుకుంటావని. నీ ఉద్దేశ్యం ఏంటి అని అడిగారు. నాకప్పటికి ఏం తెలియదు. రాఘవేంద్ర కూడా అంతకు ముందు నన్ను ఎవరిని చేసుకుంటావని అడిగితే " మా నాన్న ఎవరిని చేసుకోమంటే వారినే చేసుకుంటానని " చెప్పాను. ఇదే మాట అక్కడ కూడా చెప్పి వచ్చేసాను. ఎందుకో నాకు చాలా బాధ అనిపించింది అలా వాళ్ళతో ఏదో నేను తప్పు చేసినట్లుగా అడిగించడం. నావి, మా నాన్నని ఇష్టాలన్ని ఒకటే ఎప్పుడూ. ఏదున్నా మాట్లాడుకునే వాళ్ళం. ఆయన అడగకుండా నన్నలా అడిగించడం నాకు నచ్చలేదు. 
    ఆ రాత్రి మా నాన్న చెల్లెళ్ళను, అన్నను పిలిపించి పెదరాయుడు సినిమా స్టైల్ మీటింగ్ పెట్టి రాఘవేంద్ర మంచివాడు కాదని తీర్మానం చేసారు. అప్పుడు రాఘవేంద్ర లేడు. ఆ రాత్రి వచ్చాక ఇంట్లోనుండి వెళిపొమ్మన్నారు. మరుసటి రోజు పొద్దుటే వెళిపోయాడు. మా నాన్న అమ్మని మాటలనడం, అప్పటి వరకు మంచివాడైన రాఘవేంద్ర మంచివాడు కాకపోవడం ఇవన్నీ నాకు నచ్చలేదు. తప్పు చేయనప్పుడు బయటివారినైనా సమర్థించడం నా నైజం. అప్పటి వరకు పెళ్ళి గురించి ఏ ఆలోచనా, ఏ నిర్ణయం తీసుకోని నేను ఓ నిర్ణయానికి వచ్చాను. అదే నాన్నకు చెప్పాను. బాధ్యత లేని వాడికి పిల్లనివ్వను అన్నారు. 
     మా రాధ పెదనాన్నకి వాళ్ళ చుట్టాలు చెప్పిన AS/400 బెంగుళూరులో 22 రోజుల కోర్సు 20,000 కట్టి నేర్చుకున్నాను. ఓ నాలుగు రోజులు మా రాధ పెదనాన్న వాళ్ళ మూడో అమ్మాయి సీలర్ వాళ్ళింట్లో ఉన్నాను. తర్వాత నా ఇంజనీరింగ్ రూమ్మేట్స్ శారద, చంద్ర వాళ్ళింట్లో ఉండి నేర్చుకున్నాను. శారద వాళ్ళ నాన్నగారు అప్పుడు కర్నాటక దేవాదాయ శాఖ మంత్రి. చాలా బాగా చూసుకునేవారు అందరు. తర్వాత హైదరాబాదులో ప్రాజెక్ట్ చేయడానికని హాస్టల్లో ఉన్నాను. రాఘవేంద్ర చెల్లెలు కూడా ఉండేది. అలా ఓ సంవత్సరం నర్ర నాన్నకు, నాకు మధ్యన నిశ్శబ్ద యుద్ధం జరిగింది. 
      అది ఓ మంచిరోజో, చెడ్డరోజో నాకిప్పటికి తెలియదు. ఆగస్టు 14వ తేదిన రాఘవేంద్ర వాళ్ళ బావ ఇంటికి వచ్చి నాన్నతో, మామయ్యతో ఏం మాట్లాడారో నాకు తెలియదు. మా నాన్న లోపలికి వచ్చి నా ఆస్తి లేకుండా బతకగలవా అని అడిగారు. నేను వెంటనే నీ ఆస్తి కోసం కాదు నాన్నా నీ కోసం ఉన్నాను అని చెప్పాను. వెంటనే మా శ్రీకృష్ణం పెదనాన్నను పిలిపించి, నన్ను బట్టలు సర్దుకోమన్నారు. అప్పటికి నా పేరు మీద మూడునర్ర ఎకరాలు పొలం ఉంది. కార్ పిలిపించారు. నేను అమ్మకు ఇష్టమైన నా ఫోటో లామినేట్ చేయించి తెచ్చాను అంతకు ముందు. నాన్న అది తెచ్చి ఇచ్చేసారు. నేను తక్కువ తినలేదుగా, ఆయన కూతుర్నే కదా. మెడలో చాలా సన్న చైన్ ఉండేది.అది, గాజులు తీసి అక్కడ పెట్టేసాను. ఒంటి మీదవి ఉంచుకో అన్నా కూడా వినకుండా. ఎప్పుడో 9 చదివేటప్పుడు మా జ్యోతి పెద్దమ్మ ఇచ్చిన మెరూన్, వైట్ క్రిస్టల్స్ గొలుసు తీసి పెట్టుకున్నా. 
        సాయంత్రానికి అవనిగడ్డ రిజిస్ట్రాఫీస్ లో నా పేరుమీదున్న పొలం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఎవరి పేరు మీద అన్నది కూడా చూడలేదు. సంతకాలెక్కడ పెట్టమంటే అక్కడ పెట్టేసాను. నాకు హైదరాబాదు బస్ టికెట్ తీసుకున్నారు. ఓ కట్ట డబ్బులు ఇచ్చారు. వద్దని ఇచ్చేసాను. మనిద్దరికి తేడా ఇప్పుడు వచ్చింది. నువ్వు హాస్టల్ ఫీజ్ కట్టాలి కదా తీసుకో అన్నారు. అప్పుడు హాస్టల్ ఫీజ్ 1200 రూపాయలు. అవి మాత్రమే తీసుకుని మిగతావి ఇచ్చేసాను. మా నాన్న, పెదనాన్నల నోటి నుండి మాటలు చాలా నడిచాయి సినిమాల్లోలా. నన్ను బస్ ఎక్కించారు. 
        అప్పటి నా మానసిక స్థితి అంతా ఖాళీగా అయిపోయింది. అదే టైమ్ లో ఆడపిల్లల నెలవారి ఇబ్బందులు కూడా. బాగా ఇబ్బంది పడేదాన్ని నొప్పితో. అమ్మ ఎలా ఉందోనని బెంగ. నేను పెంచిన కుక్క ఏమౌతుందోనని దిగులు ఓ పక్క. నాన్న చూసుకుంటారులే దాన్ని అని ఓ నమ్మకం. మనసులో నాకనిపించింది అప్పుడు మా నాన్న చేసిన పనేమిటంటే " పూలల్లో పెట్టి పెంచి నడిరోడ్డు మీద వదిలేసారని . " 
చిన్నప్పుడు నన్ను అరుగు మీద నిల్చోబెట్టడానికి మట్టి నా అరికాళ్ళకు అంటుతుందని తన చేతితో తుడిచి నిల్చోబెట్టిన నాన్న తన మాట కాదన్నానని  ఇలా ఇంట్లో నుండి పంపేయడం ఊహించని సంఘటన. నేనెప్పుడూ కలలో కూడా అనుకోలేదు మా ఇద్దరి మధ్యన అభిప్రాయ బేధాలు వస్తాయని. 
అనుకోనివి జరగడమే కదా జీవితం అంటే. ఓ పద్ధతి ప్రకారం అన్ని జరిగితే అది జీవితం అనిపించుకోదు మరి. 

వచ్చే వారం మరిన్ని కబుర్లతో... 

     

అరుదైన అవకాశం...!!

      ఏ పుస్తకానికైనా నాలుగు మనవైన మాటలు రాసే అవకాశం రావడం నిజంగా చాలా అదృష్టమనే చెప్పాలి. అలాంటి అవకాశాలను నాకు ఇస్తున్న అందరికి మనఃపూర్వక ధన్యవాదాలు. 

ఓ రోజు లక్ష్మీ రాఘవ గారు ఫోన్ చేసి నా రాతల గురించి చెప్తూ... తన 6వ కథల సంపుటికి ముందు మాటలు రాయమని అడిగితే...చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే పుస్తకం చదివితే మీ అర్థం అవుతుంది..

ఇంతటి సదవకాశాన్నిచ్చిన డాక్టర్ లక్ష్మీ రాఘవ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలతో..
 
అందరి మనసులకు తన కథామాత్రలిచ్చి                   " మనసుకు చికిత్స " చేసిన డాక్టర్ లక్ష్మీ రాఘవ గారికి శుభాభినందనలు... 

నాలుగు మాటలు... 

బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన డా. లక్ష్మీ రాఘవ గారితో స్వర పరిచయమే కాని ముఖ పరిచయం లేదు. అక్షరాలతో అల్లుకున్న మా ఇరువురి అనుబంధం ముఖపుస్తకంతోనే మెుదలైంది. కథనాలను అద్భుతమైన కథలుగా మలచడంలో అందె వేసిన చేయి డా. లక్ష్మీ రాఘవ గారిది. మన చుట్టూ వున్న సమస్యలను తనదైన కోణంలో చూపిస్తూ, వాటికి చక్కని పరిష్కారాలను కూడా సూచిస్తారు తన కథలలో. దాదాపుగా 150 పై చిలుకే కథలను రాసి, 5 కథల పుస్తకాలు వేసి, ఆరవ కథా సంపుటిగా "మనసుకు చికిత్స" కథా సంపుటిని తీసుకురావడం, దానికి ముందు మాటలు రాసే అదృష్టం నాకు కలగడం చాలా సంతోషంగా ఉంది. 
         డా. లక్ష్మీ రాఘవ గారి కథలన్నీ మన చుట్టూనే తిరుగుతుంటాయి. ఈ సమాజంలో బ్రతుకుతున్న అన్ని వయసుల వారి మనసు సంఘర్షణలను, తన మనసుతో చూసి రాసినట్లుగా అనిపిస్తాయి. చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో చూసి భయపడే ఎందరికో డా. లక్ష్మీ రాఘవ గారి కథలు పరిష్కారం చూపించడమే కాకుండా, మనోధైర్యాన్ని కూడా ఇస్తాయనడంలో ఎట్టి సందేహమూ లేదు. జీవితాన్ని విభిన్న పార్శ్వాలలో చూసిన సంపూర్ణ అనుభవశాలి డా. లక్ష్మీ  రాఘవ గారు. ఆ అనుభవ సారమంతా ఈవిడ కథలలో మనకు గోచరమవుతుంది.     
     చదువుకునే పిల్లల మనస్తత్వం, వారి ఇష్టాయిష్టాలపై తల్లిదండ్రుల ప్రభావము, దాని వలన పిల్లల్లో కలిగే మానసిక ఒత్తిడి, దాని పరిణామాల గురించి చక్కని కథలు. వయసు మీరిన తరువాత పెద్దలపై పిల్లల ప్రవర్తన, పెద్దల మనోభావాలు, మానసిక ఇబ్బందులు, పిల్లల కోసం వారి సర్ధుబాట్లు,  వారి కోరికల గురించి కొన్ని కథలు ఈ సంపుటిలో ఉన్నాయి. వయసుడిగిన తల్లిని వదిలించునే కొడుకుని, ఆ కొడుకుని అమితంగా ప్రేమించే తల్లి మనసుని ఎంతో హృద్యంగా చూపించారు ‘ఎంతైనా అమ్మ’ కథలో.  కరోనా కష్టాలను, నష్టాలను, దాని ప్రభావం కుటుంబ అనుబంధాలపై ఎలా ఉంటుంది, ధనిక, పేద, వైద్యులు అన్న తేడా లేకుండా కరోనా మూలంగా జనం పడుతున్న అగచాట్లు, ఇరుగు పొరుగుతో ఇక్కట్లు, ప్రయాణాల పాట్లు, డబ్బు అవసరాల స్వార్థపు అనుబంధాలు, యువత ఆశయాలు,దూరపు కొండలు నునుపనుకునే వారికి అమెరికా ఉద్యోగంలో కష్టాలు, మన లెక్క సరి చూసే విధి విలాసాన్ని ఇలా ఎన్నో సమస్యలను,  వాటికి చక్కని పరిష్కారాలను అందించారు ఈ "మనసుకు చికిత్స" కథా సంపుటిలో. 
          కరోనా మెాడల్ తయారిలో తన అగచాట్లు చెప్పడం, అత్తగారికి చెప్పాలనుకున్న విషయాన్ని సున్నితం గా చెప్పడం, కుటుంబ సమస్యలనే అందమైన లేఖలుగా అందించడం హర్షనీయం. 
        భేషజాలు లేకుండా సరళంగా, సున్నితంగా రచనలు చేయడం కూడా ఓ కళే. ఎక్కువగా వర్ణనలు, ఉపోద్ఘాతాలు ఉంటేనే కథలు అనుకునే చాలామందికి డా. లక్ష్మీ రాఘవ గారి కథా సంపుటాలు సూటిగా సమాధానం చెప్తాయి. మనం కష్టమైన పదాలు, సమాసాలు ఎన్ని వాడామని కాదు. మన రచన ఎందరి హృదయాలను కదిలించింది అన్నది లెక్క. పాఠకుల మనసులను తాకేది, నలుగురు మెచ్చేది ఉత్తమ రచన అన్నది నా అభిప్రాయం. దీనికి ఏ విధమైన అవార్డులు, రివార్డులు అవసరం లేదు. సూటిగా, క్లుప్తంగా విషయాన్ని చెప్పడమే పాఠకులు ఇష్టపడుతున్నారిప్పుడు. ఈ లక్షణాలన్నీ మెండుగా ఉన్న డా. లక్ష్మీ రాఘవ గారి ఇంతకు ముందు కథా సంపుటాలకు ధీటుగా ఈ "మనసుకు చికిత్స" కూడా అందరిని అలరిస్తుందని ఆశిస్తూ... హృదయపూర్వక అభినందనలు. 
నా మీద అభిమానంతో నాలుగు మాటలు రాసే అవకాశం నాకిచ్చినందుకు మనఃపూర్వక ధన్యవాదాలు.
మీ కథలను అభిమానించే 
మంజు యనమదల
విజయవాడ  

19, సెప్టెంబర్ 2020, శనివారం

అనంతం..!!

నేస్తం, 
         ఓ రకంగా చెప్పాలంటే సముద్రానిది అదృష్టమే. తనలో దాచుకున్న విషాదాన్ని, సంతోషాన్ని ఆకాశంతో పంచుకుంటుంది. తనలో దాగిన అగ్నిపర్వతాలను ఉప్పెన, సునామీలను అప్పుడప్పుడూ మనకూ రుచి చూపిస్తుంది. వాయుగుండాల, అల్ప పీడనాల రూపంలో తన కన్నీటిని కడిగేసుకుంటూ ఉంటుంది కూడా. తీరంతో చెలిమి చేస్తూ అలల అల్లరితో ఆటలాడుతూ అందరికి తను ఆహ్లాదంగా ఉన్నట్లు భ్రమ కల్పిస్తుంది. తనలోనికి వెళితే ఏమి ఎరగనట్టుగా, ఏ చీకు చింతా లేనట్టుగా ఎంత ప్రశాంతంగా ఉంటుందో. మంచుని, మలినాలను ఒకేలా తనలోనికి ఆహ్వానం పలుకుతుంది. నదీ సంగమాలతో పుణ్యక్షేత్రాలుగా విలసిల్లుతోంది. తనలో కలచి వేసే కల్లోలమెంత రగులుతున్నా ఎప్పుడోగాని బయట పడదు. భూదేవంత ఓర్పు సముద్రానికి ఉందనడానికి సాక్ష్యం ఇది చాలదూ.
    మనసుకు ఈ వెసులుబాటు తక్కువే. మౌనంగా అన్నీ భరించడమే. లేదంటే అక్షరాల ఆసరాతో  పదాల అలలతో అలరించడం అలవాటు చేసుకోవడమే. మనోభావాలను పంచుకోవడానికి అంతకు మించి మరో దారి లేదు. భారం మెాయలేనప్పుడు ఈ అక్షరాలే కాస్త సేద దీరుస్తాయి. బంధాలు, అనుబంధాలు డబ్బులతో ముడిబడినప్పుడు, స్నేహం ముసుగులో వంచన చేసినప్పుడు కలిగే బాధను పంచుకోగలిగేది ఈ అక్షరాలతోనే. చుట్టరికాలు చుట్టపు చూపులకే పరిమితమైన నేటి కాలానికి అభిమానాలు, ఆప్యాయతలు నాటకీయంగా అనిపించడంలో కొత్తేం లేదు. అయినవారు, కానివారు అందరు ఒకేలా ప్రవర్తించడం ఇప్పటి సమాజంలో మనిషి సహజ లక్షణం అయిపోయింది. పిల్లల కష్టసుఖాలు పట్టని పెద్దలు ఉండటం వారి దురదృష్టము. పెద్దల ఆలనాపాలనా చూడని బిడ్డలుండటం పెద్దల కర్మ. తన ఊపిరినే ఉగ్గుపాలగా మార్చిన అమ్మను అత్యంత హీనంగా చూసిన, చూస్తున్న బిడ్డలున్న నేటి సమాజం మనది. మానసికంగా, శారీరకంగా స్త్రీని హింసకు గురి చేస్తున్న ఎందరో పుణ్యపురుషులు, సమాజోద్ధారకులు చెప్పే సూక్తి సుధలు వింటూ తలలాడించే దుస్థితి మనది. తప్పదు బతికేయాలిలాగే మారు మాటాడకుండా. అదేమని ప్రశ్నిస్తే తట్టుకోలేరు ఈ పుణ్యపురుషులు. మనసులో మాట బయటికి చెప్పే వెసులుబాటు లేకున్నా, కనీసం అక్షరాలతో పంచుకోవడానికి కూడా ఆంక్షలు పెట్టే నవ సమాజమిది. తప్పుని ఎదుటివారి మీద వేసే మన నైజం మారనంత వరకు మనసు కడలికి ఈ కన్నీరు తప్పదు. నిశ్శబ్ధం కూడా భరించలేనంత భయంకరంగా ఉంటుందనడానికి ఇలా మనకు తెలిసిన మనసు కథలెన్నో సాక్ష్యాలై మన ముందున్నా నోరు విప్పి తప్పు అని చెప్పలేని నిస్సహాయులమైనందుకు చింతించడం తప్ప ఏమి చేయలేని పరిస్థితి. సమాజంలో మార్పు కోరుకోవడం కాదు ముందు ఆ మార్పు మన ఇంటి నుండే మెుదలవ్వాలని ప్రయత్నిస్తే...మరో తరానికైనా ఆ మార్పులోని సంతోషం దక్కుతుంది.
అందుకే అతివ మనసు, అనంత సాగరం రెండూ ఎంత దగ్గరగా ఉన్నాయెా అనిపిస్తుంటుంది.

17, సెప్టెంబర్ 2020, గురువారం

భూతల స్వర్గమేనా...25

పార్ట్ 25..
మేం హంట్స్విల్ వచ్చేసరికే సింధు కూడా అక్కడే ఉంది. మా ఊరి వాళ్ళు రజిత, నరేంద్ర, చైతన్య కూడా అక్కడే ఉన్నారు. నరేంద్రకి గాస్ స్టేషన్ లో జాబ్ విష్ణునే చూసాడు. చైతన్య నరేంద్ర వైఫ్. చైతన్య, రజిత, లత,విష్ణు ఇంకా మిగిలిన పిల్లలు అందరు MS చేస్తున్నారప్పుడు. H1B వీసాతో అమెరికా వచ్చినా స్టేటస్ ప్రోబ్లంతో స్టూడెంట్ వీసాకి కన్వర్ట్ అయినవాళ్ళు చాలామంది ఇలా. హంట్స్విల్ చాలా చిన్న ఊరే అయినా డాక్టర్లు చాలామంది ఉన్నారు. రెండు యూనివర్శిటీలు ఉన్నాయక్కడ. తెలుగు వాళ్ళు, ఇండియన్స్ ఎక్కువే. 
కొన్ని రోజులు ఉష మాతోనే ఉంది. కాస్త బద్దకిస్ట్ అంతే. మా AMSOL ద్వారానే తనకి ప్రాజెక్ట్ ఇప్పించాను. మా ఆయన వచ్చిన ఇరవై రోజులకి అమ్మానాన్న, మా పెద్దోడు మౌర్య హంట్స్విల్ వచ్చారు. నేను కార్సన్ సిటీలో పని చేసినప్పుడు సంధ్య, శ్రీనివాస్ కాస్త మనీ హెల్ప్ చేసారు అమ్మావాళ్ళు రావడానికి. వాణి కూడా కొద్దిగా ఇచ్చింది. అమ్మావాళ్ళు వచ్చే ముందే ఉషకి ప్రాజెక్ట్ అట్లాంటాలో వచ్చింది. మా ఆయన, ఉష వెళ్ళారు అట్లాంటా అమ్మావాళ్ళను రిసీవ్ చేసుకోవడానికి. 
అమ్మావాళ్ళకు వీసా మూడు నెలలకు ఇచ్చారు కదా, అమెరికా వచ్చినప్పుడు ఇమ్మిగ్రేషన్ లో వాళ్ళు ఎన్ని రోజులుంటారని అడిగితే, నాన్న వీసా టైమ్ చెప్పారట. మీరు పర్మిషన్ ఇస్తే ఆరు నెలలు ఉండి వెళతామన్నారంట. I-94 మీద ఆరు నెలలు పర్మిషన్ ఇచ్చారు. 
విష్ణు వాళ్ళు వెహికల్ బుక్ చేసుకుని అమ్మావాళ్ళను తీసుకురావడానికి వెళుతూ, నన్ను రమ్మంటే, నేనూ బయలుదేరాను వాళ్ళతో. ఏముంది వెంటనే వచ్చేయడమే కదా అని. హంట్స్విల్ కి అట్లాంటా మూడు గంటల ప్రయాణం. దారిలో ఏదో యాక్సిడెంట్ జరిగ ఎనిమిది గంటలు ట్రాఫిక్ జామ్ అయ్యింది. నాకేమెా అంతసేపు కార్ లో కష్టమనిపించింది నెలలు నిండటంతో. మెుత్తానికి అందరిని తీసుకుని ఇంటికి వచ్చాము. తర్వాత ఈయన విష్ణు వాళ్ళతో కొన్ని రోజులు చేస్తూ, చౌదరి గారి గాస్ స్టేషన్ లో జాయిన్ అయ్యాడు. పగలు చౌదరి గారి దగ్గర, నైట్ విష్ణు వాళ్ళు చేసే చోట చేసేవారు. మా అవసరాలకు విష్ణు కార్ వాడుకునేవారం. నాకు సి సెక్షన్ ఆగస్టు 15న చేస్తామన్నారు డాక్టర్ కాకాని. ఆవిడ తెలుగావిడే. విష్ణుకి తెలిసిన సీతక్కతో చెప్పించాడు. తర్వాత తెలిసిందేమిటంటే చౌదరి గారి మేనమామ వైఫ్ అని. చక్కగా మాట్లాడేవారు డాక్టర్. బేబి బాగా పెరిగిపోవడంతో నైంత్ మంత్ రాగానే, వెంటనే సి సెక్షన్ కి ప్లాన్ చేసారు. హెల్త్ ఇన్ష్యూరెన్స్ వాళ్ళకి కాల్ చేసి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసాను. డాక్టర్ కాకాని ఆగస్టు 15 కాదు, 14నే చేస్తాను, మార్నింగ్ 7 కంతా హాస్పిటల్ లో ఉండండి అన్నారు. సరేనని మేము 7 కి వెళ్ళాము. అప్పటికే డాక్టర్ వెయిట్ చేస్తున్నారు. గబగబా నాకు సెలైన్ పెట్టడానికి నర్వ్ కోసం ట్రై చేస్తే దొరకలేదు. ఆ నీడిల్ తీసేసి, మరో చేతికి ట్రై చేస్తే దొరికింది. ఈ లోపల ఈ చేతి నుండి కాస్త బ్లడ్ కారిపోతే, అమ్మ కంగారు పడింది. 
నన్ను ఆపరేషన్ థియేటర్ కి తీసుకువెళ్ళారు. ఎనస్తీషియా ఇవ్వడానికి డాక్టర్ ఉన్నారు. టేబుల్ మీద కూర్చోమని, పూర్తిగా వంగమని, వెన్నుకి ఇంజక్షన్ చేసారు. ఎనస్తీషియా డాక్టర్ కాకుండా ఐదారుగురు ఉన్నారు నా బెడ్ చుట్టూ. సర్జరీ చేసినంత సేపూ, ఎనస్తీషియా డాక్టర్ నా తల దగ్గరే ఉన్నారు. మా కాకాని డాక్టర్ గారు మిగతావాళ్ళతో కబుర్లు చెప్తూనే, నాతో కూడా మాట్లాడుతూనే ఉన్నారు సర్జరీ జరిగినంతసేపు. కుట్లు వేస్తుంటే, నాకెందుకో పిన్ మెషిన్ తో పిన్ కొట్టినట్టనిపించింది. అది అనుమానం కాదు నిజమేనని అర్థం అయ్యింది వెంటనే. 
బాబు బావున్నాడు అని డాక్టర్ చెప్పగానే జుట్టు బాగా ఉందా అని అడిగాను. డాక్టర్ నవ్వి ఎందుకలా అడిగావంటే, మా అమ్మకు ఇష్టమండి అన్నాను. 
అమెరికాలో సర్జరీ చేసేటప్పుడు పేషెంట్ తోపాటు మరొకరు ఉండవచ్చు. కావాలంటే సర్జరీ జరిగేటప్పుడు వీడియో కూడా తీసుకోవచ్చు. నాన్నని రూమ్ లో ఉండమంటే తనవల్ల కాదన్నారు. ఈయనే సర్జరీ అంతసేపు ఉండి, సర్జరీ మెుత్తం వీడియెా తీసారు. బాబుని క్లీన్ చేసాక నాకు చూపించారు. అమ్మ మెుదటి ముద్దు వాడికి అందింది. నన్ను వేరే రికవరి రూమ్ లో ఓ గంట ఉంచారు. తర్వాత రూమ్ కి షిఫ్ట్ చేసారు. బాబుకి స్నానం చేయించి, తల దువ్వి మరీ తీసుకువచ్చారు సిస్టర్స్. సాయంత్రం విష్ణు, సింధు చూడటానికి వచ్చారు. మరుసటి రోజు ఇంటికి పంపేస్తామన్నారు. ఆ రోజు నైట్ వళ్ళంతా బాగా దురద వచ్చింది నాకు. సిస్టర్స్ కి చెప్తే ఇంజక్షన్స్ చేసారు రెండు, మూడు సార్లు. మరుసటి రోజు పొద్దున్నే అమ్మావాళ్ళను ఇంటికి వెళ్ళి రమ్మన్నాను. నాన్న ఉన్నారు నా దగ్గర. బాబుని సిస్టర్స్ తీసుకువెళ్ళారు స్నానం చేయించడానికి. పిల్లలను కూడా పిల్లల డాక్టర్ వచ్చి చూస్తారు. మనం మన ఇన్ష్యూరెన్స్ ప్రొవైడర్ ని బట్టి పిల్లల డాక్టర్ ని సెలక్ట్ చేసుకోవాలి. తోటకూర ప్రసాద్ గారు మా బాబు డాక్టర్. పిల్లలు పుట్టిన తర్వాత హాస్పిటల్ లోనే వారికి సోషల్ సెక్యూరిటీ నంబర్ అప్లై చేయాలి. హాస్పిటల్ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్ లో పిల్లల ఫోటో అప్ లోడ్ చేస్తారు. ఫోటో తీసుకోవడానికి, సోషల్ సెక్యూరిటీ నంబర్ అప్లై చేయించడానికి అందరు కాస్త తేడాతో వచ్చారు. కాని నాకప్పటికే బాగా తేడాగా ఉంది. బాబుని స్నానం చేయించడానికి తీసుకువెళ్ళే సరికే నాకు బాలేదు. నాన్న కంగారు పడతారని, నిద్ర వస్తోంది, కాసేపు పడుకుంటాను. కంగారు పడకండని చెప్పాను. ఈ లోపల వీళ్ళంతా రావడం, నేను వాళ్ళు అడిగే వాటికి, నాకు ఊపిరి అందక సమాధానం చెప్పలేక పోవడం జరిగింది. నాకు తెలుస్తోంది ఆఖరి క్షణాలని. ఆ టైమ్ లో కూడా నేనయిపోతున్నానని కాకుండా.. పిల్లాడికి పాలు ఎలాగో పడతారు. పేపర్స్ గురించి, ఇండియా వెళ్ళడం ఇవన్నీ పాపం వీళ్ళకు ఏం తెలియదు కదా. ఎలా వెళతారో ఇండియా అని ఆలోచించాను. 
అమెరికాలో హాస్పిటల్స్ లో బెడ్ కే ఎమర్జెన్సీ బటన్స్ ఉంటాయి. వెంటనే ఆ బటన్ ప్రెస్ చేసాను. సిస్టర్ కి నా కండిషన్ చెప్తుంటే..
ఇంతకు ముందెప్పుడయినా ఇలా జరిగిందా! అప్పుడే చేసారు?మీ వాళ్ళలో ఎవరికయినా ఇలా జరిగిందా అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంటే..నేనేమెా సమాధానం చెప్పలేని పరిస్థితి. నాన్న చెప్తుంటే వాళ్ళకు అర్థం కావడం లేదు. మన ఇంగ్లీష్ బ్రిటీష్ ఇంగ్లీష్. అమెరికా వాళ్ళకి పాపం అర్థం అవదు కదా. ఇలా కాదని నేను మా డాక్టర్ ఆఫీస్ కి ఫోన్ చేసాను. డాక్టర్ సర్జరీ లో ఉన్నారని చెప్పారు. నా కండిషన్ చెప్పి, డాక్టర్ కి ఇన్ఫామ్ చేయమని చెప్పాను. అదే టైమ్ లో బాబుని చూడటానికి పిల్లల డాక్టర్ తోటకూర గారు వచ్చారు. ఆయనకు డాక్టర్ కి చెప్పమని చెప్పాను. అప్పుడే ఇంటికి వెళ్ళిన అమ్మ, మా ఆయన, మౌర్య కూడా వచ్చారు. ఫోటోలు, సోషల్ సెక్యూరిటీ నంబర్ గురించి మిగతా వివరాలు తను చెప్పారు. 
డాక్టర్ కి నా కండిషన్ తెలిసి, వెంటనే మెడికేషన్ గురించి, హాస్పిటల్ వాళ్ళకు చెప్తే, వాళ్ళు ఫాలో అయినట్లున్నారు. మెడిసిన్స్ నేను హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన ఫుడ్ తినకుండా వేసుకున్నాను. అది అంత పని చేసినట్లుంది. చావు వరకు తీసుకువెళ్ళింది. అని కాంషియస్ కండిషన్ నుండి ఆ సాయంత్రానికి కాస్త ఊపిరి వచ్చింది. మరుసటి రోజు మధ్యాహ్నానికి ఇంటికి పంపారు.

మళ్లీ కలుద్దాం... 

14, సెప్టెంబర్ 2020, సోమవారం

కాలం వెంబడి కలం...19

       మేం ఇల్లు కట్టుకున్నప్పుడు రాని అయినవారందరు, మామయ్య పెళ్ళికి వచ్చారు. అంతా బాగా జరిగిపోయింది. మామయ్య పెళ్ళికి ముందే మా చిన్నప్పటి శిశు విద్యామందిరం స్కూల్ ఫ్రెండ్ ని ఓ రోజు రాత్రిపూట రమణ (మామయ్య) తీసుకువచ్చాడు, లాల్ కిషోర్ గుర్తుపట్టావా అని. తనకి రొయ్యల వ్యాపారంలో హెల్ప్ కావాలంటే నాన్న చేసారు. మరో విషయమేమిటంటే మమ్మల్ని మెాసం చేసిన విజయనగరం ఆయన కొడుకు వ్యాపారంలో నాన్న హెల్ప్ కావాలని ఇంటికి వస్తే తనకి హెల్ప్ చేసారు. రాఘవేంద్ర ఇంటి మనిషిలా కలిసిపోయాడు. వీళ్ళ అక్క మా అమ్మ క్లాస్మేట్స్.  ఆవిడ కొడుకు 12 ఏళ్ళు పెరిగి, ఈతకి వెళ్ళి పులిగడ్డ వంతెన దగ్గర మునిగి చనిపోయాడు. రాఘవేంద్ర వాళ్ళు ఆరుగురు సంతానం వాళ్ళ అమ్మానాన్నకు. వీళ్ళ చిన్నప్పుడే అమ్మానాన్న చనిపోయారు. నాన్న కాన్సర్ తో, అమ్మ సూసైడ్ చేసుకున్నారట. పెద్దక్క బాధ్యత తీసుకుంది, టీచర్ జాబ్ చేస్తూ. ఆవిడ పెళ్ళి చేసుకున్నాక, రెండో అక్క వేరే వెళిపోయింది. అన్నయ్య కొన్ని రోజులు మా ఊరి వాళ్ళ ట్రాక్టర్ మీద ఉండి, చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యాక, హైదరాబాదు వెళిపోయారు. తర్వాత ఎయిర్ ఫోర్స్ లో జాబ్ వచ్చిందంట. ఈ రాఘవేంద్రరావు గారు వాళ్ళ నాన్నకు మల్లే జనం మనిషి. ఇంటివాళ్ళు పట్టరు. చిన్న తమ్ముడిని వీళ్ళ బావగారు గవర్నమెంట్ హాస్టల్ లో జాయిన్ చేసారు. చిన్న చెల్లిని చదివించడం జరిగింది. నాకు తెలిసే సరికి..చిన్న తమ్ముడంటే అక్కలకి బాగా ఇష్టం. అందులోనూ పెద్దావిడ కొడుకు చనిపోయాక, ఆవిడ తన ప్రేమనంతా ఆ తమ్ముడి మీద పెట్టుకుందట. 
 నాకు ఈవిడ పరిచయం అయ్యేసరికి పెద్ద తమ్ముడు, చిన్న తమ్ముడు హైదరాబాదు లో కలిసి ఉండేవారు. పెద్ద తమ్ముడి పెళ్ళి ఈవిడే చేసిందట.చిన్న తమ్ముడు డిగ్రీ చదివి, డయాలసిస్ నేర్చుకుని, మెడికల్ సైడ్ మంచి ఉద్యోగమే అప్పుడు.  చిన్న చెల్లి కూడా హైదరాబాదులోనే డిగ్రీ చదువుతోంది. అంతకు ముందు పాలిటెక్నిక్ లో జాయిన్ చేస్తే ఓ సంవత్సరం చదివి, చదవనంటే డిగ్రీ లో జాయిన్ చేసారంట. పెద్ద చెల్లి వీళ్ళ సొంత ఊరు హరిపురంలోనే ఉండేది. ఆమెకు ఓ బాబు. మెుత్తానికి అక్కాచెల్లెళ్ళ గొడవలో, చెల్లెలు విడిపోయి, వేరే అతను పెళ్ళి చేసుకుంటానంటే తనతో ఉండేదిట. వాడు మెాసం చేసినా బాబుతో అక్కడే ఉండేది. బావగారు, చల్లపల్లి శ్రీనివాసరావు గారు పనికిమాలిన మధ్యవర్తిత్వాలు చేసి ఆమెకు అన్యాయం చేసారు. వీళ్ళ కుటుంబంలో ఎవరు ఆమెను పట్టించుకునే వారు కాదు అప్పట్లో. అక్కచెల్లెళ్ళు ఇద్దరికి బాగా ఇగో ఉండటంతో వీళ్ళ తల్లిదండ్రుల ఆస్తిని పంచుకున్నప్పుడు పెద్ద చెల్లి వాటా తనకి ఇచ్చేసి, మిగతాది ఈవిడ ఉంచుకుని బాధ్యతలు అన్నీ తానే మెాసాననని చెప్పేది. రాఘవేంద్ర మాకు తెలిసేటప్పటికి మా ఊరిలో ఆ ఇంట్లో, ఈ ఇంట్లో ఉంటూ ఉండేవాడు. అందరిని చూస్తే నన్ను మెాసం చేసారందరు, ఎవరు మాట్లాడరు అని ఈయన పెద్దక్క బాధ పడుతూ ఉండేది. నాకు బాధనిపించి అక్కతో ఎక్కువగానే మాట్లాడుతుండేదాన్ని. 

వచ్చే వారం మరిన్ని కబుర్లతో....

13, సెప్టెంబర్ 2020, ఆదివారం

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో సర్జరీ ... చావు వరకు తీసుకువెళ్ళింది ...



నా అమెరికా కబుర్లను ప్రచురిస్తున్న ఆంంధ్రాప్రవాసి డాట్ కాం వారికి,   రాజశేఖర్ చప్పిడి గారికి మన:పూర్వక ధన్యవాదాలు..



ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో సర్జరీ ... చావు వరకు తీసుకువెళ్ళింది ...

12, సెప్టెంబర్ 2020, శనివారం

ఏక్ తారలు..!!

1.  బంధాలను సవాలు చేస్తున్నాయి ఆర్థికావసరాలు_అలంకారం అక్షరాలకంటూ..!!
2.  అక్షరమెంత ఆలంబన_మౌనానికి మాట నేర్పుతూ...!!
3.  గడుసుదనమంతా అక్షరాలదే_మనసును మౌనాన్ని మాటల్లో మురిపిస్తూ...!!
4.   ఆశల వలయాలు చుట్టుముడుతున్నాయి_రాతిరికి విరామమీయ రాదంటూ..!!
5.  వీడని బంధమే మనది_తరగని చెలిమి పరిమళంలా..!!
6.  గాయమెప్పుడూ అంతే_కలత పెడుతూనే వుంటుంది మనసుని..!!
7.  మనసుకు మరణం లేదనే కదా_శాశ్వతంగా అక్కడే కొలువు దీరాలనుకున్నా...!!
8.  తేలాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాం_మునిగిపోయి ఊపిరాడకే...!!
9.   మెుక్కవోని ఆత్మస్థైర్యమిది_రెక్కలెన్ని తెగిపడుతున్నా ఓటమినొప్పుకోక..!!
10.   కోరిక తీరనేలేదు_మూగబోయింది పాడుతా తీయగా..!!
11.   అయినవాళ్ళనే ఆదమరుపది_పరాయితనమని పరాకు పడకు...!!
12.  ఎన్ని కన్నీళ్ళను దాచేసిందో గుండె_అక్షరాలను చెరిపేస్తూ..!!
13.   ఎన్ని వెలుగులను చిమ్ముతుందో అక్షరం_మనసు కన్నీళ్ళతో నిండినా...!!
14.  ఎన్ని కలలకు కారణమౌతుందో అక్షరం_కలతలను ఏమార్చుతూ...!!
15.  అక్షరమై హత్తుకుంటున్నా_మదిలోని వేదనకు సాంత్వననీయాలనుకుంటూ...!!
16.   అనుబంధమై అల్లుకుంటున్నా_ఆత్మీయత పంచే అక్షరాలనొదల్లేక...!!
17.  అక్షరానికి తప్పని బంధుత్వమే మరి_మాటకు మౌనానికి మధ్యన...!!
18.   పోరాటమెప్పుడూ గెలుపు కోసమే_అది అక్షరంతోనైనా ఆయుధంతోనైనా...!!
19.  అదేంటో అడిగితే కాదనలేను_అరువు ఇవ్వద్దనుకుంటూనే...!!
20.   ఆత్మవంచనే ఆస్తిగా మారింది_ఈ ఆధునిక జీవితాల్లో...!!
21.    బాధ్యతలు వెంబడిస్తున్నాయి_బతుకు అర్థం మరవొద్దంటూ...!!
22.  అనుభవాలన్నీ అక్షరాలతోనే_పంచుకోవడం అలవాటయ్యాక...!!
23.   మర్చిపోవడం అలవాటు చేసుకుంటున్నా_బంధాలు భయపెడుతుంటే...!!
24.   మానని గాయమే అది_ఎడబాటు ఎదని సలుపుతున్నా..!!
25.  కల చీకటిని వెదుకుతోంది_వెన్నెల్లో తన ఉనికి కనబడదేమెానని...!!
26.   సాధనకు అంతరాయం కలుగుతోంది_సహజత్వం నశిస్తుంటే...!!
27.  వాస్తవాలను రాయడం కష్టమే_ అవి మరపు తెలియని జ్ఞాపకాలైనా...!!
28.  అమెాదం అవసరం లేదు_అంతరాత్మకు సమాధానం చెప్పగలిగినప్పుడు..!!
29.   వెన్నెల వర్ణమైపోదూ_నువ్వు చీకటి చీర చుట్టుకున్నప్పుడల్లా...!!
30.   వానతో వరదా వచ్చెళ్ళింది_జ్ఞాపకాల గాయాలను గుర్తుంచుకోమంటూ...!!

ప్రచ్ఛన్న వస్తుశిల్పాల పుస్తకం గురించి...

నేస్తాలు, 
       రచన పుట్టుక, పూర్వోత్తరాల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పక చదవాల్సిన పుస్తకం ఒకటుంది. రచయిత పుస్తకాన్ని ఆవిష్కరించడం కాదు. పుస్తకమే రచయితను ఆవిష్కరిస్తుందనడానికి ప్రత్యక్ష సాక్ష్యం ఇదిగో ఇప్పుడు మీ ముందట.. 

విలక్షణ రచయిత, విమర్శకులు అయిన సాగర్ శ్రీరామ కవచం రచించిన " ప్రచ్ఛన వస్తుశిల్పాలు " పుస్తకం. 

నిజంగా చెప్పాలంటే నాకు చిన్నప్పటి నుండి పుస్తకాలు చదవడం మాత్రమే తెలుసు. రాయడం అనేది అప్పటికప్పుడు ఏదనిపిస్తే అది రాయడమే తెలుసు. రచన ఎలా జనిస్తుంది? ఎన్ని వైవిధ్య భరిత  రూపాలు సంతరించుకుంటుంది? రచయితకు ఉండాల్సిన లక్షణాలు, రచనలోని లోతుపాతులు ఇలా ఎన్నో మనకు సారి నాకు తెలియని విషయాలను ఈ పుస్తకం ద్వారా తెలుసుకున్నాను. 

సాగర్ అంకుల్ ముందు మాటలు రాయమంటే భయపడ్డాను కూడా. అంకుల్ ప్రోత్సాహంతో నేను నాలుగు మాటలు రాశాను. నాకు ఇంత అరుదైన అవకాశం ఇచ్చిన సాగర్ అంకుల్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు. 

ఈ పుస్తకం గురించి ఒక్క మాటలో నాదైన శైలిలో చెప్పాలంటే... 
" వస్తువు ఆత్మ లాంటిదైతే, శిల్పం జ్ఞానంవంటిది " అని చెప్పాలనిపించింది. 

రచన గురించి తెలుసుకోవాలని కాని, నేర్చుకోవాలన్న తపన కాని ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన పుస్తకం ఇది. 

సాహిత్య చరిత్రలో ఎన్నడూ, ఎవరూ రాయని, రాయలేని పుస్తకం ఇదని ఘంటాపథంగా చెప్పగలను. గుర్తింపు అనేది ఎలా వస్తుందో ఈ పుస్తకం ద్వారా తెలుస్తుంది. న్యాయంగా ఏ అధికారాలకు, రికమండేషన్లకు తలొగ్గకుండా ఉంటే అత్యున్నత పురస్కారం దక్కాల్సిన పుస్తకమని చదివిన అందరికి తెలుస్తుంది...

పుస్తకం చదివి చెప్పండి నా మాటలు నిజమెా కాదో...

వెల కట్టలేని సాహితీ సంపదను అందించిన సాగర్ అంకుల్ కి అభినందనల శుభాకాంక్షలు...  


కాలం వెంబడి కలం...18

కాలం వెంబడి కలం...18

      నేను M S చేయడానికి అమెరికా వెళ్ళాలంటే దగ్గర దగ్గర 3 లక్షలు ఖర్చు అవుతుందని లెక్కలు వేసుకున్నాను. జయపురంలో అమ్మమ్మ, తాతయ్య వాళ్ళఇల్లు అమ్మేసాము. వాళ్ళది, అమ్మది పొలం అమ్మి విజయనగరం వెళ్ళి మెాసపోయిన సంగతి మీకు తెలిసిందే. మళ్ళీ కాస్త పొలం కూడా కొన్నారు. ఇల్లు కట్టడానికి ఖర్చు అయ్యాయి ఉన్నవి. నా కోసం మళ్ళీ అప్పు చేయాలి. అదీ కాక అప్పట్లో ఇప్పటిలా ఇన్ని కన్సల్టింగ్ కంపెనీలు లేవు. అమెరికా ప్రాసెస్ కి ఎలా ప్రొసీడ్ అవ్వాలో సరిగా తెలియదు. వెళ్ళాలని గట్టిగా అనుకుంటే ఏదోక దారి చూసుకునేదాన్ని. మా సుధ అన్నయ్య ఫ్రెండ్ 16000 కడితే న్యూజిలాండ్ కి వెళ్ళవచ్చు అని చెప్పారు. ఇదంతా కాదులే అని నాన్నతో చదవడానికి అమెరికా వెళ్ళను, జాబ్ చేయడానికి H1B వీసాతో వెళతానని చెప్పాను. మా రాధ పెదనాన్నతో కూడా అదే మాట చెప్పాను. ఆయనకు నలుగురు ఆడపిల్లలున్నా నేనంటే చాలా అభిమానం. వాళ్ళ చుట్టాలబ్బాయి గద్దే కృష్ణ అమెరికాలో కంపెని పెట్టాడని చెప్పి తనని అడిగారు. AS/400 నేర్చుకోమని చెప్పారట. 
          ఈలోపల మా మామయ్య పెళ్ళి కుదరడం, ఎదురింట్లో ఉండే  రాఘవేంద్ర మా ఇంటికి రావడం నాటకీయ ఫక్కీలో జరిగాయి. రాఘవేంద్ర సుజాతక్క వాళ్ళ రొయ్యల చెరువులు వేసుకుంటున్నాడు. ఆ పక్కనే మా మామయ్య తీసుకున్న చెరువులు కూడా ఉన్నాయి. ఎదురింట్లో ఏం జరిగిందన్నది మనకు తెలియదు, కాని ఓ పది రోజుల నుండి రాఘవేంద్ర అన్నం తినడం లేదని నాన్నకు తెలిసింది. నాన్న అలా తినకుండా ఉండకు, మీ పెదనాన్న వాళ్ళింట్లో తిను, లేదా మా ఇంట్లో తిను అని చెప్పారు. అంతకు ముందు కూడా వాళ్ళ పెదన్నాన్న వరస అయ్యే వాళ్ళింట్లో కొన్ని రోజులు, తర్వాత వాళ్ళు బయటికి పంపేస్తే, మరో రెండు మూడిళ్ళలో ఉండి, చివరిగా ఇలా మా ఇంటికి చేరాడు. 
       నాకు పెద్ద పరిచయమూ లేదు. నా లోకం నాది. నా పుస్తకాలు, ఉత్తరాలు, చదువు, టి వి, పాటలు  ఇదే నా లోకం. నాది చాలా చిన్న ప్రపంచం. కొత్త ఇంటికి వచ్చాకే కలర్ టి వి పెద్దది ECTV తీసుకున్నాము. మామయ్య పెళ్ళి కుదరడంతో ఆగిపోయిన ఇంటి పనులు మెుదలయ్యాయి. మార్బుల్ వేయించడము, కరంట్ పని చేయించడము, కార్పెంటరీ పని మెుదలయ్యింది. అంతా టేకుతోనే చేయించారు కరంట్ బోర్డులతో సహా. కరంట్ పని చేసే పాల్ గారు విజయవాడ నుండి వచ్చారు, రమేష్ అనే కోడూరు పిల్లాడిని తీసుకుని. బాగా కోపిష్టి. కాని నేను ఏదడిగినా చక్కగా చెప్పేవారు. తను చేసే పనులన్ని వివరంగా చెప్పేవారు. ఏది కావాలన్నా నాకే చెప్పేవారు. ఆ రోజుల్లోనే మా ఇంట్లో స్విచ్ బోర్డులు కాని, స్విచ్ లు కాని కనబడకుండా కరంట్ పెట్టారు. నాతో పాల్ గారు రేపు మీ ఇంటికి నడిస్తే తెరుచునే డోర్లు పెడతానమ్మా అని  అనేవారు. బయట వరండా చుట్టూ ఆర్చ్ లు పెట్టించి, గ్రానైట్ అంటించాం అప్పట్లోనే. కోడూరు సంతలో మెుక్కలు ఇళ్ళమ్మట అమ్ము వస్తే 5 రూపాయలు పెట్టి కొన్న గులాబి, నూరు వరహాలు బోలెడు పూలు పూసేవి. కడియం నుండి తెచ్చిన తెల్ల గులాబి బోలెడు గుత్తులుగా పూలు పూసేది. మూడు, నాలుగు వందలు పెట్టి కడియం నుండి పూల మెుక్కలు తెచ్చేవాళ్ళం. రకరకాల గులాబీలుండేవి. మా తాతయ్య బంతిపూలు బోలెడు పూయించేవాడు. ఆయన చేతితో ఏ మెుక్క పెట్టినా బతికేది. మా తాతయ్య కాలం చేసి రెండేళ్ళయినా, ఆయన పెట్టిన మామిడి చెట్టు బోలెడు తీపి కాయలు ఆయన జ్ఞాపకంగా మాకిప్పుడు ఇస్తోంది. మనుష్యులు లేకున్నా కొన్ని గుర్తులు వారిని తరతరాలూ బతికించేస్తాయనుకుంటా ఇలా. 

వచ్చే వారం మరిన్ని కబుర్లతో....

11, సెప్టెంబర్ 2020, శుక్రవారం

సంస్కారం..!!

నేస్తం,
         సంస్కారం అనేది జన్మతః వస్తుంది కొందరికి. సంస్కారానికి ఎవరికి వారిచ్చే నిర్వచనాలు కోకొల్లలు. మన పెద్దలు చెప్పిన మాట నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. కాని ఈనాటి ముఖపుస్తక సంస్కారంలా కాదు. గుడ్ మార్నింగ్ లు, గుడ్ నైట్ లు మెసెంజర్ లో చెప్పుకుంటూ పోతే సంస్కారమున్నట్లు, లేదా రిప్లై ఇవ్వనంత మాత్రాన సంస్కారం లేదనుకునే వారికి తెలియజేడమేమనగా... మెసెంజర్ లు, వాట్సప్ లలో మీ గుడ్ మార్నింగ్ లకు, గుడ్ నైట్ లకు రిప్లైలు నా నుండి ఉండవు. నాకు సంస్కారం లేదనుకున్నా పర్లేదు. మరో మాట తిన్నారా, పడుకున్నారా లాంటి వాటికి కూడా సమాధానాలుండవు. మీరన్న సంస్కారం నాకు లేదనుకునే ఎవరైనా నిరభ్యంతరముగా వెళిపోవచ్చును...

ధన్యవాదాలు

5, సెప్టెంబర్ 2020, శనివారం

భూతల స్వర్గమేనా...24

పార్ట్..24
డెట్రాయిట్ లో శ్రీనివాసరెడ్డి వాళ్ళింటికి వెళ్ళాను. వాళ్ళు ముగ్గురుంటున్నారు. చంద్రశేఖర్, ఇంకో అతను. వీళ్ళిద్దరు మాల్ లో సెల్ఫోన్ షాప్లో పని చేసేవారు. నాకు ఏదైనా జాబ్ చూడమని చెప్పాను. బోలెడు ఫ్రూట్స్ అవి తెచ్చి ఫ్రిజ్ లో పెట్టి తినమనేవారు. వాళ్ళతో ఉన్న ఇరవై రోజులు చాలా బాగా చూసుకున్నారు. నేను వేరే జాబ్ కి ట్రై చేసుకున్నాను. అంతకు ముందు మాల్ లో వచ్చిన జాబ్ కి రమ్మన్నారు. అది ఉష చేసే చోటనే. మధు వాళ్ళు కాస్త దూరంలో. 
చికాగోలో ఉన్నప్పుడు మా ఆయనకు తెలిసిన మా ఊరి దగ్గరలోని పిల్లలు విష్ణు, శ్రీను. శ్రీనుతో ఎప్పుడన్నా మాట్లాడేదాన్ని. ఈయన ఇండియా వెళ్ళిన తర్వాత ఓ రోజు విష్ణుకి ఫోన్ చేసి మాట్లాడాను. అప్పటి నుండి ఇంట్లో పిల్లాడిలా ఉండేవాడు నాతో. నేను డెట్రాయిట్ వెళుతున్నానని చెప్తే తన ఫ్రెండ్ సింధు అక్కడే ఉంటోందని, వెళ్ళి కలవమని చెప్పాడు. డెట్రాయిట్ వెళ్ళిన కొత్తలో ఓరోజు వెళ్ళి వచ్చాను. తర్వాత నేను కెంటకీ లోని ఫ్లోరెన్స్ లో జాబ్ కి వెళ్ళాలని చెప్తే సింధు, వాళ్ళాయన ఫ్లోరెన్స్ కి కార్ లో పంపిస్తామని చెప్పారు. ఓ రెండు రోజులు సింధు వాళ్ళింట్లో ఉండి, ఫ్లోరెన్స్  వెళ్ళాము. నేను మధు వాళ్ళున్న సిన్సినాటి వెళ్ళలేదు. ఏదో మనకు హెల్ప్ చేయడానికి సింధు వాళ్ళు వస్తే, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని. కాని మధు వాళ్ళకి ఎందుకో కోపం వచ్చి మాట్లాడటం మానేసారు. సింధు వాళ్ళు ఉన్నప్పుడే అపార్ట్మెంట్ వెదికాము. దొరకలేదు. మాల్ కి వెళ్ళడానికి బస్ ఫెసిలిటి చూసుకోవాలి కదా. తర్వాత అపార్ట్మెంట్ దొరికింది. నేను, ఉష అవసరాలకి కావాల్సినవన్నీ కొనుక్కున్నాము. మెుత్తానికి ఫ్లోరెన్స్ మాల్ లో కళ్ళజోడు షాప్ లో నా మరో ఉద్యోగం మెుదలైంది. పొద్దున 10 కి మాల్ లో షాప్ ఓపెన్ చేస్తే రాత్రి 9 కి క్లోజ్ చేయాలి. పొద్దుటే వంట చేసుకుని లంచ్ బాక్స్ తీసుకుని వెళ్ళేవాళ్ళం. నైట్ వచ్చేసరికి బాగా లేట్ అయిపోయేది. 10,10.30 అయిపోయేది. బస్ లో అప్పుడప్పుడూ కొందరు నల్లవాళ్ళని చూసి మేం సరదాగా నవ్వుకునేవాళ్ళం. రకరకాల హెయిర్ స్టైల్స్ తో వింతగా అనిపించేవారు నాకయితే. ఓ రకమయిన వాసన వచ్చేది. నాకసలే వాసనలు చాలా త్వరగా తెలుస్తాయి. వేసిన హెయిర్ స్టైల్ వారం, పది రోజుల వరకు తీయరట. ఆ వాసన వెనుక కత అదన్నమాట. ఉష కార్ట్ (కళ్ళజోళ్ళ షాప్)పై ఫ్లోర్లో, నాది కింది ఫ్లోర్లో. ఒక్కోరోజు నాకు సేల్ తక్కువ ఉంటే ఉష హెల్ప్ చేసేది. అలా ఇద్దరం నెట్టుకొని వచ్చేవారం. శ్రీను నిమ్మకాయ పచ్చడి, ఇంకో పచ్చడి పార్సిల్ చేసాడు నాకోసమని.అప్పటికే ఆరోగ్యం అస్సలు బాలేదు. రాత్రి పూట విపరీతమైన ఒళ్ళు నొప్పులుండేవి. మా ఉష కాస్త గట్టిగానే గురక పెడుతుండేది. నాకు పుట్టబోయేది అమ్మాయేనని మేము పని చేసే మాల్ లోనే షాపింగ్ చేసి ఓ రెండు డ్రసెస్ పాపకని తీసుకున్నాను. అప్పటికింకా స్కానింగ్ చేయించుకోలేదు. అమెరికాలో 20 వారాలకే అబ్బాయెా, అమ్మాయెా చెప్తారు. 
రోనెక్ లో డాక్టర్ దగ్గరకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎక్కడా చూపించుకోలేదు. ఫ్లోరెన్స్ లో వెదుక్కుని డాక్టర్ దగ్గరకి వెళ్ళాను. అబ్బాయెా, అమ్మాయెా చెప్తారని. ఆ డాక్టర్ స్కాన్ చేయకుండానే హార్ట్ బీట్ చూసి అబ్బాయని చెప్పింది. స్కాన్ కి డేట్ ఇచ్చారు. ఆరోజు వెళితే స్కాన్ చేసి అబ్బాయంది సిస్టర్. మరోసారి చెక్ చేయమన్నాను. తను నవ్వి డాక్టర్ ముందే చెప్పారు కదా, హండ్రెడ్ పర్సంట్ అబ్బాయేనంది. జనరల్ టెస్ట్లన్నీ చేస్తే షుగర్ ఎక్కువగా ఉందని వచ్చింది. మరోరోజు ఫోర్ అవర్ షుగర్ టెస్ట్ చేయాలి. పొద్దుటే ఏం తినకుండా, తాగకుండా రమ్మని చెప్పారు. బాగ్ లో ఓ ఆపిల్, వాటర్ బాటిల్ పెట్టుకుని 2 బస్ లు మారి హాస్పిటల్ కి వెళ్ళి ఫోర్ అవర్ షుగర్ టెస్ట్ చేయించుకుని బస్ మారడానికి ఇంక ఓపిక చాల్లేదు. రెండో బస్ ఎలా ఎక్కానో తెలియదు. బాగ్ లో వాటర్ బాటిల్ తీసుకునే ఓపిక కూడా లేదు. అయినా మెల్లగా వాటర్ తాగాక కాస్త ఓపిక వచ్చింది. మా అపార్ట్మెంట్ దగ్గర బస్ దిగి లోపలికి ఎలా వెళ్ళానో కూడా తెలియదు. ఏం తినలేదు కదా బాగా నీర్సం వచ్చింది. సాయంత్రానికి కాస్త ఓపిక వచ్చింది. ఈ ఫోర్ అవర్ షుగర్ టెస్ట్ లో నాకు షుగర్ లేదని తెలిసింది. ఆరోజు షుగర్ ఎక్కువ ఉండటానికి కారణమేంటంటే అంతకు ముందు రోజు నాకు పూర్ణాలు తినాలనిపించి పూర్ణాలు లోపలి పప్పు చేసుకున్నా. పూర్ణాలు ఒండే ఓపిక లేక ఆ స్వీట్ పప్పు తినేసాను. అదన్నమాట అసలు సంగతి. ఏడవ నెలలో ఓరోజు మాల్ లో కాలు జారి పడిపోయాను. ఏమి కాలేదు. 
చికాగో లో ఉన్నప్పటి బాబీ కాల్ చేసి వాణి అని ఒకావిడ రామస్వామి దగ్గర ఉంది. ఆవిడని బాగా ఇబ్బంది పెడుతున్నారు. తన హజ్బెండ్ చనిపోయారు. బాబు ఇండియాలో ఉన్నాడు. బాగా ఇబ్బంది పడుతోంది. ఏదైనా జాబ్ చూడమని చెప్పి ఆవిడ నెంబర్ ఇచ్చాడు. ఆవిడకి కాల్ చేసి మాట్లాడి, మా దగ్గరకి వచ్చేయమని చెప్పాను. ఉషకి చెప్పాను. మన అవర్స్ లో కొన్ని తనకి ఇద్దాము. మనతో ఉంచుకుందామని అంటేే, ఉష కూడా సరేనంది. వాణి వచ్చింది. మాతోనే తను ఉంటోంది. కొన్ని రోజులు పోయాక మా రాంకుమార్ గారు వాళ్ళు సబ్ వే లో వాణికి జాబ్ ఉందంటే అక్కడికి పంపాను. 
నాకు చికాగో బాబన్నయ్య ఇండియా వెళ్ళినప్పుడు ఇచ్చిన డబ్బులు కావాలని అడిగారు. వాళ్ళింట్లో ఉన్న నా లగేజ్ అంతా ఫ్లోరెన్స్ పార్శిల్ చేసారు. ఈలోపల నాకు 8వ నెల వచ్చేసింది. మా చిన్న ఆడపడుచు పెళ్ళి అయ్యింది. మధు వాళ్ళు చెప్పారో, మరెవరు చెప్పారో తెలియదు కాని మా షాప్ ఓనర్ సడన్ గా ఓ రోజు మనిషిని పంపి షాప్ హాండోవర్ చేసుకుని మా జాబ్ అయిపోయిందని చెప్పాడు. వీడి పేరు కూడా బాబినే. విష్ణుకి ఫోన్ చేసి విషయం చెప్పాను. అపార్ట్మెంట్ తీసుకుంటాను హంట్స్విల్ వచ్చేయండి అన్నాడు. అది అలబామా స్టేట్. మా ఆయన కూడా ఇండియా నుండి వస్తుంటే, తనని హంట్స్విల్ వచ్చేయమని, ఆయన వచ్చే రోజుకి మేము హంట్స్విల్ వెళ్ళాము. హంట్స్విల్ వెళ్ళేముందే బాబన్నయ్య,జలజ వదిన వాళ్ళకు ఇవ్వాల్సిన 2850 డాలర్లు ఇచ్చేసి హమ్మయ్య అప్పు తీర్చేసాను అనుకున్నాను. అమ్మావాళ్ళకు వీసా మూడు నెలలకు ఇచ్చారు. అప్పుడే నాకు చిన్న క్రెడిట్ కార్డ్ వచ్చింది. అంతకు ముందు చికాగోలో ఉన్నప్పుడు తెలియక యాన్యువల్ ఫీ ఉండే కార్డ్ ఒకటి తీసుకున్నా డబ్బులు కట్టి మరీ. నా చిన్నప్పటి స్కూల్ ఫ్రెండ్ రాధ వాళ్ళ తమ్మడు రాము మాకు జూనియర్. తను యు ఎస్ వచ్చాడు. నేను ఇండియానా లో టెర్రాహట్ లో ఉన్నప్పటి నుండి మాట్లాడేవాడు. చికాగోలో ఉన్నప్పుడు నాకు 500 డాలర్లు పంపాడు. అవి ఈ కార్డ్ కి కొన్ని వాడాను. బాబీ తీసుకున్నాడు మిగిలినవి. నేను ఇండియా వెళ్ళేటప్పుడు రాధ వాళ్ళకి ముత్యాలు, పచ్చలు తీసుకు వెళ్ళమని రాము చెప్తే అవి తీసుకుని రాధకి ఇచ్చాను. తర్వాత రాముకి ఆ ముత్యాలు, పచ్చలకి పోను మిగిలిన డబ్బులు ఇచ్చేసాను. ఆ తర్వాత నుండి రాము మాట్లాడలేదనుకుంటా నాతో. బహుశా డబ్బులు తీసుకున్నాననేమెా అని ఇప్పుడు అనిపించింది. ఇన్నాళ్లు అంత బావుండేవాడు, ఎందుకు మాట్లాడటం మానేసాడా అని అనుకునేదాన్ని. తప్పదులెండి జీవితంలో ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. 
హంట్స్విల్ కబుర్లతో మళ్లీ కలుద్దాం...

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలోని డెట్రాయిట్ లో కళ్ళజోళ్ళ షాప్ లో ఉద్యోగం రావడం పోవడం... మళ్లి హంట్స్విల్ కి ప్రయాణం...



నా అమెరికా కబుర్లను ప్రచురిస్తున్న ఆంంధ్రాప్రవాసి డాట్ కాం వారికి,   రాజశేఖర్ చప్పిడి గారికి మన:పూర్వక ధన్యవాదాలు..



ఆంధ్ర ఆడపడుచు అమెరికాలోని డెట్రాయిట్ లో కళ్ళజోళ్ళ షాప్ లో ఉద్యోగం రావడం పోవడం... మళ్లి హంట్స్విల్ కి ప్రయాణం...

2, సెప్టెంబర్ 2020, బుధవారం

తేడా..

శకుని ఆధ్వర్యంలో కౌరవుల మెాసం
పాండవుల పక్షాన శ్రీకృష్ణుని మాయ
వెరసి మహా భారత  ధర్మాధర్మ యుద్ధంలో అంతిమ విజయం పాండవులదే...కాని ఇక్కడ మెాసం, మాయ ప్రధాన పాత్రధారులు...!!

అంతరంగం...!!

అందరు నావాళ్ళే అనుకున్నా
ఒంటరి పయనమే నాది
మౌనంతో మాటాడుతు ఉన్నా
మనసెప్పుడూ నిశ్శబ్ధమే

ఎదలో ఏకాంతం కొలువున్నా
జ్ఞాపకాలతో సహవాసమే నాది
కలలన్ని కాలిపోయినా
కలత పడని జీవితమిది

బంధాలు భారమౌతున్నా
అనుబంధాలకు దాసోహమే నా మది
అపహాస్యాలెన్నెదురైనా
ఆగని బతుకు పోరాటమే ఇది

గెలుపు తలుపు తట్టాలని ఉన్నా
గగనాన్ని తాకలేని ఆశలు నావి
ఓటమి పాఠాలే ఓదార్పులైనా
తల వంచని ఆత్మస్థైర్యమిది

కాలం కలిసి రాకున్నా
కడగండ్లు నట్టింట కొలువున్నా
విధిరాత వినోదం చూస్తున్నా
చిరునవ్వు నాతోనే చివరి వరకు....!!




1, సెప్టెంబర్ 2020, మంగళవారం

కాలం వెంబడి కలం..17

   మా పొడుగు పెళ్ళికి కడప వెళ్ళడం, అదీ ఎలక్షన్ టైమ్ లో ఓ మంచి అనుభూతి. గొడవలు జరుగుతాయి వెళ్ళొద్దని అందరు భయపెట్టారు. అయినా వెళ్ళాను. మనం టీవీల్లో, సినిమాల్లో చూసినట్లుగా కొట్లాటలు, బాంబుల గోలేం లేదు. చాలా ప్రశాంతంగా ఉందప్పుడు. మా పొట్టి, లత కూడా వచ్చారు పెళ్ళికి. మా క్లాస్మేట్ శ్రీధర్ కూడా పెళ్ళికి వచ్చాడు. వాళ్ళది కూడా కడపే. పెళ్ళి అయ్యాక మమ్మల్ని వాళ్ళింటికి తీసుకువెళ్ళి, తర్వాత బస్ స్టాండ్ లో డ్రాప్ చేసాడు వాళ్ళ చెల్లితో కూడా వచ్చి. 

     అమ్మమ్మ వాళ్ళ ఊరు జయపురం వదిలి నాయనమ్మ వాళ్ళ ఊరు నరశింహాపురం వచ్చేసాక ఓ మూడేళ్ళు అద్దె ఇంట్లోనే ఉన్నాము. నేను బయటకు వెళ్ళనని నాన్న అప్పట్లోనే డిష్ పెట్టించారు. అమెరికా వెళ్ళి ఎమ్ ఎస్ చదవాలన్న కోరిక బలంగా ఉండేది. దానితో జి ఆర్ ఈ, టోఫెల్ రాయాలని అనుకున్నాను. ముందు జి ఆర్ ఈ రాయడానికి ఒకే ఒక పుస్తకం కొనుక్కున్నాను. ఎగ్జామ్ ఫీజ్ 2800 రూపాయలు అప్పట్లో. హైదరాబాద్ సెంటర్ తీసుకున్నా. తీరా ఎగ్జామ్ టైమ్ కి బాగా హై ఫీవర్. అమ్మ ఇంత జ్వరం పెట్టుకుని అంత దూరం వెళ్ళి ఎగ్జామ్ రాయనక్కర్లేదు. మరోసారి రాద్దువులే అంటే కాదుకూడదని నాన్న, నేను హైదరాబాదు శ్రీకృష్ణ ఏసి బస్ లో బయలుదేరాం. అదే మెుదటిసారి ఏసి బస్ ఎక్కడం. ఆరోజు ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది. 60 ఏళ్ళ తర్వాత అంత ఎండ ఉందట. మా వెంకయ్య పెదనాన్న కూతురు రావమ్మ అక్క వాళ్ళ ఇల్లు ఎగ్దామ్ సెంటర్ కి దగ్గర. అందుకని వాళ్ళంటికి వెళ్ళి, ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను. 
         మూడు గంటలు ఎగ్జామ్. ఆరు సెక్షన్స్ ఉంటాయి. 2 మాథ్స్ సెక్షన్స్. మిగతావి ఇంగ్లీష్. నాకిప్పటికి ఆ ఎగ్జామ్ బాగా గుర్తు. రెండు మాథ్స్ సెక్షన్స్ కలిపి 50 బిట్స్ ఉంటాయి. గంట టైమ్. ఆ పేపర్ రాసేటప్పుడు నాకు భలే నవ్వు వచ్చింది. ఎందుకంటే గుణకారాలు, భాగహారాలు చాలా పెద్ద లెక్కలిచ్చి ఆన్సర్ మాత్రం మల్టిపుల్ ఛాయిస్ లో సెలక్ట్ చేయాలి. ఆన్సర్స్ అన్నీ దగ్గరగానే ఉంటాయి. కరక్ట్ ఆన్సర్ గెస్ చేయడం చాలా కష్టం. 
23.98×0.0836×795.963/45.321×5210.632×54.96×639.0859=? ఇలా అన్న మాట. అలాగే ఓ రెండు బిట్స్ గ్రాఫ్ మీద ఉన్నాయి. నాకు ఆ గ్రాఫ్ వి రావు. అవి దైవాధీనం కింద పెట్టేసాను. మిగతావన్నీ దగ్గర దగ్గర నంబర్ చూసుకుని సింప్లిఫికేషన్ చేసి పెట్టేసాను. మరో మాట కాలిక్యులేటర్ వాడకూడదు. నాకు నోటి లెక్కలు బాగా అలవాటు. పేకాటలో కూడా నోటితోనే పాయింట్స్ చెప్పేసేదాన్ని. ఇంజనీరింగ్ లో కూడా పెద్దగా కాలిక్యులేటర్ వాడేదాన్ని కాదు. అది బాగా పనికి వచ్చిందన్న మాట జి ఆర్ ఈ రాయడానికి. అది గుర్తు వచ్చి నవ్వు వచ్చిందన్న మాట. మాథ్స్ రెండు సెక్షన్స్ కలిపి 48 బిట్స్ కరక్ట్ గా వచ్చేస్తాయని ఫిక్స్ అయిపోయాను. మిగతావి ఎంతయితే అంత వస్తాయని పట్టించుకోలేదు. మళ్ళీ ఆ రాత్రికే ఇంటికి బయలుదేరాము. పొడుగు పెళ్ళి అయ్యాక  హైదరాబాదు లో కాపురం. తనకి, కృష్ణకాంత్, రాంప్రసాద్, భాస్కర్, గోపి వాళ్ళకి చెప్పాను వెళిపోతున్నానని. వాళ్ళంతా బస్ స్టేషన్ కి వచ్చారు. అలా మళ్ళీ వాళ్ళందరిని కలిసాను. మెుత్తానికి లెక్కల్లో ఆ గ్రాఫ్ రెండు బిట్లు తప్ప మిగతావన్నీ నేననుకున్నట్లుగా కరక్టే అయ్యి 50 కి 48 అవి వచ్చి, మిగతావన్నీ కలిపి 2400 కి 1050 జి ఆర్ ఈ స్కోర్ వచ్చి, అమెరికాలోని నాలుగు యూనివర్శిటీల్లో ఎడ్మిషన్ కి సెలక్ట్ అయినట్లు స్కోర్ కార్డ్ వచ్చింది. ఇక టోఫెల్ ఎగ్జామ్ రాయాలి.

      ఇంటివాళ్ళు ఖాళీ చేయమంటే అప్పటికప్పుడు ఇల్లు కట్టడం మెుదలు పెట్టారు. స్లాబ్ పడిన వెంటనే మా ఇంటికి వచ్చేసాము. మిగతా పనులు తర్వాత మెల్లగా చేయించుకోవచ్చులే అని. అప్పటికి ఇంకా తలుపులు కూడా పెట్టలేదు. ఆ టైమ్ లోనే నేను టోఫెల్ ఎగ్జామ్ రాయడానికి 1500 వందలు ఫీజ్ కట్టడానికి, సమయానికి నాన్న దగ్గర లేకపోతే మా ఎదురిల్లు సుజాతక్క వాళ్ళింట్లో ఉండే రాఘవేంద్ర ఇచ్చాడు. హియరింగ్ బావుండకపోతే సరిగా రాయలేమని మద్రాస్ లో మంచి కాలేజ్ సెంటర్ గా పెట్టాను. జయపురం చిన్న బాబాయ్ మద్రాస్ లోనే ఉండేవారు. బాబాయే చెప్పారు ఆ కాలేజ్ పెట్టమని. కాకపోతే చాలా ముందు పెట్టుకోవాలది, సెంటర్ వస్తుందో రాదో తెలియదు, చూద్దామన్నారు. అనుకున్న కాలేజ్ సెంటర్ గా వచ్చింది. నేను, నాన్న మద్రాస్ చిన్న బాబాయి వాళ్ళింటికి వెళ్ళి, ఎగ్జామ్ రాసి వచ్చేసాము. 600 కి 485 స్కోర్ వచ్చింది. అమెరికాలో ఉన్న గోపాలరావు అన్నయ్యకి ఫోన్ చేసి ఇలా వచ్చాయని చెప్పాను. కుదిరితే టోఫెల్ మరోసారి రాయమన్నాడు. కాలేజ్ లకి అప్లికేషన్స్ తెప్పించుకుని, అప్లై చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. అప్పట్లో అప్లికేషన్ కి 25 డాలర్లు కట్టి తెప్పించుకోవాలి. అన్నయ్యను 3,4 కాలేజ్ లను అప్లికేషన్స్ పంపమంటే అమెరికాలోని కాలేజ్ ల కేటలాగ్ పంపించాడు.

        అప్పుడే కాస్త అప్పులు తీరి ప్రశాంతంగా ఉన్నాము. నరశింహాపురం వచ్చాక కూడా అమరనేని సత్యం తెలిసినతనని, తనతో కలిసి రొయ్యల  వ్యాపారం చేస్తే, తప్పు లెక్కలు రాసి మెాసం చేసాడు. మా నాన్నకు ఇలా మెాసపోవడం బాగా అలవాటైపోయింది. తర్వాత ముమ్మనేని ప్రకాశరావు, రమేష్ అనుకుంటా వాళ్ళిద్దరు అడిగితే వాళ్ళతో కలిసి వ్యాపారం చేసారు. ఓ సంవత్సరం బానే చేసారు. వ్యాపారం తెలిసిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి చేసుకుంటామని, నాన్నను వద్దని లెక్కలు చూసి డబ్బులిచ్చేసారు. వాటితోనే ఇల్లు మెుదలు పెట్టారు. మా మామయ్య, నాన్న ఇక వాళ్ళు, వీళ్ళు ఎందుకు, మన వ్యాపారం మనమే చేసుకుందామని, చేయడం మెుదలు పెట్టారు.

వచ్చే వారం మరిన్ని కబుర్లతో.. 
.

మధూలిక కవితా సంపుటి సమీక్ష..!!

      ఓ రస రమ్య ప్రేమకావ్యం " మధూలిక "

  ఏక్ తారలు, మణిమాలికలు, త్రిపదలు కాకుండా, తనదైన ప్రత్యేక శైలిలో ప్రేమ కవిత్వం రాస్తున్న లక్ష్మీ రాధిక ముఖ పుస్తక నేస్తాలందరికి సుపరిచితులు. చాలా సరళంగా, హాయిగా సాగిపోయే కవిత్వం వీరిది. తన భావ కవితలను అందంగా అమర్చి, కొన్ని వర్గాలుగా విభజించి చూడముచ్చటైన కవితా సంపుటి " మధూలిక " గా మన ముందుకు తెచ్చారు. ప్రస్తుతం ఇది కినిగెలో డాట్ కాం లో ఈ పుస్తకంగా ఉంది.  
     మధూలిక కవితా సంపుటిలోని నేను అన్న పదానికి చెప్పిన భావోద్వేగాల హేల గురించి చూద్దాం.
నేను అంటూనే తనలోని సుగుణాలను ప్రశ్నలుగా చేస్తూ... 

" అవును.... నేను అపురూపం
  నీకు తప్ప ఎవరికీ తెలియదీ నిజం "  అంటూ తనని తాను ఆవిష్కరించుకునే క్రమంలో తనలోని ప్రేమకు, తనకున్న ఆశలు, ఊహల గురించి తను ఆరాధించే ఆరాధకుడికి చెప్పడం, చివరికి
" పైకి నాదో ప్రేమ ప్రయాణం..లోలోన నేనో ఏకాకి             స్వప్నం
          ప్రతిక్షణం..
          ప్రతీక్షణం..
నాకు నేనే అర్థం కాని అద్వైతం.." అంటూ ప్రేమ పారవశ్యానికి తాత్వికత జోడించడం చాలా బావుంది.  నేనంటే నువ్వు, నేను కలిపి మనం అంటూ ప్రేమకావ్యాన్ని నాలోని నేను నీ నేనంటూ సుందరమైన ప్రేమలోకాన్ని చంద్రోదయం వేళ తనలోని అంతర్ముఖాన్ని తన అక్షరాలతోనే మనకు పరిచయం చేస్తారు. అందరికి వాన కురుస్తున్నట్లుంటే తనకు మాత్రం అమృతం కురిసిన రేయిగా ఎందుకుందో తన మాటల్లోనే చెప్తారు. తన మనసులోని భావాల ఝల్లు ఇరువురి మధ్యన అక్షర వర్షమై ఎలా కురిసి మురిసిందో, ఆ హర్షాతిరేకాన్ని అందంగా వర్ణిస్తారు. సంధ్యారాగాన్ని, శ్రావణమాసాన్ని కూడా స్పృశిస్తారు. వాన గురించిన మరెన్నో భావాలను చెప్తూ తన అక్షరాల వర్షంతో  మనల్ని  తడిపేస్తారు సరికొత్తగా. అంతకు ముందు..ఆ తరువాత అంటూ మౌనాన్ని దాటక ముందు, మౌనంలో ఉన్నప్పుడు, మౌనాన్ని వీడిన తరువాత తన మది స్వగతాలను, ఏకాంతపు మౌనరాగాల సవ్వడులను  మౌనంలోనే మనకు వినిపించేస్తారు. ప్రేమ సంగీతంలో వినిపించిన స్వరాలను 
" నీ గుండె సవ్వడికి దగ్గరైన నా గీతం
   ఎన్ని జన్మ క్రితం మెుదలైందో మన అనుబంధం " అంటూ తనలోని ఊహల అలజడిని, మది పాడిన తలపుల సంగీతాన్ని మౌన మానస సమీరాలుగా చేసి వీనులవిందు విందుగా, కనులకింపుగా భావాలలో నింపేసారు. 
         కవిత్వాన్ని, కాలాన్ని, నయనాన్ని, జీవితాన్ని, విషాదాన్ని, జ్ఞాపకాన్ని, ప్రతీక్షణం విరహాన్ని, ప్రేమను వెరసి ఓ చక్కని రస రమ్య ప్రేమకావ్యాన్ని మధూలికగా మనకందించారు లక్ష్మీ రాధిక. భావ కవిత్వాన్ని, అదీ ప్రేమ, విరహం, ఆరాధన, ఆశలు,  కోరికలు, మౌనంతో మాటలు, మనసుతో సంగీతం పలికించడం అంతా మనమీ మధూలికలో చూడవచ్చు.  చక్కని భావ కవిత్వాన్ని తెలుగు సాహితీ లోకానికి అందించిన లక్ష్మీ రాధికకు హృదయపూర్వక అభినందనలు. 
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner