26, నవంబర్ 2020, గురువారం

అసంబద్ధ జీవితాలు..!!

నేస్తం, 
    ఏవిటో ఈమధ్యన ఈ పదం బాగా గుర్తుకు వచ్చింది. మన దైనందిన జీవితాల్లో కూడా ఈ అసంబద్ధత చోటు చేసుకోవడం బాధాకరం. త్యాగరాజు గారన్నట్టు " సమయానికి తగు మాటలాడు..." కీర్తననే తమ పనులు కానిచ్చుకోవడానికి చాలా మంది పాటిస్తున్నారు. మార్పు మంచిదే. కాని అదే మార్పు తుఫాన్ ప్రభావంలా కొందరి జీవితాలను అతలాకుతలం చేస్తుంది.  మరి కొందరి జీవితాలకు ఎదుగుదల కూడా అవుతుంది. తుఫాన్ మూలంగా నష్టమే కాని లాభం ఎలా అన్న నీ ప్రశ్నకు సమాధానం నేను చెప్పాలంటావా. జరిగిపోయిన సంఘటనలను కాస్త తరచి చూడు. సాక్ష్యాలతో సహా సమాధాన సమాచారం దొరుకుతుంది. వెలుగు కొందరికి సంతోషం. చీకటి మరి కొందరికి ఆనందం. ఆయా సమయాల్లో ఎవరి పనులు వారివి కనుక. 
        ఏ విషయాన్నైనా ఆచరించి చెప్పేవారు బహు అరుదు. సూక్తులదేం వుంది. సవాలక్ష సూక్తులు ఉన్నాయి. ఒకప్పుడు మన రాయల పెదబాల శిక్ష, సుమతి, వేమన వంటి బోలెడు శతకాల్లోనూ, చిన్నయసూరి పంచతంత్రములోను ఇంకా బోలెడు పుస్తకాల్లో దొరికేవి చదవాలన్న అభిలాష కలవారికి. ఇప్పుడంతా కష్టం లేకుండా జూకర్ గారి పుణ్యమా అని మనకు తెలియని సూక్తిసుధలు కూడా చాలా తేలికగా ( బరువుగా కాదండోయ్) ముఖపుస్తకంలో దొరికేస్తున్నాయి. చెప్పడానికేముందండి వినేవాడుండాలి కాని. మన రాజకీయ నాయకుల దగ్గర నుండి సామాన్య పౌరులు వరకు అందరూ ఈ సూక్తిసుధలకు అర్హులే. 
          మన జీవితం ఏంటన్న ఆలోచన లేకుండా, ఎంతసేపు పక్కింటి పురాణం కోసమే మన తపనంతా. ఎదుటివారి గురించి తెలుసుకుంటే, వారి అనుభవాల నుండి మనం ఎంతో కొంత నేర్చుకోగలిగితే, అది మన జీవన మార్గం సుగమం కావడానికి పనికివస్తుంది. అలాకాకుండా లోపాలు వెదకడం, అవహేళన చేయడమే పనిగా పెట్టుకుంటే మన చిట్టా మెుత్తం బయటబడుతుందన్న చిన్న లాజిక్ మర్చిపోతే ఎలా? 
          ప్రతి మనిషికి ఓ హద్దు అనేది ఉంటుంది. మనమెంత ఎదిగినా మన పరిధి మర్చిపోకూడదు. మన ఇంటి భాగోతాలు మరిచి ఎదుటివారికి నీతులు వల్లిస్తుంటే, మన ముందు నవ్వకపోయినా, మన చాటున పగలబడి నవ్వుకుంటారు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ..ఆఁ నన్నెవరూ చూడటం లేదులే అనుకుందట. అలా ఉంది ఈ పరిస్థితి. అసంబద్ధ జీవితాలు మనవని అందరికి తెలుసు. కొత్తగా ఎవరూ బొట్టు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. 
        నూటికి తొంభైతొమ్మిది మంది తల్లిదండ్రులు బిడ్డల బాగు కోరుకుంటారు. ఈ తల్లిదండ్రుల బిడ్డలలో ఎంతమంది కన్నవారి బుుణం తీర్చుకుంటున్నారో నిజంగా మీ గుండె మీద చేయి వేసుకుని చెప్పండి. ఈరోజు లక్షల జీతాలు తీసుకుంటున్నారంటే అది మీ తల్లిదండ్రులు మీకు పెట్టిన భిక్ష అని గుర్తుంచుకోండి. ఈరోజు మనం చేసినదే రేపటిరోజున వడ్డీతో సహా మనకు గిడుతుంది. పాతదే అయినా మరోసారి గుర్తు చేయక తప్పడం లేదు. తాతకు పెట్టిన ముంత తల వైపునే ఉంటుంది అని. 
      చంపడం, చావడం బహు విధములు. శారీరక హత్యలకు సాక్ష్యాలుంటే, అదీ న్యాయవాదులు న్యాయం కోసం నిలబడితే చాలా వరకు శిక్షలు పడతాయి. మరి మానసిక హత్యల సంగతేంటి? పూర్తిగా మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న మనిషిని మానసిక హింస ద్వారా దాదాపు ఓ సంవత్సరంలో చంపేయడం సాధ్యమంటే నమ్మగలరా ఎవరైనా! మరి ఈ మానసిక హంతకులకు మన న్యాయస్థానాలు ఏ శిక్షలు విధిస్తాయి? మన న్యాయమూర్తులకు కావాల్సింది సాక్ష్యాలే కదా. ఇక ఆత్మహత్యల విషయానికి వస్తే, ఇంతకు ముందు నాకో దురభిప్రాయం ఉండేది. బతకడానికి ధైర్యం లేనోళ్ళు అలా నిర్ణయం తీసుకుంటారని. నాకు అలా చనిపోయిన వాళ్ళంటే చాలా కోపం కూడానూ. ఇప్పుడనిపిస్తోంది ఛీదరింపులు, ఛీత్కారాల మధ్యన రోజూ చస్తూ బతకడం కన్నా బలవంతంగానైనా చావడమే మంచిదని. కళ్ళ ముందే ఎన్నో జీవచ్ఛవాలను, కనీసం మానవత్వం లేని దిగజారుడు మనుష్యులను చూసాక కొన్ని విషయాల్లో ఆత్మహత్యలు సబబే అనిపించింది. 
    సంపాదన ఉండగానే సరికాదు. మన బాధ్యతలను గాలికొదిలేసి, మనం జల్సాగా బతికేస్తే సరిపోదు. కనీసం మన కన్నవారికి ఓ ముద్ద పెట్టగలగాలి. ఈ విషయంలో తప్పు మన ఇంటికి వచ్చిన వారిదని చాలామంది తప్పించుకుంటారు. అది కానేకాదు. అమ్మాబాబుకి కూడు పెట్టడం బిడ్డల బాధ్యత. మనకీ ఇష్టం లేకపోతేనే కదా ఎదుటివారి మీదకి నెట్టి మనం సేఫ్ సైడ్ ఉండాలనుకుంటాం. మనం తినే ప్రతి ముద్దా వాళ్ళు వేసిన భిక్షే. కోట్లు ఉండగానే సరికాదు. ఆ కోట్ల ఉపయెాగం దేనికో తెలుసుకోండి. 
       కొన్ని రోజులుగా కొందరంటే చాలా అసహ్యంగా ఉంది. అలాంటి వాళ్ళ గురించి రాయాలన్నా అక్షరాలు కూడా సిగ్గుతో తలను వంచుకుంటాయి. దయచేసి సహజ మరణాన్ని అందించండి. శిక్ష లేదని మానసిక హత్యలకు పాల్పడకండి. ఈ విషయాల్లో ఎవరు నొచ్చుకున్నా నాకేం సంబంధం లేదు. 

          

6 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

సూర్య చెప్పారు...

ఇంత ఆవేశం మీకు ఎందుకొచ్చిందో తెలియట్లేదు.
ప్రతీ వివాదానికీ రెండువైపులా వాదనలుంటాయి. వాటిని బట్టి లోపం ఒకవైపే ఉండొచ్చు లేదా రెండువైపులా ఉండొచ్చు. That's why I don't like to judge people based on limited information.

citizen చెప్పారు...

@surya,,,
What is there to find the two sides of an issue ? Is serving minimum meals and minimum care to parents is too much to ask.
Some points are called axioms ,they don't need arguments from both sides .

citizen చెప్పారు...

అది నిజం. madam garu.

మీకు గుర్తుందా, "ఆది శంకరాచార్య" చిత్రంలో వారి తల్లిదండ్రుల ఖననం పనులను కూడా పట్టించుకోని కుమారులు ఉన్నారు. సమయం ప్రారంభమైనప్పటి నుండి ఈ రకమైన వ్యక్తులు ఎల్లప్పుడూ ఉంటారు.


చెత్త వ్యక్తులు ఎల్లప్పుడూ ఉంటారు.
కాబట్టి, కలత చెందకండి.

కానీ ఈ మానసిక హంతకులు తప్పించుకుంటారని అనుకోకండి.
వారు న్యాయస్థానంలో శిక్షల నుండి తప్పించుకోగలిగినప్పటికీ, వారు దేవుని కోర్టు నుండి తప్పించుకోలేరు.
కర్మ ఎల్లప్పుడూ వారిని అనుసరిస్తుంది మరియు సరైన సమయంలో వారిని శిక్షిస్తుంది.

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు అండి... మీ చక్కని స్పందనకు

చెప్పాలంటే...... చెప్పారు...

అమ్మాబాబుని చూడటానికి రెండు వైపులా ఏముంటాయెా నాకు తెలియదండి.. బాగా ఆరోగ్యంగా ఉన్న మనిషిని సంవత్సరంలో మానసికంగా హించించి చంపిన సంఘటనలు తెలుసండి. జరిగినది తెలియకుండా కాయను నేను. ధన్యవాదాలు మీ స్పందనకు

చెప్పాలంటే...... చెప్పారు...

మంచిది.. మీకలా అనిపించిందేమెా..
థాంక్యూ

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner