14, డిసెంబర్ 2020, సోమవారం

కాలం వెంబడి కలం..32

   
    పిల్లల మనసులు ఎంత మంచివో చెప్పడానికి ఈ సంఘటనే ఉదాహరణ. కాలేజ్ లో మా ఊరి అబ్బాయి కూడా చదువుతుండేవాడు. మెకానికల్ క్లాస్ లో అనుకుంటా ఉండేవాడు. రాఘవేంద్ర వేరే వాళ్ళ కోసం వెళ్ళి ఓ కేస్ లో ఇరుక్కున్నాడు. అంతకు ముందు కూడా తనని ఎవరో ఏదో అన్నారని, ఈయన ఫ్రెండ్స్ వాళ్ళని కొడితే ఆ కేస్ లో ఈయన్ని పెట్టారు. ఈయన ఎక్కడికి వెళ్ళాడన్న విషయం మాకసలు తెలియదు. కొందరు ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఉండటం గొప్ప అనుకుంటారనుకుంటా. రాజా అన్నయ్య వచ్చి ఎక్కడికి వెళ్ళాడు రాఘవేంద్ర అంటే, హైదరాబాద్ వెళ్ళాడనుకుంటా అని చెప్పాను. కాదు శ్రీకాకుళం వెళ్ళి, అక్కడ కేస్ లో ఇరుక్కున్నాడు, పేపర్ లో పడింది అని చెప్పాడు. తర్వాత పోలీస్ ఎంక్వైరీకి వచ్చి, నన్ను వివరాలడిగి, ఇప్పటికే రెండు కేస్ లు ఉన్నాయి. మరో కేస్ అయితే షీట్ ఫైల్ చేస్తారు. జాగ్రత్త మిమ్మల్ని చూసి ఊరుకుంటున్నాను ఈసారికి అని చెప్పి వెళ్ళారు. పల్లెటూరు కదా పోలీస్ లు వచ్చే సరికి ఊరంతా ఇంటికి వచ్చేసారు. ఆపదలో ఉంటే ఆదుకోవడానికి ఎవరూ రారు కాని, చోద్యం చూడటానికి అందరూ వస్తారు. పోలీస్ అడిగిన ఆ మాటకు నిజంగా అప్పటికప్పుడు చనిపోవాలనిపించింది. ఎప్పుడూ సొమ్ము ఉన్నా లేకపోయినా విలువగానే బతికాము. అలాంటిది ఆ మాట పడేసరికి, ఎవరితో ఓ మాట అనిపించుకుని ఎరగని నాకు చాలా బాధ వేసింది. ఇంత చదువుకున్నావు ఎలా చేసుకున్నావమ్మా అని కూడా అన్నాడు. 
         
       తర్వాత రాఘవేంద్ర వచ్చాక పసి అక్క తనకు రాఘవేంద్ర ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళ చిన్నాడికి చీటి రాసి పంపింది. ఆరోజు తను ఇంటికి వచ్చి వెళ్ళింది కాని తను అడగలేదు. సాయంత్రం పిల్లాడిని పంపింది. ఆ విషయానికి గొడవ పెట్టుకుని ఓ దెబ్బ వేశాడు. నేనూ ఎదురు తిరిగాను. అమ్మ మీద కూడ పోట్లాడాడు. అమ్మ ఇంటికి వెళ్ళి పోయిందప్పుడు. అయినా నా దగ్గరకి వస్తూనే ఉండేది. గొడవ జరిగిందని పాపక్క వాళ్ళు ఇల్లు ఖాళీ చేయమన్నారు. తర్వాత మండా రాజేశ్వరరావు గారి ఇంట్లో వేరే చిన్న గదిలోకి మారాము. గొడవ ఇందుకు. రాఘవేంద్ర వాళ్ళ అక్క వాళ్ళింటికి వెళ్ళి డబ్బులు అడుగుతాడట. నేను తనతో వెళ్ళాలట. నన్ను తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటావా అని అడిగాను. నువ్వు వాళ్ళని అడిగినా, నేను మా నాన్నని అడిగినా ఒకటే. మా నాన్ననే అడుగుతాను అని చెప్పాను. అడిగాను కాని మా నాన్న కూడా ఇవ్వలేదప్పుడు.  

            పసి అక్క నాకు చాలా సాయం చేసింది. ఆ విషయాలు ఏవి కాదనలేను. కూతురిలానే అనుకుంటున్నా అనేది. కనీసం తనే ఆ డబ్బులు అడిగితే బావుండేది.  చిన్నపిల్లాడితో చీటి రాసి పంపింది. అమ్మ కూతురిని ఇలానే అడుగుతుందా అని చాలా బాధ వేసింది. అయినవారు ఎవరు ఏమి చేయకపోయినా నన్ను బాగా చూసుకునే పసి అక్క ఇలా చేయడం బాగా కష్టంగా అనిపించింది మనసుకి. రాఘవేంద్ర ఇవ్వలేక పోయినా వడ్డీతో సహా నేను ఇచ్చేస్తానని తను మద్రాస్ వచ్చినప్పుడు చెప్పినా ఇలా చేసింది. మా వాళ్ళందరు మా ఇంటి వైపు నుండి వెళితే, మేము కనబడితే ఏ అప్పు అడుగుతానోనని వేరే దారి నుండి వెళ్ళేవారు ఇటు రాకుండా. 

          మరుసటిరోజు కాలేజ్ కి వెళ్ళాలంటే బెరుకుగా అనిపించింది. సహజంగా మనకు ఇతరుల వ్యవహారాలపై మక్కువ ఎక్కువ కదా. ఏ చిన్న విషయం తెలిసినా దానిని గోరంతలు కొండంతలుగా చేసి చెప్పుకోవడం పల్లెటూర్లులో మామూలే. కాలేజ్ లో పిల్లలందరికి ఈ విషయం తెలిసి నన్ను చులకనగా చూస్తారేమెానన్న మీమాంస. ఈ విషయం పిల్లలకు తెలుసో లేదో నాకు ఇప్పటికి తెలియదు. పిల్లలందరు ఎప్పటిలానే నాతో ఇష్టంగానూ, గౌరవంగానూ ఉండేవారు. 

           మేము ఇంటరులో నేర్చుకున్న ఫిజిక్స్ ప్రాక్టికల్స్ పిల్లలకు చెప్పడమే కాకుండా ఆ పరికరాలన్ని పిల్లలు ప్రాక్టికల్స్ చేయడానికి వీలుగా అమర్చుకుని, ప్రతి పాక్టికల్ చేసి పరికరాలు సరిగ్గా పని చేస్తున్నాయెా లేదో చూసుకోవడం కూడా చేయాల్సి వచ్చింది. పిల్లలకు ఫైనల్ పరీక్షలు మెుదలయ్యాయి. ఇన్విజిలేషన్ కూడా చేయడం బావుండేది. మెుత్తానికి పిల్లలందరు బాగా నే పరీక్షలు రాసేసారు. 
               మౌర్యకు తొమ్మిదవ నెలలో మెాపిదేవిలో జుట్టు తీయించాము. శ్రీశైలం మాతో వచ్చిన చిన్నోడే మౌర్యకి జుట్టు కత్తెర వేశాడు. చిన్నా బట్టలు తర్వాత పెడతాలేరా అన్నాను. అలా జీవితం జరిగిపోతూ ఉంది. అంతలో కోడూరు బాలభాను మురళి మాస్టారు ఇంగ్లీష్ మీడియం యుకేజి పిల్లలకు లెక్కలు చెప్పమని అడిగారు. రాఘవేంద్ర వద్దన్నాడు. పాపం పిల్లలకు చెప్పే టీచర్ డెలివరీకి వెళ్ళారట. ఆ టైమ్ లో మరొకరు దొరకడం కష్టం కదా. రాఘవేంద్ర వద్దన్నా, తనకు తెలియకుండా చెప్పేదాన్ని. కాలేజ్ అయ్యాక మధ్యాహ్నం నాకు ఎప్పుడు ఖాళీ కుదిరితే అప్పుడు బాలభాను స్కూల్ కి వెళ్ళి పిల్లలకు క్లాస్  చెప్పేసి, మళ్ళీ సెంటర్ వరకు నడుచుకుంటూ వచ్చి, మా రోడ్డుకి వచ్చేదాన్ని. పెద్ద పిల్లలకు చెప్పడం చాలా తేలిక. ఈ చిన్న పిల్లలకు చెప్పడం కష్టంగా అనిపించేది. అదీ తీసివేతలు చెప్పడం బాగా కష్టం అనిపించేది. పునాది గట్టిగా ఉండాలి కదా అందుకన్న మాట. నాకు మా చిన్నప్పుడు శిశువిద్యామందిరంలో లెక్కలు ఎలా చెప్పారా అని గుర్తుకు తెచ్చుకునేదాన్ని. ఓ ఇద్దరు అల్లరి పిల్లలు మినహా మిగిలిన పిల్లలు అందరు బుద్ధిగా చెప్పింది విని నేర్చుకునే వారు. బావుండేది చిన్నపిల్లలకు చెప్పడం. 

         పిల్లల పరీక్షల చివరిలో నాకు ఇంట్లో సమస్య మూలంగా ఓ రెండు, మూడు రోజులు అనుకోకుండా కాలేజ్ కి వెళ్ళడం కుదరలేదు. రాఘవేంద్ర మౌర్యని తీసుకుని హైదరాబాద్ వెళ్ళాడు. మా మరిది వాళ్ళింటికి వెళ్ళాడు. అతను ఫోన్ చేసి పిల్లాడు ఉండటం లేదు ఏడుస్తున్నాడని చెప్తే అమ్మానాన్న, నేను అప్పటికప్పుడు బయలుదేరి హైదరాబాద్ వెళ్ళాము. అవనిగడ్డలో హైదరాబాదు బస్ కోసం ఎదురుచూస్తుంటే కాలేజ్ పిల్లలు కొందరు చూసి నా దగ్గరకు వచ్చారు. రెండు గ్రూప్ ల మధ్యన పెద్ద గొడవ జరిగిందని చెప్పారు. వెంటనే ఆ పిల్లలను పిలిచి ఇద్దరికి కాంప్రమైజ్ చేసాను. పిల్లలు గబగబా వెళ్ళి అప్పటికప్పుడు నాకు చిన్న ఫ్లవర్ వాజ్ గిఫ్ట్ గా తెచ్చారు. ఈ లోపల మిగతా పిల్లలందరికి నేను ఊరు వెళుతున్నానని తెలిసి బస్ దగ్గరకి వచ్చేసారు సెండాఫ్ ఇవ్వడానికి. వాళ్ళందరిని చూసి మా నాన్న నీ మంచితనమే నిన్ను కాపాడుతుంది అని చాలా సంతోషపడిపోయారు. 

         మౌర్యని రాఘవేంద్ర హైదరాబాదు తీసుకు వెళ్ళేటప్పటికి మౌర్య నా దగ్గర పాలు మానలేదు. వాడి పుట్టినరోజుకి కొన్ని రోజుల ముందు తీసుకువెళ్ళాడు. మేం వెళ్ళి నా పిల్లాడిని ఇవ్వలేదు. మా బావగారు కూడా వచ్చి తిట్టి వెళ్ళారు. సరేనని మేం ఇంటికి వచ్చేసాం. నేను అప్పుడు అమ్మా వాళ్ళింట్లోనే ఉన్నాను. మా తోడికోడలు మాట అననే అంది. సెటిలవ్వకుండా పిల్లలని కనకూడదని. తప్పు మాదే మరి. మన బంగారం మంచిది కానప్పుడు ఎవరు ఏమి అన్నా పడాలి తప్పదు. తర్వాత రెండు రోజులకే మౌర్యని తీసుకువచ్చి ఇచ్చేసాడు. 

              నేను మళ్లీసారి మౌర్య పుట్టినరోజుకి ఉంటానో ఉండనో అని బాగా చేయాలనుకున్నా. కాని ఈ గొడవ జరిగేసరికి ఊరిలో పిల్లలందరిని మాత్రమే పిలిచి చేసాను. తర్వాత నేను కాలేజ్ లో మానేసి హైదరాబాదు వెళ్ళాను. అమెరికా వెళ్ళడానికి జావా నేర్చుకోవడానికి. 

     ఏ ఉద్యోగానికైతే నేను పనికిరానని అన్నారో, వారికి తెలిసేటట్లుగా నన్ను నేను నిరూపించుకుని, మరో మజిలికి ప్రయాణమయ్యాను. 
 
      జీవితంలో అడ్డంకులు, ఆటుపోట్లు మనిషిలోని, తనకు తెలియని శక్తిని బయట పడేస్తాయి. పరిస్థితులను ఆకళింపు చేసుకోవడానికి ఉపయెాగపడతాయి.దేనినైనా తట్టుకునే శక్తిని కూడా ఇస్తాయి. కాస్త ఓర్పు, నేర్పు ఉంటే చాలు. 


వచ్చే వారం మరిన్ని కబుర్లతో... 

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

citizen చెప్పారు...

మీ కథ నిజంగా స్పూర్తినిస్తుంది మేడమ్.
డెలివరీ అయిన వెంటనే అధిక ఒత్తిడితో కూడిన బోధన ఉద్యోగాన్ని చేపట్టడం చాలా సవాలుతో కూడుకున్న పని. కానీ మీరు ఆ పనిని బాగా అంగీకరించారు మరియు బాగా చేసారు.
Now a days, girls are acting like princesses and showing stars to their husbands,mothers and mother in laws as they are acting too sensitive.

బోధన ఉద్యోగం తాత్కాలికమని మీకు తెలిసినప్పటికీ (మీరు అప్పటికే H1B VIsa కోసం దరఖాస్తు చేసినట్లు), మీరు మీ పనిని హృదయపూర్వకంగా చేసారు.
(ఇప్పుడు చాలా మంది ఉపాధ్యాయులు ఏదో నేర్పుతారు కాని వారి నిజమైన దృష్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం మరియు చిట్ ఫండ్ వ్యాపారం మీద ఉంది).
మీ చిత్తశుద్ధిని, నిజాయితీని నేను నిజంగా అభినందిస్తున్నాను.

మీరు కొత్తగా జన్మించిన కొడుకు ఉన్నప్పటికీ ఆ సమయంలో ఇది అవసరం అయినప్పటికీ(need to be close to your parents and relatives) మీరు లెక్చరర్ ఉద్యోగం కోసం స్థిరపడలేదు. మీరు ఆర్థిక మరియు కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకున్నారు. USA కి వెళ్ళడానికి మీరు మళ్ళీ జావా నేర్చుకోవడం ప్రారంభించారు (AS400 నేర్చుకున్న వెంటనే). అది నిజంగా స్ఫూర్తిదాయకం మేడమ్.

How did you get such fire and inspiration ? i would have given up and might have sunk into depression.

I can't imagine hardships during that time..
ఇంటర్నెట్ ఖరీదైనది మరియు కంప్యూటర్లు అందుబాటులో లేనప్పుడు 1999 లో ఎదుర్కొన్న కష్టాలను నేను ఊహించలేము. (హైదరాబాద్‌లో ఇంటర్నెట్ కోసం ప్రజలు గంటకు 60 రూపాయలు చెల్లించేవారని నాకు తెలుసు).
At that time ఉచిత ట్యుటోరియల్స్ మరియు యూట్యూబ్ మరియు ఉచిత డాక్యుమెంటేషన్ లేవు.

ఇప్పుడు ఒక రోజు, అన్ని సౌకర్యాలు మరియు గొప్ప education వనరులు కూడా ఉన్నాయి మరియు ఉత్తమ ఉపాధ్యాయులు ఉచితంగా లభిస్తున్నారు, but నేను కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవడానికి కష్టపడుతున్నాను మరియు i almost vexed up with this software job and sometimes think of businesses.


but you are really inspiring madam for the sacrifices that you have made and the boldness you have shown.

చెప్పాలంటే...... చెప్పారు...

మీ అభిమానపూర్వక స్పందనకు మన:పూర్వక ధన్యవాదాలండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner