8, ఫిబ్రవరి 2021, సోమవారం

కాలం వెంబడి కలం... 40

     రెనో లో ఫ్లైట్ దిగి, ఎయిర్ పోర్ట్ లో నుండే అబ్బు శ్రీనివాస్ కి కాల్ చేసాను.  రెనో నుండి ఎలా రావాలని. కాబ్ మాట్లాడుకుని రమ్మని చెప్పారు. సరేనని ఎయిర్ పోర్ట్ బయటికి వచ్చి కాబ్ లో కార్సన్ సిటి బయలుదేరాను. నవేడా స్టేట్ కాపిటల్ కార్సన్ సిటీ. అమెరికాలో స్టేట్ కాపిటల్స్ ఎక్కువగా చిన్న చిన్న ఊర్లే ఉంటాయి. కార్సన్ సిటి మెుత్తం ఎటునుండి ఎటు తిరిగినా 2, 3 మైళ్ళ కన్నా ఎక్కువ ఉండదు. అబ్బు ఉండే మెాటల్ దగ్గరకి వెళ్ళేసరికి అబ్బు, సంపత్ ఇద్దరు సంపత్ జీప్ వేసుకుని వచ్చారు. లగేజ్ అబ్బు రూమ్ లో పెట్టి ఆఫీస్ కి వెళ్ళాము ముగ్గురము.  లోపలికి వెళ్ళాక వీళ్ళు నేను వచ్చానని చెప్పగానే, కాసేపటికి మైక్ వచ్చి లోపలికి తీసుకువెళ్ళి, డ్రింక్ ఏమైనా  కావాలా అని అడిగితే వాటర్ కావాలన్నాను. బాటిల్ తెచ్చి ఇచ్చాడు. మానేజర్ ఈరోజు రాలేదు రేపు వస్తాడు, మీకు వర్క్ ఎలాట్ చేస్తాడని చెప్పి, నాకు మిగతావాళ్ళ దగ్గర సిస్టమ్, సీట్ చూపించాడు. వాళ్ళందరు వర్క్ చేసుకుంటునే నాతో మాట్లాడం, అలా లంచ్ టైమ్ వచ్చేసింది. 
          అబ్బు, సంపత్ రోజూ సంపత్ ఇంట్లోనే లంచ్ చేస్తారు. మరో శ్రీనివాస్, శ్యామ్ వాళ్ళిళ్ళకి వెళతారు. సంపత్ రోజూ అబ్బూని ఆఫీస్ కి తీసుకురావడం, సాయంత్రం దింపడం చేస్తాడు. నన్ను కూడా సంపత్ వాళ్ళింటికే భోజనానికి తీసుకువెళ్ళారు. భోంచేసాక ఓ కోక్ టిన్ ఇస్తే అలవాటు లేదన్నా. పర్లేదు తాగమంటే నా హాండ్ బాగ్ లో వేసుకున్నా. మళ్ళీ ఆఫీస్ కి వెళ్ళాం. సాయంత్రం అబ్బు రూమ్ కి వచ్చాం. వంట నేను చేస్తానని చేసాను. పాపం ఒక్కడే ఉండే అలవాటు కదా... ఎంప్లాయర్ మాట కాదనలేక నేను నాలుగు రోజులు ఉండటానికి ఒప్పుకున్నాడు కాస్త ఇబ్బందిగా. నేను నా కంఫర్టర్ వేసుకుని కింద పడుకున్నా. మెాటల్ లో బెడ్, టీ వి, వంట పాత్రలు కొన్ని ఇస్తారు. చిన్న డైనింగ్ టేబుల్ సెట్ కూడా ఇస్తారు కొన్ని చోట్ల. 
    మరుసటి రోజు ఆఫీస్ కి వెళ్ళాక, ప్రాజెక్ట్ మానేజర్ క్రిష్ వస్తే, తనతో మాట్లాడటం, టెన్షన్ పడకుండా, ఫ్రీగా వర్క్ చేసుకో, విల్ సపోర్ట్ యు.. అని వర్క్ ఎలాట్ చేసారు. VC++ లో బిడ్ బార్ ని డిజైన్ చేసి పేజ్ లింక్ లు Vb లో చేసిన వాటికి ఇమ్మని చెప్పారు. మనం ఈ ప్రాజెక్ట్ కి వచ్చింది  VC++లో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగానన్నమాట. మనకేం రాదని చెప్పలేము. ఇక మన కష్టాలు మెుదలు. మనకా  VC++ చదివిన నాలెడ్జే కాని ప్రాక్టికల్ గా లేదాయే. సరే ఆరోజు అసలు ఏం చేయాలో, ఏమిటో అన్ని చూసుకుంటూ నోట్సు రాసుకున్నా. సాయంత్రం రూమ్ కి వచ్చాక పుస్తకాలు ముందేసుకుని రేపు చేయాల్సిన వాటి గురించి చూసుకుంటున్నా. అబ్బు అడిగాడు...వెంకట్ మీరు బాగా ఎక్స్పీరియన్స్డ్ అని చెప్పాడంటే, నేను కాదని నా పరిస్థితి ఇదని చెప్పా.  మానేజర్ క్రిష్ చాలా మంచోడు, కంగారు పడకుండా మెల్లగా చేసుకోండని అబ్బు చెప్పాడు. అలాగే ఆ వీక్ గడిచింది. వీకెండ్ కొత్తగా మా ఆఫీస్ లో చేరే కాలే శ్రీనివాసరావు దంపతులు అబ్బు రూమ్ కి వచ్చారు. వాళ్ళు ఇల్లు చూసుకుంటున్నారు. నన్ను వాళ్ళతో షేర్ చేసుకోమన్నారు. నాకేమెా అంతా కొత్త కదా.. పోన్లే కాస్త ఖర్చు తగ్గుతుంది, కార్ తో కూడా పని ఉండదు, కాలే శ్రీనివాసరావు గారు తీసుకువెళతారులే, లేదంటే అదే అపార్ట్మెంట్స్ లో మరో శ్రీను, శ్యామ్ కూడా ఉంటున్నారు. ట్రాన్స్పోర్ట్ కి ప్రోబ్లం ఉండదులే అనుకున్నా. అబ్బు హెల్ప్ తో బాంక్ అకౌంట్ ఓపెన్ చేసి, డబ్బులు దానిలో వేశాను. బాంక్ మనీ మెషిన్ లో డబ్బులు, చెక్ ఎలా డిపాజిట్ చేయాలో కూడా అబ్బునే చూపించాడు. వీకెండ్ అబ్బు రూమ్ లో కాలిఫోర్నియాలోని వాళ్ళ అన్నయ్య  దగ్గర నుండి తెచ్చుకున్న తెలుగు సినిమాలు చూడటంతో గడిచిపోయింది. నేను నా పెళ్ళైన తర్వాత చూడని సినిమాలన్నీ అమెరికా వెళ్ళాక చూసేసానన్నమాట. 
         మెుత్తానికి కాలే దంపతులతో కలిసి కొత్త ఇంటికి వచ్చాను. మా ప్రాజెక్ట్ లో పనిచేసే వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. మాది డబల్ బెడ్ రూమ్. ఓ రూమ్ నాది. ఇక మెుదలయ్యాయి నా పాట్లు. నాకేమెా పొద్దున్నే లేచే అలవాటు. ఆఫీస్ కి రడీ అయ్యి కాఫీ నేను పెట్టుకుంటూ వారిద్దరికి కూడా పెట్టిచ్చేదాన్ని. ఎందుకో తెలియదు కాని కాలే శ్రీనివాసరావు గారికి నేను ఏం చేసినా నచ్చేది కాదు. పేర్లు పెడుతూనే ఉండేవారు. అలా మెుత్తానికి నాకు కాఫీ పెట్టడం రాదని తేల్చేసారు. ఆవిడ పేరు నాకు గుర్తు లేదు కాని ఏ మాటకామటే... ఆవిడ ఏం మాట్లాడేది కాదు. నేను పట్టించుకోనట్టే ఉండటానికి ట్రై చేయడం మెుదలెట్టా. మధ్యాహ్నం లంచ్ ఆవిడే ప్రిపేర్ చేసేవారు. సాయంత్రం వచ్చాక మెుత్తం అంట్లు నా పనన్న మాట. నైట్ కూడా అన్ని  క్లీన్ చేసేసి పడుకునేదాన్ని.                    
        నాకేమెా VC++థియరీ నాలెడ్జ్ మాత్రమే ఉందాయే. కైలాష్ పుణ్యమా అని తన ఫ్రెండ్ కాలే VC++ లో వర్క్ చేయడం, తన ఫోన్ నెంబరిచ్చి హెల్ప్ చేస్తాడని చెప్పాడు. కాలే చాలా మంచబ్బాయ్. రోజూ నా డౌట్స్ అన్నీ సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చాక ఫోన్ చేసి అడగడం, తను క్లియర్ చేయడం ఇలా ఓ 15, 20 రోజులు బాగా కష్టపడ్డాను. తర్వాత బాగా ఈజీ అయిపోయింది వర్క్. ఆ టైమ్ లోనే నా ఇంజనీరింగ్ ఫ్రెండ్ యశోద నాకు VC++ పుస్తకం ఆన్ లైన్ లో కొని పంపించింది.  నాకు అప్పటికి ఇంకా ఫోన్ లేదు. ఈ దంపతులు ఇంటికి లాండ్ లైన్ పెట్టించారు. అప్పట్లో ఇంటర్నెట్ కూడా లాండ్ లైన్ తోనే కనక్ట్ చేసుకునే వాళ్ళం. వాళ్ళకు డెస్క్ టాప్ కంప్యూటర్ కూడా ఉంది. లాండ్ లైన్ ఫోన్ ఈ స్టేట్ వరకే ఫ్రీ కాల్స్. వేరే స్టేట్స్ కి చేయాలంటే కాలింగ్ కార్డ్స్ వాడుకోవాలి. నాకు నరసరాజు అంకుల్ ఓ 1 800 నంబర్ ఇచ్చారు. ఇండియాకి చేసుకోవడానికి. నేనది ఈ ప్రాజెక్ట్ లో డౌట్స్ కోసం కూడా వాడేసాను తెలియక. పాపం అంకుల్ కి ఎక్కువ బిల్ వచ్చి, ఫోన్ చేసి అడిగితే ఇలా వాడానని చెప్పాను. ఇక్కడ ఫోన్ చేయడానికి వేరే కాలింగ్ కార్డ్స్ ఉంటాయని చెప్పారు. అప్పుడు ఇంకో శ్రీనివాస్ సంధ్య వాళ్ళతో  Cost Co కి గ్రోసరీస్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ కాలింగ్ కార్డ్స్ కూడా కొనుక్కున్నా. నేను ఇంటికి చేయడానికి కూడా 10 డాలర్ల కాలింగ్ కార్డ్ కొంటే 12 నిమిషాలు వచ్చేది మెుదట్లో. తర్వాత తర్వాత 24 మినిట్స్ వచ్చేవి. నరసరాజు అంకుల్, గోపాలరావు అన్నయ్య ఫోన్ చేస్తూనే ఉండేవారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయా. మా పెద్దమ్మ చెల్లెలి కొడుకు ప్రసాద్ అన్నయ్య కూడా నేను అమెరికా వచ్చినప్పటి నుండి మాట్లాడుతునే ఉండేవాడు. అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వచ్చి చూసివెళ్ళాడు కూడా. 
        ఇక మా రూమేట్స్ నాతో బాగా ఆడుకునే వారు. వాళ్ళ ప్రెషర్కుక్కర్ లో నేను ఏదో పెడితే సేఫ్టీ వాల్వ్ పోయింది. దానికి అది నన్నే కొనిమ్మన్నారు. నా ఇంజనీరింగ్ ఫ్రెండ్ శోభ కాలిఫోర్నియాలో ఉండేది. తనకి ఫోన్ చేసినప్పుడు ఈ సేఫ్టీ వాల్వ్ గురించి ఎక్కడ దొరుకుతుందని అడిగితే, నా దగ్గర ఉంది, నేను పంపిస్తాను అని నా అడ్రస్ తీసుకుని సేఫ్టీ వాల్వ్ పంపించింది. ఇలా రోజూ ఏదోక దానికి ఆయన  నన్ను సాధించడం, ఆవిడేమెా ఏమీ మాట్లాడకపోవడం, అలా నడుస్తోంది. నాకేమెా ఎంత అడ్జస్ట్ అవుదామన్నా వీలుకాకుండా ఉంది. ఆవిడకు ఆవిడ మీద చాలా నమ్మకం తను బాగా తెలివైనదాన్నని. నేను ఎందుకు పనికిరాని దానినని. జాబ్ కూడా ఆవిడకు రావాల్సింది, ఏదో నా లక్ బావుండి నాకు వచ్చిందని. ఆఫీసులో కూడా ఈయన అందరిని ఏదోకటి అనడంతో మా చుట్టుపక్కల వాళ్ళందరు కాస్త దూరంగానే ఉండేవారు. నాతో బావుండేవారు. అది కూడ వీళ్ళకి నామీద కోపం పెరగడానికో కారణమైయుండవచ్చు. 
          ఓ వీకెండ్ సంధ్యా  శ్రీనివాస్ వాళ్ళు " లేక్ తాహు " చూడటానికి వెళుతూ నన్ను రమ్మన్నారు. వాళ్ళకు  వన్ ఇయర్ పాప. పేరు సహన. నాకు బాగా అలవాటైపోయింది. తన స్పెషాలిటి ఏంటంటే అమ్మాయిల దగ్గరకస్సలు వెళ్ళదట. కాని నా దగ్గరకు బాగా వచ్చేది. నేనూ మా మౌర్యని వదిలి వచ్చానేమెా, తనతోనే ఎక్కువగా ఆడుకునేదాన్ని. "లేక్ తాహు  "  వెళుతున్నానని నరసరాజు అంకుల్ కి చెప్తే బావుంటుంది,ట్రెక్కింగ్ అది ఉంటుంది చూడు అని చెప్పారు. శ్రీను వాళ్ళ కార్ లో వాళ్ళు ముగ్గురు, నేను బయలుదేరాం. మాటల్లో శ్రీను మంజూ నువ్వు వచ్చి 6 నెలలు కాకుండానే ఇవన్నీ చూసేస్తున్నావు, నేను వచ్చిన 4, 5 ఏళ్ళకు కాని చూసే అవకాశం రాలేదని నవ్వాడు. బాగా స్నో ఉన్న చోట ఫోటోలు దిగుతూ, కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం బాగా జరిగింది. అలా లేక్ తాహు వెళ్ళే దారిలో కొండలు,లోయలు, టన్నెల్ కూడా ఆ లాంగ్ డ్రైవ్ లో చూసేసాను.


వచ్చే వారం మరిన్ని కబుర్లతో...... 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner