8, మార్చి 2021, సోమవారం

కాలం వెంబడి కలం..44

         మెుదటిసారి చికాగోలో ఉన్నప్పుడు మా కిరణ్ ఫ్రెండ్ అశ్విన్ ఫోన్ చేసి మాట్లాడేవాడు. ఎయిర్ పోర్ట్ లో వాడు అమెరికాలో MS చేయడానికి వచ్చేటప్పుడు చాలా మంది ఏడవడం చూసి అక్క ఎలా వెళ్ళిందో అనుకున్నాడట. ఆ మాటే చెప్పి నీకు చాలా ధైర్యమక్కా అని అంటూ, అప్పుడప్పుడూ మాట్లాడుతుండేవాడు. అశ్విన్ కిరణ్ కి అమెరికాలో MS చేయడానికి హెల్ప్ చేసాడు ప్రాసెసింగ్, యూనివర్శిటీ సెలక్షన్ వగైరాలలో. నేను రామస్వామి గారి దగ్గరకు వచ్చేసరికి కిరణ్ కి ఓ సెమిస్టర్ అయ్యింది. హాలిడేస్ లో ఎక్కడో మెాటల్ లో క్లీనింగ్ జాబ్ లో చేరాడు. అమెరికాలో మన ఇండియన్ స్టూడెంట్స్ ఫ్రీ టైమ్ లో ఇలా జాబ్ లు చేసుకోవడం మామూలే. 
             ఇక నా విషయానికి వస్తే..రామస్వామి గారు ఇండియన్ గ్రాసరిస్టోర్, చైనీస్ ఇండియన్ రెస్టారెంట్ కాకుండా బిగ్ ఆపిల్ బేగిల్స్ అని అమెరికన్ ఫుడ్ స్టోర్ ఓ నార్త్ ఇండియన్ దగ్గర కొన్నారు. దానిలో అంతకు ముందు వర్క్ చేసేవాళ్ళే ఉన్నారు. ప్రకాష్ అన్నాయన త్వరలో మానేస్తానన్నాడట. ఇండియన్ రెస్టారెంట్లో వెంకటేశ్వరరావు, శేషయ్య ఆంధ్రావాళ్ళు,  విక్రమ్ అనే నార్త్ ఇండియన్ ఉండేవారు. బేగిల్స్ షాప్ పొద్దున 6 నుండి మధ్యాహ్నం 2 వరకు ఉండేది. నేను, నాతోపాటు వినోద్ అని తను ఇంజనీరింగ్ చేసి H1B వీసాతో వచ్చినవాడే. సాఫ్ట్ వేర్ జాబ్స్ రెసిషన్ లో ఈ జాబ్ చేయక తప్పలేదు తనకి కూడా. ఇలా చాలామంది ఈ విధమైన చాలా రకాల జాబ్స్ చేస్తున్నవాళ్ళే. వినోద్ వెంకటేశ్వరరావు తోడల్లుడు. ప్రకాష్, శేషయ్య, వెంకటేశ్వరరావు, శరత్ గారు వీళ్ళంతా ఫ్రెండ్స్. నాకసలు అమెరికన్ ఫుడ్ గురించి ఏమీ తెలియదు. ప్రకాష్ 6 నుండి 9 వరకు ఉండేవారనుకుంటా. ప్రకాష్ నాకు వర్క్ ఏం నేర్పించేవారు కాదు, నేను వినోద్ కి పోటి వస్తాననేమెా. కాష్ కౌంటర్ దగ్గర ఉండేదాన్ని. ప్రకాష్ నా మీద సెటైర్లు వేసేవారు. కాష్ కౌంటర్ దగ్గర వుంటే వర్క్ రాదని. నేర్పించనప్పుడు వస్తే, రాకపోతే నీకెందుకులే అని మనసులో అనుకుని ఊరుకునేదాన్ని. నాకేం రాదని మళ్ళీ అందరికి చెప్పేవాడు. మెక్సికన్ అమ్మాయి, వాళ్ళ అన్నయ్య మాతోపాటుగా వర్క్ చేసేవాళ్ళు. ఆ అమ్మాయి దగ్గర వర్క్ నేర్చుకునేదాన్ని. తను ప్రెగ్నెంట్ అప్పుడు. కొన్ని రోజులలో వర్క్ మానేస్తుంది. వాళ్ళ అన్నయ్య బేగిల్స్ చేసి, బేక్ చేసి మార్నింగ్ కొన్ని ఆర్డర్స్ ఇవ్వాల్సినవి ఇచ్చేసి వెళిపోతాడు. సిట్టింగ్, టేక్ అవుట్ ఆర్డర్స్ మిగతా వాళ్ళందం చూసుకోవాలి. 10, 12 రకాల బేగిల్స్, 7, 8 రకాల చీజ్ లు చేసి ఆర్డర్ ప్రకారం ఎవరికి కావాల్సింది వారికి ఇవ్వాలి. షాప్ క్లోజ్ చేసేటప్పుడు మిగిలిన బేగిల్స్ డస్ట్బిన్ లో పడేసి, షాప్ క్లీన్ చేసి, కౌంటర్ క్లోజ్ చేయాలి. ఇది బేగిల్స్ షాప్ లో పని. 
         ఓ వారం అయ్యాక ప్రకాష్ మానేసాడు. వినోద్, నేను, మెక్సికన్ అమ్మాయి చూసుకునేవారం. వినోద్, నేను క్లోజింగ్ వరకు ఉండేవారం. కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరు కూడా లిమిటెడ్ అవర్స్ చేసి వెళిపోయేవారు. నాకు వర్క్ రాదని ప్రకాష్ చెప్పడంతో, రామస్వామి గారు పొద్దున్నే నన్ను షాప్ లో డ్రాప్ చేసి కాసేపు నేను కష్టమర్స్ తో ఎలా డీల్ చేస్తున్నానో చూసేవారు. మధ్యాహ్నం బేగిల్స్ లో వర్క్ అయ్యాక, భారత్ మేళా ఇండియన్ గ్రాసరిస్టోర్ లో సాయంత్రం వరకు ఉండేదాన్ని. తర్వాత సాయంత్రం చైనీస్ ఇండియన్ రెస్టారెంట్ కి వెళ్ళేదాన్ని. ఇలా రోజు పొద్దున్నే 6 నుండి నైట్ 9 వరకు వీక్ డేస్ లో, వీకెండ్స్ 11, 12 వరకు వర్క్ ఉండేది. 
           AMSOL కంపెనీ H1B పేపర్స్ వచ్చాయి. మా వారికి వీసా పేపర్స్ పంపాలంటే ఏం కావాలని AMSOL లో వీసా పేపర్స్ వర్క్ చూసే బాల ఇటికిరాలను అడిగితే మీ H1B వీసా పేపర్స్ తో కంపెనీ నుండి ఓ లెటర్ చాలండి, బాంక్ స్టేట్మెంట్స్, మీ పే చెక్స్, మారేజ్ సర్టిఫికేట్, పెళ్ళి ఫోటోలు కొన్ని పంపండి, సరిపోతాయి అన్నారు. రామస్వామి గారు ఎకౌంట్ లో డబ్బులు వేస్తే శరత్ గారు బాంక్ స్టేట్మెంట్ తీసుకోవడంలో హెల్ప్ చేసారు. మా పెళ్ళి సంతకాల  పెళ్ళిలా జరిగింది. ఆ ఫోటోలు, పేపర్స్ అన్నీ తీసుకుని మా వారు వీసా స్టాంపిగ్ కి వెళితే, ఎంగేజ్మెంట్ ఫోటోలు కాదు, పెళ్ళి ఫోటోలు తీసుకురండి అన్నారట. అది సంగతి. 
             గోవర్ధన్ ఇండియా వెళుతున్నానంటే నా కొడుకుని చూసిరా అని చెప్పాను. ఓరోజు ఫోన్ చేసి అర్జంట్ గా ఫోన్ చేయమన్నాడు. వెంటనే ఫోన్ చేసా ఏమయ్యిందోనని. నీ కొడుకు నాలుగు మెట్ల మీద నుండి కాదు పడింది. మీ డాబా పోర్టికో పైనుండి దూకేసాడు. అమ్మావాళ్ళు చూపించారు ఎక్కడ నుండి దూకాడో. అది చూసాకా నాకు ఇప్పటికి వణుకు తగ్గలేదు అని చెప్పాడు. అప్పటికి వాడికి సరిగ్గా 2వ పుట్టినరోజు అయ్యి 2 నెలలు. విషయం తెలిసాక వెంటనే ఇండియా వెళిపోవాలనిపించింది. కాని అన్ని మనకనుకూలంగా ఉండవు కదా. ఈయనకు వీసా క్వరీ పెళ్ళి ఫోటోలు కావాలని పడింది కదా. నాకేమెా ఊపిరి సలపని పని. దానికి తోడు రామస్వామి గారు డ్రైవింగ్ నేర్చుకోమనడం. కాస్త విసుక్కోవడం మెుదలైంది. రోజూ నన్ను డ్రాప్ చేయాలి కదా అందుకు. అప్పుడప్పుడూ విక్రమ్ కాస్త నేర్పేవాడు ఇంటికి వచ్చేటప్పుడు. విక్రమ్ పెద్దగా ఎవరితో మాట్లాడేవాడు కాదు. నాతో మాట్లాడతాడని దానికి కూడా జోకులు వేస్తుండేవారు శేషయ్య, రామస్వామి బాచ్.  
        మధు, సంధ్య అని ఓ ఫామిలి పరిచయం అయ్యారు. మధు రామస్వామి గారికి బేగిల్స్ అమ్మిన నార్త్ ఇండియన్ మరో షాప్ లో చేసేవాడు. సంధ్యను కూడా ఇండియన్ గ్రాసరిస్టోర్ లో పెడదామని రామస్వామి గారి ఆలోచన. అలా నాకు పరిచయమై బాగా దగ్గరయ్యారు. బాబీ, రీనా వాళ్ళు మాధవి అక్కకు చుట్టాలు. విజయ్ బాబీ రూమ్మేట్స్. బాబీ, విజయ్ కూడా రెస్టారెంట్ కి వచ్చేవాళ్ళు. రామస్వామి గారి ఇంట్లో బేస్మెంట్ లో కంప్యూటర్ ఉండేది. వీళ్ళకు తెలిసిన అబ్బాయి అక్కడ ఉండేవాడు. కొన్ని రోజులకు వాళ్ళ చెల్లి MS చేయడానికి వచ్చింది. కొన్ని రోజులుండి ఆ అమ్మాయి వెళిపోయింది. నేను ఈమెయిల్స్ చెక్ చేసుకోవడానికి టైమ్ కుదిరినప్పుడు బేస్మెంట్ లో చూసుకునేదాన్ని. మాధవి అక్క కూతురు వందన నాలుగో, ఐదో చదువుతుండేది అప్పుడు. రకరకాల జడలు వేసుకుంటూ ఉండేది. కుక్కీస్ వెరైటీస్ చేస్తూ ఉండేది. అప్పుడప్పుడూ బేగిల్స్ షాప్ లో నాకూడా ఉండేది తన స్కూల్ అయ్యాక బోర్ కొడితే. మా ఆయన చుట్టాలు జలజ వదిన వాళ్ళాయన బాబన్నయ్య అమెరికన్ సిటిజన్. అన్నయ్య నన్ను కలవడానికి నా వర్క్ అయ్యే టైమ్ లో వచ్చేవారు. చాలా మంచివారు అన్నయ్య. నేను ఇండియా వెళదామనుకుంటున్నానని అన్నయ్యకు చెప్తే వెంటనే నాకు డబ్బులు అకౌంట్ లో వేసారు. జలజ వదిన అప్పుడు ఇండియాలోనే ఉంది. 
          నేను ఇండియా వెళతానని మాధవి అక్కకు కూడా చెప్పాను. అప్పటికి నేను అమెరికా వచ్చి సంవత్సరం నర్ర అయ్యింది. మౌర్య మూడో పుట్టినరోజుకి ఇండియా వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నా. పిల్లాడికి మాజిక్ స్లేట్, కొన్ని బొమ్మలు మాధవి అక్క కొనిపెట్టింది. నా క్లాస్మేట్ శేఖర్ బాబు ఉండేది చికాగోలోనే. అప్పుడప్పుడూ ఫోన్ లో మాట్లాడేవాడు. కాలేజ్ లో మేమిద్దరం ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు. ఇండియా వెళుతున్నానంటే తను వచ్చి దీవాన్ స్ట్రీట్ కి తీసుకువెళ్ళాడు.అక్కడ ముత్యాలు, పచ్చలు తనకు తెలిసిన షాప్లో తీసుకున్నా. నా చిన్నప్పటి ఫ్రెండ్ రాధ తమ్ముడు రాము కూడా అమెరికా వచ్చాడు నా తర్వాత. పిట్స్ బర్గ్ లో ఉన్నప్పటి నుండి మాట్లాడేవాడు. మా సీనియర్ రాంకుమార్ కూడా నేను పిట్స్ బర్గ్ లో ఉన్నప్పుడు అమెరికా వచ్చారు. రవీంద్ర ప్రసాద్ గారు రాంకుమార్ ని ఎయిర్ పోర్ట్ లో పిక్ చేసుకుని అక్కడే నాతో మాట్లాడించారు. ఇంజనీరింగ్ కాలేజ్ లో మా సీనియర్లు వీళ్ళు. రవీంద్ర ప్రసాద్ గారు బాగా కేర్ తీసుకునే వారు కాలేజ్ లో. రాంకుమార్ నన్ను కలవడానికి చికాగో వచ్చివెళ్ళారు. బాబీ నాకు షాపింగ్ లో చాలా హెల్ప్ చేసాడు. పిల్లలకు చాక్లెట్స్, బట్టలు, గిఫ్ట్ బొమ్మలు, ఓ కామ్ కాడర్ మాత్రం తీసుకున్నాను. 
             డబ్బులు కావాలని రామస్వామి గారిని అడిగితే అప్పటి వరకు ఏం లెక్కలు చూసారో నాకు తెలియదు. నేను ఇవ్వాల్సిన డబ్బులు మినాయించుకుని ఓ లక్ష ఇండియాలో తీసుకోమన్నారు. సరేనని ఇండియా బయలుదేరా. ఎయిర్ పోర్ట్ లో బాబీ దించాడు. దుబాయ్ మీదుగా మద్రాస్ వచ్చాను. రోజుకి 18, 20 గంటల పని చేసానేమెా ఫ్లైట్ లో ఒకటే నిద్ర. ఎయిర్ హోస్టెస్ నిద్ర లేపి తినడానికి ఇచ్చేది. మా మామయ్య, మావారు ఎయిర్ పోర్ట్ కి వచ్చారు. హోటల్ రూమ్ కి రాజగోపాల్, వాళ్ళ కాబోయే ఆవిడ, మా కిరణ్ చేసుకుందామనుకున్న అమ్మాయి వచ్చారు. కాసేపు వాళ్ళతో మాట్లాడి, మధ్యాహ్నం రెండింటికి పినాకినిలో విజయవాడ బయలుదేరాం. 

"   పని ఏదైనా సరే మనకు రానిది నేర్చుకోవడంలో తప్పులేదు. కాని మనం ఏ పని చేయకుండా ఎదుటివారి పనిలో లోపాలు వెదకడం మన నికృష్టపు బుద్ధిని బయటేసుకోవడం అవుతుంది. "


వచ్చే వారం మరిన్ని కబుర్లతో... 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner