15, మార్చి 2021, సోమవారం

కాలం వెంబడి కలం.. 45

         పినాకిని మమ్మల్ని విజయవాడ చేర్చింది. అక్కడి నుండి ఇంటికి చేరాము. నా కొడుకు నన్ను గుర్తు పట్టలేదు కాని నా గొంతు గుర్తు పట్టాడు. హమ్మయ్య నా ఫోన్ ఖర్చు వేస్ట్ కాలేదన్న ఆనందం నాలో. ఎందుకంటే తిన్నా తినకపోయినా వీలయినంత వరకు రోజూ ఫోన్ చేసేదాన్ని. కనీసం 5 నిమిషాలయినా వాడితో మాట్లాడేదాన్ని. వాడి మూడో పుట్టినరోజుకి ఇంటికి వచ్చాను. వాళ్ళ నాన్న ఇల్లంతా పూలతో డెకరేషన్ చేయించారు. ఊరిలో పిల్లలందరిని పిలిచి పుట్టినరోజు వేడుక బాగా చేసాము. అప్పటికి మా ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు. మా మామయ్య కూతురు ప్రియ, మావాడు మౌర్య. ఎవరి పుట్టినరోజయినా ఇద్దరు పిల్లలు కేక్ కట్ చేసేవారు. అమెరికా నుండి వచ్చాక, గతంలో నేను ఇబ్బందిలో ఉన్నప్పుడు, అమెరికా వెళ్ళేటప్పుడు కనబడని బంధువులందరు కనిపించారు. మౌర్య డాబా పైనుంచి పడిపోయినప్పుడు అమ్మ తిరుపతి వెంకన్నకు ఏడూళ్ళు జోగి, నిలువుదోపు ఇస్తానని మెుక్కుకుందట. ఇంట్లో పూజ చేసుకుని,  అయినవాళ్ళందరితో తిరుపతి మెుక్కు తీర్చుకున్నాం. నేను అమెరికాలో ఉన్నప్పుడు మా పెద్దాడపడుచుకి ఆపరేషన్ చేస్తే అమ్మా అమ్మమ్మ వెళ్ళి చూసి వచ్చారు. మౌర్య డాబా మీద నుండి కింద పడినప్పుడు కూడా వాళ్ళెవరూ చూడటానికి కూడా రాలేదు. అయినా కూడా మౌర్యని తీసుకుని నేనే ఆవిడని చూడటానికి వెళ్ళాను. కార్డ్ లెస్ ఫోన్ ఇచ్చానని, ఆ బాకీ తీర్చడానికేమెా ఓ వెయ్యి రూపాయలు నాకు ఇచ్చింది. భోజనం చేసి, చల్లపల్లి హస్పిటల్ లో పంటికి సిమ్మెంట్ పెట్టించుకుని ఇంటికి వస్తూ, దారిలో అవనిగడ్డలో గోవర్థన్ వాళ్ళింటికి వెళ్ళి ఆంటిని కూడా చూసి వచ్చాను.  
      నా పాస్పోర్ట్, మా ఆయన పాస్పోర్ట్ కలిపి, డాక్యుమెంట్స్ అన్ని పెట్టి వీసా స్టాంపిగ్ కి పంపించాము. అప్పుడు పోస్ట్ లో పంపించడమే. అమెరికా వాళ్ళు ఒక్కోసారి ఒక్కో రూల్ పెడతారు. మళ్ళీ 2 ఇయర్స్ కి వీసా స్టాంపిగ్ అయ్యింది ఇద్దరికి.  రోజులు తొందరగా గడిచిపోయి, తిరుగు ప్రయాణం దగ్గరకి వచ్చేసింది. విజయవాడలో షాపింగ్, పచ్చళ్ళు, కారాలు సర్దుకుని అమెరికా తిరిగి బయలుదేరాను. 
         చికాగో ఎయిర్ పోర్ట్ కి బాబి వచ్చి పికప్ చేసుకున్నాడు. మరుసటి రోజు రెస్టారెంట్ కి వెళ్ళేసరికి కవితక్క వాళ్ళు లేరు. బిగ్ ఆపిల్ బేగిల్స్ లో వినోద్ ఉన్నాడు. మా కిరణ్ కి జాబ్ కావాలని అడిగితే రామస్వామి గారు రమ్మని చెప్పారు. వాడు వేరే చోట ఏదో మెాటల్ లో చేస్తున్నాడు అప్పుడు. MS చదువుకునే మనవాళ్ళందరు హాలిడేస్ లో ఇలా జాబ్ లు చేయడం మామూలే. కిరణ్ బాబీ వాళ్ళతో ఉండేవాడు. క్షణం కూడా ఖాళీ లేకుండా పని సరిపోయేది. బేగిల్స్ లో బేగిల్స్ బేక్ చేసే అతన్ని కూడా మానిపించేసారు. బేక్ చేయడానికి ఓ మెక్సికన్ వచ్చేవాడు. వింటర్ లో హెవీ స్నో  పడుతున్నా కూడా నేను తెల్లవారు ఝామున రెండింటికి వెళిపోయేదాన్ని బేగిల్స్ షాప్ కి. కొన్ని రోజుల తర్వాత వినోద్, వెంకటేశ్వరరావు కూడా మానేసారు. తర్వాత మా ఆయన కజిన్ రమణ గారు కొన్ని రోజులు చేసి ఆయనా మానేసారు. తర్వాత కిరణ్ వాళ్ళ బంధువు భాను గారు చేసారు. ఆయనా సాఫ్ట్ వేరే కాని అప్పటి పరిస్థితి అలాంటిది మరి. ఎవరి రాజకీయాలు వాళ్ళు చేసుకుంటూ ఉండేవారు. రామస్వామి గారు నన్ను డ్రైవింగ్ నేర్చుకోమని అంటూ, కాస్త పెడసరంగా మాట్లాడటం మెుదలుబెట్టారు. డ్రైవింగ్ నేర్చుకునే టైమ్ ఇవ్వాలి కదా. ఆ గోల పడలేక ఓ రోజు వెళ్ళి లెర్నర్ పర్మిట్ తెచ్చుకున్నాను. అమెరికాలో డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ముందు లెర్నర్ పర్మిట్ రిటెన్ టెస్ట్ రాసి తెచ్చుకోవాలి. ఈ రిటెన్ టెస్ట్ ఏ స్టేట్ కి ఆ స్టేట్ కే సపరేట్ గా ఉంటుంది. తర్వాత డ్రైవింగ్ టెస్ట్ రోడ్ టెస్ట్ ఇవ్వాలన్నమాట. లెర్నర్ పర్మిట్ ఉంటేనే రోడ్ టెస్ట్ ఇవ్వాలి. అప్పుడప్పుడూ మధు, సంధ్యా వాళ్ళు నేర్పించేవారు వాళ్ళ కార్ తో. 
        నేను హైదరాబాదు హాస్టల్ లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ వినితో పాటు ఉషామాధవి అని మరో ఫ్రెండ్ ఉండేది. తను MSC కెమిస్ట్రీ చేసింది. నేను అమెరికా రాకముందే తనకి అమెరికా రావడానికి రాజగోపాల్ వాళ్ళ అన్నయ్య ద్వారా H1B వీసా కోసం మద్రాస్ వెళ్ళి డబ్బులు కట్టి పేపర్స్ ఫైల్ చేయించాము. పేపర్స్ రావడం, స్టాంపిగ్ కావడం అయ్యింది. కాని జాబ్ మార్కెట్ అప్పటికే అమెరికాలో బాలేదు. అందుకని వాళ్ళ ఎంప్లాయర్ రిస్క్ తీసుకోను, మీరు కావాలంటే మా ఆఫీస్ ఉన్న శాన్ఫ్రాన్సిస్కో వచ్చి తర్వాత మీకు కావాల్సిన చోటికి వెళ్ళండి. అలా అయితేనే పేపర్స్ ఇస్తాను అన్నాడు. అందుకని ఉషకి శాన్ఫ్రాన్సిస్కో నుండి చికాగోకి టికెట్ బుక్ చేసాను. తనని జలజ వదిన వాళ్ళు పిక్ చేసుకున్నారు. నాతోపాటు రామస్వామి గారింట్లోనే ఉండేది. అప్పుడప్పుడూ మాతో ఇండియన్ గ్రాసరిస్టోర్ లో ఉంటూ వుండేది. మా సీనియర్ రాంకుమార్ గారు సెయింట్ లూయీస్ లో సబ్ వే లో పని చేసేవారు. తన రూంమేట్ సతీష్ కూడా సబ్ వే లోనే.  వాళ్ళిద్దరు నువ్వే వేరేవాళ్ళింట్లో ఉంటున్నావు. ఉషని మా దగ్గరకి పంపు అని చెప్పారు. నచ్చితే సబ్ వే లో చేస్తుంది లేదా జాబ్ ట్రయల్స్ వేసుకుంటుంది అని అంటే ఉషని సెయింట్ లూయిస్ పంపించాను. ఉష వచ్చిన టైమ్ లోనే మా ఆయన కూడా అమెరికా వచ్చారు. మా ఆయన అమెరికా వచ్చినప్పుడు జలజ వదిన, అన్నయ్య చికాగో ఎయిర్ పోర్ట్ లో రిసీవ్ చేసుకుంటే, బాబీ వెళ్ళి  తీసుకువచ్చాడు. రెస్టారెంట్ లో పని చేస్తూ ఉండేవారు. పెరుగన్నం మాత్రమే తిన్నారు ఉన్నన్ని రోజులు. ఓ ఆరు నెలలు ఉండి ఉండలేక ఇండియా వెళతానని అన్నారు. రామస్వామి గారికి చెప్పాను. అప్పటికే నేను రామస్వామి గారితో సరిగా మాట్లాడటం లేదు, మాధవి అక్కని వేరే వారి దగ్గర చాలా తేడాగా మాట్లాడారని. నా పని నేను చేసుకుంటున్నాను. మీ ఆయనకు డబ్బులు ఏమి ఇవ్వను, నీకు కూడా రోజుకి ఎనిమిది గంటలకు మాత్రమే ఇస్తాను అని అంటే నేను పని చేయను వెళిపోతానని చెప్పాను. రోజుకి 20, 22 గంటలు 10 నెలలు పని చేసాను. మూడు చోట్లా మెుత్తం పని చేసేదాన్ని. ఇలా అంటారని ఊహించలేదు. ఆడపిల్ల సొమ్ము తిని బాగుపడిందెవరులే అనుకున్నాను. ఓ 30 వేల డాలర్లు ఎగ్గొట్టారు. మాధవక్క నన్ను చాలా బాగా చూసుకుంది. మాధవి అక్క మాత్రం వెళిపోతున్నానంటే బాగా ఏడిచింది. నీకు ఈ ఇంట్లో ఉండే హక్కు ఉంది. నువ్వు నీ జాబ్ చూసుకునే ఇక్కడనుండి వెళ్ళు అంది. ఎక్కడికి వెళతావు అంటే జలజ వదిన వాళ్ళింటికి వెళతాను అన్నాను. నా సంగతి అక్కకు బాగా తెలుసు. నువ్వు ఎన్నిసార్లు వాళ్ళింటికి వెళ్ళావో నాకు తెలుసు. నీకు జాబ్ వచ్చేవరకు ఇక్కడే ఉండు. ఏ పని చేయనక్కర్లేదు అంది. లేదక్కా ఉండలేను, వెళిపోతానన్నాను. వెంటనే నేను, మావారు మధు వాళ్ళింటికి వెళ్ళాము. రెండు రోజులు అక్కడే ఉన్నాము. మధు వాళ్ళింటికి వచ్చిన మరుసటి రోజు పొద్దున్నే బాబి వచ్చాడు మా దగ్గరకు. తర్వాత మేము జలజ వదిన వాళ్ళింటికి వెళ్ళాము. మావారికి నాకు ప్రెగ్నెన్సీ అని అనుమానమని చెప్పాను. మావారు ఇండియా వెళ్ళారు 20 రోజులలో వచ్చేస్తానని. నేను జాబ్ వెదుకులాటలో పడ్డాను. రాంకుమార్ వాళ్ళు నన్ను కూడా సెయింట్ లూయీస్ వచ్చేయమంటే మిగతా లగేజ్ అంతా వదిన వాళ్ళింట్లో వదిలేసి, బట్టలు మాత్రం తీసుకుని సెయింట్ లూయీస్ ట్రైన్ లో వెళ్ళాను. చాలా బావుంది ట్రైన్ జర్నీ. అప్పటికే నాకు ప్రెగ్నెన్సీ అని కన్ఫామ్ అయ్యింది. సబ్ వే లో చేయలేనని చెప్పాను. నేను సెయింట్ లూయీస్ వచ్చిన 4,5 రోజులలోనే మధు వాళ్ళు వచ్చారు. వాళ్ళతో చికాగో వచ్చేసాను. 
       మధు వాళ్ళింట్లో ఉన్నప్పుడే 2, 3 ఇంటర్వ్యూలు ఫోన్లోనే ఎటెండ్ అయ్యాను. జనరల్ గా అమెరికన్స్ ఇంటర్వ్యూ చేస్తే మాగ్జిమమ్ 20 మినిట్స్ ఉంటుంది. మన ఇండియన్స్ మాత్రం మనకు రాదనే వరకు చేసి వారి ఇగో శాటిస్ఫై చేసుకుంటారు. నేను ఎటెండ్ చేసిన కాల్స్ ఒకటి సైన్ ఆన్ మీద. అది నాకు రాదు కాని వేరే ఎవరో ఫోన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంటర్వ్యూ  ఎటెండ్ చేసాను. బానే చెప్పాను కూడా. మరొకటి AS/400 టెస్టింగ్ మీద. ఇంటర్వ్యూ చేసింది అమెరికన్. 45 మినిట్స్ చేసింది. బానే చెప్పాను కాని అంతసేపు చేసేసరికి డౌట్ వచ్చింది. ఈ ఇంటర్వ్యూ ఎరేంజ్ చేసింది వర్మ గారు. మధ్యలో 4 లేయర్స్. మా ఎంప్లాయర్ తో కలిపి ఐదన్న మాట. 
        సరే మార్కెట్ బాలేదు కదా అని వేరే జాబ్స్ కూడా ట్రై చేస్తున్నాను. మధు, సంధ్య వాళ్ళు కూడా బయట జాబ్స్ ట్రై చేస్తున్నారు. మాల్ లో కళ్ళజోళ్ళు అమ్మే జాబ్ దొరికింది ఒహాయెా, సిన్ సినాటిలో నాకు, ఉషకు కూడా కలిపి. వెళదామని డిసైడ్ అయ్యాము అందరం. నేను, మధు, సంధ్య చికాగో నుండి, ఉష సెయింట్ లూయీస్ నుండి బయలుదేరడానికి రడి అయ్యాము. రేపు బయలుదేరాలనగా ఈరోజు నాకు AS/400 టెస్టింగ్ జాబ్ రోనెక్ సిటీ, వర్జీనియా స్టేట్ లో వచ్చింది. అందరికి పోనూ నాకు అవర్ కి 20 డాలర్స్ వస్తాయి. మళ్ళీ దానిలోనే కంపెనీ టాక్స్ కట్టాలి. అసలు 80 డాలర్స్ బిల్లింగ్ ప్రాజెక్ట్. కాని 3 వీక్స్ ప్రాజెక్ట్ అన్నారు. మా AMSOL సుబ్బరాజు కి చెప్తే ప్రాజెక్ట్ కి వెళ్ళండి. మీకు గ్రీన్కార్డ్ కి లేబర్ ఫైల్ చేస్తాను అన్నారు. 3 వారాలే కదా అని వెళదామని డిసైడ్ అయ్యాను. మధు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. నా దగ్గర ఓ 250 డాలర్స్ ఉంటే వాటిలో 150 డాలర్లు వాళ్ళకు  ఇచ్చి నేను రోనెక్ సిటీ కి బయలుదేరాను. 
            రోనెక్ సిటిలో AMSOL రవి ముదునూరు బుక్ చేసిన హోటల్కి వెళ్ళాను. పొద్దున్నే నన్ను అంతకు ముందు ఇంటర్వూ చేసినామెకి కాల్ చేసాను. తను 11 కి వచ్చి పిక్ చేసుకుంటానని చెప్పింది. సరిగ్గా 11 కి మా టెస్టింగ్ మేనేజర్ టీనా ఫీల్డ్స్ ఓ పెద్ద కార్ లో వచ్చి కంపెనీకి తీసుకువెళ్ళింది. కార్ లో తనతో మాట్లాడుతూ నా టెన్షన్ తగ్గించుకోవడానికి ప్రాజెక్ట్ వివరాలడిగాను. అప్పటికి నాకు మాన్యువల్ టెస్టింగ్ వచ్చు కాని ఆటోమేషన్ టెస్టింగ్ రాదు. ఈ ప్రాజెక్ట్ లో ఏ టెస్టింగ్ వాడుతున్నారని అడిగితే మాన్యువల్ అని చెప్పింది. అప్పుడు హమ్మయ్య అనుకున్నాను. టీనా చాలా చాలా మంచిది. నేను ఈ ప్రాజెక్ట్ కి వచ్చేసరికి దగ్గర దగ్గర 7, 8 నెలల నుండి వర్క్ పెండింగ్ ఉండిపోయింది. మెుదటిరోజు సిస్టమ్ అంతా సెట్ చేయడము, నేను వర్క్ ప్లాన్ చేసుకోవడంతో కాస్త పనే చేయగలిగాను. వంచిన కల ఎత్తకుండా ఓ 10, 12 రోజులు పని చేసి పెండింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసేసాను. ఇంతకీ కంపెనీ పేరు చెప్పలేదు కదా అడ్వాన్స్ ఆటో పార్ట్స్. అమెరికాలో చాలా పెద్ద పేరున్న కంపెనీ. ఈ కంపెనీలో ఇండియన్స్ చాలా తక్కువ మంది. ఓ ఐదారుగురు వచ్చి పరిచయం చేసుకున్నారు. కొసమెరుపేంటంటే తెలుగువారు ఒక్కరూ లేదన్న మాట. తమిళ్, మళయాళీ, నార్త్ ఇండియన్స్ ఉన్నారు. ఇలా ఇండియన్స్ ఎవరు వచ్చినా అందరు కలిసి ఒకరింట్లో గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తారట. నన్నూ అలాగే ఇన్వైట్ చేసారు. 
ఆఫీస్ వర్క్ అయ్యాక ఈవెనింగ్ నన్ను పిక్ చేసుకుని తీసుకువెళ్ళారు. అందరం చక్కగా పలకరించుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ చేసాం. తర్వాత మైల్డ్ లేడీస్ డ్రింక్ వైన్ ఆఫర్ చేసారు. అలవాటు లేదని చెప్తే, ఏం కాదు తాగమవ్నారు. నేను ప్రెగ్నెంట్ అని చెప్తూ, ఏదీ పడదని నా కండిషన్ గురించి చెప్పాను. ఆఫీస్ లో పని చేసే తమిళాయన వైఫ్ కూడా ప్రెగ్నెంట్ అని చెప్పింది. గెట్ టుగెదర్ బాగా జరిగింది. 
వర్క్ లో పడి తిండి కూడా సరిగా తినేదాన్ని కాదు. ఓ వేళ తిందామన్నా, కనీసం మంచినీళ్ళు కూడా పొట్టలో ఉండేవి కాదు. వామిటింగ్ అయిపోయేవి. ఆకలికి పేగులు మెలితిరిగి పోయేవి. ఆఫీస్ కాంటిన్ లో అప్పుడప్పుడూ తింటూ, మా టెస్టింగ్ టీమ్ కొలీగ్స్ లంచ్ కి బయటకెళుతూ ఏమైనా కావాలా అని అడిగితే మెక్ డోనాల్డ్స్ డాలర్ చికెన్ శాండ్ విచ్ తెమ్మని చెప్పేదాన్ని. అమెరికన్ గ్రాసరిస్టోర్ లో వేయించిన వేరుశనగపప్పు, ఎగ్స్, పాలు, ఏవో కొన్ని వెజిటబుల్స్ తెచ్చుకునేదాన్ని. ఇంటి దగ్గర నుండి తెచ్చిన వాటిలో నల్లకారం, శనగపప్పు కారం నాతో రోనెక్ తెచ్చుకున్నా. మిగిలినవన్నీ జలజ వదిన వాళ్ళింట్లోనే వదిలేసాను త్రీ వీక్స్ ప్రాజెక్టే కదా అని. అప్పటి వరకు తిండి విలువ తెలియలేదు. రోనెక్ పుణ్యమా అని తిండి విలువ బాగా తెలిసింది. మూడు వారాలే కదా అని హోటల్ లోనే ఉంటానని రవికి చెప్పాను. నా దగ్గర డబ్బులు లేవని కూడా చెప్పాను. 1000 డాలర్స్ అకౌంట్ లో వేశారు. 
ఆఫీస్ లో ఉన్నంతసేపు నా సెల్ సిగ్నల్ వచ్చేది కాదు. చాలా దూరం బయటకు రావాల్సి వచ్చేది బ్రేక్ టైమ్ లో. అందరూ సిగిరెట్లు కాల్చుకుంటుంటే నేను ఫోన్ మాట్లాడుకునేదాన్ని. కాని నా ఫోన్ ప్లాన్ లో డే మినిట్స్ ఎక్కువ ఉండేవి కాదప్పుడు. అందుకని ఆఫీస్ లాండ్ లైన్ అదీ లంచ్ టైమ్ లోనో, ఈవెనింగ్ ఆఫీస్ అవర్స్ అయిపోయాకో వాడేదాన్ని. మధ్య మధ్యలో మరో జాబ్ కోసం ఆఫీస్ లాండ్ లైన్, ఈమెయిల్ వాడాల్సి వచ్చేది రెజ్యూమ్ పంపడానికి.ఈ ప్రాజెక్ట్ ఉండేది మూడు వారాలే కదా అని. ఆఫీస్ కి మార్నింగ్ నడుచుకుంటూ వచ్చేదాన్ని. సాయంత్రం ఎవరో ఒకరు హోటల్ దగ్గర డ్రాప్ చేసేవారు. స్నో బాగా పడినప్పుడు కాబ్ బుక్ చేసుకునేదాన్ని. కాబ్  రానప్పుడు టీనాకి రావడం లేటవుతుందని ఫోన్ చేసి చెప్తే, రావద్దులే రెస్ట్ తీసుకో అని చెప్పేది. మాకు ప్రాజెక్ట్ రివ్యూ మీటింగ్స్ జరుగుతూ ఉండేవి. నేను ముందే టీనాకి వివరమంతా చెప్పేసేదాన్ని నేను చేసిన వాటి గురించి. మీటింగ్ లో తను నా గురించి కూడా బాగా మెచ్చుకుంటూ చెప్పేది. అది కొందరికి నచ్చలేదు. మా టెస్టింగ్ టీమ్ లో అందరు అమెరికన్సేనండోయ్. మా గోపాలరావు అన్నయ్య,శిరీష వదిన వాళ్ళు, జలజ వదిన వాళ్ళు, ఉమ, మధు, సంధ్య, ఉష ఇలా అందరు ఫోన్ చేసి నా క్షేమ సమాచారాలు కనుక్కుంటూ ఉండేవారు. అలా మూడు వారాలు గడిచిపోయాయి. 

    " కాలమెప్పుడూ ఒకేలా ఉండదు. జీవితాన్ని సమన్వయం చేయడానికి మంచి చెడులను మనకు రుచి చూపిస్తూ బతుకు విలువ, మనిషి ఆసరా గురించి తెలియజెప్తుంది. "

వచ్చే వారం మరిన్ని కబుర్లతో... 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner