5, ఏప్రిల్ 2021, సోమవారం

కాలం వెంబడి కలం..48

        మేం హంట్స్విల్ వచ్చేసరికే సింధు కూడా అక్కడే ఉంది. మా ఊరి వాళ్ళు రజిత, నరేంద్ర, చైతన్య కూడా అక్కడే ఉన్నారు. నరేంద్రకి గాస్ స్టేషన్ లో జాబ్ విష్ణునే చూసాడు. చైతన్య నరేంద్ర వైఫ్. చైతన్య, రజిత, లత, విష్ణు ఇంకా మిగిలిన పిల్లలు అందరు MS చేస్తున్నారప్పుడు. H1B వీసాతో అమెరికా వచ్చినా స్టేటస్ ప్రోబ్లంతో స్టూడెంట్ వీసాకి కన్వర్ట్ అయినవాళ్ళు చాలామంది ఇలా. హంట్స్విల్ చాలా చిన్న ఊరే అయినా డాక్టర్లు చాలామంది ఉన్నారు. రెండు యూనివర్శిటీలు ఉన్నాయక్కడ. తెలుగు వాళ్ళు, ఇండియన్స్ ఎక్కువే. 
            కొన్ని రోజులు ఉష మాతోనే ఉంది. కాస్త బద్దకిస్ట్ అంతే. మా AMSOL ద్వారానే తనకి ప్రాజెక్ట్ ఇప్పించాను. మా ఆయన వచ్చిన ఇరవై రోజులకి అమ్మానాన్న, మా పెద్దోడు మౌర్య హంట్స్విల్ వచ్చారు. నేను కార్సన్ సిటీలో పని చేసినప్పటి  సంధ్య, శ్రీనివాస్ కాస్త మనీ కూడా హెల్ప్ చేసారు అమ్మావాళ్ళు రావడానికి. వాణి కూడా కొద్దిగా ఇచ్చింది. అమ్మావాళ్ళు వచ్చే ముందే ఉషకి ప్రాజెక్ట్ అట్లాంటాలో వచ్చింది. మా ఆయన, ఉష వెళ్ళారు అట్లాంటా అమ్మావాళ్ళను రిసీవ్ చేసుకోవడానికి. 
           అమ్మావాళ్ళకు వీసా మూడు నెలలకు ఇచ్చారు కదా, అమెరికా వచ్చినప్పుడు ఇమ్మిగ్రేషన్ లో వాళ్ళు, నాన్నను ఎన్ని రోజులుంటారని అడిగితే, నాన్న వీసా టైమ్ చెప్పారట. మీరు పర్మిషన్ ఇస్తే ఆరు నెలలు ఉండి వెళతామన్నారంట. I-94 మీద ఆరు నెలలు పర్మిషన్ ఇచ్చారు. 
          విష్ణు వాళ్ళు వెహికల్ బుక్ చేసుకుని అమ్మావాళ్ళను తీసుకురావడానికి వెళుతూ, నన్ను కూడా రమ్మంటే, నేనూ బయలుదేరాను వాళ్ళతో. ఏముంది వెంటనే వచ్చేయడమే కదా అని. హంట్స్విల్ నుండి అట్లాంటాకి మూడు గంటల ప్రయాణం. దారిలో ఏదో యాక్సిడెంట్ జరిగ ఎనిమిది గంటలు ట్రాఫిక్ జామ్ అయ్యింది. నాకేమెా అంతసేపు కార్ లో కష్టమనిపించింది నెలలు నిండటంతో. మెుత్తానికి అందరిని తీసుకుని ఇంటికి వచ్చాము. తర్వాత ఈయన విష్ణు వాళ్ళతో కొన్ని రోజులు పని చేస్తూ, చౌదరి గారి గాస్ స్టేషన్ లో జాయిన్ అయ్యాడు. పగలు చౌదరి గారి దగ్గర, నైట్ విష్ణు వాళ్ళు చేసే చోట చేసేవారు. మా అవసరాలకు విష్ణు కార్ వాడుకునేవారం. నాకు సి సెక్షన్ ఆగస్టు 15న చేస్తామన్నారు డాక్టర్ కాకాని. ఆవిడ తెలుగావిడే. విష్ణుకి తెలిసిన సీతక్కతో చెప్పించాడు. తర్వాత తెలిసిందేమిటంటే డాక్టర్ గారు చౌదరి గారి మేనమామ వైఫ్ అని. చాలా చక్కగా మాట్లాడేవారు డాక్టర్. బేబి బాగా పెరిగిపోవడంతో నైంత్ మంత్ రాగానే, అంటే 37 వారాలకే సి సెక్షన్ కి ప్లాన్ చేసారు. హెల్త్ ఇన్ష్యూరెన్స్ వాళ్ళకి కాల్ చేసి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసాను. డాక్టర్ కాకాని ఆగస్టు 15 కాదు, 14నే చేస్తాను, మార్నింగ్ 7 కంతా హాస్పిటల్ లో ఉండండి అన్నారు. సరేనని మేము పొద్దున్నే 7 కి వెళ్ళాము. అప్పటికే డాక్టర్ వెయిట్ చేస్తున్నారు. గబగబా నాకు సెలైన్ పెట్టడానికి నర్స్ నరం కోసం ట్రై చేస్తే దొరకలేదు. ఆ నీడిల్ తీసేసి, మరో చేతికి కాసేపు  ట్రై చేస్తే దొరికింది. ఈ లోపల ఈ చేతి నుండి కాస్త బ్లడ్ కారిపోతే, అమ్మ కంగారు పడింది. 
          నన్ను ఆపరేషన్ థియేటర్ కి తీసుకువెళ్ళారు. ఎనస్తీషియా ఇవ్వడానికి డాక్టర్ ఉన్నారు. టేబుల్ మీద కూర్చోమని, పూర్తిగా వంగమని, వెన్నుకి ఇంజక్షన్ చేసారు. ఎనస్తీషియా డాక్టర్ కాకుండా ఐదారుగురు ఉన్నారు నా బెడ్ చుట్టూ. సర్జరీ చేసినంత సేపూ, ఎనస్తీషియా డాక్టర్ నా తల దగ్గరే ఉన్నారు. మా కాకాని డాక్టర్ గారు మిగతావాళ్ళతో కబుర్లు చెప్తూనే, నాతో కూడా మాట్లాడుతూనే ఉన్నారు సర్జరీ జరిగినంతసేపు. కుట్లు వేస్తుంటే, నాకెందుకో పిన్ మెషిన్ తో పిన్ కొట్టినట్టనిపించింది. అది అనుమానం కాదు నిజమేనని అర్థం అయ్యింది వెంటనే. 
        బాబు బావున్నాడు అని డాక్టర్ చెప్పగానే జుట్టు బాగా ఉందా అని అడిగాను. డాక్టర్ నవ్వి ఎందుకలా అడిగావంటే, మా అమ్మకు ఇష్టమండి అన్నాను. 
అమెరికాలో సర్జరీ చేసేటప్పుడు పేషెంట్ తోపాటు మరొకరు ఉండవచ్చు. కావాలంటే సర్జరీ జరిగేటప్పుడు వీడియో కూడా తీసుకోవచ్చు. నాన్నని రూమ్ లో ఉండమంటే తనవల్ల కాదన్నారు. ఈయనే సర్జరీ అంతసేపు ఉండి, సర్జరీ మెుత్తం వీడియెా తీసారు. బాబుని క్లీన్ చేసాక నాకు చూపించారు. అప్పుడు సిస్టర్ ముద్దు పెట్టుకుంటారా అని అడిగింది. వెంటనే తలూపాను. దగ్గరకు తీసుకురాగానే అమ్మ మెుదటి ముద్దు వాడికి అందింది. నన్ను వేరే రికవరి రూమ్ లో ఓ గంట ఉంచారు. తర్వాత నార్మల్ రూమ్ కి షిఫ్ట్ చేసారు. బాబుకి స్నానం చేయించి, తల దువ్వి మరీ తీసుకువచ్చారు సిస్టర్స్. సాయంత్రం విష్ణు, సింధు చూడటానికి వచ్చారు. ఫోటోలు తీసారు. గులాబీల బొకే కూడా తెచ్చారు. మరుసటి రోజు ఇంటికి పంపేస్తామన్నారు. ఆ రోజు నైట్ వళ్ళంతా బాగా దురద వచ్చింది నాకు. సిస్టర్స్ కి చెప్తే ఇంజక్షన్స్ ఏవో  చేసారు రెండు, మూడు సార్లు. మరుసటి రోజు పొద్దున్నే అమ్మావాళ్ళను ఇంటికి వెళ్ళి రమ్మన్నాను. నాన్న ఉన్నారు నా దగ్గర. బాబుని సిస్టర్స్ తీసుకువెళ్ళారు స్నానం చేయించడానికి. పిల్లలను కూడా పిల్లల డాక్టర్ వచ్చి చూస్తారు. మనం మన ఇన్ష్యూరెన్స్ ప్రొవైడర్ ని బట్టి పిల్లల డాక్టర్ ని సెలక్ట్ చేసుకోవాలి. తోటకూర ప్రసాద్ గారు మా బాబు డాక్టర్. పిల్లలు పుట్టిన తర్వాత హాస్పిటల్ లోనే వారికి సోషల్ సెక్యూరిటీ నంబర్ అప్లై చేయాలి. హాస్పిటల్ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్ లో పిల్లల ఫోటో అప్ లోడ్ చేస్తారు. ఫోటో తీసుకోవడానికి, సోషల్ సెక్యూరిటీ నంబర్ అప్లై చేయించడానికి అందరు ఒకేసారి కాస్త తేడాతో వచ్చారు. కాని నాకప్పటికే బాగా తేడాగా ఉంది. ఊపిరి అందడం లేదు. బాబుని స్నానం చేయించడానికి తీసుకువెళ్ళే సరికే నాకు బాలేదు. నాన్న కంగారు పడతారని, నిద్ర వస్తోంది, కాసేపు పడుకుంటాను. కంగారు పడకండని చెప్పాను. ఈ లోపల వీళ్ళంతా రావడం, నేను వాళ్ళు అడిగే వాటికి, నాకు ఊపిరి అందక సమాధానం చెప్పలేక పోవడం జరిగింది. నాకు తెలుస్తోంది ఆఖరి క్షణాలని. ఆ టైమ్ లో కూడా నేనయిపోతున్నానని కాకుండా.. పిల్లాడికి పాలు ఎలాగోలా పడతారు. ఇమ్మిగ్రేషన్ పేపర్స్ గురించి, ఇండియా వెళ్ళడం ఇవన్నీ పాపం వీళ్ళకు ఏం తెలియదు కదా. ఎలా వెళతారో ఇండియా అని ఆలోచించాను. 
అమెరికాలో హాస్పిటల్స్ లో బెడ్ కే ఎమర్జెన్సీ బటన్స్ ఉంటాయి. వెంటనే ఆ బటన్ ప్రెస్ చేసాను. సిస్టర్ కి నా కండిషన్ చెప్తుంటే..
ఇంతకు ముందెప్పుడయినా ఇలా జరిగిందా! అప్పుడే చేసారు? మీ వాళ్ళలో ఎవరికయినా ఇలా జరిగిందా అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంటే..నేనేమెా సమాధానం చెప్పలేని పరిస్థితి. నాన్న చెప్తుంటే వాళ్ళకు అర్థం కావడం లేదు. మన ఇంగ్లీష్ బ్రిటీష్ ఇంగ్లీష్. అమెరికా వాళ్ళకి పాపం అర్థం అవదు కదా. ఇలా కాదని నేను మా డాక్టర్ ఆఫీస్ కి ఫోన్ చేసాను. డాక్టర్ సర్జరీ లో ఉన్నారని చెప్పారు. నా కండిషన్ చెప్పి, డాక్టర్ కి ఇన్ఫామ్ చేయమని చెప్పాను. అదే టైమ్ లో బాబుని చూడటానికి పిల్లల డాక్టర్ తోటకూర గారు వచ్చారు. ఆయనకు డాక్టర్ కి చెప్పమని చెప్పాను. అప్పుడే ఇంటికి వెళ్ళిన అమ్మ, మా ఆయన, మౌర్య కూడా వచ్చారు. ఫోటోలు, సోషల్ సెక్యూరిటీ నంబర్ గురించి మిగతా వివరాలు తను చెప్పారు. 
            డాక్టర్ కి నా కండిషన్ తెలిసి, వెంటనే మెడికేషన్ గురించి, హాస్పిటల్ వాళ్ళకు చెప్తే, వాళ్ళు ఫాలో అయినట్లున్నారు. మెడిసిన్స్ నేను హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన ఫుడ్ తినకుండా వేసుకున్నాను. అది అంత పని చేసినట్లుంది. చావు వరకు తీసుకువెళ్ళింది. అన్ కాంషియస్ కండిషన్ నుండి ఆ సాయంత్రానికి కాస్త ఊపిరి వచ్చింది. మరుసటి రోజు మధ్యాహ్నానికి ఇంటికి పంపారు.


   " అనుకోని సంఘటనలకు అలవాటు పడటం జీవితంలో ఓ భాగమే. "

వచ్చే వారం మరిన్ని కబుర్లతో...


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner