26, ఏప్రిల్ 2021, సోమవారం

కాలం వెంబడి కలం...51

            ఓ నెల రోజులు మరో ప్రాజెక్ట్ ఇంట్లో నుండి వర్క్ చేసాను. గ్రీన్ కార్డ్ కోసం కంపెనీ వాళ్ళు అప్లై చేసిన నా లేబర్ అప్రూవ్ అయ్యిందని చెప్పారు. ఈ లోపల H1B మరోసారి రెన్యువల్ చేయించుకోవాల్సి వచ్చింది. H1B రెన్యువల్ అయ్యింది. అమెరికాలో ఎప్పటికప్పుడు ఇమ్మిగ్రేషన్ రూల్స్ మారుతూ ఉంటాయి. అప్పట్లో పోస్ట్ లో H1B వీసా స్టాంపిగ్ కి పంపడం అదే ఆఖరుసారి. వీసా స్టాంపిగ్ కి పంపించాను, కాని వీసా స్టాంపిగ్ అవలేదు. అవుటాఫ్ కంట్రీ వెళ్ళమని వచ్చింది. అప్పటికే కొందరికి బయట కంట్రీస్ కి వెళ్ళడం మూలంగా వీసా స్టాంపిగ్ కాకపోవడము, హోమ్ కంట్రీ వెళ్ళమనడము జరుగుతోంది. కొందరికి మెక్సికో, కెనడాలలో వీసా స్టాంపిగ్ అవుతోంది. మా పెద్దోడు మౌర్యని వీసా స్టాంపిగ్ కోసం ఇండియాలో మద్రాస్ లో అమెరికన్ కన్సోలేట్ కి రెండుసార్లు పంపిస్తే అవలేదు. ఎవరితో పంపిస్తారంటే మా నాన్న తెలిసిన వారితో పంపిస్తామని చెప్పారట. అందుకు రిజెక్ట్ చేసారు. రెండవసారి వాళ్ళ పేరెంట్స్ ని వచ్చి తీసుకువెళ్ళమని చెప్పారట. 
      అందరు మెక్సికో, కెనడా వీసా స్టాంపిగ్ కి వెళుతున్నారు కదా అని నేను మెక్సికో వెళడానికి అపాయింట్మెంట్ బుక్ చేసాను. తీరా పాస్పోర్ట్ చూస్తే 5,6 నెలలే ఉంది ఎక్స్పైర్ కావడానికి. వెంటనే అపాయిట్మెంట్ కాన్సిల్ చేసి, పాస్పోర్ట్ రెన్యువల్ కి అమెరికాలో హ్యూస్టన్ లోని ఇండియన్ ఎంబసికి పంపాను. పాస్పోర్ట్ రెన్యువల్ కి చాలా టైమ్ తీసుకున్నారు మనవాళ్ళు. 
            మా చిన్నాడపడుచుకి AMSOL లో పనిచేసే అతనితో పెళ్ళి చేసాం కదా. ఆమెకు అతనికి కుదరలేదు. ఆమె అమెరికా వచ్చిన తర్వాత కూడా ఇద్దరికి కుదరలేదు. మా వాళ్ళు ఎవరు ఏమి మాకు చెప్పలేదు. అతనే చెప్పేవాడు విషయాలు. శౌర్య పుట్టినప్పుడు కూడా ఫోటో చూడటానికి కూడా ఆవిడ ఇష్టపడలేదని కూడ చెప్పాడు. నాకు అంత హెల్త్ ప్రోబ్లం అయినా ఈయన వైపు వారు ఎవరు కనీసం ఓ ఫోన్ కూడా చేయలేదు. వాళ్ళ అవసరాలకు మాత్రం డబ్బులు బానే తీసుకున్నారు. డబ్బులు పనికివచ్చాయి కాని మనుషులు పనికిరాలేదు. శౌర్యకి కాకానిలో అన్నం పెట్టినప్పుడు కూడా అందరికి ఫోన్ చేసి రమ్మని చెప్పినా ఎవరూ రాలేదు. వీళ్ళిద్దరికి బాగా గొడవ ఎక్కువైంది. మా AMSOL CEO సుబ్బరాజు ఇందుకూరి కూడా చాలా చెప్పి చూసారు ఆవిడకి. వినలేదు. ఆఖరికి మా పెద్దాడపడుచు ఈయనకి చెప్పిందేమెా, ఆ పిల్లను మా ఇంటికి రమ్మని టికెట్ బుక్ చేసాము. అప్పటికే నన్ను చాలా మాటలు అని ఉంది. అయినా అవేం  పట్టించుకోలేదు నేను. ఆ అబ్బాయికి గ్రీన్ కార్డ్ ప్రాసెస్ లో ఉంది. ఓ నెల రోజులు మా ఇంట్లో ఉంచుకున్నాం. ఎన్ని రకాలుగా చెప్పినా వినలేదు. అప్పటికే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మకు బాలేదు కాన్సర్. నేను శౌర్యని ఇండియాలో వదిలిపెట్టడానికి వెళ్ళినప్పుడు ఆవిడను చూసి వచ్చాను. ఇద్దరు డైవోర్స్ కి అప్లై చేయడానికి ఇండియా వెళతామన్నారు. ఈ పిల్లను తీసుకుని న్యూజెర్సీ వెళ్ళి, ఇద్దరిని ఇండియాకి ఫ్లైట్ ఎక్కించి నేను హంట్స్విల్ వచ్చేసాను. 
                 వెంటనే నాకు రాచెస్టర్ మినిసోటా లోని మేయెా క్లినిక్ లో ప్రాజెక్ట్ Allied Informatics ద్వారా వచ్చింది. ఈ అలైడ్ ఇన్ఫర్మాటిక్స్ CEO క్రిష్ మామగారు పూర్ణచంద్రరావు మద్రాస్ లో కంపెనీ పెట్టి ట్రైనింగ్ ఇచ్చి H1B వీసా ప్రాసెస్ చేసేవారు. నేను అమెరికా రాకముందు దీనిలో పని చేసాను. నేను ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళను సెలక్ట్ చేసి నన్ను అమెరికా వెళ్ళడానికి పనికిరానన్నాడు. మా AMSOL వాళ్ళు అలైడ్ వాళ్ళతో పని చేయడానికి ఇష్టపడలేదు పేమెంట్ సరిగా ఇవ్వరని. నేను నచ్చజెప్పి ఈ ప్రాజెక్ట్ కి వచ్చాను. ఓ వారం హోటల్ లో ఉండి, తర్వాత వేరే అమ్మాయితో రూమ్ షేర్ చేసుకున్నాను. ఆ టైమ్ లో వింటర్. కంపెని బస్ కోసం కాస్త దూరం నడవాలి సబ్ వే లో. బోలెడు ట్యూలిప్స్ పువ్వులు రంగురంగులలో దారంతా ఉండేవి. చూడటానికి భలే అందంగా ఉండేది నాకయితే. ఉగాది అక్కడి ఇండియన్స్ అందరు కలిసి చాలా బాగా చేసారు. తలా ఓ వంటకం చేసారు. నేనూ పచ్చిమిరపకాయి బజ్జీలు వేసి తీసుకెళ్ళాను. అందరు మెచ్చుకున్నారు కూడా. వంట ఎలా ఉన్నా మనం నొచ్చుకోకుండా మెచ్చుకోవడం అక్కడి మనవారి సంస్కారం. పాటలు, డాన్సులు, స్కిట్స్ లతో ప్రోగ్రామ్ బాగా జరిగింది. ఆ రాత్రి బౌలింగ్ కి కూడా వెళ్ళాము. ఆ టైమ్ లోనే " జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది " పాట కార్ లో వినడము, నాకు బాగా నచ్చడమూ జరిగిపోయింది. ఆ పాట ఏ సినిమాలోదో కూడా తెలియదు. ఓ రెండు నెలలు ఆ ప్రాజెక్ట్ జరిగింది. తర్వాత ఫ్రెండ్ శాం రాచెస్టర్ వస్తే తనతో డెట్రాయిట్ వచ్చి, వాళ్ళ ఫ్రెండ్ కెనడా నుండి వస్తే తనని కలిసి, జాబ్ గురించి మాట్లాడి మళ్ళీ హంట్స్విల్ వచ్చేసాను. తర్వాత కొన్ని రోజులు డెట్రాయిట్ కి దగ్గరలో క్విక్ స్టార్ లో ఓ ప్రాజెక్ట్ చేసాను. క్విక్ స్టార్ నుండి వచ్చేటప్పుడు వీకెండ్ అక్కడి ప్రాజెక్ట్ మేట్స్ శ్రీలక్ష్మి మరి కొందరితో కలిసి చికాగో వచ్చాను. అతడు సినిమా చూడటానికి. మెుదటిసారి అమెరికాలో తెలుగు సినిమా చూసేసాను. అప్పటికే ఆంధ్రావిలాస్ డాట్ కాం లో రివ్యూ చదివి అంత బాగుండదేమెా అన్న అనుమానంతో వెళ్ళాము. రేటింగ్ 3 ఇచ్చారు సదరు వెబ్ సైట్ వారు. సినిమా నుండి బయటకు వచ్చేటప్పడు ఏ ఒక్కరి నోటి నుండి కూడా సినిమా బాలేదు అన్న మాట లేదు. అప్పటి నుండే అందరూ ఆ వెబ్ సైట్ రివ్యూలను నమ్మడం మానేసారు. వారు ఓన్లీ మెగా ఫామిలీ అభిమానులని తెలియడంతో. 
       శ్రీలక్ష్మి వాళ్ళ బ్రదర్ వాళ్ళింట్లో ఉన్నాము. నా ఫ్రెండ్ శిరీష వాళ్ళు ఉండేది ఆ పక్కనే అపార్ట్మెంట్స్ లో. తనకి ఫోన్ చేసి వెళ్ళి కలిసాను. అశ్విన్,  వాళ్ళావిడా నన్ను కలవడానికి చికాగో వచ్చివెళ్ళారు. మేమంతా దీవాన్ స్ట్రీట్ కి షాపింగ్ కి వెళ్ళామందరం. నేను ఓ నక్లెస్ పచ్చలు, కెంపులతో ఉన్నది 900 పెట్టి తీసుకున్నాను మా ఆయన అనుమతితోనే. కాని నాకు బాగా డైమండ్స్, పచ్చలతో ఉన్న నక్లెస్ బాగా నచ్చింది. 2800ల డాలర్లు చెప్పారు. ఈయనకు చెప్తే నీ ఇష్టం ఏది నచ్చితే అది తీసుకో అన్నారు. నాకే ప్రాణం ఒప్పక 900ల డాలర్ల నక్లెస్, మిగతావి పచ్చలు, కెంపుల స్ట్రింగ్స్ 300ల డాలర్లవి తీసుకున్నాను. శ్రీలక్ష్మి వాళ్ళ మరదలు నేను నక్లెస్ కొంటానని అనుకోలేదట. నిజమే మరి నాకు సహజంగా ఆడవారికుండే షాపింగ్ ఇష్టాలుండవు. అందుకే తనలా అనుకుని ఉండవచ్చు. 
      ఈ లోపల లేబర్ అప్రూవ్ అయ్యాక, గ్రీన్ కార్డ్ లో నెక్స్ట్ ప్రాసెస్ I 140 కి ఫైల్ చేసారు. 
కొసమెరుపేమిటంటే " అమెరికా వెళ్ళడానికే పనికిరానన్న వాళ్ళతోనే ఓ ప్రాజెక్ట్ అదీ పెద్ద పేరున్న Mayo Clinic తో పని చేయడం, మా వాళ్ళు  భయపడినట్లే అలైడ్ వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే వెంటపడి అడిగి మరీ ఇప్పించడం " అన్నమాట. 
    
      "  ప్రతి పని మనకు రావాలనేం లేదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించడమే తెలివైన వారి లక్షణం. "


వచ్చే వారం మరిన్ని కబుర్లతో.... 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner