14, జూన్ 2021, సోమవారం

కాలం వెంబడి కలం... 58

      మా మరిది గారి కుటుంబం అలా మమ్మల్ని వారి అవసరాలకు వాడుకుని, పెట్టాల్సిన గొడవలు పెట్టేసి,  నాలుగు నెలల తర్వాత, ఆవిడకి జాబ్ వచ్చిందని వేరే ఊరు వెళ్ళారు. శౌర్యని స్కూల్లో జాయిన్ చేద్దామని ఫీజ్ కట్టాను. నా ఇంటికి వచ్చి చాలా మంది ఉండి వెళ్ళారు కాని, ఇంత దరిద్రపు పాదాలు ఎవరివి లేవు. 
           గ్రీన్ కార్డ్ ప్రాసెస్లో I 485 అయితే వచ్చింది కాని I 140 ఇంకా క్లియర్ కాలేదని, మా AMSOL కంపెనీ లాయర్ జెన్నిఫర్ కు అప్పుడప్పుడూ కాల్ చేసేదాన్ని. ఇమ్మిగ్రేషన్ సైట్ లో స్టేటస్ చెక్ చేసుకుంటూ ఉండేదాన్ని. తెలిసినవాళ్ళ ద్వారా పరిచయమైన తమ్మడు శ్యాం అమెరికా వచ్చాడు. ఉండటానికి హెల్ప్ కావాలంటే, నేను మద్రాస్ అలైడ్ ఇన్ఫర్మాటిక్స్ లో ట్రైనింగ్ ఇచ్చిన సతీష్ కి ఫోన్ చేసి చెబితే తనతో ఉంచుకున్నాడు. నేను చికాగోలో రామస్వామి దగ్గర చేసినప్పుడు తన వైఫ్ తో వచ్చి కలిసాడు సతీష్. శ్యాం హంట్స్విల్ వస్తాను టికెట్ బుక్ చేయక్కా, మనీ తర్వాత ఇస్తానంటే, బుక్ చేసాను. వాడు వచ్చి  రెండు రోజులుండి వెళ్ళాడు. 
వాడు వెళ్ళిన తర్వాత ఎందుకో ఇమ్మిగ్రేషన్ సైట్ లో I 140 స్టేటస్ చెక్ చేస్తే డినయల్ అయినట్లు వచ్చింది. వెంటనే లాయర్ జెన్నిఫర్ కి కాల్ చేసాను. I 140 డినయల్ అయితే ఆటోమేటిక్ గా I 485 కూడా కాన్సిల్ అవుతుంది. I 140  డినయల్ పై మళ్ళీ అప్లై చేయవచ్చు. కాని ఈసారి కూడా డినయల్ అయితే మీకు ఇమ్మిగ్రేషన్ స్టేటస్ ఉండదు. ఇల్లీగల్ అవుతారు. అందుకని ఇండియా వెళ్ళిరావడం కరక్ట్ అని చెప్పింది. 
          AMSOL బాలా ఇటికిరాల కి కాల్ చేసి విషయం చెప్తే ఏమి మాట్లాడకుండా, రాజుతో మాట్లాడండి అని చెప్పి ఫోన్ పెట్టేసాడు. మా AMSOL ECO సుబ్బరాజు ఇందుకూరి కి కాల్ చేసాను. తను వెంటనే I 140 రి ఓపెన్ చేయించమంటే చేయిస్తాను. లేదా మీరు ఇండియా వెళతానంటే, మళ్ళీ H1B చేసి అమెరికా తీసుకువస్తాను. ఇండియాలో AMSOL లో వర్క్ చేయండి అప్పటివరకు మీకు ఇష్టమైతే అని చెప్తే, సరే ఇండియా వెళతాను, కాకపోతే L1 చేయండి H1B వద్దు అని అంటే సరేనన్నారు. ఇండియా లో అరి కేసరి చూసుకుంటున్నాడు. తను ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు. మీరు కాల్ చేసి మాట్లాడండి అని చెప్పారు. అరి కేసరికి కాల్ చేసాను. ఇండియా వచ్చాక కలవమని చెప్పారు. 
          క్రెడిట్ కార్డ్స్ లో కాస్త కాస్త డబ్బులు తీసి ఇండియా పంపాను. కొన్ని కార్డ్స్ డబ్బులు తీయడానికి రావు. అవి మధు వాళ్ళకు పంపమంటే పంపాను. వాళ్ళు నాకో కెమెరా కొన్నారు. ఇంకా ఎవరెవరు ఎంత తీసుకున్నారన్నది తిన్న వాళ్ళకు తెలుసు. పైనుండి చూసిన భగవంతునికి తెలుసు. షాపింగ్ అంటూ పెద్దగా ఏం చేయలేదు. నాకు శౌర్యకి ఇండియాకి టికెట్స్ ఆన్ లైన్ లో బుక్ చేసాను. సుబ్బరాజుని,  బాలా ఇటికిరాలని ఏమైనా పేపర్స్ కావాలేమెా అని అడిగితే ఏం అవసరం లేదని చెప్పారు. హంట్స్విల్ నుండి హ్యూస్టన్ కి, అక్కడి నుండి ఇండియా కి. మధ్య లో లండన్ లో మారాలి. 
        అప్పటికే ఈయన తమ్ముడు, మరదలి మూలంగా గొడవలు బాగానే అయ్యాయిగా మా మధ్యన. అందుకని ఈయన దేనికి ఓ డాలర్ కూడా నాకు ఇవ్వలేదు. శౌర్యని మా చేతులకు ముద్దుగా అందించిన మా కాకాని డాక్టర్ గారు, మేం ఇండియా వెళుతున్నామని తెలిసి భోజనానికి రమ్మని పిలిచారు. ఆవిడ బోలెడు బిజీ. అయినా కూడా ఓ రోజు సాయంత్రం అంతా మాతోనే స్పెండ్ చేసారు. శౌర్యతో బోలెడు కబుర్లు చెప్తూ, వాడితో బాగా ఆడుకున్నారు. భోజనం చేసి వచ్చేటప్పుడు శౌర్యకి బ్లాక్స్ తో ఆడుకోవడం ఇష్టమని బోలెడు బ్లాక్స్, రకరకాలగా బిల్డ్ చేయడానికి, క్రియేటివిటి పెరగడానికి అన్నట్టుగా గిఫ్ట్ ఇచ్చారు. ఇంకా ప్రసాద్ అంకుల్ వాళ్ళు, సీతక్కా వాళ్ళు కూడా ఇంటికి రమ్మని పిలిచారు. ప్రసాద్ అంకుల్ వాళ్ళింటికి వెళ్ళాను కాని సీతక్క వాళ్ళింటికి వెళ్ళడానికి కుదరలేదు. అది అక్కకి నా మీద కోపం వచ్చేటట్లు చేసిందనుకుంటా. తర్వాత నేను ఇండియా నుండి చాలాసార్లు కాల్ చేసినా కాస్త పుల్లవిరుపుగా మాట్లాడింది. నేనూ ఇష్టం లేనప్పుడు డిస్ట్రబ్ చేయడం ఎందుకులే అని కాల్ చేయడం మానేసాను.
           అప్పటి వరకు తమ తమ అవసరాలకు మనల్ని వాడుకున్న వారంతా మెల్లగా మెుహం చాటేయడం, అప్పటి వరకు వారు మన మీద చూపిన కన్సర్న్ అంతా నాటకమని తెలియడానికి ఎక్కువ రోజులేం పట్టలేదు. ఇండియా రాగానే ఎవరేంటి అన్నది బాగా అర్థం అయ్యింది. వినయ్ గారు ఎయిర్ పోర్ట్ కి వెళ్ళే వరకు కాల్ చేసి మాట్లాడారు కాని ఆ తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు మాట కూడా లేదు. సంధ్యా, శ్రీనివాస్ లకు కూడా నేనే కాల్ చేసేదాన్ని. తర్వాత తర్వాత వారూ బిజీ అయిపోయారు. మనల్ని మర్చిపోయారు. వారు  ఇండియా వచ్చినప్పుడు ఫంక్షన్ కి పిలిస్తే నాకు వెళ్ళడానికి కుదరలేదు. అది వారి కోపానికి కారణమేమెా. అవసరానికి మలేషియాలో ఉన్నప్పుడు పదివేలు పంపమన్న పెద్దమనిషితో సహా..తర్వాత అమెరికా వచ్చి కూడా..ఇలా అమెరికాలో అందరు మెుత్తానికి మనల్ని   మర్చిపోయారన్న మాట.  
        తెల్లవారు ఝామునే రెండింటికే లేచి అన్ని సర్దుకుని హంట్స్విల్ ఎయిర్ పోర్ట్ కి నేను, శౌర్య మాతోపాటు రాజేష్, రాజు, మా ఆయన ముగ్గురు హంట్స్విల్ ఎయిర్ పోర్ట్ లో డ్రాప్ చేయడానికి వచ్చారు. వారి టాప్ మర్చిపోతే ఈయన వెళ్ళి తీసుకువచ్చాడు. పర్మిషన్ తీసుకుని గేట్ వరకు వచ్చారు. నా దగ్గర రూపాయి అదేలెండి డాలర్ కూడా ఉండదని తెలిసికూడా మా ఆయన పిల్లాడితో బయలుదేరినా ఒక్క డాలర్ కూడా ఇవ్వలేదు. రాజేష్ ఎయిర్ పోర్ట్ లో 200/300 డాలర్లు తీసి ఇచ్చాడు. హ్యూస్టన్ ఎయిర్ పోర్ట్ లో లగేజ్ చెక్ ఇన్ చేసి, బోర్డింగ్ పాస్ తీసుకున్నాను. ఫ్లైట్ ఎక్కడానికి గేట్ దగ్గరకి వెళితే, మారిన ఇమ్మిగ్రేషన్ రూల్స్ ప్రకారం లండన్ లో ఫ్లైట్ మారాలంటే నాకు లండన్/అమెరికా వీసా ఉండాలట. కావాలంటే హంట్స్విల్ పంపేస్తాము. లండన్ వీసా పర్మిషన్ తీసుకుని, మళ్లీ టికెట్ బుక్ చేసుకోండి అని చెప్పారు. లండన్ వైపు నుండి కాకుండా వేరే వైపు నుండి ఇండియా వెళితే వీసా అవసరం లేదు. నాకేం చేయాలో తెలియలేదు. పిల్లాడిని తెల్లవారు ఝామున లేపాను. పాపం వాడికి తిండి లేదు. వాడు ఒకటే ఏడుపు. నేనేమెా మళ్లీ లగేజ్ అంతా తీసుకోవాలి. ఏం చేయాలో తెలియక సుబ్బరాజుకి కాల్ చేసాను. ఫోన్ లో ఛార్జ్ కూడా లేదు. అంతమంది ఎయిర్ పోర్ట్ లో ఉన్నా ఎవరి దారి వారిదే. పాపం ఎవరో మళయాళీ అతను వాళ్ళ అమ్మను ఫ్లైట్ ఎక్కించడానికి వచ్చాడు. ఏమైందని నా దగ్గరకు వచ్చాడు. విషయం చెప్పాను. తన ఫోన్ తోనే సుబ్బరాజుతో మాట్లాడాను. మరుసటిరోజు కి టికెట్స్ బుక్ చేస్తానని చెప్పి, హోటల్ లో ఉండమన్నారు. లగేజ్ చాలా ఉంది. మళయాళీ అతనిది పెద్ద కార్. అతనే హోటల్ కి తీసుకువెళ్ళాడు. శౌర్యకి, నాకు కూడా బాగా ఆకలి వేస్తోంది. తినడానికి ఏమైనా తెమ్మంటే, పాపం తనకి కూడా తెచ్చుకుని, మాతోపాటే తిని, వాటికి డబ్బులు ఇవ్వబోతే కూడా తీసుకోలేదు. నిజంగా దేవుడు పంపినట్టు వచ్చి చాలా హెల్ప్ చేసాడు. ఎప్పటికి మర్చిపోలేను ఆ సాయాన్ని. మధు, సంధ్య వాళ్ళు కూడా ఫోన్ లో మాట్లాడారు. అప్పుడు వాళ్ళు డాలస్ లో ఉంటున్నారు. మరుసటి రోజు ఇండియా బయలుదేరాము. ఇండియా వచ్చాక సాయం పొందిన వారెవరూ కనీసం కాల్ చేయలేదు. 
           నా అమెరికా జీవితం ఇలా గడిచింది. అందరిది ఇలానే ఉండాలని లేదు. కాకపోతే మెాసం చేయడం అనేది ఎక్కడైనా ఉంటుంది. అవసరాల కోసం నమ్మించి మెాసం చేసేవారు ఎక్కడైనా ఉంటారు. మనవారు అని నమ్మితే నట్టేట్లో ముంచుతారు. చాతనైనంత వరకు  జాగ్రత్తగా ఉండటమే మనం చేయగలిగింది. కొత్తగా అమెరికా వెళ్ళేవాళ్ళకు  అమెరికా భూతల స్వర్గమేమి కాదు, కష్టసుఖాలు రెండూ ఉంటాయని చెప్పడానికే ఈ నా అనుభవాలను మీతో పంచుకున్నాను. 
నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆంంధ్రాప్రవాసి డాట్ కాం వారికి, ఇంత విపులంగా రాయించిన రాజశేఖర్ చప్పిడి గారికి, కవితాలయానికి, మీ ఇంటి మనిషిగా భావించి నా రాతలను చదివి ఆదరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.

"   జీవితాన్ని గెలవడానికి, ఓడిపోవడానికి మధ్యన సన్నని తెర అనుబంధం. ఆ విలువ తెలుసుకోగలిగితే ప్రతి ఒక్కరూ విజేతే. "

వచ్చే వారం మరిన్ని కబుర్లతో.... 

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

citizen చెప్పారు...

మీ గ్రీన్ కార్డ్ ఎందుకు తిరస్కరించబడిందో తెలుసా?
తిరస్కరణకు కారణం ఇమ్మిగ్రేషన్ విభాగం/Visa department చెబుతుందా?
అలాగే, మీరు భారతదేశానికి వచ్చిన తర్వాత ఎందుకు USA కి తిరిగి వెళ్ళలేదు మాకు తెలియజేయండి.
ధన్యవాదాలు

చెప్పాలంటే...... చెప్పారు...

I 140 డినయల్ అవడం అనేది కంపెనీకి సంబంధించినది. ఓ సంవత్సరం ఆది వెళదామనుకపన్నాను. కాని కంపెనీ వారు చేసిన మెాసం వలన తిరిగి వెళ్లలేకపోయాను. నాకూ అంత ఇంట్రస్ట్ లేదు. అందుకే వదిలేసాను. హైదరాబాదు కంపెనీలో జనాల గురించి తర్వాత వాటిలో చెప్తాను. ఎవరిని వదలనుగా...ధన్యవాదాలు అండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner