22, జూన్ 2021, మంగళవారం

హేమంత తుషారాలు సమీక్ష..!!

 " మనసును సేదదీర్చే హేమంత తుషారాలు "

       తెలుగు సాహిత్య ప్రక్రియల్లో తెలుగు గజల్ ది ఓ ప్రత్యేక స్థానం. గజల్ రాయడానికి భాష మీద పట్టు, గజల్ లక్షణాలన్నీ తెలిసుండాలి. ఓ విధంగా చూస్తే ఇది కాస్త క్లిష్టమైన ప్రక్రియే. సాధారణంగా ప్రేయసి కోసం విరహాన్ని చూపించే లక్షణం గజల్ అని, మగవారు మాత్రమే రాయగలిగినదని చాలా అపోహలుండేవి పూర్వం. ఇప్పటి కవులు, కవయిత్రులు సమకాలీన సమాజంలోని సమస్యల చుట్టూ కవితల్లానే గజళ్ళు కూడా అలవోకగా రాసేస్తున్నారు. ముఖ పుస్తకంలోను, వివిధ పత్రికల ద్వారా ఎన్నో గజళ్ళు అందించిన వారిలో డా. శ్యామల గడ్డం గారిది ఓ ప్రత్యేకమైన శైలి. వీరి రెండవ గజల్ సంపుటి హేమంత తుషారాలు. స్వతహాగానే తెలుగు భాషపై మక్కువతో, తన ఉన్నత విద్యను కూడా రంగరించి రాసిన ఈ గజళ్ళు  సౌందర్య, విషాదాలను సమపాళ్ళలో మనకు అందిస్తాయి.   
            విరహమూ తీయని వేదనే అని అన్నట్టుగా చాలా గజళ్ళలో ప్రేమ, విరహం, వేదన, నివేదనా, ఆర్తి, ఆలాపనా, కోరికలు, పులకింతలు, తుళ్ళింతలు, నిరీక్షణలు ఇలాంటి సున్నితమైన భావాలు ఈ హేమంత తుషారాలు లో మనకు కనిపిస్తాయి. డా. శ్యామల గడ్డం గారు వాడిన పద  వాక్య ప్రయెాగాలతో గజల్ కవయిత్రికి భాష పై గల పట్టు కూడా మనకు తెలుస్తుంది. సామాజిక, సమకాలీన సమస్యలపై తనదైన శైలిలో చక్కని గజళ్ళు చాలానే రాశారు. చినుకులను, మేఘాలను, ప్రకృతిని చూసి పరవశించడమే కాకుండా, చిరునవ్వుల సందడిని, దేశభక్తిని, సైనికుల త్యాగాలను, అమ్మానాన్నల ప్రేమను, బాల్యాన్ని, శిశుతనాన్ని, పసి(డి)తనాన్ని, పండు వెన్నెలను, నిశిరాతిరిని, కలలను, కల్లోలాలను, మనసును, మౌనాన్ని, మెాహాన్ని, మెాసాన్ని, అతివల అగచాట్లను, ఆడపిల్ల ఆశలను, కరోనా కష్టాలను, మంచిని, మానవత్వాన్ని, సమాజ శ్రేయస్సును కాంక్షించే ఓ బాధ్యత కలిగిన పౌరురాలిగా ఎన్నో సమస్యలను తన గజళ్ళ ద్వారా అందరికి నివేదించారు. రైతు కడగండ్లను, అప్పుల ఈతిబాధలను అద్భుతంగా వినిపించారు. శ్రామికుల శ్రమ వేదాన్ని, వైద్యుల గురించి, చదువుల సంగతులు, ఆనవాళ్ళను, అనుబంధాలను,అక్షర నివాళిని కూడా అందంగా చూపించారు. ఈ పుస్తకంలో అన్నీ వెరసి ఓ జీవితపు పుస్తకంలో పుటలన్నీ తెరిచి చూపించారనడంలో అతిశయెాక్తి ఏమీ లేదు. 
 "  వరమీయని దేవునితో పంతమేల  ఓ శ్యామల!
   జీవితమే ఒక ఆటే. గెలుపు వలపుల వాకిళ్ళు..! "
ఎంత బాగా చెప్పారో చూడండి జీవితంలో గెలుపుని. 
          చక్కని పదబంధాలతో చదువరులకు ఆనందాన్ని పంచే అంశాలతో, అక్కడక్కడా తన భాషా పఠిమను చూపుతూ, అలతి పదాలతో జీవిత పరమార్థాన్ని తెలుపుతూ, మంచిని, మానవత్వాన్ని,సమతను, మమతను చాటి చెప్పే గజల్ గేయాలను హేమంత తుషారాలు గజల్ సంపుటితో అందించిన సాహిత్య, సంగీత కళామతల్లి ముద్దుబిడ్డ, ఎన్నో కథలు, కవితలు, నవలలు రచించి ఎన్నో పురస్కారాలను అందుకున్న ప్రతిభావంతురాలు, తమ వంతుగా సాహిత్య పురస్కారాలతో ప్రతిభావంతులకు కొమర్రాజు ఫౌండేషన్ ద్వారా  పట్టం గడుతూ, సాహితీ సేవలు అందిస్తున్న డా. శ్యామల గడ్డం గారికి హృదయపూర్వక అభినందనలు. 


మంజు యనమదల 
విజయవాడ. 
                 
      
      

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner