6, సెప్టెంబర్ 2021, సోమవారం

కాలం వెంబడి కలం..70


    బయటికి బావుందని ఇల్లు మారాం కాని, ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుండి ఇబ్బందులు బాగా ఎక్కువైయ్యాయి. పాతింట్లో ఉండగా డబ్బులకు అస్సలు ఇబ్బంది పడలేదు ఎప్పుడూ. ఈ ఇంటికి వచ్చాక 50 రూపాయలకు కూడా ఇబ్బంది పడినవరోజులున్నాయి. ఆరోగ్యం కూడా చాలా పాడయ్యింది. మానసిక ప్రశాంతత లేదు. చాలామంది ఇల్లు మారమని చెప్పినా కూడా నేను వినలేదు. మా పిన్ని వాళ్ళు వాళ్ళబ్బాయి పెళ్లిలో పిల్లలకు బట్టలిస్తామంటే, ఈయన అప్పుడేం అనకుండా తర్వాత వద్దంటే, మా ఇంట్లోనే చేద్దామని అన్ని రడీ చేసుకుని, అందరికి చెప్పిన తర్వాత,  ఈయన పిల్లలకు పంచలు కట్టబెట్టనీయకుండా గొడవ పెట్టుకుని, అది జరగనివ్వలేదు. అప్పటి నుండి అది బుర్రలో బాగా ఉండిపోయిందనుకుంటా. తర్వాత కొన్ని నెలలకి నాకు ఫిట్స్ వచ్చి, ఓ 20 నిమిషాలు బ్రెయిన్ డెడ్ అయ్యింది. తర్వాత ఓ మూడు గంటలు మెలకువలోనే ఉన్నా జరిగినదేది నాకు తెలియదు. మా చెల్లెళ్ళు స్రవంతి, శిరీషలే జాగ్రత్తగా చూసుకున్నారు ఆ టైంలో. పిల్లలు, నేనే ఉన్నామప్పుడు. శౌర్య ఇంట్లోనే ఉన్నాడు ఆ టైమ్ లో. వాడే అందరిని పిలిచాడట. అప్పటి నుండి కాస్త మతిమరుపు కూడా వచ్చేసింది. అప్పటి నుండి ఓ మూడేళ్ళు విజయవాడ గోపాళం శివన్నారాయణ గారి దగ్గర మందులు వాడటం, మధ్యలో బాగా జుట్టంతా ఊడిపోయి, మనిషిని కూడా సన్నబడిపోవడంతో విజయ హాస్పిటల్ లో రమణారెడ్డి గారి దగ్గర చూపించడం, ANA టెస్ట్ పాజిటివ్ రావడం ఇవన్నీ జరిగిపోయాయి. 
       అప్పుడే మళ్ళీ జాబ్ లో జాయినవడం కాకతాళీయంగా జరిగింది. అప్పటికే మన రాతలు బ్లాగు నుండి ముఖపుస్తకానికి విస్తరించడం, సాహితీసేవ గ్రూప్ మీట్ అంతర్వేదిలో జరిగితే దానికి కంచర్ల సుబ్బానాయుడు గారు ఆహ్వానించడం, కవితల పోటిలో నేను ఓ న్యాయనిర్ణేతగా ఉండటం జరిగింది. మన తెలుగు మన సంస్కృతి, మనసంతా నువ్వే గ్రూపులకు నేనూ ఓ అడ్మిన్ గా చేయడం జరుగుతోంది అప్పటికే. నా పుట్టినరోజుకి అందరి శుభాకాంక్షలతో పాటుగా దినేష్ కూడా చెప్పడం, తర్వాత పలకరింపుల కబుర్లలో నాకు జాబ్ కావాలంటే, తను ఇస్తాననడం అనుకోకుండా జరిగిపోయింది. అది నైట్ షిప్ట్. సాహితీసేవ గ్రూప్ లో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించడం, దానికి మంచి పేరు రావడం కూడా జరిగింది. సాహితీసేవ గ్రూప్ లో తెలుగు సాహితీ ముచ్చట్లు పేరుతో ఓ శీర్షిక నిర్వహణ బాధ్యత నాపై పెట్టారు. దగ్గర దగ్గర 40 వారాల పాటు ఆ శీర్షిక కొనసాగింది. 
              విశ్వభారతిలో పని చేసే టీచర్ వాసవి గారు వేరే ఇంటికి మారిపోయారు. కొత్తగా వేరేేవాళ్ళు వచ్చారు పిల్లల చదువు కోసం. ఈవిడ వచ్చినప్పటి నుండి తేడానే. అన్నింటికి వాదులాట పెట్టుకునేది. ఇంటావిడకు కూడా మా మీద చాడీలు చెప్పడంతో, చెప్పుడు మాటలు బావుంటాయి కదా. ఆవిడ ఏదేదో మాట్లాడితే నేనూ ఊరుకోలేదు. నాకు బాలేనప్పుడు కూడా అందరు ఇంటి గురించి అంటే కూడా ఏమెా ఇల్లు బావుండబట్టే బతికానేమెా అని కూడా అన్నాను. అప్పటి నుండి ఇంటివాళ్ళు చాలా తేడాగా ప్రవర్తించేవారు. చాలా ఇబ్బంది పెట్టారు. అప్పటి వరకు మనం చేసినదంతా ఏదో వాళ్ళకి బాకీ ఉండి చేసినట్టుగా ఫీల్ అయ్యారు. నాకసలు వీళ్ళ గురించి తల్చుకోవడం కూడా ఇష్టం లేదు. నేను చాలా చోట్ల ఉన్నాను కాని ఇలాంటి వారిని మాత్రం ఎక్కడా చూడలేదు. అమెరికాలో కాలే దంపతులతోనూ, ఇక్కడ  వీళ్ళతోనూ అన్నమాట. ఇంతకీ ఇంటివారి పేరు చెప్పలేదు కదూ... స్కూటర్ (కొల్లి) పూర్ణ గారు. 
        తర్వాత పిల్లల చదువుల కోసం మళ్లీ విజయవాడ మా ఇంటికి వచ్చేయడం, నా రాతలు, ఆ రాతల్లో కొన్ని పుస్తకాలు వేయించుకోవడం జరిగింది. ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెట్టడంతో ఉద్యోగానికి విరామం, రాతలకు కాస్త విశ్రాంతిని ఇవ్వడం మెుదలైంది. ఎందరో సాహితీ పెద్దల పరిచయాలు, ముఖపుస్తక మిత్రుల పరిచయాలు, మంచి చెడులు జీవితంలో సమభాగాలుగా జరిగిపోయాయి. 

" మనిషికి సొమ్ము ఉండగానే సరిపోదు. వ్యక్తిత్వం ఉంటేనే మనిషికి గౌరవం వస్తుంది. రేపు మెాయడానికి నలుగురు వస్తారు. "

వచ్చే వారం మరిన్ని కబుర్లతో....

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner