30, డిసెంబర్ 2021, గురువారం

శిక్ష ఎవరికి..?

నేస్తం, 

      జీవితంలో ఒడిదుడుకులు రావడం సహజం. అలాగే నమ్మి మోసపోవడమూ సహజమే. అలా అని నమ్మకుండానూ వుండలేం. ఇలా నమ్మి డబ్బులు ఇచ్చో లేదా మధ్యన వుండి ఇప్పించిన పాపానికో తమ ఆస్తులు అమ్మి పెళ్ళాం బిడ్డలను రోడ్డున పడేసిన వారు కొందరైతే, కుటుంబంతో సహా ప్రాణాలు తీసుకున్న వారు ఎందరో. అప్పు ఇచ్చిన వారు, తీసుకున్న వారు ఇద్దరు బానే వున్నారు. మధ్యలో నాశనమైంది మరో కుటుంబం. 

     దొరికిన చోటల్లా అప్పులు తెచ్చి పెళ్ళాం బిడ్డలకు ఏ లోటు లేకుండా చేసి చచ్చే వెధవలు కొందరు. రాజకీయ కక్షలతో హత్య గావించబడేవారు మరి కొందరు. వీరికి అప్పు ఇచ్చినవారు, ఇప్పించినవారు  రోడ్డున పడ్డారు. వీరి పెళ్ళాం మాత్రం హాయిగా మూడు కోట్లతో గవర్నమెంటు ఉద్యోగం చేసుకుంటోంది. మరి కొందరేమో చాలా తెలివిగా కమీషన్ తీసుకుని అటు వారిని ఇటు వారిని వెధవలను చేసి, వీరు మాత్రం చాలా హాపిగా హాలిడే ట్రిప్ కి విదేశాలు తిరుగుతూ బతికేస్తుంటారు, తమకేం సంబంధం లేనట్టుగా. మనం ఎటు చూసుకున్నా నష్టపోతోంది మధ్యలోని వారే. 

        ఇంట్లో పెళ్ళాం బిడ్డల అవసరాలు పట్టవు గాని ప్రజా సేవకులు కొందరు. ప్రపంచం తమని మంచి ఉత్తముడిగా గుర్తించాలన్న ఆరాటం వీరిది. కుటుంబం తిండి ఖర్చులు లెక్కలు వేసుకుంటారు కాని తాము తగలేసే పుణ్యకార్యాలకు(పేకాట, తిరుగుళ్ళు, తాగుబోతులకు, చావులకు, దినవారాలకు వగైరా..)ఎంత ఖర్చు అయ్యిందో తెలియని అమాయకులు పాపం. ఎక్కడెక్కడ తిరిగేది, ఎవరికెంత తగలేసింది ఇలాంటివన్నీ గుట్టే. కొందరు పెద్ద మనుష్యులేమో ఆడపిల్లకు పెట్టాల్సింది పోయి తరతరాల నుండి ఆడపిల్లల సొమ్ము తిని బతికేస్తూ నీతులు మాత్రం వల్లిస్తారు. మరి కొందరేమో ఎలుక మీద పిల్లికి , పిల్లి మీద ఎలుకకి చాడీలు చెప్తూ తమ పబ్బం గడుపుకుంటూ వుంటారు. పెళ్ళాం బిడ్డల ఉసురు పోసుకున్న ఎవడూ బాగు పడిన దాఖలాలు చరిత్రలో లేవు.

        ఎవరికి వారు అందరు నీతిమంతులే. తమ బండారం బయట పడనంత వరకు. ఆ ఇంటికి ఈ ఇల్లు, ఈ ఇంటికి ఆ ఇల్లు మధ్యన దూరం ఒకటే. బంధమైనా, చుట్టరికమైనా, స్నేహమయినా ఇచ్చిపుచ్చుకోవడంలోనే వుంటుంది. డబ్బుతో అన్నీ దొరకవని తెలియాలి. రక్త సంబంధాలే అంటరాని బంధాలుగా మారిపోతున్న ఈ రోజుల్లో మనిషితనం కొరవడటంలో ఆశ్చర్యం లేదులెండి.


వెంకటేశ్వరరావు, శ్రీదేవిలకు మధ్యలో ఉండి అప్పు ఇప్పించిన పాపానికి బలైన కుటుంబం వీరు. వీరి చావుకు శిక్ష ఎవరికి వేస్తుంది న్యాయస్థానం?

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner