8, ఫిబ్రవరి 2022, మంగళవారం

జీవన పోరాటం పుస్తక సమీక్ష..!!

అభినందనలు గుడిమెట్ల చెన్నయ్య గారు.

మనఃపూర్వక ధన్యవాదాలు నవ మల్లెతీగ సాహితీ సంపాదక వర్గానికి, యాజమాన్యానికి…

  సమాజం బావుండాలంటే మార్పు మనిషిలో రావాలి..!!    

     సమాజంలో మనం బతుకుతున్నామంటే కనీసం మన పక్కవారిని పట్టించుకునే మానవత్వం కాస్తయినా ఉండాలి. ఈనాడు ఒకే ఇంటి కప్పు కింద బతుకుతున్న అపరిచితులెందరో మన సమాజంలో వున్నారు. తాను నివసించేది పరాయి రాష్ట్రమైనా తెనుగు భాష తీయదనాన్ని ఆస్వాదించడమే కాకుండా పదిమందికి ఆ ఆస్వాదన రుచి చూపిస్తున్న మానవీయులు శ్రీ గుడిమెట్ల చెన్నయ్య. 

     తన చుట్టు జరుగుతున్న సమస్యలను, చూసిన అనుభవాలను కవితా వస్తువులుగా తీసుకుని చక్కని వచన కవితలు “ జీవన పోరాటం “ కవితా సంపుటిగా మలిచారు. వాడుక వచన భాషల్లోనే ఈ కవితలన్ని మనకు కనిపిస్తాయి. మనతో చెప్తున్నట్లే అనిపిస్తాయి చదువుతుంటే. ఆది గురువు అమ్మతో మెుదలుబెట్టి అనంతమైన జీవితపు లోతుపాతులను, సాధారణ మనిషి నుండి అసాధారణ వ్యక్తిత్వాల వరకు మనకు పరిచయం చేసారు. తెలుగు భాష గొప్పతనాన్ని వివరించారు. తోటి మనుష్యుల మనసుల్లోని రకరకాల ఆలోచనలను, లోపాలను ఎత్తి చూపారు. అనుబంధాల విలువలను, మనకుండాల్సిన మానవత్వపు మనిషి లక్షణాలను చాలా సోదాహరణంగా వివరించారు. బాల్యాన్ని, కౌమారాన్ని, యుక్త వయసు, వృద్ధాప్యాన్ని వివరిస్తూ,  ఆ వయసులలో మెలగాల్సిన పద్ధతులను, తెలుకోవాల్సిన విషయాలను చెప్తూ, మానసిక సమస్యలను కూడా చక్కగా వివరించారు. రాజకీయ నాయకుల నుండి తెలుగు భాషాకోవిదులందరిని తన కవితల్లో గుర్తు చేసుకున్నారు. ఇవన్నీ కాకుండా సాహిత్య సభల్లో తెర వెనుక జరిగే చర్యలను వివరించారు. కవికి/రచయితకు ఉండాల్సి లక్షణాలను చెప్పారు. అన్ని వెరసి మనిషిగా ఎలా బతకాలో, బతకకూడదో సుస్పష్టంగా చెప్పారు. ఈ “ జీవన పోరాటం “ కవితా సంపుటి పూర్తిగా వచనమైనప్పటికి, శైలి కొత్తగా అనిపించింది. ఈ తరహా వ్యావహారిక వచనా శైలి  పాఠకులకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నది నా అభిప్రాయం. 

     సమాజానికి, సామాన్యునికి పనికివచ్చే ఎన్నో విషయాలను చక్కగా తేట తెనుగులో వచన కవిత్వంగా చేసి “ జీవన పోరాటం “ కవితా సంపుటిని అందించిన శ్రీ గుడిమెట్ల చెన్నయ్య గారికి హృదయపూర్వక అభినందనలు.

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner