11, ఏప్రిల్ 2022, సోమవారం

అనుబంధాల విలువలు..!!

“ కొన్ని సంతోషాలకు వెల కట్టలేము

కొన్ని పరిచయాలు గతజన్మ సువాసనలు

అలాంటి పరిచయమే ఈజన్మలో మాది…”


మా బాబాయి రాకతో నిన్నటి సాయంత్రం సంతోషంతో నిండిన మా మనసులు…ఫోటో తీసుకోవడం కూడా మర్చిపోయాను😍

థాంక్యూ సోమచ్ బాబాయ్…


అమృత ధారలు కురిసిన వేళ:

           ...............

1957...... శ్రీరామ నవమి రోజు..

   నాన్నగారు హఠాత్తుగా కాలం చేసిన రోజు...

అప్పటినుండి ప్రతి సంవత్సరం ఆ రోజంతా నిర్వేదంగా విషాదంగా నిర్లిప్తంగా గడిపేయటం అలవాటయిపోయింది...

నిన్న అదే పరిస్థితిలో ఉండగా మంజూ మెసేజ్...

"బాబాయ్ మీ ఇంటి అడ్రెస్ చెప్పండి అర్జంట్ గా.."అని... చాలాసార్లు ఇలాగే జరిగింది.తను వస్తాననడం...నేను ఏదో రకంగా దాట వేయడం ...

నేను రెండుమూడు సార్లు ఏవో ఫంక్షన్లకు రమ్మనడం...తను తన అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా రాలేకపోవడం....

:లేదమ్మా నేను బయటకు వెడుతున్నాను ..' అని రిప్లయ్ ఇచ్చినా :ఫరవాలెదు..నేను వస్తాను' అని తన రిప్లై. అక్కడికీ ఫోన్ చేసి ఆపడానికి ప్రయత్నం చేసాను. తను" తగ్గేదేలే" అని డిక్లేర్ చేసింది.

ఇక తప్పక సాయంత్రం వస్తానని చెప్పాను..అట్లా అని వాగ్దానం తీసుకుంది.

సాయంత్రం ఆరుగంటలకు బయట చల్లబడి మలయ సమీరాలు, లోపల మనసులో మౌన సమీరాలు  వీస్తున్న వేళ మంజు అనబడే ఒక మహా కవయిత్రి ...రచయిత్రి ఇంట్లో అడుగు పెట్టాను...

గుమ్మంలో రాఘవేంద్ర, మంజు...ఇంట్లో మంజు నాన్న గారు,అమ్మమ్మ గారు,అమ్మగారు ఏంతో ఆప్యాయంగా ఆహ్వానించారు..

నాకెందుకో కొత్త చోటుకి వెళ్లామనే ఫీలింగే రాలేదు.

చాలా రోజులకు సొంత ఇంట్లోకి వెళ్లిన అనుభూతే కలిగింది. భావ సారూప్యతే మంజు నాన్న గారిని నన్ను క్షణాలలో కలిపేసింది.ఆయన గొప్ప సాహిత్యాభిమాని... వక్త...మానవతా వాది.

ఆమె తండ్రి మేధోసంత్తిని తల్లి మనిషితనాన్ని పుణికి పుచ్చుకున్నట్లుగా అనిపించింది. ఇక ఆమె మొదటి పాఠకురాలు  అభిమాని ఆమె అమ్మమ్మ గారే నని విని ఆశ్చర్యపోయాను.

 ఎన్నెన్ని విషయాలు మాట్లాడుకున్నామో....ఎన్ని అనుభవాలు పంచుకున్నామో .....గంటలు క్షణాలుగా...మారిపోయిన అనుభూతి..

          మరోసారి కలుద్దాం అని సెలవు తీసుకోబోయాను...."అప్పుడేనా.. బాబాయ్.." అని ఎంతో ఆశాభంగం తో కూడిన  భావనతో అంది మంజు..

"ఒక్క నిమిషం  ..." అని గబ గబా 

తను రాసిన  తొమ్మిది అపూర్వ పుస్తకాల అమృత  ధారలను నా దోసిట్లో కురిపించింది...ఎంతో ఆర్ద్రంగా... 

మంజు..మంజు యనమదల...తెలుగు అక్షర సరస్వతి....సాహిత్యాకాశపు ధృవతార..

డా. డి. ప్రసాద్.


.

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner