22, ఏప్రిల్ 2022, శుక్రవారం

విజయ సమీక్ష కాలం వెంబడి కలానికి

“ కొన్ని బంధాలు గతజన్మ సంబంధాలనుకుంటా…” 

ఈ ప్రేమరాక్షసితో నా అనుబంధం కూడా అలాంటిదే…నా “ కాలం వెంబడి కలం “ పుస్తకానికి తన అనుభూతిని ఎంత బాగా చెప్పిందో చూడండి. థాంక్యూ…..సోమచ్ విజయా😍😍 Vijaya Lakshmi


కాలం వెంబడి కలం మదిమదిని కదిలించే (మంజు)మాయాజాలం.


అమ్మచేతి స్పర్శలా అనిపించింది కాలంవెంబడి కలం పుస్తకాన్ని చేతిలోకి తీసుకోగానే....కనులు ఆగలేదు చదువుతుంటే, మనసు మాత్రం ఒక్కోచోట చాలాసేపలాగే ఆగి ఆగి ముందుకు వెళ్ళింది.గతాలు అందరివీనూ,అక్షరాలూ అందరివీ.స్వగతాక్షరాలుగా మారేవి మాత్రం కొందరివే.గతాన్ని వర్తమానంతో కలబోసి భవిష్యత్ తో ముడివేసి ఒక బలమైన పునాదిని జీవితమిచ్చిన అనుభవాలతో ఏర్పరుచుకోవటం ఎలాగో ఈ కాలం వెంబడి కలం లో మనకు  కనిపిస్తుంది.

జీవితానుభవాలు రాయాలంటే చాలా చాలా ధైర్యం కావాలి.అందులోనూ మహిళలు తమ తమ స్వగతాన్ని రాయాలంటే ఎంతో నిబ్బరత స్ధైర్యం ఉంటేనే అది వీలవుతుంది.కవితాలయంలో మంజూగారి కాలం వెంబడి కలం వారం వారం చదివేటప్పుడు చాలా సార్లు అనిపించేది అమ్మో ఎలా రాస్తున్నారు ఇలా అని.అడగాలంటే అర్హత సరిపోదనిపించింది.ఒక ఆరునెలల తర్వాత మా మధ్య ఏర్పడిన అక్షరానుబంధ చనువుతో ఓసారి అడిగేసాను.మేడం,ఇలా అందరి పేర్లతో సహా వ్యక్తులను,వ్యక్తిత్వాలను బాహాటంగా రాస్తున్నారు... ఎవరూ మిమ్మల్ని ఆక్షేపించటం లేదా తిట్టడం లేదా దూరమవటం లేదా..మీకు భయమేమీ అనిపించటం లేదా అని.ఒక్కమాటే అన్నారు. "అవన్నీ నిజాలు.నిజాలు రాయటానికి భయమెందుకని."...నిజమే...నిజాలే అవి.కానీ నిజాలను నిజంగా నిక్కచ్చిగా రాయాలంటే చెప్పాలంటే అది అందరికీ చేరుతుందా మేడం అంటే... చేరేవాళ్ళకు చేరుతుంది మారేవాళ్ళు మారతారన్నారు.

                 అందరికీ తెలిసిన లోకరీతే...ఎదుటివారిని అనటం ,మనమెలాగున్నా మనలో లోటుపాట్లు ఎన్నున్నా.

ఎవరినో అన్నా కూడా నన్నేనేమో అనుకొనే బూడిద గుమ్మడికాయ చందా మనుషులు కోకొల్లలు. అలాంటి వారి స్పందనలకు ప్రతిస్పందనలకు నెరవకుండా వారి మనసు అనుభవాలను రాయటం మంజూగారికి సుసాధ్యం అయింది.

పుస్తకం ఆసాంతం ఒక జీవితమలా కళ్ళముందు కదలాడుతూ చాలా సార్లు కన్నీటి చెమరింతను, ఇంకొన్ని సార్లు పెదాలపై చిరునవ్వు ని అందించేసింది.గుండె భారమోతూ అంతలోనే తేలికయింది.

మంజూగారి జీవితానుభవాలను కానీ వాస్తవ సంఘటనలనుగానీ ప్రస్తావించే అర్హత వయసు లేదు నాకు. అందుకే పుస్తకం చివరిలోని ఒక్కపేరాను మాత్రం ప్రస్ఫుటంగా చెప్పదలుచుకున్నాను.ఈ కొన్ని లైనులు చదివి అర్ధం చేసుకుంటే చాలు కాలం వెంబడి కలంలోని ఆంతర్యం అందరికీ చేరినట్టే.

""జీవితం ఏ క్షణం ఎలాంటి మలుపులు తిరుగుతుందో మనకు తెలియదు. మనం ఎంత ప్లాన్ ప్రకారం బతికేద్దామన్నా మన చేతిలో ఏదీ ఉండదు. సమస్య లేని జీవితమూ లేదూ అలా అని ప్రతి సమస్యా పెద్దదీ కాదు. సమస్యకు భయపడకుండా బతకడం మనం అలవాటు చేసుకోవాలంతే. ఏ సమస్యా లేకుండా సాఫీగా జీవితం సాగిపోతుంటే కూడా బావుండదు కదా. పెద్దలన్నట్టు జీవితం సప్త సాగర గీతం. గెలుపోటముల సంగమం. భయపెట్టే సునామీలూ ఉంటాయి. ఆహ్లాదపరిచే అలల ఆనందాలూ ఉంటాయి. చీకటి వెలుగుల సయ్యాటే జీవితం. జీవితంలో ప్రతి పరిచయం ఓ అనుభవ పాఠమే మనం నేర్చుకోవాలంతే. మంచి చెడుల సమతూకం మనకు తెలియాలంతే. కాదూ కూడదంటే మనం ఏకాకుల్లా ఎడారి జీవితాలకు అలవాటు పడిపోవాలంతే.""""

ఎంత బాగా చెప్పారు కదా.సమస్యలు అందరీవీనూ పరిష్కారం దిశలో వెళ్ళగలిగే వారు కొందరే.ఎదురొడ్డి  నెగ్గుకొచ్చి నిలబడేవారింకొందరు.కష్టాలు కలతలు కడగండ్లంటూ కుమిలేవారు మరికొందరు.అన్నింటికీ కావాల్సింది మనోఃనిబ్బరత స్ధైర్యం. అది కోల్పోతే జీవితం సంద్రాన మునకే.తెలుసుకుంటే సప్తసాగరగీతమే.

శుభాభినందనలు మంజూమేడం ఒక్కరొక్కరుగా కనిపించిన బంధాల దారపు పోగులను చివరకు చక్కటి అనుబంధపు తాడుగా పేని మీ వ్యక్తిత్వాన్ని ఇంకా గొప్పగా మలచుకున్నందుకు.

..............ప్రేమతో మీ విజయ.


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner