4, ఏప్రిల్ 2022, సోమవారం

మంచుపూలు పుస్తక సమీక్ష

మనసుపూలు మంచుపూలు..!


         “ తరిగే సమయంలో

            కరిగే జ్ఞాపకానివే…”

ఎంత అందమైన భావుకత ఇది. కవిత్వం రాయడానికి బరువైన పదాలు, సంక్లిష్టమైన సమాసాలు అవసరం లేదని పై వాక్యాలు బుుజువు చేస్తున్నాయి. సబ్బినేని పద్మజ దివిసీమలోని మారుమూల పల్లెటూరు నుండి వచ్చినా అందమైన పల్లెటూరు స్వచ్ఛమైన మనసును తన భావాలలోమంచుపూలుకవితా సంపుటిలో చూపించారు. “ హృదయ విపంచిగా తన కవిత్వపు అడుగులను మెుదలుబెట్టి మనసు పారదర్శకతను అక్షరాల్లోనికి ఒంపిమంచుపూలుకవితా సంపుటిని మన ముందుకు తీసుకువచ్చారిప్పుడు

         మోక్షానికి మార్గాన్ని తెలుసుకుని, దైవానికి ఆత్మ నివేదనగా తన మెుదటి కవితను ఆరంభించి మానవ భవబంధాల నుండి విముక్తిని కోరుతూ దైవత్వానికి, మానవజన్మకు మధ్యనున్న సన్నని అడ్డుతెరను చక్కని భావుకతతో చెప్పడంలోనే కవయిత్రి మనసు మనకు తేటతెల్లమవుతుంది. మోక్షానికి, విముక్తి కి మధ్యన మానవజన్మ ఊగిసలాటను కవితలుగా అక్షరీకరించారు. జీవితంలోని అన్ని అనుభవాల అనుభూతులను మంచుపూలుకవితా సంపుటిలో మనం చూడవచ్చు

            ప్రేమ, విరహం, ఆరాధన, మగువ అంతరంగాలు, ఆలోచనలు, కోరికలు, కోపాలు, ఆశలు, ఆశయాలు, ఆక్రోశాలు , అసహనాలు ఇలా మనిషి మనసులోని అన్ని పార్శ్వాలను అతి సుళువైన పదబంధాలలో తనదైన ఆత్మాశ్రయ శైలిలో అందంగా రాశారు. సమాజంలోని అసమానతలను, తరిగిపోతున్న మనిషి విలువలను కూడా మనకు గుర్తుచేసారు. తనలోని అమ్మనే కాకుండా, దేశభక్తిని, సైనికులపై తనకున్న నమ్మకాన్ని ఇప్పటి వరకు ఎవరూ పోల్చని విధంగా దైవంతో పోల్చి చెప్పడం అభినందించదగ్గ విషయం. తాను రైతుబిడ్డనని గుర్తెరిగి రైతు కష్టాన్ని అక్షరాలకు అందించారు. భావ కవుల ఆరాధనను, నిరీక్షణను, ప్రకృతి అందాలను, చందమామ, సూరీడులను, జ్ఞాపకాలను ఇలా అన్ని అనుభూతులను అక్షరబద్ధం చేసారు.

             వచన కవిత్వంలో వచ్చిన మంచుపూలుకవితా సంపుటి చదువరులకు పంటికింద రాయిలా కాకుండా స్వచ్ఛమైన మనసు భావాలను పంచుతుందని మనసారా కోరుకుంటూ..మరిన్ని మృదుభావాల భావకవితలు తన నుండి ఆశిస్తూ.. సబ్బినేని పద్మజకు హృదయపూర్వక అభినందనలు.


             


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner