11, మే 2022, బుధవారం

చైతన్యస్ఫూర్తి పుస్తక సమీక్ష

                 “ సమాజ చైతన్యమే జనజీవన పురోభివృద్ధి

       సమాజంలో చాలామంది చాలా రకాలుగా బతికేస్తుంటారు. కొందరు కుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తారు. మరికొందరికి కుటుంబ విషయాలు ఏమాత్రం పట్టవు. సమాజం గురించే ఆలోచిస్తుంటారు. ఇంకొందరు కుటుంబం, సమాజం రెండింటిని సమంగా చూస్తారు. ఎవరెలా పోతే నాకేంటి? నేను, నావాళ్ళు బావుంటే చాలు అని అనుకునే ఈరోజుల్లో తన భావాలతో సమాజానికి మంచిని పంచాలని చూసే కొద్దిమందిలో డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ ఒకరు. ఎన్నో కథలు, వ్యాసాలు, పుస్తక సమీక్షలు, కవితలు రాసిన వీరి కలం నుండి జాలువారిన కొన్ని వ్యాసాలనుచైతన్యస్ఫూర్తిపుస్తకంగా తేవడం ముదావహం

       భారతదేశ ఔన్నత్యాన్ని చూపించడానికి, సమాజంలో, కుటుంబంలో స్త్రీ పాత్రను, ఆమె విలువను తెలిపే వ్యాసంవనితా నీకు వందనంలో చాలా వివరంగా చక్కగా రాసారు. స్త్రీ చదువుకుంటే కుటుంబం, తద్వారా సమాజం కూడా ఎంతో లాభ పడుతుందని చెప్పారు. ప్రపంచ దేశాలలో మన భారతదేశ గొప్పతనాన్ని సోదాహరణంగా వివరించారు మరొక వ్యాసంలో. సామాజిక చైతన్యమే సమసమాజ నిర్మాణానికి మూలమని, కాలుష్య నియంత్రణ భారం మనదేనని, యువతకు మార్గదర్శకమైన సందేశాలనిచ్చిన వివేకానందుడి గొప్పతనాన్ని ప్రపంచం ఎలా గుర్తించిందో, నేటి యువత బానిసౌతున్న మాదకద్రవ్యాల గురించి, అంతర్జాలం తీరుతెన్నులను, అమ్మ గురించిన ఆణిముత్యాలను, రచయితలను, రచనలను, పుస్తకాల ఉపయోగాన్ని, దాశరథి గారి గురించి, రూట్స్ పుస్తక సమీక్ష, కరోనా కల్లోలాన్ని ఇలా సమాజంలోని ప్రతి సమస్యను మనకు వివరించారు. ప్రపంచశాంతికి మార్గాన్ని సూచించారు. యుద్ధం అనంతరం అనాథలుగా మారిన వారి జీవితాలను కళ్లకు కట్టినట్టు వివరించారు

        తన ప్రాంతపు నమ్మకమైన బతుకమ్మ గురించి, అక్కడి చేనేతల వెతల గురించి చాలా విపులంగా రాసారు. చక్కని వాడుక భాషలో, అలతి పదాలతో 24 వ్యాసాలనుచైతన్యస్ఫూర్తిపుస్తకంగా సమాజాన్ని జాగృతం చేయడానికి ప్రయత్నించిన డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ గారికి హృదయపూర్వక అభినందనలు

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner