26, మే 2022, గురువారం

నా మాట

       “ ఓటమిలో గెలుపును వెదకడమే నా జీవితం “


       “ అనుకోనివి జరగడమే జీవితం “. కష్టం వచ్చినప్పుడు క్రుంగిపోయి, సంతోషం వచ్చినప్పుడు ఆనంద పడటం అందరు సహజంగా చేసేదే. కుటుంబ బాధ్యతలతో తలమునకలుగా ఉన్నప్పుడు అనుకోకుండా ఓ రోజు మెదడు ఓ ఇరవై నిమిషాలు పనిచేయడం మానేసి, ఓ మూడు గంటల కాలాన్ని నాకు కాకుండా చేసేసింది. అప్పటి నుండి ప్రముఖ నరాల వైద్యుల దగ్గర ముందులు వాడుతూనే ఉన్నాను. అయినా బరువు తగ్గిపోవడం, జుట్టంతా రాలిపోవడం, జాయింట్ పెయిన్స్, కారం తినలేక పోవడం, వళ్ళంతా దద్దుర్లు, దురద వంటి కొన్ని లక్షణాలు కనిపించాయి. సలహా కోసం వేరే డాక్టర్ ని సంప్రదించాను. ANA టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది. ఏమి చేయదులే అని కాస్త అశ్రద్ధ చేసాను. ఆ సమయంలో మే 10న లూపస్ గురించి పేపర్ లో చదివి అమ్మతో అన్నాను. అమ్మా ఈ లక్షణాలు నాకూ ఉన్నాయి అని, కాని అంతగాపట్టించుకోలేదు. రాను రానూ చూపులో కూడా తేడా వచ్చి, నా అంతట నేను నడవలేని పరిస్థితి కూడా వచ్చేసింది. ఆత్మీయుల సలహా మేరకు కీళ్ళ వైద్య నిపుణురాలిని కలిసాను. నా వివరాలన్ని చెప్పగానే ఆవిడ “ మీకు ఇంత చిన్న వయసులో ఇలా జరిగింది అంటే అది లూపస్ “ అని ఖచ్చితంగా చెప్పి టెస్ట్ చేయించారు. దానిలో SLE అని తేలింది. లూపస్ లో ఇది ఒక రకం. ఓ మూడు నెలలు బాగా ఇబ్బంది పడ్డాను. మంచం మీద నుండి కూడా లేవలేని పరిస్థితి. అప్పటికే నాకు మనసుకు అనిపించినవి బ్లాగులో రాసుకునే అలవాటు. ముఖపుస్తకం కూడా వాడుతుండేదాన్ని. రెండు పుస్తకాలు కవితలు, వ్యాసాలతో ముద్రితం కూడా అయ్యాయి. 

      రోగం ఎలాంటిదైనా కానివ్వండి. ముందుగా మనకుండాల్సినది మానసిక ధైర్యం. సరైన వైద్యుని పర్యవేక్షణ. రకరకాల పరీక్షలకు తట్టుకోవాలి. కొన్ని రోగాలు నయం కావు కాని సరైన సమయంలో సరైన వైద్యం చేయించుకుంటే ప్రాణహాని ఉండదు. లూపస్ ముందుగా గుర్తించ గలిగితే చాలా వరకు దాని మూలంగా వచ్చే ఇబ్బందులను తగ్గించవచ్చు. సాధారణ జీవితం గడపవచ్చు. దానికి ఉదాహరణ నేనే. ఇప్పటికి తొమ్మిది పుస్తకాలు రాసి పదవ పుస్తకం ముద్రణ పనిలో ఉన్నాను. మరో మూడు నాలుగు పుస్తకాలకు సరిపడా నా రాతలున్నాయి. దాదాపు ఏడెనిమిది సంవత్సరాల నుండి లూపస్ తో యుద్ధం చేస్తూ, నన్ను నేను గెలిపించుకుంటున్నాను నా రాతల ద్వారా. ఈ విజయానికి కారణం మా డాక్టరమ్మ. ఈ విజయం ఆవిడకే అంకితం. 



గెలుపు..!!

  

మస్తిష్కం నిదురోయినా

మనసు మెలకువగానే ఉంది


శరీరానికి ఇబ్బందులు ఉన్నా

మానసమెప్పుడూ ఉల్లాసవంతమే


వ్యాధితో సహవాసమూ మంచిదే

మన ద్వారా నలుగురికీ లక్షణాలు తెలపడంతో


సరైన వైద్యం సరైన సమయంలో జరిగితే

కాలమెప్పుడూ నీ నేస్తమే సుమా


భయంవద్దు బెదరవద్దు

మరణం తప్పదని తెలిసినా


రెప్పపాటు జీవితానికి

రెప్ప పడని క్షణాలను లెక్కలేయకు


మనోధైర్యమే మనకుందని బుుజువు చేస్తూ 

మరో నలుగురికి ధైర్యమవుదాం 

గెలుపు బావుటానెగరేద్దాం..!!


ప్రపంచ లూపస్ దినోత్సవం సందర్భంగా..!!

మా డాక్టరమ్మ అడిగితే రాసాను…












0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner